దిల్లీ వాయు కాలుష్య నియంత్రణలో బీజింగ్ రోల్ మోడల్ అవుతుందా? రెండు నగరాల మధ్య తేడా ఉందా..

2013లో, బీజింగ్‌ సహా చైనాలోని అనేక నగరాల్లో శీతాకాలంలో పొగమంచు కప్పేసేది

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, సందీప్ రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా రాజధాని బీజింగ్‌లో 2014లో వాయు కాలుష్యం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దీంతో ప్రజలను ఇంటి లోపలే ఉండాలని సూచించేవారు.

పర్యావరణ పరంగా ప్రపంచంలోని 40 ప్రపంచనగరాల్లో బీజింగ్‌ కింది నుంచి రెండో స్థానంలో ఉందని చైనా ప్రభుత్వ పరిశోధనా సంస్థ షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అప్పట్లో ప్రకటించింది.

ఆ సమయంలో, బీజింగ్‌లో కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణం కంటే 15 రెట్లు ఎక్కువగా ఉంది.

ఇప్పుడు అలాంటి పరిస్థితినే రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలు ఎదుర్కొంటున్నాయి.

వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించే వెబ్‌సైట్ ఐక్యూఎయిర్ (IQAir) ప్రకారం, వాయు కాలుష్యం విషయంలో ప్రపంచంలోని 126 ప్రధాన నగరాల్లో దిల్లీ మూడవ స్థానంలో ఉంది, ఇక్కడ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా 450 దగ్గర ఉంది.

అదే వెబ్‌సైట్ ప్రకారం, బీజింగ్ ఈ జాబితాలో 60వ స్థానంలో ఉంది. దాని ఏక్యూఐ 64.

ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘించే వాహనాల ప్రవేశాన్ని నిషేధించడం, ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతించడం, పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, భవన నిర్మాణాలను, కూల్చివేతలను నిలిపివేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది.

ఇదే సమయంలో, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో దిల్లీకి సహాయం అందించడానికి భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ముందుకొచ్చింది. బీజింగ్ వాయు కాలుష్య సమస్యను ఎలాంటి వ్యూహంతో ఒక కొలిక్కితీసుకురాగలిగిందో దశల వారీగా వివరించింది.

తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడి కూడా ఈ విషయమై స్పందిస్తూ, "వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో భారతదేశానికి దశలవారీ మార్గదర్శకత్వం అందించడానికి చైనా సిద్ధంగా ఉంది..." అని ‘X’లో రాశారు.

డిసెంబర్ 14న న్యూదిల్లీలోని ఒక ప్రాంతంలో ఏక్యూఐ 912 అని చూపిస్తున్న ఏక్యూఐ యాప్ స్క్రీన్‌షాట్‌ను ఆమె షేర్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చైనా రాయబార కార్యాలయం బీజింగ్, దిల్లీ నగరాల్లో ఏక్యూఐ రీడింగుల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది

ఫొటో సోర్స్, @ChinaSpox_India

ఫొటో క్యాప్షన్, చైనా రాయబార కార్యాలయం బీజింగ్, దిల్లీ నగరాల్లో ఏక్యూఐ రీడింగుల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది

చైనా రాయబార కార్యాలయం ఏం చెప్పింది?

డిసెంబర్ 15, 2025న బీజింగ్, దిల్లీ రెండింటికీ ఏక్యూఐ రీడింగుల స్క్రీన్‌షాట్‌ను దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యూ జింగ్ 'X'లో పోస్ట్ చేశారు.

ఇందులో దిల్లీ ఏక్యూఐ 447 కాగా, బీజింగ్ ఏక్యూఐ 67 అని ఉంది.

అదే పోస్ట్‌లో యూ జింగ్, "వేగవంతమైన పట్టణీకరణ మధ్య వాయు కాలుష్యం విసురుతున్న సవాళ్ల గురించి చైనాకు, భారతదేశానికి తెలుసు. అనేక సంక్లిష్టతలు ఉన్నప్పటికీ, గత దశాబ్దంలో చైనా చేసిన నిరంతర ప్రయత్నాలు ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చాయి" అని రాశారు.

గత రెండు దశాబ్దాలుగా బీజింగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నారు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, గత రెండు దశాబ్దాలుగా బీజింగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నారు

చైనా సూచించిన చర్యలు ఏమిటి?

