‘భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకుంటే మంచిది’- బంగ్లాదేశ్‌కు రష్యా సూచన

బంగ్లాదేశ్‌, రష్యా రాయబారి, అలెగ్జాండర్ గ్రిగోరివిచ్ ఖోజిన్

ఫొటో సోర్స్, X/ @RussEmbDhaka

బంగ్లాదేశ్‌లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్ ఖోజిన్ సోమవారం ఢాకాలోని రష్యా రాయబార కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్‌.. భారతదేశంతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు.

"బంగ్లాదేశ్ భారతదేశంతో ఉద్రిక్తతతను ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిది" అని ఆయన అన్నారు .

ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఉద్రిక్తతలను తగ్గించుకోవడం రెండు దేశాలకు, మొత్తం దక్షిణాసియాకు చాలా కీలకమని ఆయన అన్నారు.

1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్, రష్యా పోషించిన పాత్రను కూడా అలెగ్జాండర్ గుర్తుచేశారు.

"1971లో ప్రధానంగా భారతదేశం సహాయంతో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందింది. రష్యా కూడా దీనికి మద్దతు ఇచ్చింది" అని రష్యా రాయబారి అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో రష్యా జోక్యం చేసుకోవడం లేదు, అయితే ఉద్రిక్తతను మరింత పెంచకుండా ఉండే మార్గాన్ని వెతకడం తెలివైన పని.. పరస్పర విశ్వాసంపై సంబంధాలు ఆధారపడి ఉండాలి’ అని అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్ అన్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతపై రష్యా ఇప్పటివరకు మౌనంగా ఉన్నందున రష్యా రాయబారి చేసిన ఈ వ్యాఖ్య కీలకంగా మారింది.

నిజానికి, బంగ్లాదేశ్‌లోని పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు.. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ మరణంపై సంతాపాలు ప్రకటిస్తున్న వేళ రష్యా వారందరికీ భిన్నంగా బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో భారత్ పాత్రను ప్రస్తావించింది.

బంగ్లాదేశ్, భారత్, ఉద్రిక్తతలు, నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉస్మాన్ హాది మరణం తరువాత బంగ్లాదేశ్‌లో నిరసనలు చెలరేగాయి.

ఈ ప్రకటన ఎంత కీలకం?

"ప్రస్తుత పరిస్థితిలో రష్యా భారత్‌‌కు మద్దతిస్తున్నట్టు కనిపిస్తోంది" అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ రష్యా అండ్ సెంట్రల్ ఆసియా స్టడీస్ ప్రొఫెసర్ రాజన్ కుమార్ అభిప్రాయపడ్డారు.

"1971 యుద్ధంలో పాశ్చాత్య దేశాలు భారత్‌వైపు లేవు. పాకిస్తాన్ విడిపోవాలని వారు కోరుకోలేదు. తూర్పు పాకిస్తాన్‌లో స్వాతంత్య్ర పోరాటం జరిగినప్పుడు, పాశ్చాత్య దేశాలు పూర్తిగా భిన్నంగా వ్యవహరించాయి. భారత్‌ వైఖరిని, బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించాయి. బహిరంగంగా పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించాయి. అమెరికా కూడా భారత్‌ను బెదిరించింది" అని ఆయన తెలిపారు.

"ఇప్పటికీ, పాశ్చాత్య దేశాల రాయబారుల ప్రకటనలను పరిశీలిస్తే, అవి ఏకపక్షంగా కనిపిస్తాయి. వారు హాదీ మరణం గురించి మాట్లాడారు, దానిపై విచారం వ్యక్తం చేశారు. కానీ మైనారిటీ సమాజ సమస్యలపై కానీ బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దహనంపై కానీ ఎటువంటి సానుభూతి వ్యక్తం చేయలేదు. పాశ్చాత్య దేశాలు గతాన్ని మరచిపోలేకపోతున్నాయనడానికి ఇది అద్దంపడుతోంది" అని ప్రొఫెసర్ రాజన్ కుమార్ అన్నారు.

బంగ్లాదేశ్‌, తాత్కాలిక ప్రభుత్వం, మొహమ్మద్ యూనస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ యూనస్.

"బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిపై పాశ్చాత్య దేశాల ఏకపక్ష వైఖరి మధ్య రష్యా మద్దతు భారతదేశానికి ఉంది" అని ప్రొఫెసర్ రాజన్ అభిప్రాయపడ్డారు.

