బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 25న ఏం జరగబోతోంది? జర్మనీ, అమెరికా ఆ రోజున అక్కడి తమ రాయబార కార్యాలయాలు ఎందుకు మూసేస్తున్నాయి?

బంగ్లాదేశ్, డిసెంబర్ 25, ఇంక్విలాబ్ మంచ్, ఉస్మాన్ హాదీ, ఖలీదా జియా, తారిఖ్ రెహమాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 25న జరగబోయే పరిణామాలపై ఆందోళన

బంగ్లాదేశ్‌లో తమ రాయబార కార్యాలయాన్ని డిసెంబర్ 24, 25 తేదీల్లో మూసివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది.

ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా డిసెంబర్ 25కి సంబంధించి ఒక అడ్వైజరీ జారీ చేసింది.

డిసెంబర్ 24, 25న తమ ఎంబసీ మూసివేయడానికి గల కారణాల గురించి జర్మన్ రాయబార కార్యాలయం వివరణ ఏదీ ఇవ్వలేదు.

అడ్వైజరీ జారీ చేయడం వెనుక కారణాల గురించి అమెరికా ప్రకటించింది.

ఉస్మాన్ హాదీ మరణంపై అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్ దేశాలు సంతాపం ప్రకటించాయి.

ఈ పరిస్థితుల మధ్య డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌లో ఏం జరగనుందే ప్రశ్న తలెత్తుతోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై అమెరికా, జర్మనీ అప్రమత్తంగా ఉన్నాయి.

"డిసెంబర్ 24, 25న మా ఎంబసీ మూసివేసి ఉంటుంది. డిసెంబర్ 28 నుంచి కార్యకలాపాలు మళ్లీ మొదలవుతాయి" అని జర్మనీ రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"మీడియా కథనాల ప్రకారం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా డిసెంబర్ 25 ఉదయం 11.45 గంటలకు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢాకాలోని గుల్షన్ వరకు భారీ ప్రజా ర్యాలీని నిర్వహించనున్నారు" అని అమెరికన్ ఎంబసీ అడ్వైజరీ పేర్కొంది.

"ఈ ర్యాలీ వల్ల భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఢాకాలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని వెళ్లాలి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు తమ విమాన టిక్కెట్లు, ఇతర పత్రాలను తీసుకెళ్లాలి. పోలీస్ చెక్‌పోస్టుల వద్ద వాటిని చూపించాలి" అని ఢాకాలోని అమెరికన్ ఎంబసీ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాసింది.

భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో మాట్లాడారు.

బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులు, ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల గురించి ఇద్దరూ చర్చించారు.

బంగ్లాదేశ్, డిసెంబర్ 25, ఇంక్విలాబ్ మంచ్, ఉస్మాన్ హాదీ, ఖలీదా జియా, తారిక్ రెహమాన్

ఫొటో సోర్స్, Facebook/ @Tarique Rahman

ఫొటో క్యాప్షన్, తారిక్ రెహమాన్

17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిక్ రెహమాన్

బీఎన్‌పీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి ట్రావెల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఆయన లండన్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ కార్యాలయంలో ట్రావెల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

"తారిక్ డిసెంబర్ 25న ఉదయం 11:45 గంటలకు హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు" అని బీఎన్‌పీ ఫేస్‌బుక్ పోస్టులో రాసింది.

బీఎన్‌పీ వ్యవస్థాపకుడు జియాఉర్ రెహమాన్, చైర్ పర్సన్ ఖలీదా జియా దంపతుల పెద్ద కుమాడురు తారిక్ రెహమాన్.

2007లో సైన్యం మద్దతుతో కొనసాగిన కేర్‌టేకర్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది.

2008లో ఆయన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు.

తారిక్ రెహమాన్ భార్య జుబైదా ఇటీవల బంగ్లాదేశ్‌లో పర్యటించి డిసెంబర్ 20న తిరిగి లండన్ చేరుకున్నారు.

ఖలీదా జియా 40 ఏళ్లకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. జియాఉర్ రెహమాన్ హత్య తర్వాత ఆమె బీఎన్‌పీ పగ్గాలు చేపట్టారు.

1981లో జియాఉర్ రెహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన హత్యకు గురయ్యారు.

1991 ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం సాధించడంతో ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి అయ్యారు.

2001లో ఆమె తిరిగి అధికారంలోకి వచ్చి 2006 వరకు అధికారంలో కొనసాగారు.

బీఎన్‌పీ గత మూడు ఎన్నికల్ని బహిష్కరించింది.

2024లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఖలీదా జియా మద్దతు ఇచ్చారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ అతిపెద్ద పార్టీగా ఉంది.

ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖలీదా జియా జైలులో ఉన్నారు.

ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్‌ను కోర్టులు అనేక కేసుల్లో దోషిగా తేల్చాయి.

ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం, ఖలీదా ఆమె కుమారుడిని నిర్దోషులుగా ప్రకటించింది.

