వీబీ-జీ రామ్ జీ: ఈ కొత్త స్కీమ్‌కు ఉపాధి హామీ పథకానికి తేడా ఏంటి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

ఫొటో సోర్స్, ANI
లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన వికసిత్ భారత్ – జీ రామ్ జీ బిల్-2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇది ఇప్పుడు చట్టంగా మారింది.
యూపీఏ హయాంలో ప్రారంభించిన మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇకపై 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకంగా పిలుస్తారు.
ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు 125 రోజుల వేతన హామీ ఉపాధి కల్పిస్తారు.
"2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం" అనే జాతీయ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి స్పష్టమైన మార్గాన్ని వేయడమే కొత్త పథకం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
అయితే ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి.

ఈ చట్టం పేరు ''వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) అంటే 'వీబీ- జీ రామ్ జీ'.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కింద గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఏడాదిలో 100 రోజుల ఉపాధి కల్పించేందుకు హామీ ఇచ్చారు.
కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చట్టంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా ప్రభుత్వం మహాత్ముడిని అవమానిస్తోందని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి.
అయితే ఇది యూపీఏ తెచ్చిన ఉపాధి హామీ పథకం కంటే మెరుగైనదని, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, ANI
వీబీ- జీ రామ్ జీ బిల్లులో ఏముంది?
గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యంలేని వాళ్లు, పని చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి ఏడాదిలో 125 రోజులు ఉపాధి కల్పించడానికి ఈ చట్టం హామీ ఇస్తుంది.
యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంలో 100 రోజులకు మాత్రమే పని కల్పించేవారు.
కొత్త చట్టం కింద గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత నీటికి గ్యారంటీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన పనులలో ప్రజలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో సాగునీరు, తాగునీటి వనరులను మెరుగు పరచవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
కొత్త చట్టం కింద గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం, నీటి సంబంధిత మౌలిక వసతుల కల్పన, ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ, గ్రామీణ ప్రజలకు మార్కెట్ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
కొత్త చట్టం ద్వారా కార్మికులతోపాటు రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందని కేంద్రం వాదిస్తోంది.
వీబీ- జీ రామ్ జీ చట్టం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని కేంద్రం చెబుతోంది.

ఫొటో సోర్స్, Kalpit Bhachech/Dipam Bhachech/Getty Images
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా
గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలను "మెరుగుపరిచే" లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వంలోనని యూపీఏ ప్రభుత్వం 2005లో ఎంఎన్‌ఆర్‌ఈజీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది దేశంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తుంది.
నాడు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో కార్మికులకు ఇచ్చే వేతనాల మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
అయితే సామానుకయ్యే ఖర్చు మాత్రం రాష్ట్రాలు నిర్ణీత నిష్పత్తిలో భరించేవి.
కొత్త చట్టం ప్రకారం పథకం కింద అయ్యే మొత్తం ఖర్చులో 60శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ ఇతర కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రం ఈ పథకం కింద అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి 15 రోజుల్లోపు పని దొరక్కపోతే వారికి నిరుద్యోగ భృతిని రోజువారీగా చెల్లిస్తారు. దీనికి అవసరమయ్యే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. ఈ నిబంధన పాత చట్టంలోనూ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షాల ఆరోపణ, ప్రభుత్వ వాదన
వీబీ- జీ రామ్ జీ బిల్లును డిసెంబర్ 16న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం అంటే గాంధీని అవమానించడమే అన్న ప్రతిపక్షాల ఆరోపణను ఆయన కొట్టి పారేశారు.
"ఈ బిల్లు గ్రామీణ ప్రజల జీవితాలను, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పరుస్తుంది. మహాత్మా గాంధీ గ్రామాభివృద్ధిని కోరుకున్నారు. అలాంటప్పుడు కొత్త బిల్లు తీసుకురావడం ఆయనను అవమానించడం ఎలా అవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.
"యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం మేము వారి కంటే ఎక్కువ నిధులను ఖర్చు పెట్టాం. గ్రామాల అభివృద్ధి మా సంకల్పం. మహాత్మా గాంధీ కోరుకున్నది మేము చేస్తున్నాము. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కూడా ఇదే కోరుకున్నారు" అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వీబీ- జీ రామ్ జీ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నియంత్రిత పథకాన్ని రహస్యంగా తీసుకువచ్చిందని ప్రతిపక్షం ఆరోపించింది.
కొత్త చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు 'ఎక్కువగా ఖర్చు' చేస్తే, దాని 'ఫలితం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖాతా'లో పడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఈ బిల్లుపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు.
"నేను ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మేము ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పుడు రాజకీయ పార్టీలన్నీ దీనికి మద్దతిచ్చాయి. ఇది ప్రజల సంక్షేమం కోసం తీసుకువచ్చిన చట్టం అని రుజువైంది. మేము తెచ్చి ఉపాధి హామీ పథకంలో పనుల కోసం నిధుల కేటాయింపులో గ్రామ పంచాయతీలు కూడా కీలక పాత్ర పోషించాయి" అని ఆమె అన్నారు.
"యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు పేరు మార్చాలనే క్రేజ్‌ను అర్థం చేసుకోలేకపోతున్నాం" అని ప్రియాంక అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
"సభలో చర్చించకుండా, సంప్రదింపులు లేకుండా బిల్లును ఆమోదించకూడదు. దీనిని ఉపసంహరించుకోవాలి. కొత్త బిల్లు తీసుకురావాలి. దీనిని క్షుణ్ణంగా పరిశీలించడానికి, విస్తృతంగా చర్చించడానికి స్టాండింగ్ కమిటీకి పంపించాలి" అని ఆమె కోరారు.
ఈ బిల్లుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
"కొత్త బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడమే. ఉద్యోగాల కల్పనలో విఫలమైన మోదీ ప్రభుత్వం ఇప్పటికే భారతదేశ యువత భవిష్యత్తును నాశనం చేసింది. ఇప్పుడు గ్రామీణ పేదల సురక్షితమైన జీవనోపాధిని నాశనం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చింది" అని ఆయన అందులో రాశారు.
ఒకపక్క ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగానే, ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మార్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














