ఎయిర్ ఇండియా ప్రమాదం: చివరిక్షణంలో పైలట్లు మాట్లాడిన మాటలు మాత్రమే ఎందుకు బయటికొచ్చాయి,దీనిపై వివాదమేంటి?

అహ్మదాబాద్, ఎయిర్ ఇండియా, కాక్‌పిట్, వాయిస్ రికార్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొన్ని క్షణాలకే విమానం కూలిపోయింది.
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎయిర్ ఇండియా విమానం 171 ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చినప్పుడు, 260మంది మరణానికి కారణమైన ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై ఓ స్పష్టత వస్తుందని చాలా మంది భావించారు.

కానీ దీనికి బదులు 15 పేజీల నివేదిక ఊహాగానాల వెల్లువకు మరింత ఆజ్యం పోసినట్టయింది.

రిపోర్టులోని ఓ విషయం ఇన్వెస్టిగేటర్లను, విమానయానరంగ నిపుణులను, ప్రజలను కలవరపెడుతోంది.

బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చులు ''కటాఫ్'' స్థితిలోకి వెళ్లాయి. దీనివల్ల ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. విమానానికి కావాల్సిన పవర్(శక్తి) అందలేదు. సాధారణంగా ల్యాండింగ్ తర్వాత మాత్రమే జరిగే పని ఇది. కాక్‌పిట్ వాయిస్‌లో ఫ్యూయల్ స్విచ్చులు ఎందుకు ఆపావని ఓ పైలట్ మరో పైలట్‌ను అడుగుతున్నట్టు ఉంది. నేను చేయలేదు అని ఇంకో పైలట్ సమాధానమిచ్చారు. ప్రశ్నెవరడిగారు, జవాబెవరు చెప్పారనేదానిపై స్పష్టత లేదు.

కో పైలట్ విమానం నడుపుతుండగా, పైలట్ పర్యవేక్షిస్తున్నారు.

ఫ్యూయల్ స్విచ్చులు సాధారణ ఇన్‌ఫ్లైట్ పొజిషన్‌కు వచ్చాక, ఇంజిన్ ఆటోమాటిక్‌గా మళ్లీ స్టార్టయింది. విమానం ప్రమాదానికి గురయ్యే సమయానికి ఓ ఇంజిన్‌కు పవర్ అందింది. మరో ఇంజిన్‌ మాత్రం రీస్టార్ట్ అయింది గానీ మొత్తం పవర్ అందలేదు. అహ్మదాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం ఒక నిమిషం కన్నా తక్కువసేపే గాలిలో ఉండి కూలిపోయింది.

ప్రాథమిక నివేదిక బయటకు వచ్చిన తర్వాత అనేక ఊహాగానాలు బయలుదేరాయి.

తుది నివేదిక విడుదలకు మరో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చని భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అహ్మదాబాద్, ఎయిర్ ఇండియా, కాక్‌పిట్, వాయిస్ రికార్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రాథమిక నివేదికపై వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్‌లో కథనాలొచ్చాయి.

భారత పైలట్ల ఆగ్రహం

ప్రాథమిక నివేదికలోని వివరాలు సీనియర్ పైలట్ వైపు దృష్టిని మళ్లిస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ రాశాయి.

ఇంజిన్లు ఎందుకు ఆపేశావని ఫస్ట్ ఆఫీసర్ పదే పదే కెప్టెన్‌ను అడిగినట్టు తమ వర్గాలు తెలిపాయని ఇటాలియన్ న్యూస్ పేపర్ కొరియర్ డెల్లా సెరా రాసింది.

విమానంలో 56 ఏళ్ల సుమీత్ సభర్వాల్ పైలట్‌గాను, 32 ఏళ్ల క్లైవ్ కుందర్ కోపైలట్‌గా ఉన్నారు. వారిద్దరికీ కలిపి 19,000గంటలకుపైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. అందులో సగం సమయం బోయింగ్ 787 నడిపారు. ప్రమాదం జరిగిన విమానం ఎక్కేముందు ఇద్దరికీ ఆరోగ్య పరీక్షలు జరిగాయి.

ప్రమాదంపై వెలువడుతున్న ఊహాగానాలు ఇన్వెస్టిగేటర్లను, భారత పైలట్లను ఆగ్రహానికి గురిచేశాయి.

అంతర్జాతీయ మీడియా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని, దర్యాప్తు సాగుతున్న సమయంలో ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) గతవారం అభ్యంతరం వ్యక్తంచేసింది.

