షాహిద్ అఫ్రిది: గంభీర్‌పై విమర్శలు, విరాట్, రోహిత్‌లపై ప్రశంసలు.. ఈ పాకిస్తానీ క్రికెటర్ మళ్లీ పాతరోజులను గుర్తు చేస్తున్నాడా?

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్‌లపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.
గంభీర్-అఫ్రిదిల మధ్య గతంలో కూడా పరస్పరం విమర్శలు, వివాదాలు నడిచాయి.
ఇప్పుడు గంభీర్ కోచింగ్, రోహిత్–కోహ్లీల ఆట తీరుపై అఫ్రిది చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి పాత వివాదాలను తెరపైకి తెచ్చాయి.


ఫొటో సోర్స్, Getty Images
టెలికాం ఏషియా స్పోర్ట్స్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది మాట్లాడుతూ, "గంభీర్ కోచ్‌గా ప్రారంభించిన విధానం చూస్తే, తాను చెప్పిందల్లా కరెక్టేననే భావన ఆయనలో కనిపించింది. కానీ కొంతకాలానికే అది నిజం కాదని తేలింది'' అని వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో 0–2 తేడాతో భారత్ ఓడిపోయిన తర్వాత కోచ్‌గా గంభీర్‌పై విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో గంభీర్, "నాపై బీసీసీఐకి విశ్వాసం లేకపోతే వాళ్లు తగిన నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రధానం భారత క్రికెట్, నేను కాదు'' అని అన్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రదర్శన కూడా చర్చనీయాంశంగా మారగా, వీరిద్దరిపై మాత్రం అఫ్రిది ప్రశంసలు కురిపించాడు.
"విరాట్, రోహిత్ భారత బ్యాటింగ్‌కు వెన్నెముకలా ఉంటారు. చివరి వన్డే సిరీస్ చూస్తే, 2027 వరల్డ్ కప్ వరకు వీళ్లిద్దరూ ఆడగలరనే నమ్మకం ఉంది'' అని అఫ్రిది అన్నారు.
అలాగే ఈ ఇద్దరూ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను సరిగ్గా చేయాలని సూచించాడు.
‘‘బలహీన జట్లతో మ్యాచ్‌లు ఉంటే యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి, రోహిత్–విరాట్‌లకు విశ్రాంతి ఇవ్వాలి’’ అని అఫ్రిది అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిది రికార్డును నవంబర్ 30న రాంచీలో దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అధిగమించాడు.
277 మ్యాచ్‌లలో 269 ఇన్నింగ్స్‌ల్లో 352 సిక్సర్లు సాధించిన రోహిత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అఫ్రిది 398 మ్యాచ్‌లు, 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్సర్లతో 15 సంవత్సరాలపాటు ఈ రికార్డు తన దగ్గరే ఉంచుకున్నాడు.
ఈ రికార్డు బ్రేక్ కావడంపై అఫ్రిది స్పందిస్తూ, "రికార్డులు ఉన్నది బ్రేక్ కావడానికే. నేను అభిమానించే ఆటగాడు దీనిని బ్రేక్ చేయడం నాకు ఆనందం. నా వేగవంతమైన శతకం రికార్డు 18 సంవత్సరాలు నిలిచింది, తర్వాత ఎవరో బద్దలు కొట్టారు. క్రికెట్ అంటే అదే'' అని అన్నాడు.
2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్‌లో రోహిత్‌తో కలిసి ఆడిన రోజులను కూడా అఫ్రిది గుర్తు చేసుకున్నారు.
‘‘ప్రాక్టీస్‌లో రోహిత్ బ్యాటింగ్ చూసినప్పుడు అతనిలో క్లాస్ ఉందని తెలిసింది. ఏదో ఒకరోజు భారత్ కోసం ఆడతాడని అప్పుడే అర్థమైంది’’ అని గుర్తుచేసుకున్నారు.
వాస్తవానికి రోహిత్ 2007 సంవత్సరం నుంచే భారత జట్టు తరఫున ఆడటం ప్రారంభించాడు. ఆ సంవత్సరంలో రోహిత్ శర్మ టీమిండియా తరఫున ఐర్లాండ్‌తో వన్డే మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అదే సంవత్సరం ఇంగ్లండ్ మీద టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు భారత్ తరఫున ఆడాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
ఇక అఫ్రిది–గంభీర్ విభేదాల చరిత్ర చాలాకాలం నాటిది. 2007లో భారత పర్యటనలో కాన్పూర్‌లో జరిగిన వన్డేలో ఇద్దరూ ఢీకొని మైదానంలో మాటామాటకు రావడం అప్పట్లో పెద్ద వివాదమైంది. ఆ సంఘటనకు గాను గంభీర్‌కు ఐసీసీ జరిమానా కూడా విధించింది.
ఆ తర్వాత కూడా వారిద్దరూ కశ్మీర్ అంశంపై సోషల్ మీడియాలో పదేపదే వాదనలు చేసుకున్నారు.
కశ్మీర్‌లో పరిస్థితులపై 2018లో అఫ్రిది ట్వీట్ చేయగా, గంభీర్ దానికి తీవ్ర ప్రతిస్పందన ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
2019లో వచ్చిన అఫ్రిది ఆత్మకథ 'గేమ్ చేంజర్' లో కూడా గంభీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు ఉన్నాయి. గంభీర్‌ను ‘అసాధారణ రికార్డులున్న సాధారణప్లేయర్’ అని అందులో పేర్కొన్నాడు. దీనిపై గంభీర్ స్పందిస్తూ, "తన వయసే గుర్తులేని అఫ్రిది నా రికార్డులు ఎలా గుర్తు పెట్టుకుంటాడు?’’ అని వ్యాఖ్యానించాడు.
2007లో టీ20 ఫైనల్‌లో తాను 75 పరుగులు చేయగా, అఫ్రిది డకౌట్ అయ్యాడని గుర్తు చేశాడు గంభీర్.
2020లో అఫ్రిది భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. అప్పట్లో గంభీర్ బీజేపీ ఎంపీగా అఫ్రిది వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు.
అఫ్రిది, గంభీర్ మధ్య పాత వివాదాలు ఉన్నప్పటికీ, తాజా వ్యాఖ్యలు మళ్లీ పాత చిచ్చులను గుర్తు చేస్తున్నాయి.
రోహిత్-కోహ్లీలపై ఆయన చేసిన ప్రశంసలు భారత అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
ఒకవైపు కొందరిపై విమర్శలు, మరికొందరిపై ప్రశంసలు కురిపిస్తూ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు భారత్-పాకిస్తాన్ క్రికెట్ రాజకీయాలకు మరోసారి అద్దం పట్టాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














