క్రిస్మస్: ‘పండక్కి గెస్ట్‌లా వచ్చిన వ్యక్తి 45 ఏళ్లపాటు మాతోనే ఉండిపోయాడు’

ఫొటో సోర్స్, Rob Parsons
- రచయిత, చార్లీ బక్‌లాండ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రిస్మస్ పండగను మానవత్వానికి, దయాగుణానికి ప్రతీకలా భావిస్తారు. అయితే, యూకేలో ఒక జంట ఈ పండగనాడు ఓ వ్యక్తిపట్ల చూపించిన కరుణ, దయ వారి జీవితాలను మార్చేసింది.
1975 డిసెంబరు 23న కార్డిఫ్‌లోని తమ ఇంట్లో రాబ్ పార్సన్స్, ఆయన భార్య డియానేలు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇంతలో ఎవరో తలుపుకొట్టిన శబ్దం.
తలుపు తీయగానే కుడిచేతిలో ఒక బ్యాగ్, ఎడం చేతిలో కోడిని పట్టుకుని ఉన్న వ్యక్తి. బ్యాగులో ఆయన సామాన్లు ఉన్నాయి.
చూడగానే ఆయనెవరో రాబ్‌కు గుర్తొచ్చింది. చిన్నప్పుడు సండే స్కూల్లో ఆయన్ను అప్పుడప్పుడు చూసేవాడు రాబ్.
అతను కొంచెం భిన్నమైన వ్యక్తని, ప్రేమగా చూసుకోవాలని స్కూల్లో చెప్పేవారు.
''రోనీ, ఈ కోడి ఎందుకు?'' అని అడిగారు రాబ్. క్రిస్మస్ కోసం ఎవరో తనకిది ఇచ్చారని రోనీ చెప్పారు. అప్పుడు తాను అన్న రెండు మాటలు తమ జీవితాలను మార్చేశాయో రాబ్ గుర్తు చేసుకున్నారు.


అప్రయత్నంగా వచ్చిన మాటలు...
‘‘రోనీని చూడగానే లోపలికి రా అన్నాను. నేనామాటలు ఎందుకు అన్నానో నాకే తెలియదు’’ అని రాబ్ చెప్పారు.
ఆ సమయంలో రాబ్ వయసు 27 ఏళ్లు. డియానే వయసు 26.
ఆటిజంతో బాధపడుతున్న రోనీకి తమ ఇంట్లో స్థానం ఇవ్వాలని వారిద్దరూ అనుకున్నారు.
రోనీ తెచ్చిన కోడిని వండారు. అతను కూడా స్నానం చేశాకా అంతా కలిసి క్రిస్మస్ జరుపుకోవాలని అనుకున్నారు.
ఆ రోజు చిన్న కారుణ్య చర్యగా మొదలైన ఆ బంధం అసాధారణమైన అనుబంధంగా మారిపోయింది. అలా ఆ ఇంట్లోకి ప్రవేశించిన రోనీ, 45 సంవత్సరాలపాటు వారితోనే ఉండిపోయారు. చనిపోయే వరకు.
ఇప్పుడు రాబ్ వయసు 77ఏళ్లు. డియానే వయసు 76 ఏళ్లు. రోనీని తమ ఇంట్లోకి ఆహ్వానించేనాటికి వారికి పెళ్లై నాలుగేళ్లే.
ఆ సమయంలో రోనీకి దాదాపు 30 ఏళ్లుంటాయి. 15 ఏళ్ల వయసు నుంచి రోనీకి ఇల్లు లేదు. కార్డిఫ్ వీధుల్లో తిరుగుతూ అప్పుడప్పుడు పనిచేస్తూ ఉండేవారు. రాబ్ అప్పుడప్పుడు తాను నడిపే యూత్ క్లబ్‌లో రోనీని చూసేవారు.
తాను ప్రేమను పొందుతున్నానన్న రోనీకి కల్పించేందుకు, క్రిస్మస్ బహుమతులు తీసుకుని రావాల్సిందిగా ఆ జంట తమ కుటుంబాన్ని కోరింది.
"ఆయన (రోనీ) క్రిస్మస్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. చుట్టూ బహుమతులు ఉన్నాయి. ఆయన ఏడవడం మొదలుపెట్టారు. ఆయనకు తన జీవితంలో ఇంత ప్రేమ ఎప్పుడూ దొరకలేదు. ఆ క్షణం అపురూపమైంది" అని డియానే గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Rob Parsons
‘నేను తప్పు చేశానా?’
క్రిస్మస్ తర్వాత మరుసటి రోజు రోనీని పంపించాలని వాళ్లనుకున్నారు. తీరా ఆ రోజు వచ్చినప్పుడు వాళ్లేమీ చెప్పలేకపోయారు.
జాబ్ కోసం రోనీకి ఒక అడ్రస్ కావాలని హోమ్‌లెస్ సెంటర్ వాళ్లు చెప్పారు.
‘‘నిజానికి అడ్రస్ కావాలంటే ఒక జాబ్ కావాలి. చాలామంది హోమ్‌లెస్ పీపుల్‌కు ఎదురయ్యే సమస్య ఇదే’’ అన్నారు రాబ్.
ఎనిమిదేళ్ల వయసులో రోనీని కేర్ హోమ్‌లో చేర్పించారు. 11 ఏళ్ల వయసులో కార్డిఫ్ నుంచి పారిపోయారు రోనీ.
రోనీ కార్డిఫ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఒక మానసిక వికలాంగుల పిల్లల పాఠశాలకు పంపారని రాబ్ తెలిసింది. రోనీ అక్కడ ఐదేళ్లున్నారు.
''అక్కడ రోనీకి తెలిసినవాళ్లెవరూ లేరు. స్నేహితులు లేరు. సోషల్ వర్కర్స్ లేరు. కనీసం తెలిసిన టీచర్లు కూడా లేరు" అని రాబ్ చెప్పారు.
"నేనేమైనా తప్పు చేశానా’’ అని రోనీ తరచుగా అడిగేవారని రాబ్ గుర్తుచేసుకున్నారు.
తన బాధాకరమైన అనుభవాల నుంచి ఆ ప్రశ్న వచ్చింది.
''15 ఏళ్ల వయసులో రోనీని కార్డిఫ్‌కు తిరిగి పంపించారు. చేతిలో ఏమీ లేకుండా'' అని ఆ జంట చెప్పింది.

