బురఖా వేసుకోలేదని భార్యా, పిల్లల్ని చంపి ఇంట్లోనే పాతిపెట్టినట్లు భర్తపై ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images/PARAS JAIN
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బయట తలుపు దగ్గరున్న ఒక మందపాటి కర్టెన్‌ను పక్కకు జరిపి ఇంట్లోకి వెళ్లినప్పుడు, మాకు ఒక పెద్ద గొయ్యి కనిపించింది.
ఒక గదిలో పాత బెడ్ ఉంది. మరో గదిలో రెండు మంచాలు, వాటిపై దుప్పట్లు పరిచి ఉన్నాయి.
ఒక మూలన గ్యాస్ స్టవ్, దాని పక్కనే గిన్నెలు ఉన్నాయి. ఇంట్లో కిచెన్ కూడా ఇదే గదిలో ఉందని అర్ధమైంది.
ఈ ఇంటికి ఇరువైపులా పెద్ద భవనాలు ఉన్నాయి. మధ్యలో ఒక ఖాళీ స్థలం కనిపిస్తోంది. ఆ స్థలంలో ఎన్నో రోజులుగా వెలిగించని ఒక మట్టి పొయ్యి ఉంది.
డిసెంబర్ 16న ఇదే ఇంట్లో మరుగుదొడ్డికి ముందు తవ్విన గొయ్యి నుంచి మూడు మృతదేహాలను షామ్లి పోలీసులు వెలికితీశారు.


ఫొటో సోర్స్, ALTAF
తన భార్య, ఇద్దరు మైనర్ కూతుర్లను హత్య చేశారన్న ఆరోపణలపై తాహిరా భర్త ఫరూఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ హత్యాకాండ తర్వాత ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాలోని కాంద్లా ప్రాంతంలో ముస్లిం మెజార్టీ గ్రామం గఢీ దౌలత్ వెలుగులోకి వచ్చింది.
వారి చుట్టుపక్కల ఇళ్ల ప్రజలతో మాట్లాడటం, ఫరూఖ్‌ను అరెస్ట్ చేసి వాంగ్ములం తీసుకోవడం లాంటి చర్యల తర్వాత పోలీసులకు ఒక విషయం స్పష్టమైంది.
పెళ్లి తర్వాత తాహిరా జీవితం ఈ ఇంటి నాలుగు గోడల మధ్యలో బందిఖానాలా మారిపోయిందని తెలిసింది.
తానెప్పుడూ ఇంట్లోంచి బయటికి వెళ్లలేదు. తన బంధువులతో, పక్కింటివారితో లేదా పరిచయస్తులతో తనకెలాంటి కాంటాక్ట్ లేదు.
షామ్లి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నరేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. బురఖా వేసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో పుట్టింటికి వెళ్లినందుకు తన భార్యపై విపరీతమైన కోపం వచ్చిందని నిందితుడు ఫరూఖ్ చెప్పారు.
హత్యకు ప్రధాన కారణం ఇదేనని తెలిపారు.
తన భార్యతో ఎవరైనా మాట్లాడటం తన కొడుక్కి నచ్చేది కాదని ఫరూఖ్ తల్లి అస్గారి చెప్పారు. భార్యపై నిత్యం నిఘా పెట్టి ఉంచేవాడని ఆమె వెల్లడించారు.
తాహిరా, ఫరూఖ్‌కు ఐదుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు.
పెద్ద కూతురికి 14 నుంచి 15 ఏళ్లు ఉంటాయి. వారి ఐదుగురు పిల్లల్ని కూడా స్కూల్‌కుగానీ, మదర్సాకుగానీ పంపడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
ఫరూఖ్ తన భార్య తాహిరాతో పాటు, పెద్ద కూతురు, చిన్న కూతుర్లను డిసెంబర్ 9-10 తేదీల మధ్య రాత్రి చంపేసి, ఇంట్లో ఒక గుంత తవ్వి మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులు చెప్పారు.
పెద్ద కూతురు వయసు పద్నాలుగు నుంచి పదిహేను ఏళ్లు ఉండగా.. చిన్న కూతురి వయసు ఆరు నుంచి ఏడేళ్లు.
