ఇండిగో సంక్షోభం: విమాన టికెట్ ధరలు ఇక గరిష్ఠంగా ఎంతంటే.. నిర్ణయించిన ప్రభుత్వం

ఇండిగో, విమానాలు, రద్దు, రీఫండ్, భారీ ధరలు

ఫొటో సోర్స్, ani

ఇండిగో ఎయిర్‌లైన్స్ గందరగోళం నేపథ్యంలో విమాన చార్జీలు భారీగా పెరుగుతుండడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రద్దు వల్ల ఏర్పడ్డ గందరగోళంతో దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన చార్జీలపై గరిష్ఠ పరిమితులు నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం.. దేశీయ మార్గాల్లో 500 కిలోమీటర్ల ప్రయాణానికి గరిష్ఠ ధర 7,500 రూపాయలు. 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు దూరానికి గరిష్ఠ టికెట్ ధర 12,000రూపాయలు. 1,000 నుంచి 1,500 కిలోమీటర్ల దూరానికి చార్జీలు గరిష్ఠంగా 15,000 రూపాయలు. 1,500 కిలోమీటర్లకు పైగా దూరానికి చార్జీలు గరిష్ఠంగా 18,000 రూపాయలు అని నిర్ణయించింది.

అయితే, ఈ చార్జీలలో యూడీఎఫ్, పీఎస్ఎఫ్, ఇతర పన్నులు లేవు. ఈ చార్జీలు బిజినెస్ క్లాస్, ఆర్‌సీఎస్-ఉడాన్ విమానాలకు వర్తించవు.

ఈ ధరలు వెంటనే అమలులోకి వస్తాయి. ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్ ధరలను పర్యవేక్షించి నియంత్రించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండిగో, విమానాలు, రద్దు, రీఫండ్, భారీ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధరల పేరుతో ప్రజలను దోచుకోకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుందని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

‘అన్ని విమానయాన సంస్థలు ఇవే ధరలు అమలు చేయాలి’

ప్రజల ప్రయోజనాల కోసం ఈ చర్య తీసుకున్నామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు లేదా తదుపరి సమీక్ష జరిగే వరకు ఈ చార్జీలు అమలులో ఉంటాయి.

ఈ టికెట్ ధరలు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్, ట్రావెల్ పోర్టల్ రెండింటిలోనూ ఆన్‌లైన్ బుకింగ్‌లకు వర్తిస్తాయి.

"ప్రయాణికులను 'అవకాశవాద ధరల' నుంచి రక్షించడానికి మంత్రిత్వ శాఖ తన నియంత్రణాధికారాలను ఉపయోగించింది" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రభావితమైన అన్ని మార్గాల్లో చార్జీలు సహేతుకంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం ఉద్దేశమని తెలిపింది.

"కొత్త చార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. పరిస్థితి పూర్తిగా సాధారణమయ్యే వరకు ఈ చార్జీల పరిమితి అమలులో ఉంటుంది" అని పేర్కొంది.

మార్కెట్లో ధరల నియంత్రణను కొనసాగించడం, ప్రయాణికులను దోపిడీ చేయకుండా అడ్డుకోవడం, అత్యవసరంగా ప్రయాణించాల్సిన వృద్ధులు, విద్యార్థులు, రోగులకు ఉపశమనం కల్పించడం దీని లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

విమానయాన సంస్థలు, ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్‌ల సహకారంతో రియల్ టైమ్ డేటా ద్వారా చార్జీలను నిశితంగా పర్యవేక్షిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

నిర్దేశించిన ప్రమాణాల్లో ఏమైనా తేడా గుర్తిస్తే, తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇండిగో, విమానాలు, రద్దు, రీఫండ్, భారీ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆదివారం రాత్రి 8 గంటలలోపు రీఫండ్ ప్రక్రియ పూర్తిచేయాలని ఇండిగోను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఏం చెప్పింది?

రీఫండ్, బుకింగ్ రద్దు లేదా రీషెడ్యూల్‌పై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక పోస్ట్ చేసింది.

"ఇటీవలి సంఘటనల దృష్ట్యా, రద్దుకు సంబంధించిన అన్ని రీఫండ్‌లు అసలు చెల్లింపు మోడ్‌కు వాటంతటవే ప్రాసెస్ అవుతాయి" అని ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో ఇండిగో తెలిపింది.

"డిసెంబరు 5, 2025 నుంచి డిసెంబరు 15, 2025 మధ్య ప్రయాణానికి సంబంధించిన బుకింగ్‌ల రద్దు/రీషెడ్యూల్‌లపై పూర్తి మినహాయింపును అందిస్తాం" అని తెలిపింది.

అంతకుముందు, పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రయాణికులకు చెల్లించాలని ఇండిగోను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

రద్దయిన లేదా ప్రభావితమైన అన్ని విమానాలకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియను డిసెంబరు 7, 2025 ఆదివారం రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

వరుసగా ఐదో రోజు శనివారం కూడా ఇండిగో కార్యకలాపాల్లో ఎలాంటి మెరుగుదల లేదు.

దేశంలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు సహా అనేక నగరాల నుంచి 800కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయని పీటీఐ తెలిపింది.

నాలుగు రోజుల్లో 2,000కి పైగా విమానాలు రద్దయ్యాయి. సగటున రోజుకు 500 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఇండిగో, విమానాలు, రద్దు, రీఫండ్, భారీ ధరలు

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, పైలట్ల కొరతతో ఇండిగో ఇబ్బంది పడుతోందని ఓ పైలట్ చెప్పారు.

పరిస్థితులు ఇలా ఎందుకు మారాయి?

ఇండిగో ఎయిర్‌లైన్స్ చుట్టూ వివాదం ఈ వారం ప్రారంభంలోనే మొదలైంది. పదుల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దవడం, ఆలస్యమడంతో డిసెంబరు 3న వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది.

150 ఇండిగో విమానాలు రద్దయ్యాయని, డజన్ల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడిచాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

పైలట్లు అలసటను ఎదుర్కోవడానికి , వారికి విశ్రాంతి సమయాన్ని పెంచడానికి అమలు చేసిన ప్రభుత్వం కొత్త నిబంధనల కారణంగా ఇండిగో పైలట్ల కొరతను ఎదుర్కొంటోందని, రోస్టర్ నిర్వహణను ఇది క్లిష్టతరం చేస్తోందని ఓ ఇండిగో పైలట్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.

చాలా విమానాలు 12 గంటల వరకూ ఆలస్యంగా నడిచాయి.

నవంబరు 1 నుంచి పైలట్లకు విధి నిర్వహణ ప్రమాణాలను పూర్తిగా అమలు చేయడంతో ఈ సమస్య మొదలయింది.

విమానయాన సంస్థలు తమ సిబ్బందికి అనుగుణంగా మార్పులు చేయడానికి కొత్త నిబంధనల అమలును ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు వాయిదా వేసింది. అయితే దీనిని అమలు చేస్తే విమాన సర్వీసులు పెద్దసంఖ్యలో రద్దు అవుతాయని విమానయాన సంస్థలు హెచ్చరించాయి.

కానీ పైలట్‌ల సంఘాలు దిల్లీ హైకోర్టును ఆశ్రయించి, ఏప్రిల్ 2025లో దానిని అమలు చేయాలన్న ఆర్డర్ తెచ్చుకున్నాయి.

దిల్లీ హైకోర్టు ఏప్రిల్ 2025లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం దీనిని రెండు దశల్లో అమలు చేయాల్సి ఉంది. వారంలో విశ్రాంతి గంటలను 36 నుంచి 48 గంటలకు పెంచడం వంటి అనేక నిబంధనలు జులై 1 నుంచి అమలయ్యాయి.

రాత్రిపూట పైలట్ల విధినిర్వహణను నిషేధించే మిగిలిన నిబంధనలు నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇండిగో, విమానాలు, రద్దు, రీఫండ్, భారీ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమానసర్వీసులను యథాస్థితికి తీసుకురావడానికి కృషిచేస్తున్నామని ఇండిగో తెలిపింది.

‘పైలట్ల కొరతతో ఇబ్బందులు’

"ఈ తుది నిబంధనలు అమలైనప్పటి నుంచి, విమానయాన సంస్థలు పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. సెలవులను రద్దు చేసుకోవాలని పైలట్లను కోరాయి. కానీ ఎన్నో ఏళ్లుగా అసంతృప్తిగా ఉన్న పైలట్లు సహకరించడానికి ఇష్టపడటం లేదు" అని ది హిందూ తెలిపింది.

"డీజీసీఏ నిబంధనల ప్రకారం 13 గంటల డ్యూటీ సమయానికి మించి పనిచేయించడం, 7,000 కోట్ల రూపాయల లాభం ఉన్నప్పటికీ జీతాలు పెంచకపోవడం, కొత్త పైలట్ డ్యూటీ నిబంధనలను ఎయిర్‌లైన్స్ తనకు అనుకూలంగా వర్తింపజేసుకోవడంపై పైలట్లు కోపంగా ఉన్నారు"

ప్రభుత్వం విమాన చార్జీలను పరిమితం చేసిన తర్వాత కార్యకలాపాలను సాధారణీకరించడానికి కృషి చేస్తున్నట్టు శనివారం(డిసెంబరు 6)న ఇండిగో తెలిపింది.

రద్దయిన విమానాల సంఖ్య 850కన్నా తక్కువని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రయాణికులు తాజా స్థితిని పరిశీలించి, అవసరమైతే రీఫండ్ పొందాలని కోరింది.

ఇండిగో వివాదంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సకాలంలో అప్‌డేట్ ఇవ్వాలని, సమస్యలను తగ్గించడానికి ప్రయత్నించాలని ప్రయాణికులు విమానయాన సంస్థను కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)