బంగ్లాదేశ్: ఢాకాలో ఖలీదా జియా కుటుంబాన్ని కలిసిన జైశంకర్

బంగ్లాదేశ్, ఢాకా, ఖలీదా జియా, తారిక్ రెహమాన్, జైశంకర్, హసీనా, నరెేంద్రమోదీ

ఫొటో సోర్స్, @hamidullah_riaz

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు నివాళులు అర్పించేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం ఢాకా వెళ్లారు.

భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు ప్రస్తుతం పూర్తిగా సాధారణంగా లేని సమయంలోనే భారత విదేశాంగ మంత్రి ఢాకాకు వెళ్లారు.

ఢాకాలో ఖలీదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహమాన్‌ను ఎస్ జైశంకర్ కలిసిన చిత్రాన్ని బంగ్లాదేశ్‌ భారత హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ "ఖలీదా జియాకు నివాళులు అర్పించడానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా భారత విదేశాంగ మంత్రి ఢాకాకు వచ్చారు" అని హమీదుల్లా రాశారు.

మరోవైపు, పాకిస్తాన్ తన నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్‌ను ఢాకాకు పంపుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గత 17ఏళ్లుగా బ్రిటన్‌లో నివసిస్తున్న ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన ఐదు రోజులకు, మంగళవారంనాడు ఖలీదా జియా మరణించారు.

బంగ్లాదేశ్‌తో భవిష్యత్ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎస్. జైశంకర్ ఢాకా పర్యటన ఒక మార్గంగా భావిస్తున్నారు. జైశంకర్ పర్యటనను భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ మంచి దౌత్యపరమైన చొరవగా అభివర్ణించారు.

బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అత్యంత బలమైన పార్టీగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఫిబ్రవరి తర్వాత బంగ్లాదేశ్ పాలన ఎవరి చేతుల్లో ఉంటుందో, వారితో మంచి సంబంధాలు కలిగిఉండటం భారత్‌కు కీలకంగా మారింది.

అంతకుముందు, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబర్ 2024లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్‌తో మాట్లాడటానికి ఢాకా వెళ్లారు.

జైశంకర్, హసీనా, నరెేంద్రమోదీ, భారత్, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్ హసీనా

భారతదేశం వైఖరి మారుతుందా?

ఖలీదా జియా మృతికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గతంలో, ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు.. ప్రధానమంత్రి మోదీ ఆమె చికిత్స విషయంలో అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమంటూ ట్వీట్ చేశారు.

ఇందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఖలీదా జియా పాత్రను మంగళవారం ప్రధాని మోదీ ప్రశంసించారు.

బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు భారతదేశం చాలా కాలంగా మద్దతుదారుగా ఉంది. ఖలీదా జియా పదవీకాలం కంటే షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశంతో సంబంధాలు మరింతగా మెరుగుపడ్డాయి.

బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈసారి అవామీ లీగ్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. దీంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత్‌కు అవామీ లీగ్ అనే ఆప్షన్ లేదు.

ఈ పరిస్థితుల్లో, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలతోనే భారత్ తన సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.

పొరుగుదేశాలతో ఉన్న ప్రస్తుత ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీయే భారత్‌కు ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

అందుకే రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరచడంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, మాజీ ప్రధాని ఖాలిదా జియా చేసిన పాత్రను నరేంద్ర మోదీ ప్రత్యేకంగా గుర్తు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

జైశంకర్, హసీనా, నరెేంద్రమోదీ, భారత్, బంగ్లాదేశ్,బేగం ఖలీదా జియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బేగం ఖలీదా జియా, షేక్ హసీనా

భారత్‌కు ఉన్న ఆప్షన్ ఏమిటి?

