ముందు చక్రం పెద్దగా, వెనక చక్రం చిన్నగా ఉండే సైకిల్‌పై ప్రపంచ యాత్ర చేసిన సాహసి, తాజ్‌మహల్ గురించి ఏం చెప్పారంటే...

ఫొటో సోర్స్, Corbis/Getty Images
జూల్స్ వెర్న్ రాసిన అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్ అనే ప్రసిద్ధ పుస్తకం వచ్చిన పదేళ్ల తర్వాత, థామస్ స్టీవెన్స్ అనే ఓ ఇంగ్లిష్ ప్రయాణికుడు ప్రపంచమంతా తిరగాలనే లక్ష్యంతో తన ప్రయాణం మొదలుపెట్టారు.
కానీ, వెర్న్ రాసిన కథలోని పాత్ర రైలులో, ఓడలో ప్రయాణిస్తే.. థామస్ స్టీవెన్స్ మాత్రం సైకిల్ మీద ప్రపంచాన్ని చుట్టాలనుకున్నారు.
స్టీవెన్స్ ప్రయాణం 1884లో మొదలై, రెండేళ్లకుపైగా సాగింది. ఇంటికి తిరిగివచ్చాక, తను చూసిన విశేషాలన్నింటినీ కలిపి 'అరౌండ్ ద వరల్డ్ ఆన్ ఏ బైసైకిల్' అనే పేరుతో ఒక పుస్తకం రచించారు.
ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన ఈ పుస్తకంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఖండాల మీదుగా సాగిన ప్రయాణంలో తాను చూసిన ప్రతి విషయాన్ని ఆయన వివరంగా రాశారు.


ఫొటో సోర్స్, Prisma/UIG/Getty Images
తొలి అడుగు ఉత్తర అమెరికాలో...
ఇంగ్లాండ్‌లో జన్మించిన స్టీవెన్స్ 1871లో తన 17వ ఏట అమెరికాలో స్థిరపడ్డారు.
అతను పెద్ద అథ్లెట్ ఏమీ కాదు. కానీ సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో సైకిల్ తొక్కడం అనేది కేవలం ధనవంతులు సరదాగా చేసే పనిగా భావించేవారు.
''స్టీవెన్స్ ఒక మామూలు మనిషి కావడం వల్లే అంత ఫేమస్ అయ్యారు. ఒక సామాన్యుడై ఉండి కూడా, ఆగిపోకుండా ముందుకు వెళ్లే పట్టుదల, అనుకున్నది సాధించాలనే కసి అతనిలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది'' అని అమెరికాకు చెందిన రచయిత రాబర్ట్ ఐసెన్‌బర్గ్ అన్నారు.
తొలుత, స్టీవెన్స్ లక్ష్యం కేవలం ఉత్తర అమెరికా ఖండాన్ని దాటడం మాత్రమే. ఆయన శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బోస్టన్ వరకు ఐదు నెలల పాటు సైకిల్ తొక్కి ఆ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
ఈ ప్రయాణం తర్వాత, ఒక ప్రముఖ సైక్లింగ్ పత్రిక స్టీవెన్స్‌కు ఆర్థిక సహకారం (స్పాన్సర్‌షిప్) అందించింది. దీనితో తన ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
ఆయన 1884 ఏప్రిల్‌లో చికాగో నుంచి ఇంగ్లాండ్‌కు ఓడలో ప్రయాణించారు. ఐరోపా ఖండాన్ని దాటిన తర్వాత, అతను టర్కీ (నేటి తుర్కియే), ఇరాన్, భారతదేశం, చైనా, జపాన్ దేశాల గుండా సైకిల్‌పై ప్రయాణించారు.
స్టీవెన్స్ వాడిన సైకిల్ ఇప్పుడు మనం వాడే సైకిళ్లలా ఉండేదికాదు. అది 'పెన్నీ ఫార్థింగ్' అనే పాతకాలపు మోడల్. దానికి ముందు చక్రం చాలా పెద్దదిగా, వెనుక చక్రం చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా బరువుగా కూడా ఉండేది.
ఈ సైకిల్‌సై ఆయన ప్రయాణంలో తన వెంట చాలా పరిమితమైన సామాగ్రిని మాత్రమే తీసుకెళ్లినట్లు సమాచారం. కొన్ని లోదుస్తులు, ఒక తుపాకీ, డేరాగా మాదిరిగా ఉపయోగపడే 'పోంచో', ఒక అదనపు టైరు మాత్రమే వాటిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Abdullah Freres/Buyenlarge/Getty Images
ఇస్తాంబుల్ అనుభవాలు...
