మోదీ-పుతిన్ మీటింగ్‌పై పాశ్చాత్య పత్రికలు ఏం రాశాయి, రష్యన్ మీడియా ఏమంది?

ఫొటో సోర్స్, RUSSIA 1
- రచయిత, బీబీసీ మానిటరింగ్
రష్యన్ స్టేట్ టీవీలో కరెంట్ అఫైర్స్ టాక్ షో హోస్ట్ డిసెంబరు 5, శుక్రవారం రోజు పుతిన్ భారత పర్యటనపై యూరోపియన్ మీడియా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌ను ఆప్యాయంగా స్వాగతించిన విధానం 'రష్యా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టొచ్చు' అని రష్యా 1 ఛానల్‌లో '60 మినిట్స్' కార్యక్రమం హోస్ట్ ఓల్గా స్కబయేవా అన్నారు.
"రష్యాను ద్వేషించేవారు నిరాశ చెందారు. వారు రష్యాను ఒంటరిని చేయడంలో విఫలమయ్యారు. ఇంత గొప్ప స్వాగతం ఆ పాశ్చాత్య దేశాలన్నింటికీ, ట్రంప్‌కు కూడా అవమానంగా మారింది" అని కార్యక్రమం ప్రారంభంలో స్కబయేవా అన్నారు.
"రష్యా చమురు కొనకుండా భారతదేశాన్ని ఆపడానికి ట్రంప్ ప్రయత్నించారుగానీ అది అంత ప్రభావాన్ని చూపలేదు" అని ఆమె అన్నారు.
"పుతిన్ దిల్లీ పర్యటన ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్‌గా మారింది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి గ్లోబల్ సౌత్ దేశాలకు మోదీ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారని’’ ఫ్రెంచ్ వార్తాపత్రిక లె మోండే రాసిన కథనాన్ని ఆమె ఉటంకించారు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
‘పాశ్చాత్య దేశాలకు అవమానం’
" భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన అమెరికాకు మోదీ అసౌకర్యమైన సందేశాన్ని పంపారు" అని జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ (ఎఫ్ఏ) రాసిందని స్కబయేవా తెలిపారు.
"ఆ పర్యటన చాలా విజయవంతమైంది. బ్రిటన్ దీనిని పశ్చిమ దేశాలకు దౌత్యపరమైన అవమానంగా భావించింది" అని స్కబయేవా అన్నారు.
"పుతిన్‌కు లభించిన స్వాగతాన్ని టెలిగ్రాఫ్ రెండు నెలల క్రితం అంత విజయవంతంకాని బ్రిటిష్ ప్రధానమంత్రి పర్యటనతో పోల్చింది. ఆ సమయంలో పుతిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పుడు తన నిజమైన స్నేహితుడు ఎవరో మోదీ తన అతిథికి గుర్తు చేశారు" అని రాసినట్టు తెలిపారు.
''భారతదేశం, రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఇప్పుడు అమెరికాను కలవరపెడుతోంది" అని స్కబయేవా అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'అణు బాంబు పేలినట్టుగా ఉంది...'
పుతిన్ భారత పర్యటన "డోనల్డ్ ట్రంప్ కు ఆత్మపరిశీలన చేసుకునే క్షణం" అని విదేశీ వ్యవహారాల వ్యాఖ్యాత అలెక్సీ నౌమోవ్ అన్నారు.
"భారత్-రష్యా సంబంధాలు మెరుగుపడటాన్ని చూసిట్రంప్ నిజంగానే కొంచెం పళ్ళు కొరుకుతున్నారని భావిస్తున్నాను" అని ఆయన అన్నారు.
"పాశ్చాత్య జర్నలిస్టులు,వారికి నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పుతిన్ భారత పర్యటన గురించి వెంటనే రాయడం ప్రారంభించారు. అది వారికి ఒక సవాలుగా అనిపించింది" అని ఛానల్ వన్ షో "వ్రేమ్య పోకాజెత్" (టైమ్ విల్ టెల్) సహ-హోస్ట్ ఒలేస్యా లోసేవా అన్నారు.
అనేక పాశ్చాత్య మీడియా నివేదికలను ప్రస్తావిస్తూ లోసేవా "వారెలా స్పందిస్తున్నారో చూడండి. అణు బాంబు పేలినట్టుగా. ఇది వారికి చాలా కష్టంగా ఉండవచ్చు. వారేం చేస్తున్నారో వారికి ఇంకా అర్థం కాలేదు. అయినప్పటికీ గమ్యం లేని మార్గంలో కొనసాగుతున్నారు" అని విమర్శించారు.
" వ్లాదిమిర్ పుతిన్‌ను మోదీ వ్యక్తిగతంగా స్వాగతించారని, ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనని ఫ్రెంచ్ ఛానల్ ఫ్రాన్స్ 24 పదే పదే చెప్పింది. సహజంగానే ఇది పరస్పర విశ్వాసానికి, ప్రోటోకాల్‌తో సంబంధం లేదనడానికి స్పష్టమైన సంకేతాన్ని పంపింది’’ అన్నారు.
పాశ్చాత్య మీడియాలో "ఒక స్థాయిలో భయాందోళన" ఉందని ఆయన సహ-హోస్ట్ రుస్లాన్ ఒస్టాష్కో అన్నారు. "రష్యాతో వాణిజ్యం విషయమై ఆంక్షలు విధించడం నుంచి అన్ని రకాల రాజకీయ ఒత్తిళ్ల వరకు పాశ్చాత్య దేశాలు ప్రతిదీ భారత్‌పై ప్రయోగించాయి. కానీ ఏదీ ఫలితాన్నివ్వలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, @narendramodi
'పుతిన్ పర్యటన ప్రపంచ ప్రాధాన్యం గల అంశం'
పుతిన్ భారత పర్యటన 'నిజమైన అర్థంలో ఒక ప్రపంచ సంఘటన' అని విశ్లేషకులు వ్లాదిమిర్ కోర్నిలోవ్ అన్నారు.
"పాశ్చాత్య దేశాలలో కూడా దీనిని అంగీకరిస్తున్నారు. వాస్తవానికి ఎవరు ఒంటరిగా ఉన్నారనే? విషయం గురించి నేను ప్రస్తుతం యూరోపియన్ ప్రచురణలలో వ్యాఖ్యలను నిరంతరం చదువుతున్నాను. చాలా కాలంగా రష్యా పూర్తిగా ఒంటరిగా ఉందని, బహిష్కరణకు గురయిందని అంటున్నారు. ఇప్పుడు భారతదేశం, చైనా, అమెరికా, ఆఫ్రికా, ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలు రష్యాతో స్నేహపూర్వక లేదా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయని, వాస్తవానికి, యూరోపియన్ దేశాలు వేరుగా ఉన్నాయని అర్ధమవుతోంది. వారు తమను తాము అణగదొక్కుకుంటున్నారు. ఈ పరిస్థితి ఐరోపాకు అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని ఆయన చెప్పారు.
రష్యన్ వ్యాపార వార్తాపత్రిక కొమ్మెర్సంట్, ప్రభుత్వ అనుకూల దినపత్రిక ఇజ్వెస్టియా కూడా ఈ పర్యటనపై ఎంపిక చేసిన పాశ్చాత్య మీడియా వ్యాఖ్యానాన్ని ప్రచురించాయి. "మోదీ, పుతిన్ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది" అని వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉటంకిస్తూ కొమ్మెర్సంట్ పేర్కొంది.
'అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ' పుతిన్, మోదీ సమావేశమయ్యారని బ్లూమ్‌బెర్గ్ చెప్పినట్టు ఇజ్వెస్టియా ఉటంకించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