బంగ్లాదేశ్ రాజకీయ సంస్కృతి భారత్‌ చుట్టూ ఉన్న ఇతర పొరుగుదేశాల కంటే భిన్నంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డిసెంబర్ 27న, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్‌తో ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బంగ్లాదేశ్‌లో భారత మాజీ హైకమిషనర్ పంకజ్ శరన్.. "బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా తనతోనే చర్చలు జరపాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో సంభాషణలు ప్రారంభించడం ద్వారా సంబంధాలను మెరుగుపరచాలనే సంకేతాలు భారత్ ఇస్తోంది" అన్నారు.

అదే కార్యక్రమంలో బంగ్లాదేశ్ వ్యవహారాల నిపుణుడు, సీనియర్ జర్నలిస్ట్ జయంత్ భట్టాచార్య మాట్లాడుతూ.. "భారతదేశం పట్ల వారి వైఖరి ప్రతికూలంగా ఉన్నందున జమాత్-ఏ-ఇస్లామీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తాయేమో అన్న ఆందోళన భారత్‌కు ఉంటుంది. జమాత్ తనను తాను సంస్కరించుకున్నట్లు చెప్పుకున్నప్పటికీ, దాని గురించి కచ్చితంగా ఏమీ చెప్పలేం" అని అన్నారు.

"బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది" అని పంకజ్ శరన్ అన్నారు.

ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి రావడంతో ఆయన అధికారంలోకి వచ్చే సూచనలున్నాయని నిపుణులు అంటున్నారు.

బంగ్లాదేశ్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్

ఫొటో సోర్స్, @hamidullah_riaz

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుటుంబ సభ్యులను భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కలిశారు.

"అవామీ లీగ్ బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఇదే మొదటిసారి" అని పంకజ్ శరన్ అన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్‌లకు స్పష్టమైన వేదిక ఉంది. జమాత్‌తో ఎన్నికల కూటమిని ఏర్పాటు చేసుకున్న నేషనల్ సిటిజన్ పార్టీ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి జమాత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఈసారి జమాత్‌తో పొత్తు పెట్టుకోలేదు. బదులుగా, మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది" అని అన్నారు.

"కొంతమంది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. కానీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆధిక్యంలోకి రావాలని వారు చూస్తున్నారు. అందువల్ల, ఈ పార్టీని అధికారం నుంచి దూరంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి అక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగితే బంగ్లాదేశ్‌కు మంచిది" అని అదే కార్యక్రమంలో, పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్ టి.సి.ఎ.రాఘవన్ చెప్పారు.

"బంగ్లాదేశ్ విషయంలో భారత్‌ ఉన్న ఆప్షన్లలో ఉత్తమమైనది ఎంచుకోవాల్సి ఉంటుంది అందుకే ఎంపిక చాలా కీలకం. అప్పుడే సరైన విధానాన్ని రూపొందించగలం. 1971లో ఏం జరిగిందో, అందులో పాకిస్తాన్ పాత్ర ఏమిటో అనే విషయాలపైనే ఆలోచిస్తూ ఉంటే, భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో ముందుకు వెళ్లలేం" అని రాఘవన్ అన్నారు.

బంగ్లాదేశ్‌లో జరిగే ప్రతి పరిణామానికీ భారత్ తొందరపడి స్పందించకూడదని, 'పాకిస్తాన్ స్క్రిప్ట్' అమలు కాకుండా చూడాలని ఆయన అన్నారు.

"భారత్, బంగ్లాదేశ్ సాంస్కృతికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఎంతగా భారత్‌ వ్యతిరేక ప్రభుత్వం వచ్చినా, ఈ బంధాన్ని తెంచలేదు. కాబట్టి, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్‌ విషయంలో భారత్ ముందడుగు వేయాలి" అని జయంత భట్టాచార్య అన్నారు.

బంగ్లాదేశ్ పర్యటన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకురాలు, ఖలీదా జియా

ఫొటో సోర్స్, @narendramodi

ఫొటో క్యాప్షన్, 2015లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న ఖలీదా జియాను కలిశారు.

ఖలీదా జియా పార్టీతో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయి?

ఖలీదా జియా 1991 నుంచి 1996 వరకు, 2001 నుంచి 2006 మధ్య బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు.

ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదం గురించి భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలను అప్పుడు బంగ్లాదేశ్ పట్టించుకోలేదని చెబుతారు.

అయితే, 2006లో ఖలీదా జియా భారత్‌ను సందర్శించారు. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో ఆమె చర్చలు జరిపి, సవరించిన వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు.

అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసిన సమయంలో, ఖలీదా జియా తాను ఓపెన్ మైండ్‌తో భారత్‌కు వచ్చానని, గతంలో ఏర్పడిన కఠినత, గాయాలను మాన్పడమే తన పర్యటన లక్ష్యమని చెప్పారు.

దీనికి ముందు, 2005 నవంబర్‌లో 13వ సార్క్ శిఖరాగ్ర సమావేశానికి ఆమె ఆతిథ్యం ఇచ్చారు. భారత్‌లో ఆమె చివరిసారిగా 2012 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు పర్యటించారు. ఆ సమయంలో ఆమె బంగ్లాదేశ్‌ ‘జాతీయ సంగ్సద్’లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు.

ముఖ్యంగా ఆమె రెండో పదవీకాలం భారతదేశానికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. 2001, 2006 మధ్య, బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని భారత వ్యతిరేక వేర్పాటువాద సంస్థలు, ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించిందన్న ఆరోపణలున్నాయి. ఆ సమయంలో ఖాలిదా జియా.. జమాత్ ఏ ఇస్లామీతో చేతులు కలిపారు.

ఆ కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనంతరం 2008లో షేక్ హసీనా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగుదల కనిపించింది. అప్పట్లో ఢాకా, ఇలాంటి గ్రూప్‌లపై కఠిన చర్యలు తీసుకుంది.

భారత్‌కు రావడానికి ముందు, ఖలీదా జియా ఒక వ్యాసంలో... "మన రెండు దేశాల్లోనూ భయాన్ని ఆధారంగా చేసుకుని పరస్పర అనుమానాలు, అవిశ్వాసాన్ని పెంచే శక్తులు ఉన్నాయి. అవి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. కాలం కోరేది మన ఆలోచనా విధానంలో మార్పు. భారత్ అవామీ లీగ్‌కు ఎక్కువగా దగ్గరగా ఉంది, బీఎన్‌పీ భారత్ వ్యతిరేకం అన్న భావనను మార్చాల్సిన అవసరం ఉంది" అని రాశారు.

బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, @CMShehbaz

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ 2024 డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్.

తాత్కాలిక ప్రభుత్వం

"బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి భారతదేశం మద్దతు ఇచ్చినప్పటికీ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తరచూ ఉద్రిక్తంగా ఉంటాయి.. పూర్తిగా ప్రతికూలంగా కాకపోయినా. రెండు దేశాలు బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో పోషించిన పాత్రను ఒకదానికొకటి బలహీనపరిచే కథనాలను ప్రోత్సహించాయి" అని "ఎ హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్" అనే పుస్తకంలో విలియం వాన్ షెండెల్ రాశారు.

"స్వాతంత్ర్య పోరాటానికి అందించిన సహకారానికి బంగ్లాదేశ్ తగినంత కృతజ్ఞత చూపించలేదనే అభిప్రాయం భారత్‌లో ఉంది. మరోవైపు భారతదేశం తన సొంత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే జోక్యం చేసుకుంటుందని, స్వతంత్ర బంగ్లాదేశ్‌ను తరచుగా శాటిలైట్ దేశంలా చూస్తుందనే భావన బంగ్లాదేశ్‌లో ఉంది" అని ఆయన రాశారు.

మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సున్నితమైన అంశంగా ఉండేవి.

షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయినప్పటి నుంచి, బంగ్లాదేశ్–భారత సంబంధాల్లో ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. మరోవైపు, పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాల్లో ఏర్పడిన కఠినత కొంతమేరకు తగ్గినట్లు కనిపిస్తోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)