"మరో విషయం ఏమిటంటే పాశ్చాత్య దేశాలు బీఎన్‌పీ, జమాతే-ఇ-ఇస్లామి లేదా ఇతర వేదికలకు మద్దతు ఇస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు వాటిని అంగీకరిస్తున్నాయి. అవి ఏకపక్ష వైఖరి తీసుకుంటున్నాయి. అందుకే రష్యా వైఖరి భారత్‌కు మద్దతుగా ఉన్నట్టు స్పష్టమవుతోంది" అని రాజన్ కుమార్ అన్నారు.

"రష్యా ప్రకటనకు రెండు ఉద్దేశాలు ఉండవచ్చు" అని ఆయన చెప్పారు.

"ఒకటి, దక్షిణాసియాలో భారత్ రష్యాకు మిత్రదేశం అని వారు భావిస్తున్నారు, కాబట్టి వారు భారతదేశంతోనే ఉండాలి. రెండోది.. చారిత్రకంగా రష్యా షేక్ హసీనా ప్రభుత్వానికి గొప్ప మద్దతుదారుగా ఉంది. ఇప్పుడు కూడా,వారు భారతదేశంతో తమ ప్రయోజనాలను చూస్తున్నారు" అని ఆయన తెలిపారు.

మరోవైపు భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాల తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.

"ఉస్మాన్ హాదీ వైఖరి భారతదేశం పట్ల ప్రతికూలంగా ఉంది. ఆయన భారత్‌కు చెందిన ఈశాన్య రాష్ట్రాలపై హక్కు ఉందని పేర్కొన్నారు" అని ‘ఎక్స్‌’లో రాశారు.

ఉస్మాన్ హాదీ మరణంపై ఢాకాలోని రష్యా రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించలేదు.

ఉస్మాన్ హాది, మరణం, బంగ్లాదేశ్ యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా పదవి కోల్పోయినప్పటి నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి సంబంధించిన చారిత్రక కట్టడాలపై దాడులు జరుగుతున్నాయి.

బంగ్లాదేశ్ ఏర్పాటులో రష్యా సహాయం

1971లో తూర్పు పాకిస్తాన్‌లో ఏర్పడిన మానవతా సంక్షోభం కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య 13 రోజుల యుద్ధం జరిగింది.

ఈ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా మారింది. అంతకుముందు నుంచే, తూర్పు పాకిస్తాన్‌పై పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగుతోందన్న విషయాన్ని భారత్ ప్రపంచ దేశాలకు వివరించే ప్రయత్నం చేసింది.

తూర్పు పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు భారతదేశంలోకి వస్తున్నారు. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ మధ్య రాజకీయ పరిష్కారం కనిపించంలేదు.

ఆ సమయంలో, భారతదేశం మాట విన్న ఏకైక దేశం సోవియట్ యూనియన్.

ఆగస్ట్ 1971లో, అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 'భారత్-సోవియట్ శాంతి, స్నేహం, సహకార ఒప్పందం'పై సంతకం చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం, యుద్ధం జరిగితే సోవియట్ యూనియన్ భారతదేశానికి దౌత్య, సైనిక మద్దతు రెండింటినీ హామీ ఇచ్చింది. రష్యా భారతదేశానికి నమ్మకమైన భాగస్వామిగా ఉంది.

మరోవైపు, అమెరికా భారత్ కంటే పాకిస్తాన్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, పాకిస్తాన్ అమెరికా నేతృత్వంలోని కూటమితో పొత్తు పెట్టుకుంది, అయితే భారతదేశం అలీనంగా ఉన్నప్పటికీ, సోవియట్ యూనియన్‌కు సన్నిహితంగా ఉంది.

గత వారం రోజులుగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాలు వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

రెండు దేశాలు ఒకదానికొకటి ముఖ్యమైనవి. బంగ్లాదేశ్‌ను తరచుగా "ఇండియా-లాక్డ్" దేశం అని పిలుస్తారు.

నిజానికి, బంగ్లాదేశ్‌లోని 94 శాతం సరిహద్దు భారత్‌తో ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 4,367 కిలోమీటర్ల సరిహద్దు దాని అంతర్జాతీయ సరిహద్దులో 94 శాతం ఉంటుంది. బంగ్లాదేశ్ చుట్టూ దాదాపు అన్ని వైపులా భారత్ ఉంది.

ఇటువంటి పరిస్థితిలో, బంగ్లాదేశ్ భద్రత, వాణిజ్యం విషయాలలో భారత్‌పై ఆధారపడి ఉంటుంది.

