బులీమియా: 'తిండిపై నియంత్రణ లేక నా మీద నాకే అసహ్యం వేసింది', దంగల్ ఫేమ్ ఫాతిమా సనా చెప్పిన ఈ ఈటింగ్ డిజార్టర్ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుమన్‌దీప్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''తినడం నాకు బాగా అనిపిస్తుంది. ఆపకుండా గంటల తరబడి తింటూనే ఉండేదాన్ని. ఒకానొక దశలో తిండిపై నియంత్రణ లేక నా మీద నాకే అసహ్యం వేసింది. నిరాశలో కూరుకుపోయా.''
ఇవి బాలీవుడ్ నటి, దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ చెప్పిన మాటలు.
దంగల్ సినిమా తర్వాత తాను బులీమియాతో బాధపడినట్లు ఓ పాడ్‌క్యాస్ట్‌లో రియా చక్రవర్తితో ఫాతిమా సనా పంచుకున్నారు.
ఆమె తన పరిస్థితిని వివరిస్తూ, ఒకానొక సమయంలో తనపై తాను పూర్తిగా నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు.
''నేను బయటికి వెళ్తే, తింటూనే ఉంటానేమో అనిపించేది. నాపైన నాకు లవ్-హేట్ రిలేషన్‌షిప్ ఉండేది. ఫుడ్‌తో టాక్సిక్ రిలేషన్‌షిప్ ఉండేది. దంగల్ సినిమా కోసం బరువు పెరిగాను. ఎందుకంటే, అప్పుడు పెరగాల్సి వచ్చింది'' అని ఆమె తెలిపారు.
''రోజుకు మూడు గంటల పాటు ట్రైనింగ్ తీసుకునేదాన్ని. కాబట్టి బరువు పెరగడం కోసం ప్రతిరోజూ 2,500 నుంచి 3000 కేలరీల ఆహారం తీసుకునేదాన్ని. సినిమా అయిపోయాక అంత ట్రైనింగ్ లేదు. కానీ, అప్పుడు కూడా 3 వేల కేలరీలు తినేదాన్ని. అలా అలవాటైపోయింది'' అని ఫాతిమా చెప్పారు.
''నేను ఆరోగ్యకరంగా లేను. వ్యాయామం చేయడం లేదు. అతిగా తినడం సమస్య కాదు, కానీ అసలు సమస్య మీలోనే ఉంటుంది. ఎందుకంటే, మీరు ఎప్పుడూ అసౌకర్యంగా ఉంటూ, మీ భావోద్వేగాలను తింటూ ఉంటారు. అంటే, మీ మూడ్ ఎలా ఉన్నా తినడంపైనే ధ్యాస.'' అని ఫాతిమా సనా షేక్ తెలిపారు.
''ఇదొక డూమ్‌స్క్రోలింగ్ లాంటిది. అంటే, శరీరాకృతి, బరువు తగ్గడం, సన్నగా అవ్వడం వంటి పోస్టులను లేదా వీడియోలను మొబైల్‌లో పదేపదే చూడటం లాంటిది'' అని తెలిపారు.

ఈ ఏడాది మొదట్లో ఈటింగ్ డిజార్డర్లు (తినడానికి సంబంధించిన రుగ్మతలను) అత్యవసర పరిస్థితిగా పరిగణించి వెంటనే చికిత్స చేయాలని బ్రిటన్‌లోని పార్లమెంట్ సభ్యుల బృందం కోరింది.
గత పదేళ్లుగా బులీమియా వంటి ఈటింగ్ డిజార్డర్లు ''ఆందోళనకర'' స్థాయిలో పెరుగుతున్నాయని వారు చెప్పారు. ఇప్పుడు ''అత్యవసర పరిస్థితి''గా మారాయని తెలిపారు.
అయితే, బులీమియా అంటే ఏమిటి? దాని లక్షణాలేంటి? ప్రజలపై ముఖ్యంగా యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇదొక శారీరక లేదా మానసిక రుగ్మతా? అనేది తెలుసుకునేందుకు మేం కొంతమంది వైద్య నిపుణులతో మాట్లాడాం.

ఫొటో సోర్స్, Getty Images
బులీమియా నెర్వోసా అంటే ఏమిటి?
నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం.. బులీమియా (బులీమియా నెర్వోసా) అనేది ఈటింగ్ డిజార్డర్ (తినడానికి సంబంధించిన రుగ్మత), తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితి. ఎవరైనా దీనికి గురికావొచ్చు. ఇది నయం అయ్యేందుకు కాస్త సమయం పడుతుంది.
''బులీమియా నెర్వోసా ఉన్న వ్యక్తి అతిగా తింటారు. అంటే, కొద్ది సమయంలోనే ఎక్కువగా తినేస్తుంటారు. తమను తాము నియంత్రించుకోలేరు'' అని దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ టీనా గుప్తా తెలిపారు.
