ఇండిగో: దేశవ్యాప్తంగా ఈ సంస్థ విమానాల రద్దుకు కారణమేంటి, హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటి?

ఇండిగో ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు పెద్దఎత్తున రద్దు లేదా ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.

భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థలలో ఒకటైన ఇండిగోకు చెందిన 150 విమానాలు బుధవారం రద్దయ్యాయి. పదుల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచాయని వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

పైలట్లకు అలసట తగ్గించడానికి విశ్రాంతి సమయాన్ని పెంచుతూ జులై1, నవంబర్ 1 తేదీల నుంచి ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనల మేరకు పైలట్లకు డ్యూటీలు కేటాయించడం కష్టతరంగా మారడంతో, పైలట్ల కొరత ఏర్పడినట్టు ఇండిగో పైలట్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.

అనేక విమానాలు 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

మంగళవారం అర్ధరాత్రి (తెల్లవారితే బుధవారం) 12 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల మధ్య కోల్‌కతా విమానాశ్రయంలో 15 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయని,, సాయంత్రం వరకు 130 కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులను ఉటంకిస్తూ వార్తాపత్రిక ది హిందూ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో..

విమానాల రద్దు, ఆలస్యం కావడంపై హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి.

"నిర్వహణాపరమైన కారణావల్ల , రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడిచే కొన్ని ఫ్లైట్‌లలో ఆలస్యం, సమయాల మార్పు జరుగుతున్నట్టు తెలిసింది" అని అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తూ...హైదరాబాద్ విమానాశ్రయం ఎక్స్‌లో పేర్కొంది.

హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 74 విమాన సర్వీసులు రద్దు అయినట్లుగా హైదరాబాద్ ఎయిర్‌‌పోర్టు అధికారులు ప్రకటించారు.

ఇందులో 37 ఎరైవల్స్, 37 డిపార్చర్ సర్వీసులు ఉన్నాయి.

మూడో తేదీన హైదరాబాద్ రావాల్సిన 21 విమానాలు, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 19 విమానాలు రద్దు అయ్యాయని హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.

''ఇండిగో సంస్థతో మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. విమానాల రాకపోకలలో ఆలస్యం, సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం'' అని హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు బీబీసీతో చెప్పారు.

విమానాశ్రయం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, విమానాశ్రయంలో ప్రయాణికులు గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

ప్రయాణికుల ఫిర్యాదులు

ఈ పరిస్థితుల్లో తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు అంటున్నారు.

బీబీసీ హిందీ ఎడిటర్ నితిన్ శ్రీవాస్తవ డిసెంబర్ 2న కోల్‌కతాకు ప్రయాణిస్తున్నారు. విమానాశ్రయంలో పరిస్థితిని ఆయన ఇలా వివరించారు:

"డిసెంబర్ 2న, దిల్లీ-కోల్‌కతా ఇండిగో విమానం 6E223 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది, కానీ ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే ఆలస్యం గురించి తెలిసింది"

"భద్రతా తనిఖీల తర్వాత, విమాన షెడ్యూల్ స్క్రీన్ ముందు ఆందోళన చెందుతున్న ప్రయాణికులు కనిపించారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఇండిగో విమానం ఆలస్యం అయింది లేదా రద్దు అయింది"

"ఇండిగో రెండో ఫ్లైట్ బోర్డింగ్ గేట్ల వద్ద చాలా మంది ప్రయాణికులు వేచి ఉన్నారు. చాలా గేట్ల వద్ద, వారు తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ, స్టాఫ్‌ని సమాధానం అడుగుతున్నారు"

"మా ఫ్లైట్ బోర్డింగ్ గేట్ ప్రతి అరగంటకోసారి మారుస్తూనే ఉన్నారు. గంట మాత్రమే ఆలస్యం అని చెప్పారు. కానీ ఇది రాత్రి తొమ్మిదింటి వరకు కొనసాగింది. ఐదు గంటల నిరీక్షణ, నాలుగు బోర్డింగ్ గేట్ల మార్పుల తరువాతే విమానం బయలుదేరింది"

