అనురాగ్ ద్వివేది : విలాసవంతమైన కార్లు, లగ్జరీ షిప్‌లో పెళ్లి, కోట్లాది రూపాయల ఆస్తులు, ఈ యూట్యూబర్‌పై దర్యాప్తు ఎందుకు?

ఫొటో సోర్స్, X/@AnuragxCricket
- రచయిత, సయ్యద్ మోజిస్ ఇమామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్, ఫాంటసీ క్రికెట్ నిపుణుడిగా చెప్పుకునే అనురాగ్ ద్వివేది జీవనశైలి ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిశీలనలోకి వచ్చింది.
డిసెంబర్ 17న, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని నవాబ్‌గంజ్ ప్రాంతంలోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకుంది.
లఖ్‌నవూ, ఉన్నావ్, దిల్లీలోని పలు ప్రాంతాల్లో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ అనురాగ్ ద్వివేది ఆస్తులపై సోదాలు నిర్వహించినట్టు ఈడీ శుక్రవారం సాయంత్రం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను ప్రోత్సహించడంలో అనురాగ్ ద్వివేది కీలక పాత్ర పోషించాడని తెలిపింది.

"అనురాగ్ ద్వివేది వివిధ హవాలా మార్గాలలో నకిలీ ఖాతాలను సృష్టించి, వాటి నుంచి అక్రమ బెట్టింగ్ యాప్‌లతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. అక్రమ బెట్టింగ్ యాప్‌ల కోసం ఆయన ప్రమోషనల్ వీడియోలు చేసి ఇతరులకు పంపిస్తారు. తద్వారా సామాన్య జనాన్ని ఆ ప్లాట్‌ఫామ్స్‌పై జూదం ఆడమని ప్రోత్సహిస్తారు" అని ఈడీ తెలిపింది.
"ఏ చట్టబద్ధమైన వ్యాపార కారణం లేకుండానే ఆయన కంపెనీల బ్యాంకు ఖాతాల్లోనూ, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది" అని పేర్కొంది.
ఈడీ దాడిలో లంబోర్గిని, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ సహా అనేక ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ వాహనాలన్నింటినీ లక్నోలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయ ప్రాంగణానికి తరలించారు.
లఖ్‌నవు, ఉన్నావ్‌లలో అనురాగ్ ద్వివేదికి సంబంధించిన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు "మీడియా నా గురించి నాకే తెలియని చాలా విషయాలను కేవలం రెండు రోజుల్లోనే తెలుసుకుంది" అని డిసెంబర్19న అనురాగ్ ద్వివేది ఎక్స్‌లో రాశారు.
"ఎవరైనా తమకు నచ్చింది రాయచ్చు, ఎవరి పేరునైనా జోడించేయచ్చు, ఎంత పెద్దమొత్తమైనా చెప్పొచ్చు. అన్నీ అర్ధంలేనివి. ప్రజలు మీడియాను ఎలా సహిస్తున్నారో ఇప్పుడర్థమైంది" అని ఆయన రాశారు.

ఎవరీ అనురాగ్ ద్వివేది
అనురాగ్ ద్వివేది స్వస్థలం ఉన్నావ్ జిల్లా నవాబ్‌గంజ్ తాలూకా. 26 ఏళ్ల అనురాగ్ 1999లో జన్మించారు. ఆయన క్రమంగా ఫాంటసీ క్రికెట్ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఆయన తండ్రి గ్రామపెద్ద. ఆయనకు నవాబ్‌గంజ్‌లో ఒక దుకాణం ఉంది.
అనురాగ్ గతంలో గ్రామంలోనే నివసించేవారు అని స్థానికులు చెప్పారు.
ఎంటర్‌టైనర్స్ క్రికెట్ లీగ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అనురాగ్, తాను 2017లో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టానని తెలిపారు. 2019లో ఫాంటసీ లీగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరానని, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడితో కలిసి 'కంటెంట్ క్రియేటర్' అయ్యానని ఈసీఎల్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
అనురాగ్‌కు యూట్యూబ్‌లో దాదాపు 70 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 24లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
వివాహం, జీవనశైలి
ఈ ఏడాది నవంబర్ 22న అనురాగ్ లఖ్‌నవూ చెందిన ఒక మహిళను దుబయ్‌లో వివాహం చేసుకున్నారు. తన గ్రాండ్ వెడ్డింగ్‌తో అనురాగ్ వార్తల్లో నిలిచారు.
"ఆయన గ్రామంలోని సన్నిహితులు, బంధువులతో సహా దాదాపు 100 మందిని దుబయ్‌కు తీసుకెళ్లాడు" అని స్థానికులు తెలిపారు. అతిథుల ప్రయాణం, వసతి ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు.
అనురాగ్ ద్వివేది ఎంటర్‌టైనర్స్ క్రికెట్ లీగ్‌లో చేరారు. లక్నో లయన్స్ జట్టులో ఉన్నారు. ఇది ఫ్రాంచైజ్ ఆధారిత క్రికెట్ సిరీస్, ఇందులో ప్రముఖ సోషల్ మీడియా స్టార్ల నేతృత్వంలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఈ లీగ్ T-10 ఫార్మాట్‌లో ఆడతారు. ప్రైజ్‌మనీ కోటిరూపాయలు.