''ఇది సాధారణంగా అతిగా తినడం, డైటింగ్ చేయడం వంటివాటికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, తినే విషయంలో ఒక వ్యక్తి తనపై తాను నియంత్రణ కోల్పోతారు. ఎక్కువ ఆహారం తీసుకున్న తర్వాత, వాంతులు చేసుకోవడం, లాక్సేటివ్స్ (మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించే మందులు) లేదా డైయురెటిక్స్ (మూత్ర విసర్జన ఎక్కువగా చేయడం ద్వారా శరీరం అదనపు ఉప్పు, నీటిని బయటకు పంపించేందుకు సహాయపడే మందులు) తీసుకోవడం లేదా ఎక్కువ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం, ఎక్కువగా వ్యాయామం చేయడం ద్వారా దీన్ని భర్తీ చేస్తుంటారు'' అని ఆమె వివరించారు.
బులీమియా లక్షణాలు
బులీమియాను ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా కష్టమని, ఎందుకంటే, ప్రజలు దాని లక్షణాలను బయటికి చెప్పరని డాక్టర్ టీనా అన్నారు.
శరీరంలో ఆహారం ఎక్కువై, కావాలని వాంతులు చేసుకుంటూ ఉండడం బులీమియాతో బాధపడే వారిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణం.
ఇది కాకుండా ఎన్‌హెచ్ఎస్ చెబుతున్న ప్రకారం.. ఇతర లక్షణాలు కింద పేర్కొన్న విధంగా ఉంటాయి.
- బరువు పెరుగుతారనే భయం.
- అద్దంలో చూసుకుంటూ పదేపదే ఊబకాయం గురించి మాట్లాడటం.
- బరువు, శరీరాకృతి గురించి ఎక్కువగా విమర్శించుకోవడం.
- మూడ్ స్వింగ్స్ – బాగా చికాకుగా, చింతతో లేదా విచారంలో ఉండటం.
- ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడటం
- అలసటగా భావించడం, నిద్ర పోలేకపోవడం.
- నీరసంగా ఉండటం లేదా కళ్లు తిరగడం.
- గొంతు నొప్పి, కడుపు నొప్పి
- గ్రంథుల వాపు కారణంగా ముఖానికి ఇరువైపులా, చెవుల కింద వాపు
- రుతుస్రావం సక్రమంగా లేకపోవడం లేదా ఆగిపోవడం

ఫొటో సోర్స్, Getty Images
దీని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేంటి?
బులీమియా వల్ల కలిగే పొటాషియం హెచ్చుతగ్గులు గుండె జబ్బులకు దారితీయొచ్చని డాక్టర్ టీనా గుప్తా తెలిపారు.
''జీర్ణవ్యవస్థలో సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు కడుపు నొప్పి వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌కు గురవుతాం. అరుదైన కేసుల్లో, వాంతులు చేసుకునే సమయంలో కడుపు పగిలిపోయినట్లు అనిపించవచ్చు.''
అంతేకాక, '' దంత సమస్యలు వస్తాయి. ఎందుకంటే, వాంతులు పదేపదే చేసుకోవడం వల్ల దంతాలపై కడుపులో నుంచి వచ్చిన యాసిడ్‌లు ప్రభావం చూపుతాయి. ఇవి దంత క్షయం, చిగుళ్ల సమస్యలకు దారితీయొచ్చు. ఎనామల్ కూడా కోల్పోయేలా చేస్తాయి. అప్పుడు దవడలో నొప్పి వస్తుంది'' అని ఆమె చెప్పారు.
'' హార్మోన్లలో బ్యాలెన్స్ తప్పుతుంది. దీనివల్ల మహిళలకు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం లేదా ఆగిపోవడం జరుగుతుండొచ్చు. వారికి ఫెర్టిలిటీ సమస్యలు రావొచ్చు. డీహైడ్రేషన్ లేదా డైట్ పిల్స్, లాక్సేటివ్స్, డైయురెటిక్స్ వాడటం వల్ల కిడ్నీ సమస్యలు కూడా తలెత్తవచ్చు.
'' శరీరంలో, జట్టులో మార్పులు వస్తాయి. బులీమియా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. డిప్రెషన్‌ను, ఒత్తిడిని పెంచుతుంది'' అని డాక్టర్ టీనా గుప్తా వివరించారు.
బులీమియా నిర్ధరణ ఎలా?
దీనిని నిర్ధరించేందుకు ఎలాంటి పరీక్ష లేదని, కానీ బాధితుల్లో వచ్చే మార్పుల ద్వారా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు గుర్తించవచ్చని పోషకాహార నిపుణురాలు (న్యూట్రిషనిస్ట్) అమీషా గులాటి చెప్పారు.
'' టీనేజీ దశ చివరిలో లేదా 20ల ప్రారంభంలో సాధారణంగా వస్తుంటుంది. ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండటం, డిప్రెషన్, కుటుంబ సమస్యలతో ఇది ముడిపడి ఉంటుంది. పీడియాట్రిషియన్ లేదా థెరపిస్ట్ దీనిని గుర్తించవచ్చు'' అని తెలిపారు.
