డీ లిమిటేషన్‌ను పాతికేళ్లు వాయిదావేయాలనే డిమాండ్ దేనికి?

డీ లిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, డీలిమిటేషన్‌ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని దక్షిణాది రాష్ట్రాల నేతలు డిమాండ్ చేశారు.
    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకుల సమావేశం ప్రస్తుత పార్లమెంటరీ సీట్ల సంఖ్యను మరో 25 సంవత్సరాలు కొనసాగించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఇదే అంశంపై గతంలో తమిళనాడు అఖిలపక్ష సమావేశం ఆమోదించిన తీర్మానానికి....దీనికి మధ్య కొంచెం తేడా ఉంది. పార్లమెంటరీ సీట్ల సంఖ్యను పెంచాలంటే, తమిళనాడు ప్రస్తుత 7.18 శాతం ప్రాతినిధ్యాన్ని మార్చకుండానే చేయాలని అప్పుడు తమిళనాడు అఖిలపక్ష సమావేశం తీర్మానం చేసింది.

జనాభా ఆధారంగా భారతదేశ పార్లమెంటరీ నియోజకవర్గాలను తిరిగి విభజించాలనుకుంటే జనాభా పెరుగుదలను పరిమితం చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలపై కలిగే ప్రభావాలను చర్చించడానికి తమిళనాడు ప్రభుత్వం మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

తమిళనాడులానే ఇలాంటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉన్న రాష్ట్రాల నుంచి కీలక నాయకుల ప్రతినిధులతో ఒక ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.

ఈమేరకు తెలంగాణ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు.. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీ నాయకులు శనివారం (మార్చి 22)న సమావేశమై దీనిపై చర్చించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మరికొందరు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు తమ అభిప్రాయాలను చెప్పిన తర్వాత, కొన్ని తీర్మానాలను సంయుక్తంగా ఆమోదించారు.

'జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించకూడదు. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణలు చేయాలి. సంబంధిత రాష్ట్ర శాసనసభల్లో దీనిపై తీర్మానాలను ఆమోదించాలి' అని సమావేశంలో నిర్ణయించారు.

పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్యను మరో 25 సంవత్సరాల వరకు మార్చకూడదని ఒక తీర్మానం ఆమోదించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డీ లిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, HANDOUT

ఫొటో క్యాప్షన్, జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ జరిపితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.

30 ఏళ్లా,25 ఏళ్లా?

"1971 జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన కొనసాగుతుందని 2000వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్టే, 2026 నుండి మరో 30 సంవత్సరాలు ఈ పునర్విభజనను పొడిగిస్తామని ప్రధానమంత్రి ఇప్పుడు పార్లమెంటుకు హామీ ఇవ్వాలి'' అని మార్చి 5న చెన్నైలో జరిగిన తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు.

నియోజకవర్గాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని కూడా ఆ తీర్మానంలో ఉంది. "తమిళనాడు నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకించడం లేదు. అదే సమయంలో, గత యాభై ఏళ్లగా అమలవుతున్న సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలకు తీవ్ర నష్టం కలిగించేలా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉండకూడదు" అని తీర్మానంలో పేర్కొన్నారు.

పార్లమెంటులో తమిళనాడు ప్రస్తుత ప్రాతినిధ్య శాతం 7.18ని నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం మార్చకూడదని కూడా తీర్మానం డిమాండ్ చేసింది.

తాజా సమావేశంలో నియోజకవర్గ పునర్విభజనను రాబోయే 25 సంవత్సరాల పాటు వాయిదా వేయాలని తీర్మానం ఆమోదించారు.

కనిమొళి

ఫొటో సోర్స్, TNDIPR

ఫొటో క్యాప్షన్, సీట్ల సంఖ్యను 800 దాటి పెంచడం వల్ల కొన్ని రాష్ట్రాలు అధిక సంఖ్యలో సీట్లు పొందుతాయని కనిమొళి అన్నారు.

రాష్ట్రాల జనాభా ప్రాతినిధ్యం ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచడం వల్ల మొత్తం రాష్ట్రాల సమతుల్యతపై ప్రభావం చూపుతుందని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయని, అందుకే డీలిమిటేషన్‌ను మరో 25 సంవత్సరాలు వాయిదా వేయాలనే తీర్మానాన్ని ఆమోదించామని డీఎంకే ఎంపీ కనిమొళి బీబీసీకి తెలిపారు.

1971 జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన కొనసాగుతుందని అప్పటి ప్రధానమంత్రి 2000వ సంవత్సరంలో హామీ ఇచ్చినట్టే..2026 నుంచి డీలిమిటేషన్ మరో 30 సంవత్సరాలు పొడిగిస్తామని ప్రధానమంత్రి పార్లమెంటులో హామీ ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కూడా తాము డిమాండ్ చేశామని కనిమొళి తెలిపారు.