‘‘బురఖా వేసుకోకుండా తన భార్య పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ఆమె పుట్టింటికి వెళ్లడంపై తనకు కోపమొచ్చిందని ఫరూఖ్ చెప్పారు. అందుకే ఆమెని చంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు'' అని పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఫరూఖ్ మిగిలిన ముగ్గురు పిల్లలు, ఆయన కుటుంబం ఇచ్చిన సమాచారం ప్రకారం.. తాహిరాకు, ఫరూఖ్‌కు నెల కిందట ఏదో విషయంలో పెద్ద గొడవ జరిగింది. అకస్మాత్తుగా తాహిరా తన తల్లిగారింటికి వెళ్లిపోయారు. అలా వెళ్లే సమయంలో ఆమె బురఖా ధరించ లేదు.
పెళ్లయిన తర్వాత తాహిరా గడపదాటి బయటికి వెళ్లడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడటం అదే మొదటిసారి.
‘‘తాహిరా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలంటే.. ఫరూఖ్ రోజువారీ కూలీ అయినప్పటికీ, కారు బుక్ చేసేవాడు. బస్సులో అసలు ప్రయాణించలేదు. కానీ, ఆరోజు జరిగిన గొడవ తర్వాత, బురఖా వేసుకోకుండా తాహిరా ఇల్లు దాటి బయటికి వచ్చేశారు'' అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, ALTAF
భార్య తాహిరా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫరూఖ్ అసలు జీర్ణించుకోలేకపోయారని పోలీసులు చెప్పారు.
''ఫరూఖ్ పూర్తి ప్లాన్ వేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలను కొన్నారు. కూలీలను పెట్టుకుని ఇంట్లో గొయ్యి తీయించారు. ఆ తర్వాత తాహిరాను చంపాలన్న ఉద్దేశ్యంతో ఆమెను తన తల్లిదండ్రుల ఇంటి నుంచి పిలిపించారు'' అని నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
''తన భార్యను మాత్రమే చంపాలనే ఉద్దేశ్యం ఉండేదని దర్యాప్తులో ఫరూఖ్ చెప్పారు. కానీ, కూతుర్లు మధ్యలో మేల్కొనడంతో, వారిని కూడా చంపేసినట్లు చెప్పాడు'' అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వెల్లడించారు.
‘‘మూడు మృతదేహాలను ఒక గుడ్డలో చుట్టి గొయ్యిలో పూడ్చేశాడు. తర్వాత రెండు రోజులకు పైన కాంక్రీట్ ఫ్లోర్ నిర్మించారు'' అని పోలీసులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, ALTAF
ఫరూఖ్ మిగిలిన ముగ్గురు పిల్లలు పన్నెండేళ్ల కంటే తక్కువ వయసున్న వారు. రెండు మూడు రోజులుగా హోటల్ నుంచి తెచ్చిన ఫుడ్‌నే తింటున్నారు.
''అమ్మను, అక్కని, చెల్లిని నాన్న ఎక్కడికో పంపించారని పిల్లలు మాకు చెప్పారు. మేం ఫరూఖ్‌ను అడిగినప్పుడు, వారు అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలిపారు. కానీ, ఫరూఖ్ తన బట్టలకు నిప్పంటించి కాల్చేసినప్పుడు మాకు అనుమానం వచ్చింది'' అని ఫరూఖ్ తల్లి అస్గారి తెలిపారు.
ఇద్దరు మనవరాళ్లు, కోడలు కనిపించకుండా పోయిన తర్వాత, ఫరూఖ్ తండ్రి దావూద్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, కొడుకుపై అనుమానం వ్యక్తం చేశారు.
''ఫరూఖ్ తొలుత మమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూశారు. కానీ, డిసెంబర్ 16న సాయంత్రం ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంట్లో ఒక గొయ్యి నుంచి మూడు మృతదేహాలను వెలికితీశాం. ఈ హత్యలకు ఆయన వాడిన ఆయుధాన్ని, గది నుంచి ఖాళీ కాట్రిడ్జ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నాం'' అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఈ ఘటనతో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? అన్నది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో బయట పడలేదన్నారు.
