‘కోడిగుడ్లలో నిషేధిత యాంటీబయాటిక్స్’.. తమిళనాడులో తనిఖీలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విజయానంద్ అర్ముగం
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోడిగుడ్లలో నిషేధిత యాంటీబయాటిక్ నైట్రోఫ్యూరాన్ ఉంటోందన్న ఆరోపణల నేపథ్యంలో తమిళనాడులో ఆహార భద్రతాధికారులు స్పందించారు. పరీక్షల కోసం కోడిగుడ్ల శాంపిళ్లను చెన్నై, నామక్కల్ పరీక్ష కేంద్రాలకు పంపారు.
"గత పదేళ్లుగా నిషేధిత యాంటీబయాటిక్స్ వాడే అలవాటు లేదు" అని నామక్కల్ జిల్లాకు చెందిన కోడిగుడ్ల ఎగుమతిదారులు 'బీబీసీ తమిళం'తో అన్నారు.
క్యాన్సర్ కారకాల్లో ఒకటిగా పరిగణిస్తున్న నైట్రోఫ్యూరాన్ అనే యాంటీబయాటిక్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
ఎగ్గోజ్ అనే ప్రైవేట్ కంపెనీ విక్రయిస్తున్న కోడిగుడ్లలో నిషేధిత నైట్రోఫ్యూరాన్ సమ్మేళనం ఉందనే ఆరోపణలు వచ్చాయి.
ఆహార నాణ్యత పరీక్షపై వీడియో ఒక యూట్యూబ్ చానల్‌లో వచ్చింది. ఎగ్గోజ్ నుంచి వచ్చిన కోడిగుడ్లను పరీక్షించినప్పుడు, వాటిలో కిలోగ్రాముకు 0.74 మైక్రోగ్రాముల ఏవోజడ్ (3 అమినో 2 ఆక్సాజోలిడినోన్) ఉందని ఆ వీడియోలో ఆరోపించారు. ఏఓజడ్ అనేది నైట్రోఫ్యూరాన్ యాంటీబయాటిక్స్‌కు సంబంధించిన మెటాబోలైట్.
భారతదేశంలో ఆహారోత్పత్తికి వాడే జీవులపై ఏవోజడ్ సమ్మేళనాల వాడకంపై పూర్తి నిషేధం ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
'డేంజరస్'.. కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరిక
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ కార్యాలయం గత ఏప్రిల్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక లేఖ పంపింది.
ఆహారాన్ని ఉత్పత్తి చేసే జీవులపై వాడకుండా క్లోరాంఫెనికాల్, నైట్రోఫ్యూరాన్స్ ఔషధాల దిగుమతి, తయారీ, అమ్మకం, పంపిణీ, వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఆ లేఖలో తెలిపింది.
ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువుల పెంపకం కేంద్రాల్లో ఈ మందుల వాడకం ప్రమాదకరమని, వాటి అమ్మకం, పంపిణీపై కఠినమైన పర్యవేక్షణ నిర్వహించాలని స్పష్టంగా పేర్కొంది.
యూరోపియన్ యూనియన్ కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేసే జంతువులలో నైట్రోఫ్యూరాన్ వాడకాన్ని నిషేధించింది.
తమ కోడిగుడ్లలో నిషేధిత యాంటీబయాటిక్ ఉందని వచ్చిన ఆరోపణలను ఎగ్గోజ్ తోసిపుచ్చింది.

ఎగ్గోజ్ ఏం చెబుతోంది?
"కోళ్ల మేత (ఫీడ్) నుంచి కోడిగుడ్ల పంపిణీ వరకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్‌ఎస్ఏఐ) నిబంధనల ప్రకారం మేం సరైన ప్రక్రియలను అనుసరిస్తాం" అని ఎగ్గోజ్ ఒక ప్రకటనలో తెలిపింది.
సంబంధిత ప్రయోగశాల నివేదికలను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కోడిగుడ్ల నమూనాలను ప్రయోగశాలలకు పంపే పనిలో ఎఫ్ఎస్‌ఎస్ఏఐ నిమగ్నమైంది.

చెన్నై, నామక్కల్‌లో పరిశోధన
చెన్నైలో దాదాపు 15 కోడిగుడ్ల నమూనాలను సేకరించి, పరీక్ష కోసం పంపినట్లు ఎఫ్ఎస్‌ఎస్ఏఐ సదరన్ రీజనల్ డైరెక్టర్ వి.కె.పంచమ్ తెలిపారు.
