ప్రపంచంలోని టాప్ 'స్మార్టెస్ట్ సిటీస్’ ఇవే.. వీటి ప్రత్యేకతలు ఏంటంటే?

- రచయిత, లిండ్సే గాలవే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోని టాప్-10 స్మార్ట్ నగరాల్లో జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. అందుకే, ఈసారి ‘స్మార్ట్ సిటీస్ ఇండెక్స్ 2024’లో చోటు దక్కించుకున్న 5 నగరాల్లోని ప్రజలతో బీబీసీ మాట్లాడింది. అక్కడ వారి జీవితాలపై ఏయే అంశాలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుంది.
పలు అంశాల ఆధారంగా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎమ్‌డీ) స్మార్టెస్ట్ నగరాలకు వార్షిక ర్యాంకింగ్‌లను కేటాయిస్తుంది.
ఈసారి 142 నగరాల్లో నివసించే ప్రజలతో మాట్లాడి, ఆయా నగరాల్లో ఆరోగ్యం, భద్రత, మొబిలిటీ, అవకాశాలు, పాలన వంటి అంశాలపై డేటాను స్మార్ట్ సిటీస్ ఇండెక్స్ సేకరించింది.
ఆసక్తికరంగా, ఈ ఏడాది ఉత్తర అమెరికా లేదా ఆఫ్రికాలోని ఒక్క నగరం కూడా మొదటి 20 స్థానాల్లో లేదు. టాప్ 20లో మూడు నగరాలు మినహా మిగతావి యూరప్ లేదా ఆసియాలో ఉన్నాయి.
వీటిని "స్మార్ట్" నగరాలు అని ఎందుకు అంటారో, ఏయే అంశాలు అక్కడి ప్రజల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవడానికి బీబీసీ టాప్-5 నగరాల్లోని ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రపంచంలోని 10 స్మార్టెస్ట్ నగరాలు
స్మార్ట్ సిటీస్ ఇండెక్స్ 2024 ప్రకారం, ప్రపంచంలోని పది స్మార్టెస్ట్ నగరాలు:
- జ్యూరిచ్
- ఓస్లో
- కాన్‌బెర్రా
- జెనీవా
- సింగపూర్
- కోపెన్‌హాగన్
- లుసాన్
- లండన్
- హెల్సింకీ
- అబుదాబి