మీడియా రిపోర్టులు ''పరిణితి లేనివని, ఊహాగానాలని'' యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పొర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్‌టీఎస్‌బీ) హెడ్ జెన్నిఫర్ హొమెండీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇలాంటి దర్యాప్తులు పూర్తికావడానికి చాలా సమయం పడుతుందని ఆమె తెలిపారు. ఈ సంస్థ విమాన ప్రమాదంపై దర్యాప్తులో సాయపడుతోంది.

సిబ్బందిపై నిందలు మోపడం నిర్లక్ష్యమైన విషయమని, బాధాకరమని, తుది నివేదిక వచ్చేదాకా అందరూ ఓపికపట్టాలని భారత కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది.

ఇలాంటి ఊహాగానాలు అసలైన నిజాలను మరుగున పడేస్తాయని ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్‌పీఏ) హెడ్ శామ్ థామస్ బీబీసీతో చెప్పారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌తో పాటు విమాన నిర్వహణకు సంబంధించిన విషయాలు, డాక్యుమెంటేషన్‌ను రివ్యూ చేయాల్సిన అవసరముందన్నారు.

అహ్మదాబాద్, ఎయిర్ ఇండియా, కాక్‌పిట్, వాయిస్ రికార్డర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చివరిక్షణంలో పైలట్లు మాట్లాడిన మాటలు మాత్రమే బయటికొచ్చాయి.

‘ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న’

ప్రాథమిక రిపోర్టులో క్లుప్తంగా వచ్చిన కాక్‌పిట్ రికార్డింగ్ సమాచారం ఈ ఊహాగానాలన్నింటికీ కేంద్రంగా మారింది. మొత్తం రికార్డింగ్ ఫైనల్ రిపోర్టులో బయటకు వస్తుంది. అసలేం జరిగిందనేదానిపై ఆ రిపోర్టులో స్పష్టత వస్తుంది.

ప్రాథమిక రిపోర్టులో పొందుపర్చిన ఆ కొద్ది సంభాషణా సారాంశం విభిన్న ఆలోచనలకు ఆస్కారమిస్తోందని కెనడాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు అధికారి అభిప్రాయపడ్డారు. తన పేరు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

''ఉదాహరణకు పైలట్ ''బి'' అనుకోకుండా లేదా తెలియని స్థితిలో ఫ్యూయల్ స్విచ్చులు ఆపారనుకుంటే, ఇంకో పైలట్ అడిగినప్పుడు తాను ఆ పని చేయలేదని ఆయన బదులివ్వడాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు.

కానీ పైలట్ ''ఏ'' ఏదో ఉద్దేశంతో స్విచ్చులు ఆపి..కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ని పరిశీలిస్తారని తెలిసి, దృష్టి మళ్లించడానికి, తనను బాధ్యునిగా గుర్తించకుండా ఉండడానికి స్విచ్చులు నువ్వెందుకు ఆపావని ప్రశ్నించి ఉండొచ్చు.ఎవరు ఏ మాటలు మాట్లాడారనేవిషయాన్ని ఏఏఐబీ స్పష్టంగా గుర్తించినప్పటికీ ఫ్యూయల్ స్విచ్చులు ఎవరాపారనేదానికి అది స్పష్టమైన సమాధానం ఇవ్వదు''

‘‘ఆ ప్రశ్నకు మనకెప్పటికీ సమాధానం లభించకపోవచ్చు'' అని ఆయనన్నారు.

అహ్మదాబాద్, ఎయిర్ ఇండియా, కాక్‌పిట్, వాయిస్ రికార్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిపోర్టులో లేని విషయాలపై ఎక్కువ ఊహాగానాాలొస్తున్నాయి.

ఊహాగానాల వెల్లువ

ఫ్యూయల్ స్విచ్చులను చేత్తో ఆపేశారనడానికి స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఈ విషయాన్ని విస్తృత కోణాల్లో చూడాల్సిన అవసరముందని ఇన్వెస్టిగేటర్లు బీబీసీతో చెప్పారు.

ఇంజన్ల పనితీరు, కండిషన్‌ను పర్యవేక్షించే ఫ్లైట్స్ ఫుల్ అధారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్(ఎఫ్ఏడీఈసీ)సిస్టమ్‌లో సమస్య ఉండి, ఒకవేళ సెన్సార్ల నుంచి తప్పుడు సంకేతాలు అంది, ఫ్యూయల్ స్విచ్చులు ఆటోమాటిక్‌గా షట్‌డౌన్ అయిఉంటాయని కొందరు పైలట్లు భావిస్తున్నారు.

స్విచ్చులు కటాఫ్ అయిన తర్వాత ఇంధనం ఎందుకు ఆపేశావు అనే పైలట్ ప్రశ్న వినిపించిందని ప్రాథమిక రిపోర్టులో తెలిపింది. ఇలా జరిగుంటే పైలట్లు లేవనెత్తిన అంశానికి ప్రాధాన్యత ఉండదు.