స్టీవెన్స్ 1885 వేసవిలో ఇస్తాంబుల్ చేరుకున్నారు. అక్కడ గలటా అనే చారిత్రక ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఆయన రంజాన్ మాసం అంతా గడిపారు.
ప్రజలు, వీధులు, వస్త్రధారణలోని వైవిధ్యతను గమనించిన ఆయన ఇస్తాంబుల్‌ను ప్రపంచంలోని 'అత్యంత వైవిధ్యభరితమైన నగరాల్లో ఒకటి' అని అభివర్ణించారు. ఆ నగరంలో ప్రకాశవంతవంతమైన రాత్రి దృశ్యాలను వివరిస్తూ, అక్కడి వీధులు కేవలం కాఫీ హౌస్‌ల వెలుతురుతోనే ప్రకాశించేవని, ప్రజలు చేతుల్లో లాంతర్లు పట్టుకుని నడిచేవారని ఆయన పేర్కొన్నారు.
ట్రామ్‌లు, ఫెర్రీలలోని ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లలో మహిళలు తమ ముసుగులను తీసేసి, స్మోకింగ్ చేయడం గురించి కూడా ఆయన రాశారు.
స్టీవెన్స్ తన సొంత ప్రయాణ ప్రణాళిక అనుభవంతో నగరాన్ని సందర్శించే వారి కోసం ఒక గైడ్ కూడా రూపొందించారు: ''ఇస్తాంబుల్‌లో మధ్యాహ్నపు షికారులో.. మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్, హగియా సోఫియా మసీదు, కాస్ట్యూమ్ మ్యూజియం, 1,001 స్తంభాలు, సుల్తాన్ మహమూద్ సమాధి, ప్రపంచ ప్రసిద్ధ గ్రాండ్ బజార్, పావురాల మసీదు, గలటా టవర్, సుల్తాన్ సులేమాన్-I సమాధి వంటివి చూడవచ్చు" అని రాశారు.
ఆయన రచనల్లో సూఫీ ధ్యాన నృత్యాల గురించి, ఇస్తాంబుల్ నగరంలోని సంపన్న కుటుంబాల నివాసాల గురించి కూడా ప్రస్తావించారు. రంజాన్ సమయంలో స్టీవెన్స్ చేసిన ఈ పర్యటనలో, ఒట్టోమన్ సామ్రాజ్యపు వాస్తుశిల్పం పట్ల ఆయనకున్న అభిమానం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మసీదు మినార్ల మధ్య చేసిన పండుగ దీపాలంకరణ ఆయనను ఎంతో ఆకట్టుకుంది.

ఫొటో సోర్స్, ullstein bild via Getty Images
సుల్తాన్ క్షణకాల దర్శనం
తుర్కియే చరిత్రలోనే అత్యంత వివాదాస్పద వ్యక్తులలో ఒకరిగా పరిగణించే సుల్తాన్ 'అబ్దుల్ హమీద్-II' సైనిక దళాన్ని కూడా స్టీవెన్స్ తన పర్యటనలో భాగంగా కలిశారు.
"సుల్తాన్ ముఖాన్ని చూడాలనుకున్న నా కోరిక తీరింది. కానీ ఆయన కేవలం ఒక్క క్షణం మాత్రమే కనిపించారు" అని స్టీవెన్స్ తన పుస్తకంలో ప్రస్తావించారు.
తుర్కియేలో పేరుగాంచిన ఇండస్ట్రియల్ ఏరియా ఇజ్మిత్ గల్ఫ్ దగ్గర తెల్లటి రంగు వేసిన ఇళ్లతో నిండిన గ్రామాలు సాయంత్రం వేళ చూడటానికి చాలా అందంగా ఉన్నాయని పేర్కొన్నారు.
సెంట్రల్ అనతోలియా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు స్టీవెన్స్‌కు ఒక కుర్దిష్ సంచార జాతికి చెందిన టెంట్లు కనిపించాయి. వారి ఆదరణ, దాతృత్వం అతనికి చాలా బాగా నచ్చాయి.