"స్వచ్ఛమైన గాలి అంటే రాత్రికి రాత్రే అయిపోదు, కానీ దానిని సాధించవచ్చు" అని యూ జింగ్ డిసెంబర్ 16న 'X'లో మరొక పోస్ట్‌లో రాశారు .

తొలి దశ : వాహన ఉద్గారాల నియంత్రణ కింద చైనాలో తీసుకున్న చర్యలు...

  • చైనా యూరో 6 ప్రమాణాలకు సమానమైన 6ఎన్ఐ వంటి కఠినమైన నిబంధనలను అమలు చేసింది.
  • పాత వాహనాలను, అధిక ఉద్గార వాహనాలను దశలవారీగా తొలగించారు.
  • లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసి-సరి లేదా వారాంతపు డ్రైవింగ్ నియమాల ద్వారా వాహనాల రాకపోకలను తగ్గించారు.
  • ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో, బస్సు నెట్‌వర్క్‌లో ఒకదాన్ని చైనా సృష్టించింది.
  • ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగంగా మార్పు వచ్చింది.
  • బీజింగ్-తియాంజిన్-హెబీ ప్రాంతంలో సమష్టి కృషితో ఉద్గారాలను తగ్గించగలిగారు.

డిసెంబర్ 17న యూ జింగ్ తన మూడవ పోస్ట్‌లో , రెండో దశ కింద పారిశ్రామిక పునర్నిర్మాణానికి చర్యలను సూచించారు...

  • మూడు వేలకు పైగా భారీ పరిశ్రమల మూసివేత లేదా ఇతర ప్రాంతాలకు తరలింపు జరిగింది.
  • చైనాలోని అతిపెద్ద ఉక్కు కంపెనీలలో ఒకటైన షోగాంగ్‌ను తొలగించారు.
  • మూసేసిన ఫ్యాక్టరీలను పార్కులు, వాణిజ్య సముదాయాలు, సాంస్కృతిక, సాంకేతిక కేంద్రాలుగా మార్చారు. ఉదాహరణకు, పాత షోగాంగ్ కాంప్లెక్స్‌ను 2022 వింటర్ ఒలింపిక్స్ వేదికగా మార్చారు.
  • హోల్‌సేల్ మార్కెట్లు, లాజిస్టిక్స్ హబ్‌లు, కొన్ని విద్యా, వైద్య సంస్థలను ఇతర ప్రదేశాలకు తరలించారు.
  • ప్రాంతీయ సమన్వయం కింద సాధారణ తయారీ పరిశ్రమలను హెబీకి తరలించారు. అయితే అధిక విలువైన పరిశోధన, అభివృద్ధి, సేవా రంగాలను బీజింగ్‌లోనే ఉంచారు.

అదేవిధంగా, డిసెంబర్ 18న తన నాల్గో పోస్ట్‌లో, మూడో దశ చర్యలను యూ జింగ్ వివరించారు.

"బీజింగ్-తియాంజిన్-హెబీ ప్రాంతంలో సంపూర్ణ బొగ్గు నిషేధం అమలు చేశారు. ఫలితంగా, బీజింగ్‌లో బొగ్గు వినియోగం 2012లో ఉన్న 2.1 కోట్ల టన్నుల నుంచి 2025 నాటికి 6 లక్షల టన్నుల కంటే తక్కువకు పడిపోయింది. ఇది నగరం మొత్తం శక్తి వినియోగంలో 1 శాతం కంటే తక్కువ" అని పేర్కొన్నారు.

డిసెంబర్ 19న పోస్టులో నాలుగో దశ చర్యలను యూ జింగ్ వివరించారు. దుమ్మును పూర్తిగా నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వాటిలో నిర్మాణ ప్రదేశాలలో దుమ్ము నిరోధక వలలను ఏర్పాటు చేయడం, నీరు చల్లడం, రోడ్లను శుభ్రపరచడం, గడ్డిని కాల్చకుండా ఉండటానికి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో భవనాల నిర్మాణాలను, పాత భవనాల కూల్చివేతలను ఆపేయడం, పెద్ద ఎత్తున చెట్లను నాటడం వంటివి ఉన్నాయి.

సోషల్ మీడియాలో స్పందన

చైనా రాయబార కార్యాలయం సహాయ ప్రతిపాదనకు సోషల్ మీడియాలో గణనీయమైన ప్రతిస్పందన వచ్చింది. కొందరు బీజింగ్ ప్రతిపాదనను ప్రశంసించగా, మరికొందరు దానిని అవహేళనగా తీసుకున్నారు.

