బ్యాటిల్ ఆఫ్ గల్వాన్: కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు ఎవరు?

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ ఇటీవల విడుదల కాగా చైనా మీడియాలో ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి.
2020 జూన్‌లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు చిత్ర యూనిట్ మీడియాకు చెప్పింది.
కాగా.. గల్వాన్ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు చనిపోయారు.
దేశంలో రెండో అత్యున్నత మిలటరీ అవార్డైన మహావీర్ చక్రను మరణానంతరం ఆయనకు ఇస్తున్నట్లు భారత ప్రభుత్వం 2021 జననవరిలో ప్రకటించింది.
ఆయనకు ఇచ్చిన మహావీర్ చక్ర పురస్కార ప్రశంస పత్రంలో భారత ప్రభుత్వం.. "2020 జూన్ 15న కల్నల్ సంతోష్ బాబు 16వ బిహార్ రెజిమెంట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆపరేషన్ స్నో లెపర్డ్ కింద శత్రువులను గమనించేందుకు ఒక అబ్జర్వేషన్ పోస్ట్ ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించారు. తన సైనికులకు సూచనలు ఇవ్వడం ద్వారా కల్నల్ సంతోష్ బాబు ఈ పని పూర్తి చేశారు" అని పేర్కొంది.
"తమ స్థావరాన్ని కాపాడుకునేందుకు చేసిన పోరాటంలో అతనికి శత్రువుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. శత్రువులు ప్రాణాంతక, పదునైన ఆయుధాలు ఉపయోగించారు. పైనుంచి రాళ్లు విసిరారు. శత్రు సైనికుల హింసాత్మక, దూకుడు చర్యలకు భయపడకుండా సంతోష్ బాబు తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వరిస్తూ భారత సైనికులను వెనక్కి నెట్టడాన్ని ప్రతిఘటించారు. ఈ ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చివరి శ్వాస వరకు ఆయన తన సైనికులను నడిపిస్తూనే ఉన్నారు" అని ప్రశంస పత్రంలో పేర్కొన్నారు.
సైన్యంలో చేరాలనే తన కలను తన కుమారుడి ద్వారా సాకారం చేసుకున్నానని సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ చెప్పారు.


సైనిక స్కూల్లో విద్యాభ్యాసం
సంతోష్ బాబు మరణించిన సమయంలో ఆయన కుటుంబీకులతో ‘బీబీసీ’ మాట్లాడింది. అప్పుడు ఆయన తండ్రి తమ కుటుంబం, సంతోష్ బాబుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
సంతోష్ బాబు 1983 ఫిబ్రవరి 13న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యాపేటలో(ప్రస్తుతం తెలంగాణలో ఉంది) ఉపేందర్, మంజుల దంపతులకు జన్మించారు. ఉపేందర్ మంజుల దంపతులకు ఆయనొక్కరే సంతానం. ఉపేందర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తూ రిటైర్ అయ్యారు.
సంతోష్ ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేటలో(ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉంది) ఉన్న శ్రీసరస్వతి శిశుమందిర్‌లో చదివారు.
విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.
2000 డిసెంబర్ 27న పుణే సమీపంలోని ఖడక్‌వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. దెహ్రాదూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2004లో ఆయన సైనిక జీవితం మొదలైంది. అప్పుడాయన వయసు 22 ఏళ్లు.
సైన్యంలో చేరిన తర్వాత ఆయన సంతోషిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.
"ముందు నుంచి చాలా ప్రతిభ ఉన్నవాడు. చదువులో బాగా రాణించేవాడు. ఆర్మీ ఆఫీసర్ అయినా కూడా సాఫ్ట్‌వేర్‌లో ఎక్స్‌పర్ట్. ఆర్మీలోనూ చాలా త్వరగా ప్రమోషన్స్ వచ్చాయి. నేను విద్యార్ధిగా ఉన్నప్పుడు ఆర్మీలో చేరాలనుకున్నా. అయితే కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. మా అబ్బాయి రూపంలో నా కల నెరవేరింది" అని సంతోష్ బాబు తండ్రి ఉపేందర్ చెప్పారు.

ఫొటో సోర్స్, gallantryawards.gov.in
జమ్ము కశ్మీర్‌లో తొలి పోస్టింగ్
2004లో సంతోష్‌బాబును ఇండియన్ ఆర్మీలోని 16 బిహార్ రెజిమెంట్‌కు కేటాయించారు. ఆయనకు జమ్ము కశ్మీర్‌లో తొలి పోస్టింగ్ వచ్చింది. జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌లో పని చేసిన సంతోష్ బాబు తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్నారు.
2006 డిసెంబర్ 10న కెప్టెన్‌గా ప్రమోట్ అయ్యారు. 2010 డిసెంబర్‌లో మేజర్ అయ్యారు.
16 బిహార్ రెజిమెంట్‌లో ఘాతక్ ప్లటూన్, యాంటీ ట్యాంక్ ప్లటూన్, రైఫిల్ కంపెనీ కమాండర్‌గా పని చేశారు.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు ఐక్యరాజ్య సమితి పంపిన శాంతి పరిరక్షక దళంలో సంతోష్ బాబు సేవలు అందించారు.
2019 డిసెంబర్‌లో 37 ఏళ్ల వయసులో సంతోష్ బాబుకు కల్నల్‌గా ప్రమోషన్ వచ్చింది.
ఇండియన్ ఆర్మీలో 15 ఏళ్ల కెరీర్‌లో భాగంగా కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, భారత్ -పాక్ సరిహద్దు, భారత్ – చైనా సరిహద్దుల్లో సేవలందించారు.
2007లో ఇండో -పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సమయంలో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు చొరబాటుదారులను హతమార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సైన్యంలో ఉన్నానని భయపడవద్దు’
"సైన్యంలో పని చేస్తున్నప్పటికీ సైన్యంలో లైఫ్ రిస్క్ చాలా తక్కువని మా అబ్బాయి చాలా సార్లు చెప్పాడు. నేను సైన్యంలో ఉన్నానని మీరేమీ భయపడవద్దని చెప్పేవాడు’ అన్నారు సంతోష్ బాబు తండ్రి ఉపేందర్.
‘మా వాడు చాలా సీరియస్, క్రిటికల్ ఆపరేషన్స్ చేశాడు. ఇంకా చాలా చేశాడు. దీనికి సంబందించి చీఫ్ ఆఫ్ ఆర్మీ దగ్గర రికార్డు కూడా ఉంది" అని కల్నల్ సంతోష్‌బాబు చనిపోయినప్పుడు ఆయన తండ్రి ఉపేందర్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