బంగ్లాదేశ్, డిసెంబర్ 25, ఇంక్విలాబ్ మంచ్, ఉస్మాన్ హాదీ, ఖలీదా జియా, తారిఖ్ రెహమాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా

విదేశీ రాయబార కార్యాలయాల వైఖరిపై ప్రశ్నలు

బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 12న ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

హాదీని చికిత్స కోసం సింగపూర్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయన మరణించారు.

2024లో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించిన విద్యార్థుల ఆందోళనలకు హాదీ నాయకత్వం వహించారు.

హాదీ మరణ వార్త తర్వాత ఢాకాలో హింస చెలరేగింది. ఆందోళనకారులు భారత హైకమిషన్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

హాదీని చంపినవారు భారత్‌కు పారిపోయారని వదంతులు వ్యాపించాయి.

హాదీ అంత్యక్రియల రోజున యూరోపియన్ దేశాల రాయబార కార్యాలయాలు సంతాపం ప్రకటించాయి. జర్మన్ రాయబార కార్యాలయం తన జెండా అవనతం చేసింది.

అయితే భారత్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేదు.

హాదీ మరణంపై పాశ్చాత్య దేశాల స్పందనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ ప్రశ్నలు సంధించారు.

"ఒక విద్యార్థి నాయకుడి హత్యకు బంగ్లాదేశ్‌లోని అమెరికా, ఈయూ దేశాల రాయబార కార్యాలయాలు రాజకీయంగా ఇంత ప్రాధాన్యం ఇవ్వడం దౌత్య కోణంలో అసాధారణ అంశం. ద్వైపాక్షిక లేదా అంతర్జాతీయ కోణలో దీని ప్రాముఖ్యం అస్పష్టంగా ఉంది" అని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాశారు.

"ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే హాదీకున్న ఇస్లామిక్ సంబంధాలు. అతని ఇంక్విలాబ్ మంచ్ లౌకిక బంగ్లాదేశ్‌ను ఇస్లామీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అతనికి భారతదేశంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. భారత దేశపు ఈశాన్య రాష్ట్రాలను తమవిగా ప్రకటించున్నారు. ప్రాంతీయంగా చూస్తే భారత్‌కు ఇది స్పష్టమైన సందేశం" అని ఆయన తన సందేశంలో తెలిపారు.

"షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించాలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదని ఇంక్విలాబ్ మంచ్ ప్రచారం చేస్తోంది. షేక్ హసీనా ప్రజాస్వామ్య వాది కాదని పాశ్చాత్య దేశాలు ఫిర్యాదు చేశాయి. బంగ్లాదేశ్‌లో షరియా అమలు చేయాలని కోరుతున్న వ్యక్తికి మద్దతు ప్రకటించడం అంటే ఆ దేశ ప్రజాస్వామ్యానికి, మైనారిటీల హక్కులకు వ్యతిరేకం. హాదీ అనుచరులు షేక్ ముజిబుర్ రెహమాన్‌తో సంబంధం ఉన్న భవనాలను అనేకసార్లు తగలబెట్టారు" అని కన్వల్ సిబల్ అన్నారు.

"బంగ్లాదేశ్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలు వీటన్నింటికీ మద్దతు ఇస్తాయా? ఆ దేశాల ద్వంద్వ ప్రమాణాలను కపటత్వానికి ఇదొక ఉదాహరణా? అని కన్వల్ సిబల్ తన సందేశంలో ప్రశ్నలు సంధించారు..

భారత్- బంగ్లాదేశ్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని బంగ్లాదేశ్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరివిచ్ ఖోజిన్ సూచించారు. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్, డిసెంబర్ 25, ఇంక్విలాబ్ మంచ్, ఉస్మాన్ హాదీ, ఖలీదా జియా, తారిఖ్ రెహమాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలో హిందూ సంస్థలు ముహమ్మద్ యూనస్ దిష్టి బొమ్మలను తగులబెట్టాయి.

భారత్, బంగ్లాదేశ్ సంబంధాలలో ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో గతేడాది విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన తర్వాత భారత్- బంగ్లా సంబంధాలలో ఉద్రికత పెరుగుతూ వచ్చింది.

ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస భారత వ్యతిరేక భావనను మరింత పెంచింది.

గత వారం బంగ్లాదేశ్‌లో ఒక హిందూ యువకుడిని కొట్టి చంపారు.

ఈ ఘటనకు వ్యతిరేకంగా డిసెంబర్ 20న దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ఎదుట కొంతమంది నిరసన చేపట్టారు.

ఈ నిరసన గురించి బంగ్లాదేశ్‌లోని కొన్ని మీడియా సంస్థలు "తప్పుదోవ పట్టించే ప్రచారం" చేస్తున్నట్లు భారత్ గుర్తించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.

"వాస్తవం ఏంటంటే డిసెంబర్ 20న దిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం ఎదుట 20-25 మంది యువకులు పోగయ్యారు. మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు" అని భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

రణధీర్ జైస్వాల్ ప్రకటనపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందించింది.

ఇది" అనవసరమైన సంఘటన" ఇలా జరగడం విచారకరం అని బంగ్లాదేశ్ పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)