'భారత్' తరఫున ఆడిన పాకిస్తానీ కబడ్డీ ప్లేయర్.. ఆ తర్వాత ఏమైంది?

భారత్, పాకిస్తాన్, కబడ్డీ ఆటగాడు

ఫొటో సోర్స్, Facebook/Ubaidullah Rajput

    • రచయిత, బీబీసీ ఉర్దూ

బహ్రెయిన్‌లో జరిగిన కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొన్నందుకు పాకిస్తాన్ ఆటగాడు ఒబేదుల్లా రాజ్‌పుత్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ ప్రకటించింది.

ఇటీవల (మంగళవారం) బహ్రెయిన్‌లో జీసీసీ కప్ అనే ప్రైవేట్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు.

ఈ టోర్నమెంట్‌లో అనేక జట్లు పాల్గొన్నాయి. పాకిస్తాన్, ఇండియాగా పిలుస్తున్న జట్ల మధ్య కూడా ఒక మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ తర్వాత, పాకిస్తానీ కబడ్డీ ఆటగాడు ఒబేదుల్లా రాజ్‌పుత్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిత్రంలో ఆయన భారత జెండాతో కనిపిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ తర్వాత, ఒబేదుల్లా రాజ్‌పుత్ వివరణ ఇస్తూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు.

బహ్రెయిన్ కప్ ప్రతి ఏటా నిర్వహిస్తారని, ఇంతకుముందు కూడా ఈ కప్‌లో ఆడానని ఈ వీడియోలో ఆయన చెప్పారు.

ఈ విషయాన్ని పరిశీలనకు తీసుకున్న పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.

బహ్రెయిన్‌లో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్టు పాకిస్తాన్ జాతీయ జట్టు కాదని, దీనికి ప్రభుత్వం, జాతీయ క్రీడా సమాఖ్య నుంచి అనుమతి తీసుకోలేదని పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాణా సర్వర్ అన్నారు.

"వాళ్లు ఎప్పుడు వెళ్లారో, ఎప్పుడు తిరిగి వచ్చారో కూడా మాకు తెలియదు" అని ఆయన చెప్పారు.

ఏదైనా పోటీలో పాల్గొనడానికి ఆటగాళ్లు ఎన్ఓసీ లేకుండా విదేశాలకు వెళ్లడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు.

అనేక దేశాల ఆటగాళ్లను వారి ప్రభుత్వం, సంబంధిత సమాఖ్య నుంచి ఎన్ఓసీ తీసుకోకుండానే ఆహ్వానిస్తున్నారని రాణా సర్వర్ పేర్కొన్నారు.

ఒబేదుల్లా రాజ్‌పుత్, ఫేస్ బుక్, వీడియో

ఫొటో సోర్స్, X

ఈ ఆటగాళ్లు వేరే దేశంలో ఆడటానికి అనుమతి అవసరమా? అని అడిగినప్పుడు.. కబడ్డీ ఫెడరేషన్‌కు ఒక రాజ్యాంగం ఉందని, ఆటగాళ్లందరూ దానిని పాటించాలని ఆయన అన్నారు.

అలాంటి పోటీలలో పాల్గొనడానికి సాధారణంగా ఫెడరేషన్ నుంచి ఆహ్వానం వస్తుందని సర్వర్ రాణా అన్నారు.

కానీ, వీరు సొంతంగా టిక్కెట్లు కొనుక్కుని అక్కడికి వెళ్లారు.

మరోవైపు, ఒబేదుల్లా రాజ్‌పుత్ మాట్లాడుతూ, "నా సోదరులు నన్ను పిలవలేదు, అందువల్ల నేను వేరే జట్టుతో ఆడాను" అని తన వీడియోలో తెలిపారు.

అయితే, ఆ జట్లకు 'ఇండియా', 'పాకిస్తాన్' అని పేర్లు పెట్టారని తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు.

"నేను మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, కొందరు రాజ్‌పుత్ అయిన నేను భారత్ తరఫున ఆడుతున్నానంటూ కేకలు వేశారు" అని ఆయన చెప్పారు.

కబడ్డీ, పాకిస్తాన్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

"ఇది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కాదని, ప్రతి ఏటా జరిగే లోకల్ కప్ అని చెప్పాలని నేను అనౌన్సర్‌తో చెబుతూనే ఉన్నాను" అని ఆ వీడియోలో తెలిపారు.

తన అభ్యర్థన మేరకు అధికారికంగా ప్రకటించారని ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ, అక్కడ జెండాలు ఎగరేసి.. పాకిస్తాన్, ఇండియా నినాదాలు చేయడం మొదలుపెట్టారని ఆయన పేర్కొన్నారు.

అలా జెండాలు ఎగరేస్తారని, నినాదాలు చేస్తారని తనకు తెలియదని అన్నారు.

"ఇలా జరుగుతుందని తెలిసుంటే, నేను పాకిస్తాన్ తరఫున ఆడేవాడిని. ప్రపంచ కప్ అయితే, పాకిస్తాన్ తరఫున ఆడేవాడిని. ఈ లోకల్ కప్‌ను కేవలం ఒక కప్‌గానే ఉండనివ్వండి, దీనిని ప్రపంచ కప్‌గా మార్చొద్దు" అని ఆయన అన్నారు.

ఈ విషయానికి సంబంధించి ఫెడరేషన్, కోచ్‌కు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాణా సర్వర్ మాట్లాడుతూ, ఫెడరేషన్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోందని, ఈ ఆటగాళ్లపై నిషేధం విధించే అవకాశం ఉందని అన్నారు.

ప్రభుత్వం, ఫెడరేషన్ అనుమతి లేకుండా ఆటగాళ్లు విదేశాలకు వెళ్లకుండా ఉండటానికి ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆటగాళ్ల జాబితాను పంపుతానని రాణా సర్వర్ చెప్పారు.

డిసెంబర్ 7న న్యూజీలాండ్‌లో ఇలాంటి పోటీ జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ పోటీలో భారతీయ ఆటగాళ్లు పాల్గొన్నారని, మరికొన్ని దేశాల ఆటగాళ్లు కూడా పాల్గొన్నారని ఆయన చెప్పారు.

"ఈ కార్యక్రమాల నిర్వాహకుల ఉద్దేశం క్రీడను ప్రోత్సహించడం కాదు, కేవలం డబ్బు సంపాదించడమే. వారు కేవలం టిక్కెట్లు అమ్ముకోవడంలోనే వారికి ఆసక్తి."

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)