రోహిత్‌శర్మ-షాహిద్ అఫ్రిది: ఈ సిక్సర్ల హీరోల గురించి సోషల్ మీడియాలో వాదనలేంటి?

వన్డే క్రికెట్‌

ఫొటో సోర్స్, Getty Images

వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన షాహిద్ అఫ్రిది రికార్డును భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అధిగమించాడు.

అయితే, ఎవరి సిక్సర్లు జట్టుకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాయి, అవి ఎన్ని ఇన్నింగులు, ఎన్ని బంతుల్లో కొట్టారు అనే దానిపై భారత పాకిస్తాన్ సరిహద్దులకు ఇరువైపులా చర్చ జరుగుతోంది.

ఆదివారం రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించి వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

'హిట్‌మ్యాన్' గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 51 బంతుల్లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 57 పరుగులు చేశాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

ఫొటో సోర్స్, Getty Images

షాహిద్ అఫ్రిది 15 ఏళ్ల రికార్డు

రోహిత్ శర్మ 277 మ్యాచ్‌ల్లో 269 ఇన్నింగ్స్‌లలో 352 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్సర్లు కొట్టాడు.

ఈ రికార్డు షాహిద్ అఫ్రిది పేరిట గత 15 సంవత్సరాలుగా ఉంది.

భారత్, పాకిస్తాన్‌లోని సోషల్ మీడియా యూజర్లు ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాటర్లలో ఎవరి రికార్డులు ఎక్కువ విలువైనవో చర్చించుకుంటున్నారు. ప్రతి బ్యాటర్ ఎన్ని బంతులు ఎదుర్కొన్నాడు? వారు ఏ క్లిష్టమైన బౌలర్లను ఎదుర్కొన్నారు? ఈ సిక్సర్లు ఏ పరిస్థితులలో కొట్టారు? అంటూ చర్చ కొనసాగుతోంది.

ఏ ఆటగాడు ఎన్ని మీటర్ల పొడవున్న సిక్సర్లు బాదాడు అనే దానిపై కూడా చర్చ జరిగింది.

సామాన్య ప్రజలే కాదు, రెండు దేశాల పాత ఆటగాళ్లు కూడా దీని గురించి మాట్లాడారు.

ఎవరు ఏం చెబుతున్నారో తెలుసుకునే ముందు, ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టినవారు క్రికెట్ ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

మహేంద్ర సింగ్ ధోని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహేంద్ర సింగ్ ధోని 350 మ్యాచ్‌ల్లో 297 ఇన్నింగ్స్‌ల్లో 229 సిక్సర్లు కొట్టాడు.

అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 బ్యాట్స్‌మెన్లు

క్రికెట్ వెబ్‌సైట్ 'క్రిక్‌ఇన్ఫో' ప్రకారం, రోహిత్ శర్మ, షాహిద్ అఫ్రిది తర్వాత, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వ్యక్తి వెస్టిండీస్ మాజీ ఓపెనర్, 'యూనివర్సల్ బాస్' అని అభిమానులు పిలిచుకునే క్రిస్ గేల్.

క్రిస్ గేల్ 301 మ్యాచ్‌ల్లో 294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్సర్లు సాధించాడు. శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 445 వన్డేల్లో 433 ఇన్నింగ్స్‌లలో 270 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు.

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 350 మ్యాచ్‌ల్లో 297 ఇన్నింగ్స్‌ల్లో 229 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 248 మ్యాచ్‌ల్లో 230 ఇన్నింగ్స్‌ల్లో 220 సిక్సర్లు కొట్టి ఆరో స్థానంలో ఉన్నాడు.

ఏడో స్థానం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ది. ఆయన 228 మ్యాచ్‌ల్లో 218 ఇన్నింగ్స్‌లలో 204 సిక్సర్లు కొట్టాడు.

కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 260 మ్యాచ్‌ల్లో 228 ఇన్నింగ్స్‌ల్లో 200 సిక్సర్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా, 463 మ్యాచ్‌ల్లో 452 ఇన్నింగ్స్‌ల్లో 195 సిక్సర్లు కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

పదో స్థానంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 311 మ్యాచ్‌ల్లో 300 ఇన్నింగ్స్‌లలో 190 సిక్సర్లు కొట్టాడు.

షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మ, రికార్డు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ శర్మ ఇప్పుడు 277 మ్యాచ్‌ల్లో 269 ఇన్నింగ్స్‌లలో 352 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

సోషల్ మీడియాలో పోలిక

ఆదివారం రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత, భారత సోషల్ మీడియా యూజర్స్ ఆయన్ని ప్రశంసించగా, పాకిస్తాన్ సోషల్ మీడియా యూజర్స్ షాహిద్ అఫ్రిది సిక్సర్లను గుర్తు చేసుకున్నారు.

షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మల సిక్సర్లను పోల్చడం "ఆపిల్ పండ్లను నారింజతో పోల్చడం లాంటిది" అని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అతుల్ వాసన్ అన్నారు.

"ఎందుకంటే ఓపెనర్ ఈ రికార్డును సాధించడం చాలా పెద్ద విషయం" అని ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు .

"దిగువ బ్యాటింగ్ క్రమంలో వచ్చి మ్యాచ్‌ను ఫినిష్ చేయడం షాహిద్ అఫ్రిదీ పాత్ర. కానీ ఒక ఓపెనర్‌గా ఇంత తక్కువ ఇన్నింగ్స్‌లో ఇంత పెద్ద రికార్డు సాధించడం, ఆయన భారత జట్టుకు ఎంత పెద్ద ఇంపాక్ట్ కలిగించారో చూపిస్తుంది" అని వాసన్ అన్నారు.

షాహిద్ అఫ్రిది కంటే 100 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి రోహిత్ శర్మ ఈ రికార్డును సాధించాడని సమీర్ హష్మి అనే యూజర్ సోషల్ మీడియాలో రాశారు. అతని ఈజీ స్టైల్, అద్భుతమైన టైమింగ్, పవర్‌ఫుల్ షాట్స్‌ను అందంగా మార్చగల సామర్థ్యం...ఇవే అతన్ని మిగతా వారితో పోల్చితే ప్రత్యేకంగా నిలబెడతాయి" అని హష్మి పేర్కొన్నారు.

"ఆయన 400 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టి తన కెరీర్‌కు వీడ్కోలు చెబుతారని ఆశిస్తున్నా" అని ఆయన రాశారు.

రోహిత్ శర్మ "షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలుకొట్టాడు. దీంతో నా హృదయం బద్ధలైంది" అని ఫరీద్ ఖాన్ రాశారు.

పాకిస్తాన్ క్రీడా జర్నలిస్ట్ ఫైజాన్ లఖానీ, షాహిద్ అఫ్రిది సిక్స్‌లను మరింత ముఖ్యమైనవిగా పరిగణిస్తూ, "ఇద్దరు ఆటగాళ్ల మధ్య తేడా ఏమిటంటే షాహిద్ అఫ్రిది రోహిత్ శర్మ కంటే చాలా తక్కువ బంతులు ఆడాడు" అని అన్నారు .

రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 12,321 బంతులు ఎదుర్కొన్నాడు. షాహిద్ అఫ్రిది 8,064 బంతులు ఆడాడు.

"షాహిద్ అఫ్రిది ప్రతి బంతికీ తన బ్యాట్‌ను ఊపేవాడు. అందుకే రోహిత్ శర్మ అతని కంటే 100 తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడి ఈ రికార్డును సాధించాడు" అని వికాస్ కుమార్ సింగ్ అన్నారు .

షాహిద్ అఫ్రిదిని సమర్థిస్తూ "పంచ్ హిట్టర్, మీరు అతన్ని రోహిత్ శర్మతో పోల్చాలనుకుంటే, రోహిత్ శర్మ ఎన్ని వికెట్లు తీసుకున్నాడో కూడా చెప్పండి" అని కబీర్ రాశాడు .

షాహిద్ అఫ్రిది వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో 395 వికెట్లు పడగొట్టాడు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)