ది రాజా సాబ్: నటి నిధి అగర్వాల్‌ను గుంపు చుట్టుముట్టిన వీడియో వైరల్, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

సినిమా, భద్రత, టాలీవుడ్, తెలుగు సినిమా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిధి అగర్వాల్

హైదరాబాద్‌లో జరిగిన ది రాజా సాబ్ సినిమా పాట విడుదల కార్యక్రమం సందర్భంగా నటి నిధి అగర్వాల్‌ను అభిమానుల గుంపు చుట్టుముట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

నిధి అగర్వాల్‌ను చుట్టుముట్టడం, తోపులాట కారణంగా ఆమె కారులో కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.

చిత్ర బృందం బుధవారం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ కూడా హాజరయ్యారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత, బయటకు వెళ్లే సమయంలో అభిమానులు భారీగా చుట్టుముట్టడంతో ఆమె గుంపులో చిక్కుకుపోయారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వైరల్ అయిన వీడియోలో, నిధి అగర్వాల్ చుట్టూ జనం గుమిగూడడం, ఆ గుంపులో ఆమె కదలలేని పరిస్థితిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె బాడీగార్డ్ అతికష్టమ్మీద ఆమెను గుంపు నుంచి తప్పిస్తూ కారులో కూర్చోబెట్టినప్పటికీ నిధి అగర్వాల్ ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవడంతో, అభిమానుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కార్యక్రమానికి సంబంధించి కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం కేసు కూడా నమోదు చేశారు.

అయితే, నటి నిధి అగర్వాల్ నుంచి కానీ, కార్యక్రమ నిర్వాహకుల నుంచి కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు.

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, "ఒక సెలెబ్రిటీని ఆహ్వానించారు, ముందుగా అనుమతి తీసుకోకుండా కార్యక్రమం నిర్వహించారు. అందుకే కేసు నమోదు చేశాం" అని తెలిపారు.

వార్తా సంస్థ పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ముందస్తు అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాల్ మేనేజ్‌మెంట్‌తో పాటు కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంగ్లిష్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఊహించిన దానికంటే భారీగా అభిమానులు రావడంతో భద్రతా ఏర్పాట్లు విఫలమయ్యాయి.

ది హిందూ పత్రికతో మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ రెడ్డి.. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. భారీగా వచ్చిన అభిమానులను కట్టడి చేయడంలో లోపాలు, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

సినిమా, భద్రత, టాలీవుడ్, తెలుగు సినిమా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభాస్

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసిన ఒక యూజర్, "ఇది చాలా భయంకరంగా ఉంది" అని కామెంట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని లులు మాల్‌లో జరిగిందని, అక్కడే 'సహనా–సహనా' పాట విడుదల కార్యక్రమం జరిగినట్లు పేర్కొన్నారు.

మరో యూజర్, "ఎవరికీ ఇలా జరగకూడదు. ఆమె ఒక పబ్లిక్ ఫిగర్ అయినా, గౌరవం ఇవ్వాలి. ఆమెను తాకాలని ఎందుకు ప్రయత్నిస్తారు? ఇది నిజంగా భయానకం" అని రాశారు.

ఇంకొకరు, "ది రాజా సాబ్ పాట విడుదల కార్యక్రమంలో నిధి అగర్వాల్‌తో అభిమానులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైనది కాదు" అంటూ విమర్శించారు.

మరో కామెంట్‌లో, "భద్రతా ఏర్పాట్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది. నిర్వాహకులు తప్పు చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్వాహకుల నిర్లక్ష్యం, అభిమానులకు నియంత్రణ లేకపోవడం - రెండూ ఈ ఘటనకు కారణం. భవిష్యత్తులో కఠిన నిబంధనలు అమలు చేయాలి" అని మరో యూజర్ రాశారు.

సినిమా, భద్రత, టాలీవుడ్, తెలుగు సినిమా

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, అల్లు అర్జున్

ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ముంబైలో జరిగిన దహీ హండి కార్యక్రమంలో తన సినిమా ప్రచారం కోసం హాజరైన నటి జాన్వీ కపూర్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆమె కారు వైపు వెళ్లే సమయంలో అభిమానులు చుట్టుముట్టడంతో ఆమె అసౌకర్యానికి గురైన దృశ్యాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి.

గత ఏడాది హైదరాబాద్‌లో నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా, సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయన ఒక రాత్రి జైలులో గడిపారు. ఈ సంఘటన కూడా సినీ ఈవెంట్లలో భద్రత ఎంత కీలకమనే చర్చకు దారితీసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)