‘‘అసలు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని అనుకున్నాం కానీ...’’- ఏడేళ్ల కిందట మనువు విగ్రహానికి నల్లరంగు పూసిన ఇద్దరు మహిళల కథ

రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు
ఫొటో క్యాప్షన్, కాంతాబాయ్, షీలాబాయ్
    • రచయిత, ప్రవీణ్ సింధు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''దిల్లీలో మనువాదులు 2018లో మన రాజ్యాంగాన్ని తగలబెట్టారు. ఆ సమయంలో నేను ఒకరి ఇంట్లో అంట్లు తోముతున్నా.

'దిల్లీలో మీ రాజ్యాంగం తగలబెట్టారు' అని ఆ ఇంటి యజమానురాలు నాతో చెప్పారు. నాకు ఆమెపై చాలా కోపం వచ్చింది.

''ఇది మీది కూడా. సారు క్లాస్ వన్ ఆఫీసర్. ఆయన రాజ్యాంగం మీద ఆధారపడి జీవిస్తున్నారా లేదా మనుస్మృతి మీదనా' అని నేనడిగాను. ఆలోచిస్తూ వాళ్ల ఇంటి నుంచి బయలుదేరాను"

ఇళ్లల్లో పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునే కాంతాబాయ్ అహిరే తీవ్ర భావోద్వేగంతో ఈ మాటలు చెప్పారు.

2018లో రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలో ఉన్న మనువు విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఈ కాంతాబాయే. దీని కోసం ఆమె తన స్నేహితురాలు షీలాబాయ్ పవార్‌ను వెంట తీసుకెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు

ఫొటో సోర్స్, SK

ఫొటో క్యాప్షన్, రాజస్థాన్ హైకోర్టు ప్రాంగణంలోని మనువు విగ్రహం

జైపూర్ ఎలా వెళ్లారు?

ఆ తర్వాత కాంతాబాయ్, షీలాబాయ్ ఎనిమిది రోజులు జైపూర్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. 18 రోజులపాటు జైలు జీవితం గడిపారు. ఈ సంఘటన మొత్తం ఎలా జరిగిందో వారు బీబీసీకి వివరించారు.

రిజర్వేషన్ విధానాన్ని నిరసిస్తూ దిల్లీలోని ఒక సంస్థ రాజ్యాంగ ప్రతిని దహనం చేసింది . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆజాద్ సేన అనే సంస్థ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు కనిపించాయి.

"డిసెంబరు 25న బాబాసాహెబ్ మనుస్మృతిని తగలబెట్టారని చాలా మంది చెబుతుంటారు. జైపూర్ హైకోర్టు ప్రాంగణంలో మనువు విగ్రహం ఉందని నాకు తెలిసింది. నేను అక్కడికి వెళ్లాలనుకున్నా. జాగ్రత్తగా ఆలోచించా. ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పలేదు. షీలాబాయ్‌కి ఫోన్ చేశా. ఆమెను తీసుకుని జైపూర్ వెళ్లా" అని కాంతాబాయ్ చెప్పారు.

అగరుబత్తులు తయారు చేస్తూ జీవనం సాగించే కాంతాబాయ్‌కి, సంవత్సరానికి ఆరు నెలలు కర్ణాటకలో చెరుకు పంట కోయడానికి వెళ్తూ, మిగిలిన వేళల్లో నిర్మాణ రంగంలో పనిచేసే షీలాబాయ్‌కి జైపూర్ వెళ్లడం అంత ఈజీ కాదు.

"వెళ్లే ముందు డబ్బు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. వడ్డీకి 20వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నా" అని కాంతాబాయ్ చెప్పారు.

ఛత్రపతి శంభాజీనగర్ నుంచి జైపూర్‌ దాకా సాగిన ప్రయాణాన్ని కాంతాబాయ్ వివరించారు.

"శంభాజీనగర్ నుంచి జైపూర్‌కు శనివారం రైలు ఉండేది. అప్పట్లో అది ప్రతి వారం నడిచేది. షీలాబాయ్‌తో కలిసి రైలు ఎక్కా. శనివారం బయలుదేరిన రైలు సోమవారానికి జైపూర్ చేరుకుంది. రెండు రోజులు రైలులో ఉన్నాం. జైపూర్‌లో దిగిన తర్వాత కోర్టు ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడకు వెళ్లాం’’

"మనుస్మృతి మహిళలకు వ్యతిరేకం. మేము మనువు విగ్రహాన్ని పగలగొట్టాలనుకున్నాం. కానీ అది వీలుకాలేదు. నల్లరంగు వేసిన తర్వాత మమ్మల్ని అక్కడ అడ్డుకున్నారు. 'రాజ్యాంగం వర్థిల్లాలి' అంటూ మేం నినాదాలు చేశాం. లాయర్లు, స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. మనువు మద్దతుదారులు మాపై దాడి చేశారు" అని కాంతాభాయ్ చెప్పారు.

రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు

ఫొటో సోర్స్, Shrikant Bangale

ఫొటో క్యాప్షన్, కాంతాబాయ్

'దేశానికి రాజ్యాంగం ఆధారం.. మనుస్మృతి కాదు'

"పోలీసులొచ్చారు. మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మమ్మల్ని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మేం అంబేడ్కర్ వాదులమని చెప్పాం. పోలీసులు మమ్మల్ని కొట్టారు. ఆరు రోజులు పోలీసు కస్టడీలో, 18-19 రోజులు జైలులో ఉన్నాం" అని కాంతాబాయ్ గుర్తుచేసుకున్నారు.

"జైలులో మమ్మల్ని నేల శుభ్రం చేయమని, గిన్నెలు కడగమని బలవంతపెట్టారు. అక్కడ ఉన్నంతకాలం మాతో బలవంతంగా ఆ పనులు చేయించారు" అని కాంతాబాయ్ తెలిపారు.

''పోలీసులకు, జైలుకు మేం భయపడలేదు. మా ఇళ్ల గురించి కూడా మేము ఆలోచించలేదు. మనువు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేయాలనుకున్నాం. కోర్టుకు ఒక లేఖ రాసి మనువు విగ్రహాన్ని తొలగించాలని కోరాలనుకున్నాం'' అని గుర్తుచేసుకున్నారు.

"దేశం మనుస్మృతి మీద నడవదు. రాజ్యాంగం మీద నడుస్తుంది. మరి ఈ విగ్రహం ఎందుకు?" అని కాంతాబాయ్ సూటిగా ప్రశ్నించారు.

రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు
ఫొటో క్యాప్షన్, బీఆర్ అంబేడ్కర్ మనుస్మృతిని తగలబెట్టారు.

జైపూర్ జైలు నుంచి బెయిల్‌పై ఎలా బయటకు వచ్చారు?

కాంతాబాయ్, షీలాబాయ్ జైలులో ఉన్నప్పుడు వారి తరఫున వాదించడానికి చాలామంది లాయర్లు ముందుకొచ్చారు. అయితే వాళ్లిద్దరూ చాలా రోజుల పాటు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు.

"జైపూర్ న్యాయవాది బాబులాల్ బైర్వా తాను అంబేడ్కర్ వాదినని, జై భీమ్ మద్దతుదారుణ్ణని చెప్పారు. ఆయనపై నాకు నమ్మకం కుదిరింది. ఆయన మా తరఫున వాదించడానికి ఒప్పుకున్నాం. ఆయన వాదనల తర్వాత మాకు బెయిల్ దొరికింది'' అని కాంతాబాయ్ చెప్పారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వెంటనే ఇంటికి వెళ్లడానికి కాంతాబాయ్, షీలాబాయ్ దగ్గర డబ్బులు లేవు.

జైపూర్ జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్లు అజ్మీర్ వెళ్లారు.

''జైపూర్ నుంచి ఔరంగాబాద్ (ఇప్పుడు ఛత్రపతి శంభాజీనగర్)కు రైలు లేదు. వేర్వేరు రైళ్లలో టికెట్లు కొనడానికి మా దగ్గర డబ్బులేదు. అప్పటికి బాగా ఆకలితో ఉన్నాం. ఎనిమిది రోజులు అజ్మీర్‌లో ఉండి తోటపని, హోటల్‌లో గిన్నెలు కడగడం వంటివి చేశాం. తర్వాత ఛత్రపతి శంభాజీనగర్‌కు తిరిగి వచ్చాం'' అని కాంతాబాయ్ చెప్పారు.

ఇంతటితో వాళ్ల పోరాటం ముగియలేదు.