వ్యక్తి ప్రవర్తనలో మార్పులను బట్టి దీన్ని నిర్ధరించవచ్చని డాక్టర్ టీనా గుప్తా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దీనికి చికిత్స ఉందా?
''బాధితులతో చాలా వివరంగా మాట్లాడాల్సి ఉంటుంది. దీన్నే క్లినికల్ ఇంటర్వ్యూ అంటాం. క్లినికల్ ఇంటర్వ్యూలో ఆహారపు అలవాట్లు, అతిగా ఏ సందర్భాల్లో తింటున్నారు, నియంత్రణ కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి ఎలా భావిస్తున్నారు, ఆ తర్వాత ఏం చేస్తున్నారు, శరీరాకృతి విషయంలో ఏదైనా ఆందోళనలు ఉన్నాయా, ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉందా అనే కోణాల్లో బాధితులను డాక్టర్ ప్రశ్నిస్తారు'' అని టీనా గుప్తా తెలిపారు.
''దీని ద్వారా అతిగా తినడం, పర్జింగ్ (బలవంతంగా వాంతులు చేసుకోవడం) వంటి ప్రవర్తనలకు సంబంధించి కీలక విషయాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. ఈటింగ్ డిజార్డర్‌కు చికిత్స చేసే సమయంలో, అతిగా తినే సైకిల్‌ను, పర్జింగ్‌ను మేం బ్రేక్ చేస్తాం. వారు మానసికంగా, శారీరకంగా కోలుకునేలా సాయపడతాం'' అని చెప్పారు.
దీనికి చికిత్స పలు రకాలుగా ఉంటుంది. ఈటింగ్ డిజార్డర్ల కోసం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ రూపంలో టాకింగ్ థెరపీని వాడతారు.
''చాలా కేసుల్లో మందులు కూడా అవసరం పడుతుండొచ్చు. యాంటీ డిప్రెసెంట్స్‌గా పిలిచే ఎస్ఎస్ఆర్ఐలు, ముఖ్యంగా ఫ్లూక్సెటైన్ ఎక్కువగా రాస్తుంటాం'' అని తెలిపారు.
కొన్ని వైద్య పరీక్షలు, పర్యవేక్షణ అవసరం పడుతుండొచ్చు. కొన్ని రక్తపరీక్షలు, డెంటల్ చెకప్‌లు, హార్ట్ మానిటరింగ్ వంటివి డాక్టర్ సూచించవచ్చు. కొన్నికేసుల్లో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరమని కూడా బాధితులకు చెప్పవచ్చు.
కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
డాక్టర్ టీనా గుప్తా చెబుతున్న ప్రకారం.. బులీమియా నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది.
సగటున, కోలుకోవడానికి 9 నుంచి 12 నెలల కాలం పట్టవచ్చు. ఈ రుగ్మత తిరగబెట్టడం సర్వసాధారణం. బులీమియాతో బాధపడే వారిలో 30 నుంచి 50 శాతం ప్రజలు రికవరీ సమయంలో ఏదో ఒక సమయంలో మళ్లీ ఈ రుగ్మత బారినపడతారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స సమయంలో కుటుంబం పాత్ర
బులీమియా నుంచి కోలుకోవడంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కీలక పాత్ర పోషిస్తారు. ఆ వ్యక్తితో ప్రేమగా, హాయిగా మాట్లాడేందుకు ఇంట్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించాలి.
వారి శరీరాకృతిపై లేదా బరువుపై ఎలాంటి కామెంట్ చేయకూడదు.
వారితో ఓపికగా ఉండాలి. వారికి ఎలాంటి సహాయం కావాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

ఫొటో సోర్స్, Getty Images
బులీమియాను నివారించవచ్చా?
టీనేజర్ల కోసం స్కూళ్లు, కాలేజీలు సురక్షితమైన వాతావరణాన్ని అందించాలని పోషకాహార నిపుణులు అమీషా గులాటి చెప్పారు. పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి పిల్లలకు, తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయాలి.
‘‘ముఖ్యంగా తల్లిదండ్రుల మద్దతుతో టీనేజర్లలో ఆత్మ విశ్వాసం పెంపుకు కృషి చేయాలి. శరీరంపై సానుకూల ధోరణిని ప్రోత్సహించాలి. టీనేజర్లు సోషల్ మీడియా, టీవీ ద్వారా ఎక్కువగా ప్రభావితులవుతున్నారు. సన్నగా ఉండటం ఆదర్శవంతమైన శరీరాకృతిగా భావించే అవకాశం ఉంది. అందుకే పర్యవేక్షణ అవసరం’’ అని తెలిపారు.
బులీమియా లక్షణాలను పెద్దలు లేదా పిల్లలు గుర్తిస్తే.. వెంటనే నిపుణుల సాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అంతేకాక, ‘‘సరైన సమయంలో సరైన సాయం అందితే బులీమియా నుంచి రికవరీ అవ్వడం సాధ్యం’’ అని డాక్టర్ టీనా గుప్తా తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














