శుభ్‌మన్‌ గిల్: ఈ వన్డే, టెస్టు కెప్టెన్‌‌కు టీ ట్వంటీ జట్టులో ఎందుకు చోటు దక్కలేదు? మాజీ క్రికెటర్లు ఏమన్నారంటే...

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ వరల్డ్ కప్, శుభ్‌మన్ గిల్, అజిత్ అగార్కర్

ఫొటో సోర్స్, Alex Davidson/Getty

ఫొటో క్యాప్షన్, శుభ్‌మన్ గిల్( ఎడమ) యశస్విజైస్వాల్‌కు టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించారు.

వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టు టోర్నీకి ముందు జనవరిలో న్యూజీలాండ్‌తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్‌లోనూ ఆడనుంది.

జట్టులో సభ్యుల ఎంపిక గురించి సీనియర్ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు స్పందించారు.

శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ లాంటి పెద్ద ఆటగాళ్లకు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కలేదు.

టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్( కెప్టెన్) అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్) తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్) రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ వరల్డ్ కప్, శుభ్‌మన్ గిల్, అజిత్ అగార్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ ట్వంటీ వరల్డ్ కప్‌కు జట్టు ఎంపిక చక్కగా ఉందని సీనియర్ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నారు.

జట్టు ఎంపికపై ఎవరేమన్నారు?

"టెస్టుల్లో ఫెర్‌ఫార్మెన్స్ ఆధారంగా టీ ట్వంటీ కోసం జట్టును ఎంపిక చేస్తే ఇలాగే ఉంటుంది. గిల్‌ను ఎంపిక చేయకపోవడం ద్వారా ఇంగ్లండ్ పర్యటన సమయంలో సెలెక్టర్లు అత్యుత్సాహంతో చేసిన తప్పును దిద్దుకున్నారు" అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చెప్పారు.

"శుభ్‌మన్ గిల్‌కు చాలా మద్దతు లభించింది. అది స్పష్టం. సెలెక్టర్లు ఆయన ఆట తీరు పట్ల నమ్మకం ఉంచారు. ఆయనను నేరుగా వైస్ కెప్టెన్ చేశారు. ప్రస్తుత జట్టు బాగుంది" అని రవి చంద్ర అశ్విన్ తన యూట్యూబ్ చానల్‌లో చెప్పారు.

"ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం వల్ల సెలెక్టర్లు గిల్‌ను టీ ట్వంటీ జట్టు నుంచి తప్పించారు. కిషన్ రూపంలో భారత్‌కు మంచి వికెట్ కీపర్ దొరికాడు. దీంతో జితేష్ శర్మను కూడా పక్కన పెట్టారు" అని క్రికెట్ వ్యాఖ్యాత అయాజ్ మెమన్ అభిప్రాయపడ్డారు.

"ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో గిల్ ఆట తీరు దృష్టిలో ఉంచుకునే అతనిని పక్కన పెట్టారు. ఆసియా కప్ ప్రారంభంలో సెలెక్టర్ల మైండ్ సెట్ మార్పును ప్రతిబింబిస్తుంది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెప్పారు.

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ వరల్డ్ కప్, శుభ్‌మన్ గిల్, అజిత్ అగార్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ ట్వంటీ వరల్డ్‌కప్ జట్టు ఎంపికపై సీనియర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

గిల్ గురించి అజిత్ అగార్కర్ ఏమన్నారు?

"శుభ్‌మన్ గిల్ మంచి ఆటగాడు. అయితే ప్రస్తుతం ఆయన పరుగుల చేయలేక పోతున్నాడు. గత వరల్డ్ కప్‌లోనూ ఆయన ఆడలేకపోవడం దురదృష్టకరం. మీరు జట్టుకు15 మందిని ఎంపిక చేయాల్సినప్పుడు ఎవరో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. దురదృష్టత్తువశాత్తూ అది ఈసారి గిల్ వంతైంది" అని అజిత్ అగార్కర్ చెప్పాడు.

"గిల్‌ను జట్టులో నుంచి తప్పించడానికి, అతని ఫామ్‌కు ఎలాంటి సంబంధం లేదు. టాప్ ఆర్డర్‌లో ఒక వికెట్ కీపర్ ఉండాలని మేము భావించాం" అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ పెద్దగా పరుగులు చేయలేదు.

తన ఫామ్‌పైనా ఆయన స్పందించారు.

"మీరికపై మెరుగ్గా ఆడే సూర్యకుమార్ యాదవ్‌ను చూడబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఇలాంటి దశ వస్తుంది. అయితే నాకొచ్చిన దశ కాస్త ఎక్కువ కాలం ఉంది" అని చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత ఇండియన్ స్కిప్పర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ వరల్డ్ కప్, శుభ్‌మన్ గిల్, అజిత్ అగార్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌ జితేశ్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు.

జితేశ్ శర్మకూ ఉద్వాసన

టీ ట్వంటీ వరల్డ్ కప్‌కు జట్టు ఎంపికలో ఇషాన్ కిషన్‌కు చోటు కల్పించేందుకు జితేశ్ శర్మను పక్కన పెట్టారు. సంజూ శాంసన్‌ను వికెట్ కీపింగ్‌తో పాటు టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా తీసుకున్నారు.

ఇషాన్ కిషన్ రెండేళ్ల కిందట తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు.

"తనను జట్టులో ఎంపిక చేయకపోవడానికి గల కారణాలేంటో తెలియక జితేశ్ శర్మ ఆశ్చర్యపోయి ఉండవచ్చు. వరల్డ్ కప్ గెలవడానికి సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌తో అవసరం లేదు. న్యూజీలాండ్‌తో సిరీస్‌లో అతను ఫామ్‌లోకి రావచ్చు. వరల్డ్ కప్ టోర్నీలో అదే ఫామ్ కొనసాగించవచ్చని భావిస్తున్నాను" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.

"జట్టు ఎంపిక బాగుంది. ఇషాన్, అక్షర్ పటేల్ 2024 కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు" అని సీనియర్ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాశారు.

భారత క్రికెట్ జట్టు, టీ ట్వంటీ వరల్డ్ కప్, శుభ్‌మన్ గిల్, అజిత్ అగార్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ శర్మ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు 2024లో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకుంది.

టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్

ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

ఈ టోర్నీలో 20 దేశాలు, నాలుగు గ్రూపుల్లో పోటీ పడుతున్నాయి. ప్రతీ గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్టు సూపర్ 8 కి చేరుకుంటాయి.

గ్రూప్ ఎ: భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్

గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లండ్, ఒమన్

గ్రూప్ సి: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్

గ్రూప్ డి: సౌతాఫ్రికా, న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ

శ్రీలంక ఆడే మ్యాచ్‌లన్నీ స్వదేశంలోనే ఆడుతుంది. అలాగే పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు కూడా అక్కడే జరగనున్నాయి.

పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరితే తొలి సెమీ ఫైనల్ కోల్‌కతాకు బదులుగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది.

పాకిస్తాన్ ఫైనల్‌కు చేరితే, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌కు బదులుగా కొలంబోలో జరుగుతుంది.

షెడ్యూల్ ప్రకారం చూస్తే ఫైనల్ మ్యాచ్ 2026 మార్చ్ 8న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్డేడియంలో జరుగుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)