ఒక హోటల్‌లో పనిచేస్తూ, సాధారణ జీవితం గడిపే ఫరూఖ్‌ను ఎవరు ప్రభావితం చేశారనే దానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
''ఎవరిపై మాకు అనుమానం లేదు. కానీ, ఫరూఖ్ ఎందుకింత రాడికలైజ్డ్‌గా (భార్య, పిల్లల్ని చంపేంత మూర్ఖపు ఆలోచనల వైపుకు) మారారు అన్నది మేం దర్యాప్తు చేస్తున్నాం'' అని నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
దర్యాప్తులో.. ఫరూఖ్ తన భార్య, పిల్లల కోసం ఆధార్ కార్డులను తీసుకోలేదని, ఎలాంటి ప్రభుత్వ పథక ప్రయోజనాలను పొందడం లేదని పోలీసులు గుర్తించారు.
''పెద్ద అమ్మాయి ఆధార్ కార్డు ఆమె చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాం. అది కూడా మేమే చేయించాం. ఫరూఖ్ ఎవరికోసం ఎలాంటి డాక్యుమెంట్‌ను తీసుకోలేదు'' అని ఫరూఖ్ తల్లి అస్గారి తెలిపారు.

ఫొటో సోర్స్, PARAS JAIN
‘‘తాహిరాను ఎవరూ ఇంటి బయట ఎప్పుడూ చూడలేదు’’
తన కోడలు తాహిరా గడపదాటి ఎప్పుడూ బయటికి రాలేదని ఫరూఖ్ తల్లి అస్గారి చెప్పారు. ఏ కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేదన్నారు.
''తన భార్యను ఎవరైనా చూడటం నా కొడుక్కి నచ్చదు. ఆమెకు కూడా తనకంటూ ఒక జీవితం ఉంది కాబట్టి మేమెప్పుడూ ఏదీ చెప్పలేదు. నా కోడలికి కూడా ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎప్పుడూ ఫిర్యాదు కూడా చేయలేదు'' అని తెలిపారు.
గత ఆరేడేళ్లలో తాహిరా ముఖాన్ని కనీసం ఒక్కసారి కూడా చూడలేదని ఫరూఖ్ సోదరి చెప్పారు.
తాహిరాను ఇంటి వెలుపలగానీ, డోరు బయటగాని, టెర్రస్ పైనగానీ, వీధి బయటగానీ ఎప్పుడూ చూడలేదని పక్కింటి వారు చెప్పారు.
''ఆమె మృతదేహాన్ని మాత్రమే మేం చూశాం. ఈ గ్రామంలో ఏ పిల్లాడిని అడిగినా, తాహిరాను ఎప్పుడూ ఇంటి బయట చూడలేదనే చెబుతారు. ఇల్లు దాటి తాహిరా ఎప్పుడూ బయటికి రాలేదు. కానీ, ఆమె పిల్లలు ఇంటి బయట ఇతర పిల్లలతో ఆడుకునేవారు'' అని పక్కింటి వారు తెలిపారు.
తాహిరా పర్దాను కచ్చితంగా పాటించేవారు. ఈ ముస్లిం మెజార్టీ గ్రామంలో ఇది అంత కచ్చితమైన సంప్రదాయం ఏమీ కాదు. చాలామంది మహిళలు బురఖా లేకుండా కూడా ఇళ్ల బయటికి వస్తుంటారు.
''బురఖా వేసుకోవాలా లేదా అన్నది మీ ఇష్టం. మేము పొలం పనులకు కూడా వెళ్తుంటాం'' అని ఒంటి మీద శాలువా కప్పుకున్న ఇద్దరు యువతులు చెప్పారు.
అయితే, ఇక్కడ కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు తక్కువ.
''కొంత వెనుకబాటుతనం ఉంది. కానీ, పిల్లలు ఇప్పుడు స్కూళ్లకు వెళ్తున్నారు. అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు'' అని తాహిరా పక్కింటి వ్యక్తి చెప్పారు.

ఫొటో సోర్స్, ALTAF
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లోని ముస్లిం మహిళల్లో బురఖా వేసుకోవడం ఒక సాధారణ సంప్రదాయం.