ఫొటో సోర్స్, @AnuragxCricket
సైకిల్ నుంచి సూపర్ కారు వరకు
ఈసీఎల్ పాడ్‌కాస్ట్‌లో అనురాగ్ ద్వివేది 2016 నుంచి తాను ఫాంటసీ క్రికెట్‌లో పెట్టుబడి పెడుతున్నానని, తన నికర ఆస్తుల విలువ దాదాపు రూ.190 కోట్లు ఉంటుందని చెప్పారు.
ఒకసారి తాను టాటా మ్యాజిక్ వాహనంలో పాఠశాలకు వెళ్లానని అదే పాడ్‌కాస్ట్‌లో అనురాగ్ వెల్లడించారు కానీ .ఇప్పుడు తన దగ్గర దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువైన లంబోర్గిని ఉరుస్ కారు ఉందన్నారు. గంటకు 288 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్లు పేర్కొన్నారు.
ఒకప్పుడు సైకిల్‌పై కూడా పాఠశాలకు వెళ్లానని ఆ కార్యక్రమంలో తెలిపారు.
అనురాగ్ ద్వివేదిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుత దర్యాప్తు..పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించినది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూన్ 5, 2025న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపింది.ఈ ఎఫ్ఐఆర్‌లో మోసం, అవినీతి, చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులున్నాయి.
సిలిగురిలో ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ గ్రూప్ పనిచేస్తోందని, దానిని కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో విశాల్ భరద్వాజ్, సోనుకుమార్‌లను అరెస్ట్ చేసినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు 8న విడుదల చేసిన మరో ప్రకటనలో నిందితుల నుంచి 17 క్రెడిట్ కార్డులు, 1130 'మ్యూల్ అకౌంట్లు' స్వాధీనం చేసుకుని బ్లాక్ చేసినట్టు పేర్కొంది. వీటిలో దాదాపు 10 కోట్ల రూపాయలు ఉన్నాయి.
చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను ప్రోత్సహించడంలో కొంతమంది వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.
వీరు యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రమోషనల్ వీడియోలు తయారుచేసి, షేర్ చేశారు. ప్రతిగా, వారికి పెద్ద మొత్తంలో డబ్బు లభించిందని తెలిపారు. టెలిగ్రామ్ ఛానెల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలను సంప్రదించినట్టు ఈడీ తెలిపింది.
ప్రజల డబ్బును 'మ్యూల్ అకౌంట్స్’లో జమ చేసేవారు.
మ్యూల్ అకౌంట్ అంటే ఖాతాదారు కాకుండా, ఆ ఖాతాలోని నగదు లావాదేవీలన్నీ ఇతరులు నిర్వహిస్తారు. ప్రతిఫలంగా సొంత ఖాతాదారుకు డబ్బు చెల్లిస్తారు.

దర్యాప్తులో తేలిందేంటి?
దర్యాప్తు సాగుతుండగా, అనురాగ్ ద్వివేది పేరు బయటపడింది.
అనురాగ్ ద్వివేది ఒక ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కోట్లాది రూపాయల బెట్టింగ్‌తో దాని ద్వారా సంపాదించిన డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో, దాని పరిధి ఎంత పెద్దదో తెలుసుకోవడానికి ఏజెన్సీ ప్రయత్నిస్తోందని చెప్పారు.
ద్వివేది చెప్పినదాని కంటే చాలా ఎక్కువఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఈడీ దర్యాప్తులో అనురాగ్ ద్వివేది దుబయ్ సంబంధాలు కూడా కీలకమైన అంశం. ఆయనకు ఈడీ గతంలో చాలాసార్లు సమన్లు జారీ చేసిందని, కానీ ఆయన హాజరు కాలేదని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన దుబయ్‌లో అనేక స్థిరాస్తులు కొనుగోలు చేసి కొంతకాలం నుంచి అక్కడే నివసిస్తున్నారని ఏజెన్సీ అనుమానిస్తోంది.
దుబయ్‌లోని ఒక లగ్జరీ షిప్‌లో జరిగిన ఆయన విలాసవంతమైన వివాహం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.
లఖ్‌నవు జోనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొంటోంది.
దుబయ్‌లో జరిగిన వివాహం, ఆస్తులు, విదేశీ పెట్టుబడుల వెనుక ఉన్న నగదు మూలాలపై లోతైన దర్యాప్తు అవసరమని ఏజెన్సీ అధికారులు అంటున్నారు.
అనురాగ్ ద్వివేది ఆదాయానికి సంబంధించిన నిజమైన మూలాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.
అయితే, ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు. అనురాగ్ తండ్రి ఫోన్ నంబర్ అందుబాటులో లేదు.
అనురాగ్ ఆదాయం అకస్మాత్తుగా పెరిగిందనీ, కానీ ఆయన తన పన్నులన్నింటినీ సకాలంలో చెల్లిస్తున్నారని అనురాగ్ సన్నిహితుడొకరు చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