''జైపూర్ నుంచి మేం శంభాజీనగర్‌కు వచ్చేటపప్పటికి మా కుటుంబం రోడ్డున పడింది. మనువు విగ్రహానికి మేం నల్లరంగు పూస్తున్న వీడియో వైరల్ కావడం, ఆ వార్త పత్రికల్లో రావడంతో ఇంటి యజమాని నా కుటుంబాన్ని, పిల్లలను రోడ్డున పడేశారు. ఎందుకిలా చేశారని నేను యజమానిని అడిగితే 'నువ్వు ప్రమాదకరమైన మహిళవు' అని ఆయన బదులిచ్చారు.

‘‘మీకు మనుస్మృతి అర్థమైందా? రాజ్యాంగం అర్థం కాలేదా?' అని నేను ఆయన్ను అడిగా. ఆ తర్వాత నేను కొన్ని రోజులు గైరానాలో ఉన్నా. కొన్నిరోజులు బంధువుల ఇళ్లల్లో ఉన్నా. తర్వాత ఇల్లు అద్దెకు తీసుకున్నా" అని కాంతాబాయ్ గుర్తుచేసుకున్నారు.

రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు

ఫొటో సోర్స్, Shrikant Bangale

ఫొటో క్యాప్షన్, కాంతాబాయ్ ఇల్లు

'మనువు విగ్రహాన్ని తొలగించాలి'

ఆ ఘటన జరిగి ఏడేళ్లయినప్పటికీ జైపూర్‌లోని మనువు విగ్రహం కాంతాబాయ్‌ని వెంటాడుతూనే ఉంది.

"ఓ గ్రామంలో ఉంటూ మేం మనువు విగ్రహానికి నల్లరంగు పూశాం. విద్యావంతులైన మహిళలంతా ఆ విగ్రహానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి. ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలి"

"రాజ్యాంగం వల్ల అందరూ ప్రయోజనం పొందుతారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మనం రాజ్యాంగం వల్లే జీవిస్తున్నామని గుర్తుంచుకోవాలి. గొర్రెలా జీవించడం కంటే ఒకరోజు పులిలా జీవించడం మంచిదని బాబాసాహెబ్ చెప్పారు" అని కాంతాబాయ్ అన్నారు.

ఈ ఘటన గురించి కాంతాబాయ్ స్నేహితురాలు షీలాబాయ్‌తో కూడా మాట్లాడటానికి మేం ప్రయత్నించాం. అయితే నిర్మాణ రంగంలో పనిచేసే షీలాబాయ్ ఆరు నెలలు చెరుకు నరికే పనికోసం కర్ణాటకలో ఉంటారు. దీంతో ఆమె అందుబాటులోకి రాలేదు. షీలాబాయ్ తనంత తానుగా ఈ ఘటనలో భాగమయ్యారని కాంతాబాయ్ చెప్పారు.

రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు
ఫొటో క్యాప్షన్, మనుస్మృతి

మనుస్మృతిని అంబేడ్కర్ ఎందుకు తగలబెట్టారు?

రాయ్‌గఢ్‌ జిల్లాలో ఉన్న మహద్‌లో 1927 డిసెంబరు 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేశారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ పుస్తక సంపాదకులు, భండార్కర్ ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరి నార్కే 2018లో దీనిపై బీబీసీతో మాట్లాడారు.

"బాబాసాహెబ్ 1927 డిసెంబరు 25న మహద్‌లో మనుస్మృతిని తగులబెట్టారు. ఆయన స్నేహితుడు ప్రఖ్యాత సంస్కృత పండితుడు గంగాధర్ నీలకంఠ సహస్రబుద్ధే మనుస్మృతిని తగలబెట్టాలంటూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని బాబాసాహెబ్ అమలుచేశారు'' అని డాక్టర్ హరి నార్కే తెలిపారు.

"మనువు నాలుగు వర్ణాలను ప్రశంసించాడు. నాలుగు కులాలను పవిత్రంగా ఉంచాలని మనువు బోధించాడు. అదే కుల వ్యవస్థకు దారితీసింది. మనువు కుల వ్యవస్థను సృష్టించాడని చెప్పలేకపోయినా, దానికి బీజం మనువు నాటిందే" అని డాక్టర్ అంబేడ్కర్ తన ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం పుస్తకంలో రాశారు.

తన 'హూ వర్ ది శూద్రాస్', 'అబాలిషన్ ఆఫ్ కాస్ట్' పుస్తకాలలో కూడా మనుస్మృతిని తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో అంబేడ్కర్ వివరించారు.

