డిసెంబర్‌ కార్ సేల్స్: ఈ నెలలో డీలర్లు ఇచ్చే ఆఫర్ కంటే ఇంకా తక్కువ ధరకు కారు కొనుక్కోవచ్చా?

కారు, డిసెంబర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిసెంబర్ వస్తే చాలు... పేపర్లు, టీవీలు, హోర్డింగుల్లో కార్ల మీద భారీ తగ్గింపు ఆఫర్లు అంటూ ప్రకటనలు కనిపిస్తాయి.

ఏటా డిసెంబర్లో ఆఫర్లు కామనే అయినా, ఇప్పుడు మార్కెట్ కూడా కంపెనీలను తొందరపెడుతోంది.

రూపాయి విలువ కనిష్టానికి పడిపోతుండటం, తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లతో కార్ల ధరలు భారీగా తగ్గాయి.

దీని ప్రభావం కార్ల అమ్మకాలపైనా పడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డిస్కౌంట్లు, అమ్మకం

ఫొటో సోర్స్, Getty Images

డిసెంబర్‌లో డిస్కౌంట్లు..

కార్ల అమ్మకాలలో వాటి తయారీ సంవత్సరం చాలా కీలకం. ఏడాది మారేలోగా మిగిలిపోయిన స్టాక్‌ను త్వరగా విక్రయించాలని కంపెనీలు చూస్తాయి.

జనవరిలో కొత్త మోడల్ వచ్చేస్తుంది కాబట్టి, పాత ఏడాది కార్లకు డిమాండ్ తగ్గుతుంది.

సాధారణంగా ఉగాది, దసరా, దీపావళి వంటి పండుగలతో పాటు, మార్చిలో కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని బెంగళూరు ఎంజీ సేల్స్ మేనేజర్ ఎం.ప్రవీణ్ బీబీసీతో చెప్పారు.

ఆ సీజన్లో అమ్మకాలు పూర్తి కాకపోయినా తర్వాత పూర్తి చేయవచ్చు. కానీ డిసెంబర్ దాటితే మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్ మారుతుంది కాబట్టి వాటిని అమ్మడం కష్టం. దీంతో పాటు ప్రతి డీలర్‌‌కు వార్షిక లక్ష్యాలుంటాయి. ఈ టార్గెట్‌లు పూర్తి చేస్తే కంపెనీల నుంచి ఇన్సెంటివ్‌లు వస్తాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం, ఇన్వెంటరీ నిల్వలు పెరిగినప్పుడు వాటిని తగ్గించడానికి కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తాయి.

వీటితో పాటు సాధారణంగా ముడి సరుకుల ఖర్చులు, కార్పొరేట్ వ్యయాల దృష్ట్యా ప్రతి ఏటా జనవరి 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు అధికారికంగా ప్రకటిస్తాయి. ఈ పెంపు నుంచి తప్పించుకోవడానికి డిసెంబర్‌లోనే కొనుగోలు చేయమని వినియోగదారులను ప్రోత్సహిస్తాయి.

అంతేకాదు, 2025 మాన్యుఫ్యాక్చర్ కార్లను 2026లో అమ్మాలంటే ఇప్పటికన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వాలి. ఒకవేళ 2025 డిసెంబర్లో కొన్నప్పటికీ, దాని రిజిస్ట్రేషన్ 2026లో జరిగినా... దాని మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్ మాత్రం 2025గానే నమోదై ఉంటుంది.

ఈ ఏడాది తాము కొన్ని ఈవీ మోడళ్ల మీద లైఫ్ టైం వారెంటీ ఇస్తున్నామని బెంగళూరుకి చెందిన ఎం.ప్రవీణ్ బీబీసీకి తెలిపారు. వచ్చే ఏడాది ఈ ఆఫర్ కొనసాగించే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేమన్నారు.

లాభం, నష్టం, రిజిస్ట్రేషన్, ఇయర్ఎండ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ నెలలో కొనడం లాభమా? నష్టమా?

డిసెంబర్‌లో కార్లు కొంటే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. కొందరు డీలర్లు డిస్కౌంట్లతో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఫ్రీ యాక్సెసరీలు అందిస్తారు.

ఇతర నెలలతో పోలిస్తే డిసెంబర్‌లో కస్టమర్లకు బేరం ఆడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ డిస్కౌంట్ వల్ల, ఎక్స్ షోరూం ధర తగ్గుతుంది. దీంతో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు కూడా తగ్గుతాయి.

ఇదొక్కటే కాదు. ఫైనాన్స్‌లో కారు కొనాలనుకునే వారికి కూడా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు డీలర్లతో కలిసి ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తాయి. మామూలు రోజుల్లో డిమాండ్ ఎక్కువగా, చాలా లేటుగా డెలివరీ అయ్యే వాహనాలు కూడా డిసెంబర్లో తక్కువ ధరకు, కాస్త ముందుగా, సులువుగా దక్కించుకోవచ్చు.