డిసెంబర్ 18న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యాసం ప్రచురితమైంది - 'బీజింగ్- దిల్లీకి మోడల్‌గా ఎందుకు ఉండకూడదు' అన్నది దాని హెడ్ లైన్.

పొల్యూషన్ వ్యవహారాన్ని, చైనా సూచనలను చాలామంది ఒక వెటకారంగా, సరదాగా తీసుకుంటున్నారని ఆ కథనం పేర్కొంది.

"సంవత్సరాలపాటు ప్రయత్నాలు చేసినప్పటికీ, బీజింగ్‌లో ఏక్యూఐ 214కు వచ్చింది. పొగమంచు లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి" అని ఆ కథనం పేర్కొంది.

ఈ విషయాన్ని ఎక్స్‌లో పేర్కొంటూ, జనసాంద్రత కలిగిన ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా ఈ సవాలును ఎదుర్కోవడం మాకు ఎంత కష్టమైందో కొన్ని దేశాలు గమనించాయని, అందుకే తాము తమ అనుభవాలను ఇతరులకు అందిస్తున్నామని, దాని ఉద్దేశం 'బీజింగ్ మోడల్‌ను ఎక్స్‌పోర్ట్ చేయడం' తన లక్ష్యం కాదని యూ జింగ్ రాశారు .

"అందరికీ సరిపోయే పరిష్కారం అంటూ ఏమీ లేదు, దానికి ప్రామాణిక సమాధానం కూడా ఉండదు. భారతదేశం తన జాతీయ పరిస్థితులకు అనుగుణంగా స్వచ్ఛమైన వాతావరణం కోసం తన మార్గాన్ని నిర్దేశించుకుంటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం" అని ఆమె పేర్కొన్నారు.

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ)లో క్లీన్ ఎయిర్, సస్టైనబుల్ మొబిలిటీపై కన్సల్టెంట్, దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ మాజీ అదనపు డైరెక్టర్ మోహన్ జార్జ్ మాట్లాడుతూ, బీజింగ్‌తో దిల్లీని పోల్చడం సరైనది కాదని అన్నారు.

"వారు (చైనా) చర్య తీసుకున్నారు, వారు చెబుతున్న ఫలితాలు బాగానే ఉన్నాయి. కానీ దిల్లీలో సమస్య భిన్నంగా ఉంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

"దిల్లీ భౌగోళిక స్థానం కూడా ఒక సమస్య. ఇది ల్యాండ్ లాక్డ్ (భూపరివేష్టిత) ప్రాంతం. ఇక్కడ దుమ్ము పెద్ద సమస్య. బీజింగ్ విషయానికొస్తే, సముద్ర తీరం నుంచి దూరం చాలా తక్కువ (బోహై సముద్రం నుంచి బీజింగ్‌కు దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్లు)" అని ఆయన వివరించారు.

2013 తర్వాత బీజింగ్, దాని చుట్టుపక్కల ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేయడమో లేదా వేరే చోటకు తరలించడమో చేశారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2013 తర్వాత బీజింగ్, దాని చుట్టుపక్కల ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేయడమో లేదా వేరే చోటకు తరలించడమో చేశారు.

చైనా సమగ్ర వ్యూహం

బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ రెండు సంవత్సరాల కిందట ఇచ్చిన వార్తా కథనం ప్రకారం, 2013 నుంచి బీజింగ్‌లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి విస్తృతంగా చర్యలు చేపట్టారు.

కొత్తగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, అలాగే ఇళ్లలో వేడి కోసం బొగ్గు వాడకంలాంటి వాటిని పూర్తిగా నిషేధించింది.

డీజిల్ ట్రక్కుల ఇంధనం, ఇంజిన్ ప్రమాణాలను పెంచడం, కాలుష్య కారక కార్లను తగ్గించడం కూడా ఈ చర్యల్లో ఉన్నాయి.

ప్రజలు విద్యుత్ వాహనాలను, తక్కువ దూరాలకు సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించారు.

"గాలి నాణ్యతను మెరుగుపరచడానికి బీజింగ్ చాలా కష్టపడింది. అయితే, గత దశాబ్దంలో నగర పరిధిని దాటి ప్రయత్నాలను విస్తరించినప్పుడు అతిపెద్ద మార్పు వచ్చింది" అని హెల్సింకికి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ విశ్లేషకులు లౌరి మిల్లివిర్టా చెప్పారు.