తమ శిబిరంలోకి ఆహ్వానించిన కుర్దిష్ తెగ నాయకుడిని "హుక్కా తాగే హుందా అయిన షేక్" అని స్టీవెన్స్ అభివర్ణించారు. తనకు వారు అందించిన ఆహారం గురించి, అడగకుండానే తన కోసం ఏర్పాటు చేసిన పడక గురించి కూడా ఆయన తన రచనల్లో పేర్కొన్నారు.
తుర్కియేలోని వైవిధ్యత గురించి స్టీవెన్స్ ప్రస్తావనలకు నిదర్శనంగా, ఒక ఆర్మేనియన్ పాస్టర్ ఆయన ప్రయాణ క్షేమం కోరుతూ బైబిల్‌ను కానుకగా ఇవ్వడం కూడా ఆయన ప్రయాణ వృత్తాంతంలో ఉంది.

ఫొటో సోర్స్, EDUCATION IMAGES/ GETTY IMAGES
తూర్పు వైపు ప్రయాణం...
ఇరాన్‌లో ఉన్నప్పుడు స్టీవెన్స్ నాటి రాజు (షా) నాసిర్ అల్-దిన్ ఆతిథ్యం స్వీకరించారు. టెహ్రాన్‌లో కొంతకాలం గడిపారు.
టెహ్రాన్ శివార్లలో 'జొరాస్ట్రియన్ టవర్స్ ఆఫ్ సైలెన్స్' (నిశ్శబ్ద గోపురాలు) చూసి ఆశ్చర్యపోయారు. ''అది ఒక ప్రాచీన ప్రదేశం. చనిపోయిన వారి మృతదేహాలను అక్కడ రాబందులకు వదిలేసేవారు. మృతదేహాలను భూమిలో పూడ్చితే నేల అపవిత్రం అవుతుందని వారు నమ్మేవారు'' అని తన రచనలో ప్రస్తావించారు.
జొరాస్టర్ వెలిగించిన పవిత్ర జ్వాలలు ఎప్పుడో ఆరిపోయాయి. కానీ ఇప్పుడా గోపురాలు ఒక ప్రాచీన మతం తాలూకా అవశేషాలుగా మాత్రమే మిగిలిపోయాయి'' అని ఆయన రాశారు.
తాజ్‌మహల్‌పై ప్రశంసలు
ఇరాన్ పర్యటన తర్వాత, స్టీవెన్స్ అఫ్గానిస్తాన్ వైపు బయలుదేరారు. అయితే, ఆయనకు ఆ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి లభించలేదు. అందువల్ల ఆయన కాస్పియన్ సముద్రం మీదుగా ఓడలో బాకూ (నేటి అజర్‌బైజాన్ రాజధాని) చేరుకున్నారు. అక్కడి నుంచి రైలులో ప్రస్తుత జార్జియాలోని బటుమి నగరానికి వెళ్లారు.
ఆ తర్వాత స్టీవెన్స్ ఓడలో భారత నగరమైన కోల్‌కతా చేరుకున్నారు. భారతదేశంలో తాజ్ మహల్ కట్టడాన్ని ఆయన రచనల్లో ఎంతో ప్రశంసించారు. ఇక్కడి ఎండ తీవ్రత గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, తన పర్యటనలో అప్పటివరకు చూసిన వాటిలో ఇక్కడి దృశ్యాలు, రంగులు తనకు అత్యంత ఇష్టమైనవని ఆయన పేర్కొన్నారు. తర్వాత ఆయన హాంకాంగ్ వెళ్లి, ఆపై చైనాకు చేరుకున్నారు. ఆయన ప్రయాణంలో చివరి గమ్యస్థానం జపాన్‌లోని యోకోహామా.
జపాన్‌లో స్టీవెన్స్‌కు 'మర్యాదపూర్వకమైన ప్రవర్తన', 'ఉత్సాహభరితమైన మనస్తత్వం' కలిగిన గ్రామస్థులు పరిచయమయ్యారు. 'సంతోషంగా జీవించడం ఎలా అనే సమస్యకు, ఇతర దేశాల కంటే వీరే పరిష్కారానికి అత్యంత సమీపంలో ఉన్నారు' అని ఆయన రాశారు. అలాగే, అక్కడి పిల్లలకు చదువుపై ఉన్న ఆసక్తిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు.
