తెలంగాణ సచివాలయం తరలింపు ప్రారంభం.. కొత్త సచివాలయం వచ్చే వరకూ బీఆర్‌కే భవన్‌లోనే ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ సచివాలయం ఇప్పుడున్న చోటు నుంచి బీఆర్‌కే భవన్‌కు తరలింది. ఈ కొత్త ప్రాంగణంలో శుక్రవారం కార్యకలాపాలు మొదలయ్యాయి. చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి కూడా ఇక్కడి నుంచే పనిచేయనున్నారు.
కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బీఆర్‌కే భవన్‌లోనే వివిధ శాఖల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అధికారులు, ఉద్యోగులు ఎవరూ పాత సచివాలయంలో ఉండరాదని.. శుక్రవారం నుంచి నూతన ప్రాంగణంలో కార్యకలాపాలు చేపట్టాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది.
పాత సచివాలయాన్ని కూల్చి అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) ఇదివరకే ప్రకటించారు.
అయితే, విపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వాస్తు పిచ్చితో, కుమారుడిని సీఎం చేయాలన్న కాంక్షతోనే కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణం తలపెట్టారని చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, telangana.gov.in
‘అస్తవ్యస్తంగా భవనాలు’
విపక్షాల విమర్శలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
పాత సచివాలయంలోని లోపాలను చూపిస్తూ, కొత్తగా సమీకృత సచివాలయ భవన నిర్మాణాలను ఏ విధంగా చేపట్టనున్నది వివరించే ప్రయత్నం చేస్తోంది.
అందులో భాగంగానే మంత్రుల బృందంతో ఓ కమిటీని వేసి, కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది.
పాత సచివాలయం ప్రాంగణంలో భవనాల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందన్నది కేసీఆర్ సర్కారు వాదన.

ఫొటో సోర్స్, TELANGANACMO/FACEBOOK
‘అంతర్జాతీయ ప్రమాణాలతో..’
పార్కింగ్ స్థలం సరిగ్గా లేదని, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సందర్భాల్లోనూ సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతోందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ అవసరాలు తీర్చే సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేవని.. ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫెటేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు కొరవడ్డాయని అంటోంది.
అధికారులు, సిబ్బంది ఒక భవనం నుంచి మరో దానికి వెళ్ళడం కష్టంగా ఉందని, ఫైళ్ల తరలింపులోనూ ఇబ్బందులు ఉంటున్నాయని ప్రభుత్వం వివరించింది.
ఇలాంటి లోటుపాట్లు ఏవీ లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్తగా సమీకృత సచివాలయ నిర్మిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణకే తలమానికంగా ఉండేలాగా నిర్మిస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
25 ఎకరాల విస్తీర్ణం
పాత సచివాలయం సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిలోని బీ, సీ బ్లాక్‌లను 1978లో, ఏ బ్లాక్‌ను 1998లో, డీ బ్లాక్‌ను 2003లో నిర్మించారు. 2012లో హెచ్ (నార్త్), హెచ్ (సౌత్) బ్లాకులను కట్టారు.
వీటి నిర్మాణాలు నేషనల్ బిల్డింగ్ నార్మ్స్, గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్‌కు లోబడి లేవని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే జనం కనీసం బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితి ఉందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కొత్త సచివాలయం నిర్మిస్తే, ఇప్పుడున్న నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, క్రైస్తవ ప్రార్థనా మందిరాలను ఏం చేయాలనే విషయాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
తరలింపులో రెండు రకాల సవాళ్లు
కొత్త సచివాలయ నిర్మించనున్న నేపథ్యంలో వివిధ శాఖల తరలింపు కీలక ఘట్టంగా మారింది.
తరలింపు ప్రక్రియలో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. సాంకేతికపరమైన సవాళ్లు మొదటిది కాగా, భద్రతపరమైన సమస్యలు రెండోది.
దీనిపై అటు ఐటీ శాఖ, ఇటు పోలీసు శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందించినట్లు సమాచారం. శాఖల తరలింపులో ఈ రెండు శాఖలు ఇచ్చిన సలహాలు, సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. వీలైనంత త్వరగా శాఖల తరలింపు ప్రక్రియ పూర్తిచేసి, కొత్త సచివాలయం నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
వివిధ శాఖల నుంచి ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందానికి అందిన గడువు ప్రతిపాదనలను కూడా ఆయన పరిశీలించారు.
ఈ ప్రక్రియను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఫైళ్ల గల్లంతు, వాటిలోని కీలక డాక్యుమెంట్లు చిరగడం, మాయమవడం లాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించినట్లు సమాచారం.

ఫొటో సోర్స్, Getty Images
మిగిలినవి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో
ఇంటర్నెట్, వైఫై, ఇంట్రానెట్ నెట్‌వర్క్ వంటి సదుపాయాలు కూడా శాఖల తరలింపులో కీలకం. ప్రస్తుతం జీఓఐఆర్, సీఎంఆర్ఎఫ్, మీసేవ ఈ ప్రొక్యుర్ మెంట్, సమగ్ర వేదిక, ధరణి, ఐజీఆరెస్, మాభూమి, వెబ్ లాండ్, ఆరోగ్యశ్రీ, ఈ ఆఫీస్, సివిల్ సప్లైస్, ఫైనాన్స్, ఎక్సైజ్, రెవెన్యూ, ట్రెజరీ, వ్యవసాయ, పోలీసు, ఆర్టీసీ, జెన్ కో, ఈఆర్పీ లాంటి అప్లికేషన్లు, ఇతర, రాష్ట్ర, జిల్లా స్థాయి పోర్టళ్లన్నీ గచ్చిబౌలిలో ఉన్న స్టేట్ డేటా సెంటర్లో ఉన్నాయి.
వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులతో సహా, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీఎస్‌లు ఇతర అధికారగణమంతా బీఆర్‌కే భవన్‌లోనే కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఇంకా ఏవైనా శాఖలు, విభాగాలు, సెక్షన్లు మిగిలితే వాటిని పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి తరలిస్తారు. ఐ అండ్ పీఆర్ ఆధ్వర్యంలోని పబ్లిసిటీ సెల్‌ను, సీఎంఓలో భాగంగా ఉన్న సీపీఆర్ఓ కార్యాలయాన్ని కలిపి అక్కడే ఒక క్వార్టర్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీపీఆర్ఓ కోసం బీఆర్‌కే భవన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక గదిని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఎన్ఎంసీ బిల్లుపై వైద్యులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు
- ఏపీ సచివాలయానికి శంకుస్థాపన: అంత ఎత్తైన భవనాన్ని ఎలా నిర్మిస్తారు?
- వైద్య పరీక్షల కోసం దానమిచ్చిన శవాన్ని ఏం చేస్తారు...
- అభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ల కంటే జమ్ము కశ్మీరే నయమా?
- ఉత్తర కొరియా: సైబర్ దాడులు చేసి 200 కోట్ల డాలర్లు కొట్టేసింది.. ఆయుధాల కోసం: ఐరాస రహస్య నివేదిక
- మలేషియా అడవుల్లో మాయమైన ఆ టీనేజ్ అమ్మాయి ఎక్కడ?
- వాట్సాప్‌లో కొత్త సమస్య.. మీ మెసేజ్‌లను వక్రీకరించి పంపొచ్చు
- టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