భారతదేశానికి, ఈశాన్య రాష్ట్రాలకు చౌకైన, అందుబాటులో ఉండే కనెక్టివిటీని కూడా బంగ్లాదేశ్ అందిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించడంలో బంగ్లాదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఉస్మాన్ హాది, మరణం, యువత, తోహిద్ హుస్సేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉస్మాన్ హాది మరణం తర్వాత బంగ్లాదేశ్ యువత వీధుల్లోకి వచ్చారు.

శివ్ నాడార్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్, ఇండియాస్ వరల్డ్ మ్యాగజీన్ ఎడిటర్ హ్యాపీమోన్ జాకబ్.. బంగ్లాదేశ్ సమస్యను భారతదేశం జాగ్రత్తగా డీల్ చేయాలని అభిప్రాయపడ్డారు.

"బంగ్లాదేశ్‌తో వేగంగా క్షీణిస్తున్న సంబంధాలు భారతదేశానికి మూడు వైపుల సవాల్ విసురుతున్నాయి. 4,000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో అభద్రత, చొరబాటు ముప్పు పెరుగుతుంది. సరిహద్దు వెంబడి భారత వ్యతిరేక శక్తులు స్థావరాలను ఏర్పాటు చేసుకునే ప్రమాదం కూడా ఉంది" అని జాకబ్ అభిప్రాయపడ్డారు.

"భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలను పాకిస్తాన్, చైనా ఉపయోగించుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ జోక్యం కూడా పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో చైనాలోని కున్మింగ్‌లో చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశం న్యూదిల్లీ పట్ల ఆందోళనను వ్యక్తం చేసింది. 2024 చివరిలో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు పాకిస్తాన్ నేవీకి చెందిన నౌక వచ్చింది. చైనా ముహమ్మద్ యూనస్ ప్రభుత్వంతో తన సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోంది" అని ఆయన తెలిపారు.

"ఏ విధంగా చూసినా, ప్రస్తుత ద్వైపాక్షిక సంబంధాల స్థితి భారతదేశానికి ఉపయోగకరంగా లేదు. ఈ ఉద్రిక్తత బంగ్లాదేశ్, ఆ దేశ ప్రజల ప్రయోజనాలను మరింత దెబ్బతీస్తుంది. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి కాదు. ఈ ఉద్రిక్తత దాని దేశీయ వైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చడానికి సహాయపడుతుంది. అందువల్ల, భారతదేశంతో పేలవమైన సంబంధాలు బంగ్లాదేశ్‌కు మరింత నష్టం కలిగిస్తాయని భావించడం తప్పుగా విశ్లేషించడమే అవవుతుంది" అని జాకబ్ రాశారు.

షేక్ హసీనా ఆగస్టు 2024 నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. హసీనాకు బంగ్లాదేశ్‌ మరణశిక్ష విధించింది.

మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ షేక్ హసీనాను అప్పగించాలని కోరుతోంది.

కానీ భారత ప్రభుత్వం ఈ డిమాండ్‌కు అంగీకరించలేదు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పదేపదే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

బంగ్లాదేశ్‌లో 'శాంతియుత వాతావరణంలో' స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుకొని, విశ్వసనీయమైన ఎన్నికలకు అనుకూలంగా ఉన్నామని భారత్ డిసెంబర్ 14న తెలిపింది.

అందరినీ కలుపుకొని అంటే ఎన్నికల ప్రక్రియలో హసీనా అవామీ లీగ్‌ను చేర్చడమని అర్థమవుతోంది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం తన ప్రకటనలలో 'కలుపుకొని' అనే పదాన్ని ప్రస్తావించలేదు.

అత్యున్నత ప్రమాణాలతో ఎన్నికలు నిర్వహించాలని, ప్రజలు ఓటు వేయడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించాలని కోరుకుంటున్నట్లు మాత్రమే చెప్పింది.

గత 15 ఏళ్లుగా అలాంటి వాతావరణం లేదని తాత్కాలిక ప్రభుత్వం చెబుతోంది.

భారతదేశం చేసిన వ్యాఖ్య బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తోహిద్ హుస్సేన్‌కు నచ్చలేదు.

"భారత్ ఇటీవల చేసిన ప్రకటనలో మాకు కొన్ని సలహాలు ఇచ్చింది. వాటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ఎలా నిర్వహించాలో పొరుగు దేశం సలహా ఇవ్వడం మాకు ఇష్టం లేదు" అని తోహిద్ హుస్సేన్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)