సంభాషణ కచ్చితంగా ఎప్పుడు జరిగిందనే సమాచారం, ఇంజిన్ సమాచారం తుది నివేదికలో తెలుస్తుంది. అప్పుడు దీనిపై స్పష్టత వస్తుంది.

ఎవరేం చెప్పారనేదానిపై కన్నా రిపోర్టులో చెప్పని విషయాలపై ఎక్కువ ఊహాగానాలు సాగుతున్నాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌(సీవీఆర్)లోని మొత్తం సమాచారం బయటకు వెల్లడించలేదు. చివరి క్షణాల గురించి తెలియజేసే ఒక్క లైను మాత్రమే ప్రస్తావనకు వచ్చింది.

ఇలా ఈ ఒక్క విషయమే బయటకు రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎవరు ఏం మాట్లాడారో దర్యాప్తు బృందానికి తెలుసా....విషయంలోని సున్నితత్వం దృష్ట్యా జాగ్రత్తగా ఉంటున్నారా..? లేదా ఏ మాటలు ఎవరు మాట్లాడారనేదానిపై స్పష్టత తెచ్చుకోవడానికి మరింత సమయం కావాలని కోరుకుంటున్నారా?

పైలట్ల వాయిస్‌లు గుర్తిస్తూ మొత్తం వాయిస్ రికార్డర్‌ సమాచారాన్ని ఏఏఐబీ షేర్ చేయాలని ఎన్‌టీఎస్‌బీ మాజీ అధికారి పీటర్ గోల్జ్ అంటున్నారు.

టేకాఫ్ సమయంలో విమానంలో ఏమన్నా సమస్యలు తలెత్తితే , ఆ సమాచారం ఫ్లైట్ డేటా రికార్డర్‌(ఎఫ్‌డీఆర్)‌లో నమోదవుతుందని, హెచ్చరికలు చేసే అవకాశం ఫ్లైట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఉందని, దీనిపై పైలట్లు అప్రమత్తమవుతారని, పైలట్లు దీనిపై మరింతగా మాట్లాడతారని ఆయన చెప్పారు.

అహ్మదాబాద్, ఎయిర్ ఇండియా, కాక్‌పిట్, వాయిస్ రికార్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రమాదంపై పూర్తి నివేదిక రావడానికి ఏడాది సమయం పట్టొచ్చు.

ఉద్దేశపూర్వకమా...లేక పొరపాటా...?

అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తంచేయడాన్ని ఆపేయాలని దర్యాప్తు అధికారులు కోరుతున్నారు.

''స్విచ్చులు టర్న్ ఆఫ్ అయ్యాయంటే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా, పైలట్ తప్పిదమా లేక ఆత్మహత్యా, లేక మరింకేదన్నానా అన్నదానిపై తేలిగ్గా ఊహాగానాలొస్తుంటాయి. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. మనకున్న ఈ కాస్త సమాచారంతో ఓ అభిప్రాయానికి రావడం చాలా ప్రమాదకరం'' అని ఓహియో స్టేట్ యూనివర్శిటీలో విమానయానరంగ నిపుణులు, మాజీ ఎయిర్‌లైన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ షాన్ ప్రాచ్‌నిక్కి బీబీసీతో వ్యాఖ్యానించారు.

ప్రమాదంపై ఇంకా అనేక రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. విమానం తోక భాగంలో ఎలక్ట్రికల్ ఫైర్ జరగడానికి అవకాశం ఉందనేదానిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పేపర్లు ప్రధానంగా దృష్టిపెట్టాయి.

ఫ్యూయల్ స్విచ్చులు టర్నాఫ్ అవ్వడం వల్లే ఇంజిన్లు ఆగిపోయాయని ప్రాథమిక రిపోర్టు తెలియజేస్తోంది. ఇంధనం చిమ్మడం, బ్యాటరీలు డ్యామేజ్ వంటివాటి వల్ల విమానం ప్రమాదం జరిగిన తర్వాత పేలుడు సంభవించి ఉండొచ్చని ఓ స్వతంత్ర ఇన్వెస్టిగేటర్ చెప్పారు.

ఏం జరిగిందన్నది తెలియజేయడమే ప్రాథమిక రిపోర్టు ఉద్దేశమని ఏఏఐబీ చీఫ్ జీవీజీ యుగంధర్ గత వారం చెప్పారు. ఇంత త్వరగా ప్రశ్నలకు సమాధానాలు వెతకడం తొందరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు కొనసాగుతోందని, కారణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తుది నివేదిక వెల్లడిస్తుందని చెప్పారు. ముఖ్యమైన విషయాలను అందరికీ తెలియచేస్తామని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)