విమానంలో బాంబు పెట్టామని బెదిరిస్తున్నదెవరు? ఎందుకు బెదిరిస్తున్నారు? పోలీసులు వారిని ఎలా పట్టుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
విమానాల్లోనో.. విమానాశ్రయాలలోనో బాంబులు ఉన్నాయంటూ 2025లో ఇప్పటివరకు తమకు 31 ఫేక్ కాల్స్, మెయిల్స్ వచ్చాయని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీస్ ఔట్ పోస్ట్ అధికారులు బీబీసీకి చెప్పారు.
విమానంలో బాంబులు ఉన్నాయని, విమానాశ్రయంలో బాంబు ఉందని.. ఇలా ఏదో రకంగా బెదిరింపులకు పాల్పడుతూ కాల్స్ చేశారని లేదా మెయిల్స్ పంపించారని అధికారులు గుర్తించారు.ఈ కాల్స్, మెయిల్స్ అన్నీ ‘నకిలీవని’ గుర్తించామని అయినా, భద్రతా చర్యల్లో భాగంగా క్షుణ్ణంగా తనిఖీలు చేశామని శంషాబాద్ డీసీపీ బి.రాజేష్ చెప్పారు.

ఫేక్‌కాల్స్ ఎందుకు చేస్తున్నారు?
గత కొన్నాళ్ల డేటాను పరిశీలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఫేక్ కాల్స్, మెయిల్స్ వచ్చాయని పోలీసు అవుట్ పోస్టు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు. ''కారణాలు స్పష్టంగా చెప్పలేం. వేర్వేరు ఉన్నాయి. ఈ ఏడాది ఇలాంటి ఫేక్ కాల్స్ ఎక్కువగా వచ్చాయి'' అని ఆ అధికారి చెప్పారు. ఈ కేసులలో ఐదుగురిని గుర్తించి అరెస్ట్ చేశాం అని డీసీపీ రాజేశ్ చెప్పారు.
''ఎయిర్ లైన్స్ మీద కోపంతో విమానంలో బాంబు ఉందంటూ ఒక ట్రావెల్ ఏజెంట్ కాల్ చేసి బెదిరించాడు. మరో ఘటనలో ఓ బాలుడు తుంటరితనంతో కాల్ చేశాడు. మరో వ్యక్తి మానసిక స్థితి సరిగా లేక కాల్ చేశాడు. ఇలా కారణాలు వేర్వేరుగా ఉన్నాయి'' అని రాజేశ్ చెప్పారు.
వ్యక్తిగత కారణాలతోనో, ఎయిర్ లైన్స్‌పై ఉన్న కోపంతోనో కాల్స్ చేస్తుంటారు. కానీ దీని ప్రభావం మిగిలిన ఎయిర్ లైన్‌పైనా, విమాన సర్వీసులపైనా పడుతుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జనరల్ మేనేజర్ మల్లికార్జున్ బీబీసీతో చెప్పారు.
''విమానం సమయానికి వెళ్లకుండా ఆగడం లేదా వేరొక విమానాశ్రయానికి మళ్లించడం వల్ల మిగిలిన సర్వీసులు కూడా ఆలస్యం అవుతాయి. ఎంతో మంది ప్రయాణాలపై ప్రభావం పడుతుంది'' అన్నారు.

ఫొటో సోర్స్, Satish Bate/Hindustan Times via Getty Images
బాంబు ఉందంటూ కాల్ వస్తే ఏం చేస్తారంటే..
విమానాశ్రయాలకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బందోబస్తు ఉంటుంది.
భద్రతాపరంగా అన్ని విషయాలనూ సీఐఎస్ఎఫ్ చూసుకుంటుంది. వీరికి స్థానిక పోలీసులు సహకరిస్తుంటారు.
విమానానికి బాంబు బెదిరింపు కాల్ వస్తే, ఏం చేస్తారో శంషాబాద్ డీసీపీ రాజేశ్ వివరించారు.