ఇప్పుడు నష్టమేంటో చూద్దాం..

డిసెంబర్లో కారు కొంటే దాని మాన్యుఫ్యాక్చర్ ఇయర్ 2025 అని ఉంటుంది. కానీ, కారు కొని నెల తిరక్కుండానే మీ కారు ఒక ఏడాది పాతదైపోతుంది. భవిష్యత్తులో కారు తిరిగి అమ్మాలనుకుంటే మోడల్‌ను బట్టి ధర ఉంటుంది. ఇయర్ తేడా వల్ల కారు విలువ తగ్గుతుంది.

2026లో కంపెనీలు కొత్త మోడల్ కార్లను రిలీజ్ చేస్తాయి. జనవరిలో రిలీజయ్యే కొత్త వెర్షన్‌ కార్లలో ముందు మోడళ్లలో లేని ఫీచర్లతో కలిపి, కొత్త డిజైన్‌తో లాంచ్ చేస్తాయి.

మీరు డిసెంబర్లో కారు కొంటే కొద్ది రోజుల్లోనే మీరు కొన్న మోడల్ కారే మార్కెట్లోకి .. కొత్త లుక్, అదనపు ఫీచర్లతో వస్తే మీరు పాత మోడల్ వాడుతున్నారన్న అసంతృప్తి కలుగుతుంది.

డిసెంబర్లో కారు కొనాలంటే డీలర్ల దగ్గరున్న లిమిటెడ్ స్టాక్ నుంచే ఎంచుకోవాలి. దీంతో మీకు నచ్చిన రంగు, కోరుకున్న వేరియెంట్ లభించకపోవచ్చు.

కారు తయారీ సంవత్సరం ఆధారంగానే ఇన్సూరెన్స్‌తోపాటు, కారు డిప్రిసియేషన్ కూడా లెక్కిస్తారు. దీని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్ణయించే ఇన్‌స్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ) కూడా భవిష్యత్తులో ముందే తగ్గుతుంది.

ఒకవేళ మీరు కారును ఏడెనిమిదేళ్లకు పైగా వాడుకోవాలనుకుంటే ఇవేమీ పెద్ద ఎఫెక్ట్ చూపవు. కానీ మూడు నాలుగేళ్లకే కారును మార్చాలనుకునే వారికి డిసెంబర్లో కారు కొనడం కాస్త నష్టదాయకం కావొచ్చు.

ఆఫర్లు, కారుషోరూం, యాక్ససరీస్, ఆన్ రోడ్ ప్రైస్

ఫొటో సోర్స్, Getty Images

డీలర్ల ఆఫర్ల కంటే తక్కువకు ఎలా కొనుక్కోవచ్చు...

డిసెంబర్‌లో కంపెనీలిచ్చే ఆఫర్ల కన్నా ఇంకా తక్కువకు లేదా అదనపు ప్రయోజనాలతో కారును కొనుగోలు చేయడానికి కొన్ని అవకాశాలున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక షోరూం ఎగ్జ్‌క్యూటివ్ తెలిపారు.

కారు బేరమాడేటప్పుడు ఎక్స్ షోరూం ధరపై కాకుండా, ఆన్ రోడ్ ధర మీద బేరమాడటం కాస్త లాభదాయకంగా ఉంటుందన్నారు.

కొన్ని షోరూంలలో డీలర్ షిప్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, లాజిస్టిక్ చార్జీలు వసూలు చేస్తాయి, వీటిని తగ్గించమనడం ద్వారా కాస్త ప్రయోజనం పొందవచ్చు.

కారు కొనే ముందు ఒక్క షోరూంలో మాత్రమే వాకబు చేయకుండా, వేర్వేరు డీలర్లు దగ్గరకు వెళ్లి కొటేషన్లు తీసుకోవాలి. ఒక డీలర్ ఇచ్చే ఆఫర్ ధరను, లేదా ఇతర ప్రయోజనాలను చూపించి, అంతకన్నా మెరుగైన డీల్ ఇవ్వమని అడగొచ్చు.

డిసెంబర్ మధ్యలో కోట్స్ తీసుకుని, నెలాఖరులో వెళ్తే.. అప్పటికి వారి టార్గెట్లు పూర్తి కాకపోతే, ముందు చెప్పిన దానికన్నా కాస్త ధర తగ్గించడం, లేదా అదనపు ప్రయోజనాలను జోడించే అవకాశం ఉంటుంది.