ఫొటో సోర్స్, Getty Images
కాన్‌బెర్రా, ఆస్ట్రేలియా
స్మార్టెస్ట్ సిటీల జాబితాలో కాన్‌బెర్రా మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా. తక్కువ వాయు కాలుష్యం, పచ్చని ప్రదేశాలు, మైనారిటీ ప్రజల్నికలుపుకుని పోవడం వంటి కారణాలతో ఎక్కువ స్కోర్ సాధించింది.
కాన్‌బెర్రాలోని వర్క్‌ఫోర్స్ కన్సల్టెన్సీ ‘బ్రాండ్ రెబెల్లియన్’ సహ వ్యవస్థాపకులు బ్రైడెన్ మాట్లాడుతూ, "ఇక్కడ ప్రజలు ఇతరులకు సహాయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ సుముఖంగా ఉంటారు. అందుకే ఈ నగరం అందరినీ స్వాగతించే ప్రదేశంగా మారింది" అని వివరించారు.
"క్లీన్ ఎనర్జీ, పునరుత్పాదక కార్యక్రమాలలో కాన్‌బెర్రా చాలా ముందుంది. 2045 నాటికి నెట్-జీరో ఉద్గారాలను సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది" అని ఆమె అన్నారు.
కాన్‌బెర్రా నగరాన్ని మరింత నివాసయోగ్యంగా, ఆకర్షణీయంగా మార్చడానికి అత్యున్నత సాంకేతికతను అమలు చేస్తున్నారు.
"స్మార్ట్ లైటింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలతో సహా నగరంలోని స్మార్ట్ సిటీ కార్యక్రమాలన్నీ సేవా రంగం సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి" అని బ్రాండ్ రెబెల్లియన్ మరో సహ వ్యవస్థాపకులు డేవిడ్ అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
సింగపూర్
ఈ సంవత్సరం ఇండెక్స్‌లో ఐదవ స్థానంలో నిలిచిన సింగపూర్ భద్రత అంశంలో ఎక్కువ స్కోర్ చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన విస్తృతమైన సీసీటీవీ వ్యవస్థ వల్ల ఇది సాధ్యమైంది. పాఠశాల విద్య, ట్రాఫిక్ పర్యవేక్షణను సులభతరం చేసే హై కనెక్టివిటీ, ప్రభుత్వ అధికారులతో సులువుగా వ్యవహరించేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ రిపోర్టింగ్, డాక్యుమెంట్ ప్రాసెసింగ్ కారణంగా ఈసారి సింగపూర్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకింది.
"ఓపెన్ డేటా, కాంటాక్ట్‌లెస్ చెల్లింపు సాంకేతికతలను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడం వల్ల సింగపూర్ ప్రజా రవాణా వ్యవస్థ చాలా మెరుగుపడింది" అని చాలా కాలంగా అక్కడ ఉంటున్న పర్సనల్ ఫైనాన్స్ రిసోర్స్ ‘డాలర్ బ్యూరో’ వ్యవస్థాపకులు ఫిరదౌస్ సియాజ్వానీ అన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సరళిని, బస్సు, రైలు షెడ్యూల్‌ను విడుదల చేస్తాయని ఆయన తెలిపారు.
ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే పరిష్కారాలను యాప్ డెవలపర్‌లు, అర్బన్ ప్లానర్‌లు సూచిస్తారని ఆయన చెప్పారు.
‘స్విస్సోటెల్ ది స్టాంఫోర్డ్’ అనే ఆక్వాఫోనిక్స్ సంస్థ, ఇక్కడ మట్టి లేకుండా మొక్కలను పెంచడాన్ని, వాటి పెంపకంలో నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, పట్టణ పరిసరాలలో ఆహార ఉత్పత్తి కోసం స్మార్ట్ నగరాలు ఎలాంటి వినూత్న పరిష్కారాలను అందిస్తాయి అనే దానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

ఫొటో సోర్స్, Alamy
లుసాన్, స్విట్జర్లాండ్
ఈ జాబితాలో స్విట్జర్లాండ్‌కు చెందిన మూడు నగరాలు టాప్-10లో నిలిచాయి. జ్యూరిచ్ తొలి స్థానాన్ని, జెనీవా నాలుగో స్థానాన్ని దక్కించుకోగా కేవలం లక్షన్నర జనాభా కలిగిన చిన్న నగరమైన లుసాన్ ఏడో స్థానాన్ని దక్కించుకుంది.
"నాకు లుసాన్‌లో నివసించడం చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న నగరమైనా ఇక్కడ పెద్ద పట్టణంలోని ఉండేటువంటి అన్ని సౌకర్యాలూ ఉన్నాయి" అని లుసాన్ టూరిజంలో పీఆర్ మేనేజర్‌గా పని చేస్తున్న ఒలివియా బోషార్ట్ అన్నారు.
"ఇక్కడంతా కాలినడకనే చుట్టేయవచ్చు. స్టేషన్ నుంచి జెనీవా సరస్సుకు, సిటీ సెంటర్‌కు కేవలం 15 నిమిషాలు పడుతుంది" అని బోషార్ట్ చెప్పారు.
ఈ నగరంలో 360 హెక్టార్ల పచ్చదనం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం 1,400 కంటే ఎక్కువ కొత్త మొక్కలను నాటుతారు. ఉద్యానవనాలు, పచ్చని ప్రదేశాలను విస్తృతంగా పెంచుతారు.