మిల్లివిర్టా చెప్పిన సమాచారం ప్రకారం, నగరం వెలుపల ఉన్న పారిశ్రామిక సమూహాలు, కాలుష్య వనరులను కవర్ చేసే "కీలక నియంత్రణ ప్రాంతం" ఏర్పాటుచేశారు. ఇది మరింత ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చింది.

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 2013 బడ్జెట్‌లో 430 మిలియన్ల డాలర్లు కేటాయించగా, 2017 నాటికి దీనిని 2.6 బిలియన్ల డాలర్లకు పైగా పెంచారు.

దిల్లీని కమ్మేసిన పొగమంచు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీని కమ్మేసిన పొగమంచు

దిల్లీ ప్రయత్నాల్లో లోపం ఏమిటి?

గత రెండు దశాబ్దాలలో, వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి దిల్లీ అనేక చర్యలు తీసుకుంది. కాలుష్య కారక పరిశ్రమలను జాతీయ రాజధాని ప్రాంతం నుంచి తరలించడం, ప్రజా రవాణాను బలోపేతం చేయడం, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో, రాపిడ్ రైలు మొదలైన వాటిని విస్తరించడం వంటివి ఈ చర్యల్లో ఉన్నాయి.

దిల్లీలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను మూసివేయడం, వాహనాల కాలుష్య ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం, పాత కమర్షియల్ వాహనాలను దశలవారీగా తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు.

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మెట్రో నెట్‌వర్క్ 423 కిలోమీటర్లకు పైగా చేరింది. ఇంకా, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) దిల్లీ, దాని చుట్టుపక్కల నగరాలను ర్యాపిడ్ రైల్ ద్వారా అనుసంధానించే ప్రాజెక్ట్‌ పని జరుగుతోంది.

దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లోని ఏడు వేల బస్సులు విద్యుత్‌తో నడుస్తాయి. కానీ రైలు, బస్సుల మధ్య కనెక్టివిటీ ఇంకా పూర్తిగా జరగలేదు.

దిల్లీ నగరం లోపల నుంచి వెలువడే ఉద్గారాలు ఒక పెద్ద సమస్య.

"చుట్టుపక్కల రాష్ట్రాలలోని రైతులు పంటలను కాల్చడం వల్ల లేదా బయటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల దిల్లీకి 40 నుంచి 50 శాతం కాలుష్యం వస్తోంది. కానీ దిల్లీలో వెలువడే ఉద్గారాలు కూడా ఈ కాలుష్యానికి అంతే మొత్తంలో దోహదం చేస్తున్నాయి. ముందుగా దీనిని తగ్గించాలి" అని మోహన్ జార్జ్ చెబుతున్నారు.

దిల్లీకి ఆనుకుని ఉన్న గౌతమ్ బుద్ధనగర్‌లోని దాద్రిలో ఎన్‌టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీకి ఆనుకుని ఉన్న గౌతమ్ బుద్ధనగర్‌లోని దాద్రిలో ఎన్‌టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్

దిల్లీ సమీపంలో 11 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు

మరో ప్రధాన ఆందోళన ఏమిటంటే, దిల్లీ చుట్టూ ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి.

''దిల్లీకి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో 11 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పొగ గాలిలో కలిసిపోతోంది'' అని మోహన్ జార్జ్ చెప్పారు.

శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం దిల్లీ చుట్టూ 11 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి.

ఈ ప్లాంట్లను పెద్ద మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తున్న అతిపెద్ద కాలుష్య కారకాలుగా భావిస్తున్నారు.

ఈ నివేదిక ప్రకారం, ఒక్కో ప్లాంట్ పారిశ్రామిక రంగంలో 60 శాతం పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్) ఉద్గారాలకు, 45 శాతం సల్ఫర్ డయాక్సైడ్ (SO2), 30 శాతం నైట్రోజన్ ఆక్సైడ్, 80 శాతం మెర్క్యూరీ ఉద్గారాలకు బాధ్యత వహిస్తుంది.

ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2015 డిసెంబర్‌లో అటువంటి థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు కఠినమైన ప్రమాణాలను ప్రకటించింది.

