బోండై బీచ్ మారణహోమం: ఈ దాడి కోసం నిందితులు ఏమేం చేశారు?

ఫొటో సోర్స్, SUPPLIED
- రచయిత, కేటీ వాట్సన్, ఎమిలీ ఎట్కిన్‌సన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆస్ట్రేలియా కోర్టులో సమర్పించిన పత్రాల ప్రకారం బోండై బీచ్ దాడి నిందితులు మొదట పేలుడు పదార్థాలను విసిరారు.
దాడి ప్లాన్‌కు కొన్నివారాల ముందు నుంచే వారు కాల్పులు ఎలా జరపాలో ప్రాక్టీస్ చేసినట్లు కూడా తేలింది.
డిసెంబరు 14న యూదుల పండుగ హనుకా సందర్భంగా బోండై బీచ్ దగ్గర ఇద్దరు సాయుధులు జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు.
'టెన్నిస్ బాల్ బాంబు'తో సహా అనేక పేలుడు పదార్థాలు పేలలేదని కోర్టుకు చేరిన పత్రాల్లో ఉంది.
24 ఏళ్ల నవీద్ అక్రమ్‌పై 59 అభియోగాలు మోపారు. ఇందులో 15 హత్యాయత్నం అభియోగాలు ఉన్నాయి.


ఫొటో సోర్స్, SUPPLIED
‘చాలా నెలల పాటు ప్రాక్టీస్’
రెండో నిందితుడు నవీద్ తండ్రి సాజిద్ అక్రమ్. ఈయన పోలీసులు జరిపిన ఎదురుదాడిలో సంఘటనా స్థలంలోనే మరణించారు.
ఆ ఇద్దరు వ్యక్తులు చాలా నెలలపాటు దాడికి సవివరంగా ప్రణాళిక రచించారు. కాల్పులకు రెండు రోజుల ముందు దాడికి సన్నాహకంగా వారు ఆ ప్రదేశాన్ని సందర్శించారు.
బాధితుల గుర్తింపు బయటపడకుండా పోలీసు ఫ్యాక్ట్ షీట్‌ను బహిరంగంగా విడుదల చేయడంపై గత వారం తాత్కాలిక నిషేధం విధించారు.
సోమవారం నిషేధాన్ని ఎత్తివేసి, కొన్ని సవరణలతో పత్రాలను ప్రచురించారు.
దాడికి ముందు నెలలు, రోజులు, గంటల్లో నిందితులు ఏమేం చేశారో చూపించే అనేక వీడియోలు ఇందులో ఉన్నాయి.
వీరు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) జెండా ఫోటో ముందు కూర్చున్నట్టు అక్టోబరులో వారి ఫోన్‌లతో తీసిన ఒక వీడియోలో ఉంది.
ఆ వీడియోలో నవీద్ అక్రమ్ అరబిక్‌లో ఖురాన్‌లో ఒక భాగాన్ని చదువుతున్నట్టు కూడా రికార్డు చేసి ఉంది.
అక్టోబరు నాటి వీడియోలో తండ్రీ కొడుకులు "గ్రామీణ ప్రాంతంలో ఆయుధ శిక్షణ తీసుకుంటున్నట్టు" ఉందని పోలీసులు తెలిపారు.
ఆ ప్రాంతం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు తుపాకితో కాల్పులు జరుపుతున్నట్టు ఫుటేజీలో కనిపిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
డిసెంబరు 12 సాయంత్రం నాటి సీసీటీవీ ఫుటేజీలో బోండై బీచ్ సమీపంలో నిందితులు తమ కారులో ఉన్నట్టు కనిపిస్తోంది.
"నిందితులు వాహనం దిగి వంతెనపై నడుస్తూ కనిపించారు. రెండు రోజుల తర్వాత వారిద్దరూ కాల్పులు జరిపిన ప్రదేశం ఇదే" అని కోర్టు పత్రాల్లో ఉంది.
‘‘ఉగ్రవాద చర్యకు సన్నాహాలు, ప్రణాళిక’’కు సంబంధించిన ఆధారాలు ఇవేనని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SUPPLIED
ఇస్లామిక్ స్టేట్ జెండాలు
దాడి జరిగిన రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, ఇద్దరు వ్యక్తులు సిడ్నీలోని క్యాంప్సీలో అద్దెకు తీసుకున్న ఇంటి నుంచి బయటకు వచ్చి 'దుప్పట్లలో చుట్టిన పొడవైన, బరువైన వస్తువులను' కారులోకి తీసుకెళ్తున్నట్టు సీసీటీవీలో కనిపించింది.
వారు క్యాంప్సీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు వారి దగ్గర రెండు సింగిల్-బారెల్ షాట్‌గన్‌లు, ఒక బెరెట్టా రైఫిల్, నాలుగు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు (ఐఈడీలు), రెండు ఐఎస్ జెండాలు ఉన్నాయని డాక్యుమెంట్స్‌లో ఉంది.
సాయంత్రం 5 గంటల తర్వాత ఆ వ్యక్తులు అద్దె ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు కనిపించిందని పోలీసులు తెలిపారు.
ప్రత్యేక ఫుటేజీలో సాయంత్రం 6గంటల50నిమిషాలకు వారు బోండైకి చేరుకున్నట్టు ఉంది. అక్కడ వారు కారు పార్క్ చేసి, ముందు వెనుక విండోల దగ్గర జెండాలను పెట్టారు.
నిందితులు కారు నుంచి తుపాకులు, ఐఈడీలను తీసినట్టు, తర్వాత ఒక ఫుట్‌బ్రిడ్జి వైపు నడిచి వెళ్తున్నట్టు కనిపించారు.
ఈ ప్రదేశం నుంచే వారు పేలుడు పదార్థాలు - మూడు పైపు బాంబులు, ఒక టెన్నిస్ బాల్ బాంబును జనంపైకి విసిరారని పోలీసులు భావిస్తున్నారు. అయితే వాటిలో ఏవీ పేలలేదు.

ఫొటో సోర్స్, SUPPLIED
జైలుకు నవీద్ అక్రమ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బీచ్‌కు చేరుకున్న కాసేపటికే వారు జనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది అక్కడికక్కడే మరణించారు. మరొక వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు.
న్యూ సౌత్ వేల్స్ పోలీసు అధికారులతో జరిగిన కాల్పుల్లో సాజిద్ అక్రమ్ మరణించారు.
పోలీసుల కాల్పుల్లో నవీద్ అక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం(డిసెంబరు 22) ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించారు.
తుపాకులపై కఠినమైన ఆంక్షలు విధించాలని, పెరుగుతున్న యూదు వ్యతిరేకత నుంచి యూదు సమాజాన్ని రక్షించడానికి మరిన్ని ప్రయత్నాలు అవసరమని బోండై బీచ్ దాడి తర్వాత ఆస్ట్రేలియాలో అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
కాల్పుల నేపథ్యంలో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సోమవారం మళ్ళీ పార్లమెంటును సమావేశపరిచి తుపాకులు, నిరసన ప్రదర్శనలపై కొత్తగా చట్టాలను ప్రతిపాదించింది.
తుపాకులు, నిరసన ప్రదర్శనలపై ఈ చట్టాలు అన్యాయమైన ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని కొందరు మానవహక్కుల కార్యకర్తలు, తుపాకుల వినియోగాన్ని సమర్ధించేవారు ఆందోళన వ్యక్తం చేశారు.
''కొంతమంది ఈ మార్పులు చాలా తీవ్రంగా ఉన్నాయని భావించవచ్చు, కానీ సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి అవి అవసరం'' అని న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