డిసెంబర్ 17న ఆహార నియంత్రణ విభాగం అధికారులు నామక్కల్‌లో కోడిగుడ్ల ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి నమూనాలను సేకరించారు.
నామక్కల్ తమిళనాడులో కోడిగుడ్ల ఎగుమతి కేంద్రం (హబ్)గా ఉంది. ఈ జిల్లాలో వెయ్యికి పైగా కోడిగుడ్ల ఉత్పత్తి కంపెనీలు పనిచేస్తున్నాయి. అవి ప్రతిరోజూ ఆరు కోట్లకు పైగా కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తాయని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నామక్కల్ ప్రాంతీయ అధ్యక్షుడు సింగరాజ్ బీబీసీతో చెప్పారు.
నామక్కల్ నుంచి బ్రిటన్, జపాన్ సహా వివిధ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయని ఆయన ‘బీబీసీ తమిళ్’తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'యాంటీబయాటిక్స్‌పై ఇంకా ఫిర్యాదులేవీ రాలేదు'
"కోడిగుడ్లను క్రమం తప్పకుండా పరీక్ష కోసం ప్రయోగశాలలకు పంపుతున్నారు. అయితే, నిషేధిత మందులేవీ ఉపయోగించలేదని నిరూపించాల్సిన అవసరం ఉంది" అని నామక్కల్ జిల్లా ఆహార భద్రత అధికారి డాక్టర్ తంగా విఘ్నేష్ చెప్పారు.
కోడిగుడ్లలో యాంటీబయాటిక్స్ ఉన్నాయని చూపించే పరిశోధన ఫలితాలేవీ ఇప్పటివరకు లేవని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రజల భయాలను తొలగించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో నిషేధించిన నైట్రోఫ్యూరాన్‌ను పదేళ్ల నుంచి కోళ్ల ఫారాలలో ఉపయోగించడం లేదని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నామక్కల్ ప్రాంతీయ అధ్యక్షుడు సింగరాజ్ చెప్పారు.
నామక్కల్‌లో కోడిగుడ్డు ధర రూ.6.25 ఉంటే, బహిరంగ మార్కెట్లో రూ.7.50 నుంచి రూ.8 వరకు అమ్ముతారు. దీనిని ప్రస్తావిస్తూ, "ధర ఎక్కువగా ఉండటం వల్ల కోడిగుడ్ల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని భావిస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రతి 21 రోజులకు ఒకసారి తనిఖీ'
నామక్కల్ వెటర్నరీ సైన్స్ కళాశాలలో రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ బీబీసీతో మాట్లాడుతూ, నామక్కల్ జిల్లాలో ప్రతి 21 రోజులకు ఒకసారి కోడిగుడ్ల శాంపిళ్లను ప్రయోగశాలల్లో పరీక్షిస్తారని చెప్పారు.
"నామక్కల్‌లో తమిళనాడు ప్రభుత్వ పశుసంవర్ధక శాఖకు చెందిన ప్రయోగశాల ఉంది. అక్కడ కోడిగుడ్లను పరీక్షించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. వైరస్‌లు, బ్యాక్టీరియా ఏమైనా సోకాయా అనేదీ అక్కడ పరీక్షిస్తారు" అని అన్నారు.
కోళ్లకు విటమిన్లు, మినరల్స్, లివర్ టానిక్స్ ఇస్తారని ఆయన చెప్పారు.
"నైట్రోఫ్యూరాన్ క్యాన్సర్‌కు కారణమవుతుందనే అనుమానం ఉంది. అందువల్ల, ఈ మందు కోళ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు" అని ప్రొఫెసర్ చంద్రశేఖర్ చెప్పారు.
నైట్రోఫ్యూరాన్ ప్రమాదకరమా?
నైట్రోఫ్యూరాన్‌లను తరచుగా ఉపయోగించడం వల్ల మానవులకు ప్రమాదం ఉందని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
ఈ మందు దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్, జన్యుపరమైన నష్టం, అలర్జీలు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఉంటాయని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఫర్ ఎకాలజీ సభ్యుడు డాక్టర్ పుగళేంది బీబీసీతో చెప్పారు.
కోళ్లు, చేపలు, పశువుల దాణాలో దీని వాడకుండా ప్రభుత్వం తీవ్రంగా పర్యవేక్షించాలని ఆయన అన్నారు.
అదే సమయంలో, "గుడ్లు తినడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు" అని సేలంలోని మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కేశవన్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