స్టీవెన్స్ తన ప్రయాణాన్ని 1886లో జపాన్‌లో ముగించారు.
ఈ యాత్ర మొత్తం రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు సాగింది. ఆయన లెక్క ప్రకారం, మొత్తం 13,500 మైళ్లు (22,000 కి.మీ) సైకిల్ తొక్కారు.
దీనితో ప్రపంచాన్ని సైకిల్‌పై చుట్టివచ్చిన మొదటి వ్యక్తిగా స్టీవెన్స్ గుర్తింపు పొందారు.
ఆయన తన ప్రయాణ విశేషాలను మొదట ఒక పత్రికలో ధారావాహికగా ప్రచురించారు. ఆ తర్వాత 1887లో వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చారు.

ఫొటో సోర్స్, Around the World on a Bicycle
పాశ్చాత్య ప్రభావం
స్టీవెన్స్ తాను కలిసిన కొన్ని వర్గాలను అభిమానంతో వర్ణించినప్పటికీ, అదే సమయంలో నాడు వాడుకలో ఉన్న అనేక మూస పద్ధతులను కూడా ఉపయోగించారు.
తనకు ఎదురైన ప్రజలను ఆయన తరచుగా 'పెద్దగా నాగరికత తెలియనివారు, 'అపరిశుభ్రమైన వారు' 'అజ్ఞానులు'అని వర్ణించేవారు.
వాస్తవానికి, ఆయన తుర్కియేలోని శివాస్‌ను సందర్శిస్తున్నప్పుడు ఇలా రాశారు: 'సగటు ఆర్మేనియన్ గ్రామస్థుడి మానసిక స్థితిని లోతైన, దట్టమైన అజ్ఞానం, నైతిక విషాదంగా అభివర్ణించవచ్చు.'
తుర్కియేలో స్టీవెన్స్ ప్రయాణంపై అధ్యయనం చేసిన తుర్కియే రచయిత ఐదాన్ సెలిక్ అభిప్రాయం మేరకు , ఆ కాలంలోని చాలామంది యాత్రికుల మాదిరిగానే స్టీవెన్స్ కూడా ఒక పాశ్చాత్య ధోరణి కలిగిన వ్యక్తి '. అంటే తూర్పు దేశాల సంస్కృతులను, ప్రజలను మూస ధోరణిలో చూసే వ్యక్తి."
అయితే, స్టీవెన్స్ ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ ఆయన దృక్పథం మారడం మొదలైందని రచయిత రాబర్ట్ ఐసెన్‌బర్గ్ చెప్పారు.
''నిజానికి, స్టీవెన్స్ ఒక కఠినమైన సాంస్కృతిక కోణం నుంచి మాట్లాడుతున్నారు. ఆయన వద్ద ఒక విలక్షణమైన విక్టోరియన్ కొలమానం ఉంది. కానీ ఆయన తాజ్‌మహల్‌ను చూసినప్పుడు అక్కడి వాస్తుశిల్పం, కళ ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొదటిసారిగా ఆయన దేనినీ దేనితోనూ పోల్చలేదు. ఆయన కేవలం ఆ సౌందర్యానికి మంత్రముగ్ధులైపోయారు'' అని చెప్పారు.
సైకిల్‌పై ప్రపంచ యాత్ర చేసిన మొదటి వ్యక్తి కావడంతో, స్టీవెన్స్ కథలకు ఇంగ్లాండ్, అమెరికాలో విపరీతమైన ఆదరణ లభించింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆ కాలంలో చాలా మంది అమెరికన్లు మిగిలిన ప్రపంచాన్ని చూసే విధానాన్ని ఆయన కథనాలు ప్రభావితం చేశాయి.
స్టీవెన్స్ జీవితం అమెరికాకు చెందిన యువ సాహసికులు విలియం సాచ్‌లెబెన్, థామస్ అలెన్‌లకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది, వారు కూడా సైకిల్‌పై ఇస్తాంబుల్ వరకు ప్రయాణించారు.
వీటన్నింటికీ మించి, స్టీవెన్స్ వదిలి వెళ్లిన అత్యంత ముఖ్యమైన వారసత్వం ఏమిటంటే, ద్విచక్ర వాహన ప్రయాణాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం. దీనిని ఒక రకమైన 'సైకిల్ విప్లవం'గా సెలిక్ అభివర్ణించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