ఫొటో సోర్స్, Rob and Dianne Parsons
''ఆయన నా లాయర్''
రోనీ మొదట్లో చాలా సిగ్గరి. కళ్లలోకి చూసేవాడు కాదు. చాలా తక్కువ మాట్లాడేవారు.
కానీ క్రమంగా వాళ్లు ఆయన గురించి తెలుసుకున్నారు. ఆయన్ను ఇష్టపడడం ప్రారంభించారు.
వాళ్లు ఆయనకు చెత్త సేకరించే ఉద్యోగం, కొత్త దుస్తులు ఇప్పించారు. అప్పటిదాకా స్కూల్లో ఇచ్చిన దుస్తులనే ఆయన వేసుకున్నారు.
"మాకు పిల్లలు లేరు. దీంతో మా పిల్లాడిని స్కూలుకు పంపించడానికి రెడీ చేసినట్లే అనిపించేది" అని రాబ్ తెలిపారు.
వృత్తిరీత్యా లాయర్ అయిన రాబ్, రోజూ ఉదయం ఒక గంట ముందుగానే నిద్రలేచి రోనీని పని చేసే ప్రదేశంలో దింపేవారు.
‘‘నిన్ను రోజూ ఇక్కడ దింపుతున్నది ఎవరు అని అందరూ అడుగుతున్నారు. ఆయన మా లాయర్ అని వాళ్లకు చెప్పాను’’ అని రోనీ తనతో చెప్పినట్లు వెల్లడించారు రాబ్.
"బహుశా తనను దింపడానికి ఒకరున్నారని ఆయన సంతోషంగా ఉండేవారు" అని రాబ్ అన్నారు.
ప్రతి క్రిస్మస్‌కి రోనీ నాకు మార్క్స్,స్పెన్సర్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేవారు. ఖాళీ సమయంలో ఎక్కువ భాగాన్ని స్థానిక చర్చికోసం కేటాయించారు. హోమ్‌లెస్ ప్రజల కోసం విరాళాలు సేకరించడం, ప్రార్థనా స్థలాల్లో ఏర్పాట్లు, కుర్చీలు సర్దడం వంటివి చేసేవారు.
ఒక రోజు రోనీ వేరే బూట్లతో ఇంటికి వచ్చారని డియానే గుర్తుచేసుకున్నారు.
"రోనీ, నీ బూట్లు ఏవి అని అడిగాను. హోమ్‌లెస్ వ్యక్తికి ఇచ్చాను అని చెప్పారు. ఆయన నిజంగా అద్భుతమైన వ్యక్తి’’ అని డియానే అన్నారు.

ఫొటో సోర్స్, Rob Parsons
‘‘చివరిదాకా కలిసే’’
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్‌తో డియానే అనారోగ్యానికి గురవడంతో ఆ కుటుంబానికి కష్టం వచ్చింది. చాలా రోజులు ఆమె మంచానికే పరిమితమయ్యారు.
‘‘మాకు మూడేళ్ల చిన్నమ్మాయి ఉండేది. రాబ్ ఉద్యోగానికి వెళ్లేవారు. రోనీ పిల్లలతో ఎంతో బాగుండేవారు. వాళ్లకు సీసాతో పాలు పట్టేవారు. ఇంటి పనిలో సహాయం చేసేవారు. మా అమ్మాయితో ఆడుకునేవారు’’ అని డియానే చెప్పారు.
20 ఏళ్లపాటు అతను జూదానికి బానిసగా ఉన్నప్పటికీ, రోనీ లేకుండా తమ జీవితాన్ని ఊహించుకోలేకపోయామని రాబ్, డియానే అంటున్నారు.
ఒక దశలో రోనీని వెళ్లిపొమ్మని చెప్పాలని అనుకున్నామని డియానే అన్నారు. ఆ మాట అనగానే, ‘నేను ఏదైనా తప్పు చేశానా?’ అని రోనీ అడిగారట. దానికి సమాధానంగా డియానే ఏడ్చేశారు.
కొన్ని రోజుల తర్వాత రోనీ "మన ముగ్గురం స్నేహితులమే కదా?" మనం ఎప్పుడూ కలిసి ఉంటాం కదా?" అని అడిగారు. దానికి రాబ్ ‘అవును’ అని బదులిచ్చారు.
అలా వాళ్లు వారు కలిసే ఉన్నారు.
2020లో 75 ఏళ్ల వయసులో రోనీ మరణించారు. కోవిడ్ వల్ల రోనీ అంత్యక్రియలకు 50 మంది మాత్రమే హాజరు కాగలిగారు.
"రోనీ మా జీవితాన్ని ఆనందమయం చేశారు" అని అన్నారు డియానే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