ఫొటో సోర్స్, Getty Images
లండన్, యూకే
ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. నిరుటి కంటే ర్యాంకింగ్‌లో రెండు స్థానాలు దిగజారింది. రవాణా బుకింగ్, సులభంగా యాక్సెస్ చేయగల వైఫైతో సహా ఆన్‌లైన్ సేవల సౌలభ్యం రీత్యా లండన్ మంచి ర్యాంక్‌లో కొనసాగుతోంది.
"ట్యూబ్, బస్సులు, పడవలు, బైక్‌లు, స్కూటర్‌ల వంటి ట్రావెల్ స్కీమ్‌లతో కూడిన రవాణా సౌకర్యాలతో పాటు రెస్టారెంట్‌లు, పబ్‌లు, నైట్ లైఫ్, కచేరీలు, వీటన్నింటితో కూడిన లండన్ ఒక ఆహ్లాదకర ప్రదేశం" అని ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పని చేసిన ఎమ్మా ఓర్ అన్నారు.
సుస్థిరతను సాధించడం కోసం నగరంలో కొన్నేళ్లుగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఓర్ చెప్పారు.
"నగరం అంతటా స్మార్ట్ గ్రిడ్‌లు, పునరుత్పాదక శక్తి వాడకం పెరుగుతోంది. లండన్ 'క్లీన్ సిటీ'గా మారేందుకు కట్టుబడి ఉంది. 2041 నాటికి లండన్‌లో 80% ప్రయాణాలు నడక, సైక్లింగ్, ప్రజారవాణా ద్వారానే జరగాలని లక్ష్యాలను నిర్దేశించుకుంది’’ అని ఓర్ వివరించారు.

ఫొటో సోర్స్, Alamy
అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఈ ఏడాది రేటింగ్స్‌లో అబుదాబి మూడు స్థానాలు ఎగబాకి జాబితాలో 10వ స్థానానికి చేరింది. రవాణా, ఆన్‌లైన్ బుకింగ్, నగరంలోని అత్యంత పేద ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం, పాఠశాలల్లో డిజిటల్ నైపుణ్యాల బోధన, వివిధ జాతుల ప్రజలను స్వాగతించే ప్రదేశంగా ఈ నగరం ఎక్కువ మార్కులు సంపాదించింది.
"నగరంలో వాహనాల చార్జింగ్‌కు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం, స్వతంత్రంగా డ్రైవింగ్ చేసుకునే విధానాలు ప్రయాణాన్ని సాఫీగా, సమర్ధవంతంగా మారుస్తాయి" అని అబుదాబి నివాసి, ఏఐ టూల్ ప్రాంప్ట్ వైబ్స్ వ్యవస్థాపకుడు ధన్విన్ శ్రీరామ్ అన్నారు.
స్థిరమైన పట్టణ అభివృద్ధికి నమూనాగా అబుదాబిలో మస్దర్ సిటీని కొత్తగా ప్లాన్ చేస్తున్నారని ఆయన తెలిపారు. "సాంప్రదాయ అరబ్ ఆర్కిటెక్చర్‌ను ఆధునిక సాంకేతికతతో మిళితం చేసి దానిని డిజైన్ చేశారు. దాని వల్ల వేసవి నెలల్లోనూ వాతావరణం చల్లగా ఉంటుంది" అని ఆయన చెప్పారు.
మస్దర్ సిటీలోని అన్ని భవనాలు విద్యుత్, నీటి వినియోగాన్ని కనీసం 40% తగ్గించేలా రూపొందించారు. ఈ ప్రాంతాన్ని 40,000 మంది నివాసితులకు సరిపోయేంతగా తీర్చిదిద్దుతున్నారు.
(‘లివింగ్ ఇన్’ అనేది బీబీసీ ట్రావెల్‌లోని ఒక సిరీస్. ఇది ప్రపంచంలోని కొన్ని ప్రముఖ నగరాలలో నివసించడం గురించి పరిశోధిస్తుంది)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