"ఈ రోజు, అంటే డిసెంబర్ 4న, తిరిగి బయల్దేరే ఫ్లైట్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 9:50కి బయలుదేరే ఇండిగో 6E 5077 ఫ్లైట్‌లో ప్రయాణికులకు రెండుసార్లు ఆలస్యమయ్యిందని అలర్ట్ అందింది"

"మరోవైపు ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉదాహరణకు, ఈరోజు అంటే డిసెంబర్ 4న, ఒక పెద్ద విమానయాన సంస్థలో కోల్‌కతా నుంచి దిల్లీకి విమాన టికెట్ ధర రూ.38,000కు చేరుకుంది. సాధారణంగా ఇలాంటి టిక్కెట్లను రూ. 5500-7500 కు కొనుగోలు చేసే వారు ఇంత ధరపెట్టి కొనలేరు" అని ఆయన అన్నారు.

నాగ్‌పూర్ నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న ఒక మహిళ ది టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ , తాను ఉదయం 6 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నానని, కానీ ఉదయం 7:30కి బయలుదేరాల్సిన తన విమానం రద్దయిందని చెప్పారని తెలిపారు.

‘‘తరువాత బెంగళూరు మీదుగా ఉండే విమానాన్ని మళ్లీ బుక్ చేశారు. కానీ అది కూడా తరువాత రద్దయింది’’ అని ఆమె ట్రావెల్ ఏజెంట్ ఓ వార్తాపత్రికకు చెప్పారు.

ఆ మహిళ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ టికెట్‌ను రూ.22,000కు కొనుగోలు చేయాల్సి వచ్చింది, ఇది ఇండిగో ఛార్జీ అయిన రూ.5,000 కంటే నాలుగు రెట్లు ఎక్కువ.

కోల్‌కతాకు ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన ఒక వ్యాపారవేత్త, ఉదయం 11.55 గంటలకు ఇండిగో విమానం ఎక్కాల్సి ఉందని, ఉదయం 10 గంటలకే విమానాశ్రయానికి చేరుకున్నానని, కానీ విమానం రద్దైందని చెప్పారు. 25,000 రూపాయలు చెల్లించి కోల్‌కతాకు కారులో వెళ్ళాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

విమానాల రద్దు

ఫొటో సోర్స్, Anushree Fadnavis/Reuters

ఫొటో క్యాప్షన్, విమానాల రద్దుతో ప్రయాణికులు విమానాశ్రయాలలో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది

డీజీసీఏ ఏం చెప్పింది?

ఆలస్యం వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు ఇండిగో సంస్థ ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు లేదా రీఫండ్ అందిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది .

"విమానాల రద్దు, ఆలస్యం సమస్యను తగ్గించడానికి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం, సమీక్షిస్తున్నాం" అని డీజీసీఏ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితికి కారణాలను వివరించాలని, పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సమర్పించాలని విమానయాన సంస్థను డీజీసీఏ కోరింది.

గత రెండు నెలల్లో విమానయాన సంస్థ పనితీరుకు సంబంధించిన డేటాను కూడా డీజీసీఏ అందించింది.

విమానాల సమయపాలన పరంగా ఇండిగో పనితీరు నవంబర్‌లో 67.70 శాతం, అక్టోబర్‌లో 84.1 శాతంగా ఉందని తెలిపింది.

నవంబర్‌లో మొత్తం 1,232 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.

ప్రయాణికులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ ప్రయాణం లేదా రీఫండ్ అందిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.

ఇండిగో ఏమంటోంది?

పెద్ద ఎత్తున విమానాల రద్దు, జాప్యం, ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి సంబంధించి ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది.

"గత రెండు రోజులుగా నెట్‌వర్క్ అంతటా ఇండిగో కార్యకలాపాలకు గణనీయంగా అంతరాయం కలిగిందని గుర్తించాం. మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం" అని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు .

" చిన్న సాంకేతిక లోపాలు, శీతాకాలానికి సంబంధించిన షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణం, విమానయాన వ్యవస్థలో పెరుగుతున్న రద్దీ, కొత్త సిబ్బంది షెడ్యూల్‌ సమస్యలు వంటి అనుకోని సవాళ్లను ఎదుర్కొంటున్నాం"

"మా కార్యకలాపాలపై ఇంత ప్రతికూల ప్రభావం పడుతుందని అసలు ఊహించలేదు. ఈ అంతరాయాన్ని తగ్గించడానికి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, మా షెడ్యూల్‌లో కొన్ని మార్పులను అమలు చేశాం. ఈ చర్యలు రాబోయే 48 గంటల్లో అమలవుతాయి"

"ఇది మా ఆపరేషన్లను సాధారణంగా కొనసాగించడంలో, నెట్‌వర్క్ అంతటా మా సమయపాలనను క్రమంగా పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. కస్టమర్ల అసౌకర్యాన్ని తగ్గించడానికి, సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలను స్థిరీకరించడానికి మా బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి"

ప్రయాణీకులకు సహాయం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, లేదా రీఫండ్ ఆఫర్ చేస్తామని కంపెనీ తెలిపింది.

పైలెట్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, పని పరిస్థితులు, జీతాలకు సంబంధించి పైలట్లలో అసంతృప్తి ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి.

పైలట్ల ఆగ్రహానికి కారణమేంటి?

డిసెంబర్ 2న ఇండిగో విమానాలలో 35% మాత్రమే సకాలంలో నడిచాయని, డిసెంబర్ 1న 49.5% విమానాలు మాత్రమే సకాలంలో నడిచాయని ప్రభుత్వ డేటా చూపిస్తోందని ది హిందూ వార్తాపత్రిక వెల్లడించింది.

"నవంబర్ 1 నుంచి పైలట్ల డ్యూటీ ప్రమాణాలు పూర్తిగా అమలులోకి వచ్చినందున సంక్షోభం మొదలైంది. ఎయిర్‌లైన్ తన క్రూ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోవడానికి ప్రభుత్వం దీన్ని ఏడాదిపాటు వాయిదా వేసింది. దీనిని అమలు చేస్తే విస్తృతంగా విమానాలు రద్దు అవుతాయని విమానయాన సంస్థలు హెచ్చరించాయి. అయితే పైలట్ యూనియన్లు దిల్లీ హైకోర్టును ఆశ్రయించి 2025 ఏప్రిల్‌లో దానిని అమలు చేయడానికి ఆర్డర్‌ను పొందారు"అని ది హిందూ రాసింది.

పైలట్ అలసట గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి రూపొందించిన విశ్రాంతి, డ్యూటీ గంటల కొత్త ప్రమాణాలపై ఎయిర్‌లైన్‌ రెండేళ్లపాటు సుదీర్ఘపోరాటం చేసింది. దిల్లీ హైకోర్టు ఏప్రిల్ 2025న ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి, వాటిని రెండు దశల్లో అమలు చేయాల్సి ఉంది. వారపు విశ్రాంతి గంటలను 36 నుంచి 48 గంటలకు పెంచడం వంటి అనేక నిబంధనలు జూలై 1 నుంచి అమలయ్యాయి. పైలట్లు రాత్రిపూట విమానాలను నడపడంపై పరిమితులు సహా ఇతర నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.

"ఈ చివరి నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుండి ఎయిర్‌లైన్లు పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. పైలట్లను తమ సెలవులను రద్దు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న అసంతృప్తి కారణంగా పైలట్లు సహకరించడానికి ఇష్టపడటం లేదు. డీజీసీఏ ప్రమాణాల ప్రకారం 13 గంటలకు మించి డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. 7,000 కోట్ల లాభం వచ్చినప్పటికీ జీతం పెంచకపోవడం, అలాగే కొత్త పైలట్ డ్యూటీ నిబంధనలను ఎయిర్‌లైన్ తమ ప్రయోజనానికి అనువుగా మార్చుకుంటోందనే తాజా వివాదం ఇవన్నీ పైలట్ల ఆగ్రహానికి కారణమయ్యాయి" అని ది హిందూ పేర్కొంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)