విజయవాడలో నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య - ప్రెస్ రివ్యూ

పప్పుల సురేష్ కుటుంబం

దైవ దర్శనానికి విజయవాడ వచ్చిన ఓ కుటుంబం శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడిందని 'ఈనాడు' కథనం తెలిపింది.

'అప్పుల బాధ తట్టుకోలేక, పరువు పోయిందనే కుంగుబాటు మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్ (58), ఆయన భార్య శ్రీలత (54), కుమారులు అఖిల్ (26), ఆశిష్ (24) విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డారు.

శనివారం తెల్లవారుజామున ఇద్దరి మృతదేహాలు సత్రంలో.. మరో ఇద్దరివి ప్రకాశం బ్యారేజీలో లభించాయి.

సురేష్ కుటుంబం గురువారం సాయంత్రం విజయవాడ చేరుకుంది. వయౌటౌన్ శివాలయం సమీపంలో వాసవీ కన్యకా పరమేశ్వరి సత్రంలో అఖిల్ పేరుతో గది అద్దెకు తీసుకున్నారు.

శుక్రవారం దర్శనానికి వెళ్లి వచ్చారు. శనివారం ఉదయం వారి బంధువుల నుంచి సత్రం సిబ్బంది ఫోన్ రావడంతో గదిలో చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.

తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ విగతజీవులుగా కనిపించారు. తర్వాత ప్రకాశం బ్యారేజీ వద్ద తండ్రి సురేష్. పెద్ద కుమారుడు అఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాము అప్పుల బాధ భరించలేక చనిపోతున్నామని ఒక వాయిస్ మెసేజ్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉండే తన సోదరుడికి శ్రీలత పంపారు.

ఇది అర్ధరాత్రి 2.30 సమయంలో వెళ్లింది. వారి గదిలో ఇన్సులిన్ సీసాలు, ఇంజెక్షన్లు లభించాయి.

తండ్రి సురేష్, పెద్ద కుమారుడు సత్రం నుంచి బయటకు వచ్చి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.

శ్రీలత పంపిన వాయిస్ మెసేజ్‌ను ఆమె సోదరుడు తెల్లవారాక చూశారు. వెంటనే సత్రం నిర్వాహకులను సంప్రదించగా వారికి గదిలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నిజామాబాద్ నుంచి పప్పుల సురేష్ కుటుంబం ఈ నెల 3నే బయల్దేరినా.. 6వ తేదీ సాయంత్రం. విజయవాడకు చేరుకుంది. 7వ తేదీన సురేష్ కుటుంబానికి చెందిన ప్లాట్‌ను ఫైనాన్స్ సంస్థ జప్తు చేసింది. పీసీహెచ్ఎఫ్ఎల్ సంస్థ దీన్ని జప్తు చేసినట్లు బోర్డు పెట్టింది.

ఈ విషయం తెలిసి పరువు పోయినట్లు భావించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

2 వేల నోటు

ఫొటో సోర్స్, AFP

కోవిడ్‌లో భారీగా డబ్బులు సేవింగ్‌

కోవిడ్‌ సంక్షోభం సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున డబ్బులను బ్యాంకుల్లో దాచుకుంటున్నారని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆర్‌బీఐ నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి డిపాజిట్లలో 12.32 శాతం మేర వృద్ధి నమోదైంది.

అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డిపాజిట్లలో 15.27 శాతం మేర వృద్ధి నమోదైంది.

ఇక ఏపీలోని బ్యాంకు డిపాజిట్లలో 10.74 శాతం వృద్ధి రికార్డయ్యింది. రాష్ట్రంలో 2020 మార్చి నాటికి రూ.3,24,873 కోట్ల బ్యాంకు డిపాజిట్లుండగా.. 2021 మార్చి నాటికి రూ.3,59,770 కోట్లకు పెరిగాయి.

రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి పెరుగుదలే కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటకలో 2021 మార్చి నాటికి అత్యధికంగా రూ.12,56,023 కోట్ల డిపాజిట్లుండగా.. ఏపీలో రూ.3,59,770 కోట్ల డిపాజిట్లున్నాయి’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

సీతారాం ఏచూరి, పినరయి విజయన్, కేసీఆర్, మాణిక్ సర్కార్

ఫొటో సోర్స్, TRS

ఫొటో క్యాప్షన్, సీతారాం ఏచూరి, పినరయి విజయన్, కేసీఆర్, మాణిక్ సర్కార్

కేసీఆర్‌తో సీపీఎం, సీపీఐ నేతల భేటీ

దేశంలో బీజేపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకోసం లౌకికవాద శక్తులన్నీ ఏకమై పోరాడాలని సీపీఐ, సీపీఎం అగ్రనేతలు అన్నారని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘బీజేపీ ముక్త భారత్ లక్ష్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని వామపక్ష నేతలు పేర్కొన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విజభన రాజకీయాలు దేశ సమగ్రతకే పెను ముప్పుగా పరిణమించాయని, ఇది ఇలాగే కొనసాగితే భారత ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు.

శనివారం సీపీఐ, సీపీ ఎం జాతీయ నేతలు.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో వేర్వేరుగా సమావేశమయ్యారు. సందర్భంగా పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలు, జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

బీజేపీ దుర్మార్గ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేలా, దేశ రాజకీయాల నుంచి ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించేలా భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణ అవసరం ఉన్నదని వామపక్ష నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇందుకోసం భావ సారూప్యత ఉన్న పార్టీలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం.ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఫిబ్రవరి, మార్చిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు సీఎం కేసీఆర్తో చర్చించినట్టు సమాచారం. రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి ఖాయమని, పంజాల్లోనూ ఆ పార్టీకి మరోసారి ఓటమి తప్పదని విశ్లేషించినట్టు తెలిసింది. యూపీ ప్రజలు బీజేపీని తిరసరించనున్నారని, అక్కడ అఖిలేశ్ యాదవ్ గెలుపు ఖాయమని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు.

రైలు ప్రయాణం

సొంతూరి బాటపడుతున్నారు.. బస్సులు, రైళ్లు ఫుల్‌

భాగ్యనగరవాసులు సొంతూరి బాటపడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘పాఠశాలలకు 8 నుంచి సెలవులు ఇవ్వడం, శని, ఆదివారాలు కొందరు ఉద్యోగులకు సెలవులు రావడంతో గ్రామాలకు వెళ్లేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

దీంతో నగర పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి వెళ్లే రైళ్లలో రద్దీ నెలకొంటోంది.

జనరల్‌ బోగీల్లో వందలాది మంది సాధారణ టికెట్లు తీసుకుని ప్రయాణిస్తుండడంతో రద్దీ కనిపిస్తోంది.

శుక్ర, శనివారాల్లో సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి రోజుకు దాదాపు 3.10 లక్షలకు పైగా మంది వివిధ ప్రాంతాలకు తరలివెళ్లినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి’’ అని కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)