మహిళలు పరదా పద్ధతిలో ఉండటం గురించి ఫరూక్ పక్కింటి వారు ఒకరు మాట్లాడుతూ, '' ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది. మహిళలు గ్రామం దాటి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా బురఖా ధరిస్తారు. అయితే, బురఖా విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. చాలా మంది మహిళలు పరదాను ధరించరు. వారు పొలం పనులకు కూడా వెళ్తుంటారు. మా కుటుంబంలోనే మహిళలు పరదా పద్ధతిలో ఉండరు'' అని చెప్పారు.
ఒక పెళ్లి సమయంలో తాహిరాను పక్కనుంచి తీసిన ఒక ఫోటోను పోలీసులు గుర్తించారు.
ఈ ఒక్క ఫోటో తప్ప, తాహిరా గురించి ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు.
తాహిరా పిల్లలు కూడా ఆ ఫోటోలో ఉన్నది తమ తల్లేనని కచ్చితంగా చెప్పలేకపోయారు.
ఒక కూతురు, కొడుకు అది వారి అమ్మ ఫోటో కాదనగా, మరొక కొడుకు ఆ ఫోటో తన తల్లిదేనని అన్నారు.
ఈ ఫోటో తాహిరాదేనని, పక్కింట్లో ఒక పెళ్లికి ఆమె హాజరైనప్పుడు తీసిందని కోడలు ముఖం గుర్తుపట్టిన అస్గారి చెప్పారు.
తాహిరాకు 35 నుంచి 36 ఏళ్లు ఉంటాయి. చిన్నవయసులోనే ఆమెకు పెళ్లయింది. ఆ తర్వాత ఆమె మొత్తం జీవితం ఈ రెండు గదుల ఇంటికే పరిమితమైంది.
''తన కొడుకే తాహిరాకు, పిల్లలకు బట్టలు తీసుకొస్తాడు. ఆమె మార్కెట్‌ను ఎప్పుడూ చూడలేదు'' అని అస్గారి తెలిపారు.

ఫొటో సోర్స్, ALTAF
స్కూల్‌కు వెళ్లాలని ఉందంటున్న పిల్లలు
భార్య, ఇద్దరు మైనర్ కూతుర్లను చంపిన కారణంతో ఫరూఖ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఇప్పుడు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు.
ఫరూఖ్ పిల్లలు ఎప్పుడూ స్కూల్‌కు లేదా మదర్సాకు వెళ్లలేదు. కానీ, వారికి చదువుకోవాలనే ఆసక్తి ఉంది.
స్కూల్‌కు వెళ్లాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు, ఆమె తల ఊపింది. ఒక్కసారిగా ఆమె ముఖం వెలిగిపోయింది. అయితే, తన తల్లి గురించి ప్రస్తావిస్తే, ఆమె ముఖం మళ్లీ దిగాలుగా మారిపోయింది.
తన నాన్నమ్మ ఒడిలో కూర్చున్న ఫరూఖ్ కూతురు, ''నాకు చదువుకోవాలని ఉంది. అమ్మ నన్ను స్కూల్‌కు పంపాలనుకుంది. కానీ, నాన్న వెళ్లనిచ్చేవారు కాదు. అంకుల్ ఒకసారి నన్ను స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోమని చెప్పినప్పుడు, నాకు చాలా సంతోషం వేసింది'' అని చెప్పింది.
ఫరూఖ్ మైనర్ కొడుకుల్లో ఒకరు పనికి పోతుండగా.. మరొకరు ఇంట్లోనే ఉంటున్నారు.
''మమ్మల్ని స్కూల్‌కు పంపించాలని అమ్మ అడిగినప్పుడు, ఇంట్లో గొడవ జరిగేది'' అని పిల్లలు చెప్పారు.
స్థానిక అధికారులు పిల్లల్ని స్కూల్‌లో చేర్చడంపై చొరవ తీసుకోవాల్సి ఉంది.
''పిల్లల్ని స్కూల్‌లో చేర్చడంపై ప్రస్తుతం మేం ప్రయత్నిస్తున్నాం. వారికి అవసరమైన అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తాం. జిల్లా కలెక్టర్‌తో ఈ విషయం గురించి చర్చించాం. ఈ కోణంలో చర్యలు తీసుకోవాలని పిల్లల సంక్షేమ కమిటీని అభ్యర్థిస్తాం'' అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














