ఉస్మాన్ హాదీ, దీపు చంద్రదాస్: ఈ ఇద్దరి హత్యలతో దిగజారిన భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయా?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఒక ప్రకటన చేశారు.
దీనిపై బంగ్లాదేశ్ స్పందించింది. ఈ నిరసన ప్రదర్శనపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తంచేసింది.
దీన్ని కేవలం ‘‘తప్పుదోవ పట్టించే ప్రచారం’’ అంటూ తోసిపుచ్చలేమని పేర్కొంది.
దిల్లీలోని తమ హైకమిషన్ కార్యాలయం దగ్గర డిసెంబరు 20న జరిగిన ‘‘అనవసర సంఘటన’’ తీవ్ర విచారకరమని బంగ్లాదేశ్ పేర్కొంది.
"హైకమిషన్ చుట్టుపక్కల అల్లరిమూకలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతించారు. హై కమిషన్ ప్రాంగణంలో ఉన్నవారిలో ఇది ఆందోళన కలిగించింది. ఈ సంఘటనపై హైకమిషన్‌కు ముందుగా సమాచారం ఇవ్వలేదు. అయితే బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల భద్రతపై భారత ప్రభుత్వం నిబద్ధతను మేం గమనించాం" అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.


ఫొటో సోర్స్, Niamul RIFAT / AFP via Getty
మైనర్టీలను అన్ని దేశాలూ రక్షించుకోవాలి
"బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తి హత్య ఘటనను భారత ప్రభుత్వ అధికారులు మైనారిటీలపై జరిగిన దాడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఆయన హిందువు" అని ఆ ప్రకటనలో బంగ్లాదేశ్ పేర్కొంది.
"ఈ దాడిలో నిందితుడిని బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసింది. దక్షిణాసియాలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే బంగ్లాదేశ్‌లో భిన్న మతాలకు చెందిన ప్రజల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రతి దేశానికీ మైనారిటీలను రక్షించాల్సిన బాధ్యత ఉందని బంగ్లాదేశ్ నమ్ముతోంది" అని ప్రకటనలో ఉంది.

ఫొటో సోర్స్, Maruf Rahman/NurPhoto via Getty Images
భారత్ ఏం చెప్పింది?
బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు జరిగిన నిరసనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ఈ సంఘటనపై బంగ్లాదేశ్‌లోని కొన్ని మీడియా సంస్థల్లో 'తప్పుదోవ పట్టించే ప్రచారం' వ్యాప్తి చెందడాన్ని భారతదేశం గమనించిందని అన్నారు.
"డిసెంబరు 20న దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు దాదాపు 20-25 మంది యువకులు గుమిగూడారు. బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన అన్నారు.
దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర ఫెన్సింగ్‌ను దాటడానికి లేదా భద్రతాపరంగా ఇబ్బందులు సృష్టించడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని జైస్వాల్ అన్నారు. సంఘటనా స్థలంలో మోహరించిన పోలీసులు నిమిషాల్లోనే ఆ గుంపును చెదరగొట్టారని తెలిపారు.
"ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా వాటిని చూడొచ్చు. వియన్నా కన్వెన్షన్ నిబంధనల ప్రకారం భారత్‌లోని విదేశీ రాయబార కార్యాలయాల భద్రతకు భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది" అని ఆయన అన్నారు.
భారత అధికారులు బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారని రణ్‌ధీర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్యతో ఉద్రిక్తత
బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్‌ను హత్య చేసినవారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని భారత్ డిమాండ్ చేసిందని రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.
మైమన్‌సింగ్ జిల్లాలోని భాలూకాలో మతాన్ని 'అవమానించాడ'నే ఆరోపణలతో ఒక హిందూ యువకుడిని ఒక మూక కొట్టి చంపింది.
జిల్లాలోని దుబాలియా పాడాలో గురువారం(డిసెంబరు 18) రాత్రి ఈ సంఘటన జరిగిందని పోలీసులు బీబీసీతో చెప్పారు.
ఆ యువకుడిని కొట్టి చంపిన తర్వాత, మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించారని భాలుకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిపన్ మియా బీబీసీతో అన్నారు.
మరణించిన యువకుడిని దీపు చంద్రదాస్‌గా పోలీసులు గుర్తించారు.
మైమన్‌సింగ్‌లో జరిగిన హత్యను బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ ఒక ప్రకటనలో ఖండించారు.
"మైమన్‌సింగ్‌లో ఒక హిందూ వ్యక్తిని కొట్టి చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త బంగ్లాదేశ్‌లో అలాంటి హింసకు చోటు లేదు. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోము" అని ముహమ్మద్ యూనస్ ప్రెస్ విభాగం ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.
"ఈ కీలక సమయంలో హింస, రెచ్చగొట్టడం, ద్వేషాన్ని వ్యతిరేకించడం ద్వారా అమరవీరుడు హాదీకి నివాళులర్పించాలని మేం ప్రతి పౌరుడిని కోరుతున్నాం" అని ఆ పోస్టులో ఉంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఉస్మాన్ హాదీ హత్య తర్వాత మరింత దిగజారిన పరిస్థితి
గత శుక్రవారం(డిసెంబరు 19) ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీని బంగ్లాదేశ్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
ఆయన మరణం భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. హాదీని కాల్చిన వ్యక్తులు భారత్‌కు పారిపోయారని ఊహాగానాలు వ్యాపించాయి.
హాదీ మరణ వార్త తర్వాత చెలరేగిన హింసలో భారత హైకమిషన్ కూడా టార్గెట్‌గా మారింది.
2024లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించిన తిరుగుబాటులో హాదీ ముఖ్యపాత్ర పోషించారు.
గతవారం ఢాకాలో ముసుగులు ధరించిన దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడిన హాదీ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌లో తొలిసారి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని హాదీ భావించారు.
రాత్రంతా నిరసనకారులు బంగ్లాదేశ్‌లోని ప్రముఖ వార్తాపత్రికలైన ది డైలీ స్టార్, ప్రథమ్ ఆలో కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పంటించారు.
హాదీని శనివారం(డిసెంబరు 20) ఢాకా విశ్వవిద్యాలయంలో బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధికి సమీపంలో ఖననం చేశారు.
అంత్యక్రియల ప్రార్థనలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్‌తో సహా రాజకీయ పార్టీ నాయకులు, హాది మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కొత్త ప్రభుత్వం వచ్చాకయినా పరిస్థితి మెరుగుపడుతుందా?
24 గంటల్లోగా హాదీ హంతకులను అరెస్టు చేయాలని ఇంక్విలాబ్ మంచ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది.
హాదీ అంత్యక్రియలు జరిగిన రోజు యూరోపియన్ దేశాల రాయబార కార్యాలయాలు సంతాపాన్ని ప్రకటించాయి. జర్మన్ రాయబార కార్యాలయం తన జెండాను అవనతం చేసింది.
గత ఏడాది ఆగస్టు 5న మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందినప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
కొంతకాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముహమ్మద్ యూనస్ థాయిలాండ్‌లో సమావేశమయ్యారు.
ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా సంబంధాలను గాడిన పెట్టడానికి సహాయపడుతుందని భారతదేశం ఆశించింది.
కానీ ఉస్మాన్ హదీ మరణం తర్వాత, తదుపరి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