''ఏ విమానానికైనా బాంబు బెదిరింపు కాల్ లేదా మెయిల్ వస్తే విమానాన్ని విమానాశ్రయంలో నిలిపివేస్తారు. అప్పటికే విమానం టేకాఫ్ అయితే దగ్గరలోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయిస్తారు. తరువాత రన్‌వేపైకి ఫైరింజన్, అంబులెన్సులు, బాంబు స్క్వాడ్ చేరుకుంటాయి. ముందుగా ఎయిర్ క్రాఫ్ట్‌ను ఐసొలేషన్ బేకు తరలిస్తారు. అక్కడ ప్రయాణికులను తనిఖీ చేసి, దించివేస్తారు'' అని రాజేశ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ విమానాన్ని ప్రయాణానికి అనుమతిస్తారా?
బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (బాంబుస్క్వాడ్) విమానం వద్దకు చేరుకుంటుంది. ఏ మేరకు ముప్పు ఉందో ఈ సిబ్బంది అంచనా వేస్తారు. దాన్ని బట్టి తనిఖీలు మొదలుపెడతారు.
ఇందులో స్థానిక పోలీసులతో పాటు సీఐఎస్ఎఫ్ బలగాలూ భాగస్వామ్యం అవుతాయి.
ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా తనిఖీ చేసి ఎలాంటి బాంబూ లేదని, 'ప్లయింగ్ సేఫ్' అని తేల్చిన తర్వాతే పోలీసులు విమానాన్ని తిరిగి పంపేందుకు అనుమతిస్తారు.
డిసెంబరు 5న దిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ రావడంతో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన తర్వాత తనిఖీలు చేశారు. అంతకుముందు డిసెంబరు 4న మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ ఇండిగో ఎయిర్ లైన్స్‌కు మెయిల్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వెంటనే విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ల్యాండ్ చేసి ప్రోటోకాల్ ప్రకారం తనిఖీ చేశారు . అనుమానాస్పద వస్తువులేవీ లభించలేదని అధికారులు ప్రకటించడంతో తిరిగి విమానం హైదరాబాద్‌కు పంపించారు.
అలాగే నవంబరు 1న జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉందని ఇండిగో సంస్థకు మెయిల్ రావడంతో ముంబయికి తరలించి తనిఖీలు చేసి, చివరికి ఫేక్ కాల్‌గా గుర్తించారు.
బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ తరచూ వస్తున్న నేపథ్యంలో ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే ఎదుర్కొనేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైందని అధికారులు చెబుతున్నారు.
దేశంలో 14 విమానాశ్రయాల్లో 12 రకాల బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్) పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా 2023-24 వార్షిక నివేదికలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP via Getty Image
ఫేక్ కాల్స్ చేసే వారిని ఎలా గుర్తిస్తారంటే..
ఫేక్ కాల్స్, ఈ మెయిల్స్‌ను గుర్తించేందుకు సైబర్ క్రైం పోలీసుల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు డీసీపీ రాజేశ్.
"కాల్స్ ఎక్కువగా మాస్క్ చేయడం, వీపీఎన్ మార్చడం, స్ఫూఫింగ్ చేస్తుంటారు. స్థానికంగానే ఉన్నప్పటికీ , విదేశాల్లో ఉన్నట్టుగా కాల్స్ చేస్తున్నారు'' అని చెప్పారు. ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక సహకారంతో వారిని గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు.
"ఫేక్ కాల్స్, మెయిల్స్ పంపిస్తే గుర్తించలేరనే భావనతో ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ, అలాంటివాటిని కచ్చితంగా గుర్తించి, అరెస్టు చేస్తాం'' అని తెలిపారు.
గతంలో అంటే 25-30 ఏళ్ల కిందట కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చేవని మల్లికార్జున్ బీబీసీతో చెప్పారు. అప్పట్లో ఎవరైనా విమానం సమయానికి చేరుకోలేకపోతే, ఆ తరహా కాల్స్ చేసేవారని తర్వాత విచారణలో తేలేదని అన్నారు.
''అప్పట్లో కాల్స్ చేసిన వారిని గుర్తించడం కాస్త కష్టంగా ఉండేది. ల్యాండ్ ఫోన్ కావడంతో ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారనేది గుర్తించడం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి కాల్స్, మెయిల్స్ గుర్తించడం కాస్త సులువుగా మారింది'' అని మల్లికార్జున్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