ఈ కొత్త ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేస్తే, NOx, SO2, పీఎం ఉద్గారాలలో గణనీయమైన తగ్గుదల ఉండవచ్చు.

ఈ ప్రమాణాలు అమలైతే, 2026-27 నాటికి పీఎం ఉద్గారాలను దాదాపు 35 శాతం, NOx ఉద్గారాలను దాదాపు 70 శాతం, SO2 ఉద్గారాలను 85 శాతానికి పైగా తగ్గించడంలో సహాయపడతాయని సీఎస్ఈ అంచనా వేసింది.

కానీ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఈ ప్రమాణాలు కఠినంగా అమలు చేయట్లేదని అనేక పర్యావరణ సంస్థలు ఆరోపించాయి.

SO2 ఉద్గారాలను తగ్గించడానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి నిబంధనలను సడలించినట్లు మోహన్ జార్జ్ అన్నారు.

ఈ ఏడాది జూలైలో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మినహాయింపును ప్రకటించింది . అయితే, థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే ఫ్లూ గ్యాస్‌లలో సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది వాతావరణంలోకి విడుదలైనప్పుడు సెకండరీ పర్టిక్యులేట్ మ్యాటర్‌ను ఏర్పరుస్తుంది.

దిల్లీలో వాయు కాలుష్యానికి నగరంలోని ఉద్గారాలు ప్రధాన కారణం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో వాయు కాలుష్యానికి నగరంలోని ఉద్గారాలు ప్రధాన కారణం

దిల్లీ వాయు కాలుష్యం పరిష్కరించలేనిదా?

దిల్లీలో వాయు కాలుష్యం నియంత్రణకు నియమాలు, కఠినమైన నిబంధనలను రూపొందించడం మంచి ప్రయత్నమని, కానీ వాటి అమలు విషయమే అతిపెద్ద సమస్య అని మోహన్ జార్జ్ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను దిల్లీ నుంచి తరలించడానికి చొరవ తీసుకున్నారు. కానీ ఇప్పటికీ దిల్లీలో 32 పారిశ్రామిక ప్రాంతాలు, 25 డెవలప్‌మెంట్ ఏరియాలు ఉన్నాయి. చాలావరకు అసంఘటిత రంగం ఉంది. దీనిని పర్యవేక్షించడం లేదు" అని చెప్పారు.

"కేవలం 1500 చదరపు కిలోమీటర్ల పరిధిలో చర్య తీసుకోవడం వల్లనే ఫలితాలను పొందలేం. ఇది విస్తారమైన భౌగోళిక ప్రాంతంలో చాలా చిన్న భాగం. బీజింగ్ విషయానికొస్తే, వారు నిర్ణయాలు తీసుకొని వాటిని వెంటనే అమలు చేశారు. మా దగ్గర మంచి ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఇక్కడ నిర్ణయాల అమలు అంత ప్రభావవంతంగా లేదు" అని ఆయన అన్నారు.

"గత 15 సంవత్సరాలుగా మనం పంట వ్యర్థాలను తగలబెట్టే సమస్యను ఎదుర్కొంటున్నాం. అదృష్టవశాత్తూ, ఈ సంవత్సరం అది చాలా తక్కువగా ఉంది. కేవలం రెండు రోజుల్లో, ఇది మొత్తం వాయు కాలుష్యంలో 22 శాతానికి కారణమైంది. కానీ వాహన ఉద్గారాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని చెప్పారు.

దిల్లీలోని 1500 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పరిధిలో 80 లక్షల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయని, వాటిలో 15 నుంచి 20 లక్షల వాహనాలు నిత్యం రోడ్డుపై తిరుగుతున్నాయని మోహన్ జార్జ్ చెప్పారు.

ఆయన చెప్పినదాని ప్రకారం, "వాయు కాలుష్యాన్ని దిల్లీ తగ్గించాలనుకుంటే, నగరంలోని కాలుష్య కారకాలను తగ్గించాలి. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. రోడ్లపైనున్న దుమ్మును తొలగించాలి. కాలుష్య కారక పరిశ్రమలను మూసివేయాలి"

"చైనా ఎదుర్కొన్న సమస్యలకు, మన సవాళ్లకు మధ్య చాలా తేడా ఉంది. కానీ వారి ప్రయత్నాల నుంచి మనం ఏం నేర్చుకోగలమో చూడాలి" అని మోహన్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)