క్యాష్ డిస్కౌంట్లు మాత్రమే కాకుండా, ఉచిత ఇన్సూరెన్స్, లేదా ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఉచిత సర్వీసులు, ఉచిత యాక్సెసరీలు వంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. మీ దగ్గర పాత వాహనం ఉంటే దానిని ఎక్స్ఛేంజ్ చేస్తే, ఎక్స్ఛేంజ్ బోనస్ అదనంగా వస్తుంది.

సీట్లు, కెమెరా, మ్యాట్లు వంటి యాక్సెసరీలకు షోరూంలు ఎంత ఛార్జ్ చేస్తున్నాయో చూసుకోండి. సాధారణంగా ఈ ధర బయటి కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని వద్దని చెప్పి ఆ మొత్తాన్ని కారు ధరలో తగ్గించమని కోరవచ్చు.

ఇక మరో అంశం ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇన్సూరెన్స్ కంపెనీలు డీలర్లతో టై అప్ అవుతాయి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ బయట కంపెనీల్లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ కోట్ తీసుకుని, ఆ పాలసీని మ్యాచ్ చేయమని డీలర్‌ని అడగవచ్చు. లేదా నేరుగా బయటే పాలసీ తీసుకున్నా ఆ మేరకు ప్రయోజనం పొందవచ్చు.

డిసెంబర్లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కూడా కార్‌ లోన్లపై ఆఫర్లు ఇస్తాయి. ఈ సీజన్‌లో తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు రద్దు చేయడం వంటి ఆఫర్లు ఇస్తున్నట్లు ఒక కార్ ఫైనాన్సింగ్‌ ఎగ్జిక్యూటివ్ సురేశ్ బీబీసీకి తెలిపారు.

లోన్‌లో కారు కొనాలంటే తక్కువ వడ్డీ రేటు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ వంటి ఆప్షన్లు ఎక్కడ తక్కువగా ఉన్నాయో చెక్ చేసుకోండి.

మీరు ఉద్యోగి అయితే, మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకులు కూడా కార్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తాయి. మీరు ఏదైనా కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగి అయినా, వారి కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్‌లు, ఆఫర్లు ఇస్తాయి. సో అలాంటి స్కీమ్‌లున్నాయోమో చెక్ చేసుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు.

కొన్ని కార్ల కంపెనీలు లాయల్టీ బోనస్‌లు ప్రకటిస్తాయి. అంటే, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు అదే కంపెనీ కారు ఉండి, మళ్లీ అదే కంపెనీలో కారు కొంటే లాయల్టీ బోనస్ పొందే అవకాశం ఉంటుంది.

కారు, మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్

ఫొటో సోర్స్, Getty Images

కారు తయారైన సంవత్సరం ఎలా తెలుసుకోవాలి?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి వాహనానికి వెహికిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (వీఐఎన్) అనే యూనిక్ నంబర్ ఉంటుంది.

వాహనం మీద ఉండే ఈ 17 అక్షరాల నంబర్‌ను బట్టి అది ఏ దేశంలో, ఎప్పుడు తయారైందో తెలుసుకోవచ్చు.

మొదటి మూడు అక్షరాలు వరల్డ్ మాన్యుఫ్యాక్చర్ ఐడెంటిఫయర్ (డబ్యూఎమ్ఐ) అంటారు. ఇందులో నాలుగు నుంచి 9 వరకూ ఉన్న అక్షరాలను బట్టి కారు మోడల్, బాడీ టైప్, ఇంజిన్, ఇతర ఫీచర్లు తెలుసుకోవచ్చు. 10వ అక్షరం కారు తయారైన సంవత్సరాన్ని, 11వ అక్షరం తయారైన నెలను సూచిస్తుంది. దీనిని బట్టి కారు వివరాలు తెలుసుకోవచ్చు.

జనవరి, డిసెంబర్, ఆఫర్లు, స్టాక్

ఫొటో సోర్స్, Getty Images

జనవరిలో కొన్నా ఆఫర్లు పొందవచ్చా?

ఒకవేళ మీరు డిసెంబర్ నెలలో కార్ బుక్ చేసుకోలేకపోయినా, 2026 జనవరిలో కూడా ఈ పాత ఆఫర్లతో కొత్త కారు కొనుక్కోవచ్చు.

డీలర్లు 2025 లో తయారైన కార్లను పూర్తిగా అమ్మలేకపోతే.. వారు ఆ స్టాక్ ను ఎలాగైనా ఖాళీ చేయాలని చూస్తారు. కాబట్టి పాత ఆఫర్లతో ఆ కారు కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ అవకాశం స్టాక్ లభ్యత మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

మీరు 2025 డిసెంబర్‌లో కారు బుక్ చేసి, 2026 జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఆర్‌సీ మీద రిజిస్టర్ చేసిన సంవత్సరం ఉన్నా, తయారైన సంవత్సరం మాత్రం 2025 అనే ఉంటుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)