ఇప్పుడు పూర్తిస్థాయి తీర్మానం ఆమోదించాం. జనాభా శాతం ఆధారంగా, సీట్లు పెరిగితే, జనాభా తగ్గిన రాష్ట్రాలు ప్రభావితమవుతాయని అనేక రాష్ట్రాల నాయకులు భావించారు. సీట్ల సంఖ్యను 800 దాటి పెంచడం వల్ల కొన్ని రాష్ట్రాలు అధిక సంఖ్యలో సీట్లు పొందుతాయని, ఇది ప్రస్తుత సమతుల్యతను దెబ్బతీస్తుందని వారు భావించారు. అందుకే పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య రాబోయే 25 సంవత్సరాల పాటు ప్రస్తుత సంఖ్య 543 వద్ద ఉండాలని మేము కోరుతున్నాం" అని కనిమొళి అన్నారు.

డీ లిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి

వాయిదా వేయాలనడం సరైనదే: నిపుణులు

రాజకీయంగా ఇది సరైన డిమాండే అన్నారు ''సౌత్ వర్సెస్ నార్త్ : ఇండియాస్ గ్రేట్ డివైడ్'' పుస్తక రచయిత ఆర్.ఎస్. నీలకంఠన్.

''సీట్ల సంఖ్య స్వల్పంగా తగ్గడం, లేదా పెరగడంపై ప్రజలను సమీకరించి పోరాడటం కష్టం. అందుకే ఇలాంటి డిమాండ్ ద్వారా మాత్రమే ఈ సమస్య లోతు ఏమిటో అర్ధం అయ్యేలా చెప్పవచ్చు. రాజకీయంగా ఇది సరైనదే'' అని నీలకంఠన్ అభిప్రాయపడ్డారు.

అయితే నియోజకవర్గాల పునర్విభజన ఎక్కువకాలం వాయిదా వేయకూడదని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు.

''జనాభా కారణంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రభావితం కాకూడదని 2001లో డీలిమిటేషన్ వాయిదా వేశారు. అయితే గత పాతికేళ్లలో జనాభా పెరిగింది.ఇందుకు అనుగుణంగా పార్లమెంటు సీట్ల సంఖ్యను కచ్చితంగా పెంచాలి. అయితే పార్లమెంటులో ఇప్పుడున్న ఆయా రాష్ట్రాల ఎంపీల శాతానికి సమానంగా సీట్ల సంఖ్యను పెంచితే తమిళనాడు వంటి రాష్ట్రాలపై ప్రభావం పడదు. కానీ అలా కాకుండా మరో పాతికేళ్లపాటు డీలిమిటేసన్ వాయిదా వేయాలని డిమాండ్ చేయడం సబబేనా అన్నదానిపై స్పష్టత లేదు. ఒకపార్లమెంటు సభ్యుడు ఎన్నిలక్షలమంది సేవ చేయగలరు? చాలా నియోజకవర్గాలలో దాదాపు 15లక్షలమందికి ఒక ఎంపీ ఉన్నారు. ఇది సరైనది ఎలా అవుతుంది?'' అని నారాయణ తిరుపతి ప్రశ్నించారు.

డీ లిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, TELANGANA CMO

ఫొటో క్యాప్షన్, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించేదిలేదని తెలంగాణ సీఎం అన్నారు.

రేవంత్ రెడ్డి ఏమన్నారు?

డీ లిమిటేషన్‌ను 25 ఏళ్ల పాటు వాయిదావేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం లోక్‌సభ స్థానాల్లో 33శాతం ఉండేలా చూడాలన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించేదిలేదన్నారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీలో కూడా దీనిపై తీర్మానం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

డీ లిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాలు

ఫొటో సోర్స్, https://x.com/KTR_News

ఫొటో క్యాప్షన్, అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ ప్రతిపాదన ఏంటి?

సమావేశం తర్వాత మీడియాతో మట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ప్రతిపాదన చేశారు.

''ప్రజల ప్రాథమిక సమస్యలను శాసనసభ, స్థానిక సంస్థల సభ్యులు పరిష్కరించాలి కాబట్టి, జనాభాను బట్టి శాసనసభ సభ్యుల సంఖ్యను పెంచవచ్చు. ఇది రాష్ట్రాలలో జరుగుతుంది కాబట్టి, ఇతర రాష్ట్రాలతో అధికార సమతుల్యత ప్రభావితం కాదు" అని ఆయన ప్రతిపాదించారు.

"ఈ ఆలోచన చెడ్దదని అనలేం. ఎంపీల ప్రధాన పని పార్లమెంటులో ఉంటుంది. వారు ప్రజలతో తక్కువగా పని చేస్తారు. కాబట్టి, ఎమ్మెల్యేల సంఖ్యను పెంచడం చెడ్డ ఆలోచనగా పరిగణించలేం. అదే సమయంలో, స్థానిక సంస్థల్లో కూడా ఇలాంటి మార్పు తీసుకురావాలి" అని ఆర్.ఎస్ నీలకంఠన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)