ఏనుగును కాగడాలతో కాల్చేశారు.. శ్రీలంకలో ఘోరం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కోహ్ ఈవె
- హోదా, బీబీసీ న్యూస్
శ్రీలంకలో ఏనుగులను పవిత్రంగా భావిస్తారు.
అయితే ఒక అడవి ఏనుగును తరిమేందుకు ప్రయత్నిస్తూ కాగడాలతో కాల్చివేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన వీడియో గతవారం సోషల్ మీడియాలో రావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
పశువైద్యులు చికిత్స చేసినప్పటికీ ఆ మగ ఏనుగు గత గత మంగళవారం మరణించింది.
అనంతరం పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. నిందితుల వయస్సు 42 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది.

‘ఈ ఏడాది అనేక సార్లు డాక్టర్లు చికిత్స చేశారు’
కాగడాలతో కాల్చిన ఆ ఏనుగు ఒంటిపై తీవ్ర గాయాలు, ఒక కాలికి తుపాకీ తూటా గాయంతో ఉండడాన్ని కొందరు చూశారు.
అనంతరం దానికి పశువైద్యులు చికిత్స చేశారు.
ఇదే ఏనుగుకు ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు పశువైద్యులు చికిత్స చేశారు.
ఈసారి మాత్రం గాయాలు తీవ్రంగా ఉండడంతో అది మరణించింది.
జంతు హక్కుల కోసం పోరాటం చేస్తున్నవారు, సోషల్ మీడియా యూజర్లు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నేరస్థులపై విచారణ జరపాలని, ఇలాంటి క్రూర చర్యలను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ తయారుచేశారు. దీనిపై 400 కంటే ఎక్కువమంది సంతకాలు చేశారు.
శ్రీలంకలో ఏనుగులను పవిత్రంగా భావిస్తారు.
"శ్రీలంకలో ఏనుగులను చంపడం నేరం, దీనికి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది" అని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ పేర్కొంది.
కానీ మనుషులు, ఏనుగుల మధ్య పెరుగుతున్న ఘర్షణలు రెండువైపులా ప్రాణాంతకంగా మారుతున్నాయి.
ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 400 ఏనుగులు మరణించాయని స్థానిక మీడియా నివేదించింది. ఈ మరణాలలో చాలా వరకు మనుషుల వల్లే సంభవించాయని, వాటిలో కాల్పులు, రైలు ప్రమాదాలు,"జా బాంబులు" (రైతులు అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకోవడానికి ఉపయోగించే పేలుడు ఎర) కూడా కారణమని ఒక అధికారి స్థానిక పత్రిక డైలీ మిర్రర్‌తో అన్నారు.
మరోవైపు ఏనుగుల దాడుల్లో 100 మందికి పైగా మరణించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