మహిళలు, దళితులకు సాధారణ జీవితం గడిపే హక్కు లేకపోవడం, బ్రాహ్మణుల ఆధిపత్యం సమాజంలో అనేక కులాల పుట్టుకకు దారితీసింది. ఈ కులాలు ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు వెళ్ళడానికి మెట్లు లేని బహుళ అంతస్తుల భవనం లాంటివని ఆయన అభివర్ణించారు.

"చాతుర్వర్ణాన్ని సృష్టించడం ద్వారా మనువు శ్రమ విభజన చేయలేదు. కార్మికుల విభజనను సృష్టించాడు" అని డాక్టర్ అంబేడ్కర్ అన్నారు.

విలియం జోన్స్ మనుస్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు.

"మనుస్మృతిని మొదట సవాలు చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే. వ్యవసాయ కార్మికులు, సన్నకారు రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలు, దళితుల దుస్థితిని చూసి మనుస్మృతిని ఆయన విమర్శించారు" అని రాజీవ్ లోచన్ బీబీసీతో చెప్పారు.

రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు
ఫొటో క్యాప్షన్, శంభాజీ భిడే, అంబేడ్కర్

జైపూర్‌లోని హైకోర్టులో మనువు విగ్రహాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్టించారు?

జైపూర్‌లో హైకోర్టు భవనం నిర్మించక ముందు, రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్‌లో ఉండేది. రాజస్థాన్‌లో మరో బెంచ్ కోసం డిమాండ్ ఉండేది.

ఆ సమయంలో జైపూర్‌లో కూడా కొత్త కోర్టు భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని రాజస్థాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నారాయణ్ బారెట్ చెప్పారు.

"జైపూర్ హైకోర్టు ప్రాంగణంలో మనువు విగ్రహాన్ని 1989లో నిర్మించారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కూడా రాజస్థాన్‌లో కలకలం రేగింది. సుందరీకరణ కోసం హైకోర్టు న్యాయవాదులు అప్పటి బార్ అసోసియేషన్ అధ్యక్షుని అనుమతి కోరారు. సుందరీకరణ పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో లాయర్లలో ఉన్నత కులాల వారు ఎక్కువగా ఉండేవారు. మనువు మొదట చట్టాన్ని రాశాడని చెబుతూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు" అని రాజస్థాన్‌లోని దళిత ఉద్యమ కార్యకర్త పి.ఎల్.మిత్రోత్ చెప్పారు.

"1989లో జోధ్‌పూర్‌లో హైకోర్టు సమావేశం జరిగింది. ఈ విగ్రహాన్ని 48 గంటల్లోపు తొలగించాలని ఆదేశించారు. కానీ విగ్రహం ఇప్పటికీ అలాగే ఉంది. బాబా అధవ్, కాన్షీరామ్ వంటి చాలామంది దీనికి వ్యతిరేకంగా పోరాడారు" అని మిత్రోత్ తెలిపారు.

రాజస్థాన్, రాజ్యాంగం, అంబేడ్కర్, మనుస్మృతి, మనువు
ఫొటో క్యాప్షన్, మనువు మొదట చట్టాన్ని రాశాడని చెబుతూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

మనువును, మనుస్మృతిని ఎవరు సమర్థిస్తారు?

తుకారాం, ధ్యానేశ్వర్‌ల కంటే మనువు గొప్పవాడని రైట్ వింగ్ యాక్టివిస్ట్ శంభాజీ భిడే అన్నారు. లోక సంక్షేమం కోసం మనువు ఈ పుస్తకం రాశాడని ఓ ప్రసంగంలో భిడే అన్నారు .

మనువు గొప్ప న్యాయనిపుణులు. అందుకే రాజస్థాన్ హైకోర్టు వెలుపల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

సనాతన్ సంస్థ కూడా మనుస్మృతికి మద్దతు ఇస్తుంది. "మనుస్మృతిని తగలబెట్టాలా లేక అధ్యయనం చేయాలా?" అనే పుస్తకాన్ని కూడా సనాతన్ సంస్థ వెలువరించింది. మనుస్మృతిలోని మార్గదర్శకాల ప్రకారం రాజకీయవ్యవస్థ ఉనికిలో ఉందని సనాతన్ సంస్థ పేర్కొంది.

జర్మన్ తత్వవేత్త నీట్షేపై మనుస్మృతి అపారమైన ప్రభావాన్ని చూపిందని కూడా సనాతన్ చెబుతోంది. మనుస్మృతిలో కులాల ప్రస్తావన లేదని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)