బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య తగ్గుతున్న దూరం భారత్‌కు ఎంత ఆందోళనకరం?

ఫొటో సోర్స్, @ChiefAdviserGoB
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు.
బంగ్లాదేశ్‌ను గుర్తించకపోవడంతో పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికార్ అలీ భుట్టోతో మాట్లాడేందుకు షేక్ ముజిబుర్ రెహమాన్ నిరాకరించారు.
పాకిస్తాన్ మొదట బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని తిరస్కరించింది.
తర్వాతి రోజుల్లో పాకిస్తాన్ వైఖరి మారింది.
1974 ఫిబ్రవరిలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ సమ్మిట్ లాహోర్‌లో జరిగింది.
జుల్ఫికార్ అలీ భుట్టో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు.
ముజిబుర్ రెహమాన్‌కు అధికారిక ఆహ్వానాన్ని పంపించారు. ముజిబ్ మొదట హాజరు కావడానికి నిరాకరించినా తరువాత అంగీకరించారు.
పాకిస్తాన్ 1974 ఫిబ్రవరి 22న బంగ్లాదేశ్‌ను గుర్తించింది. భుట్టో ఈ గుర్తింపును ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్’లో ప్రకటించారు.
"అల్లా కోసం మా దేశ పౌరుల తరఫున మేం బంగ్లాదేశ్‌ను దేశంగా గుర్తిస్తున్నాం. రేపు ఒక ప్రతినిధి బృందం వస్తుంది. 7 కోట్ల మంది ముస్లింల తరఫున మేం వారిని ఆలింగనం చేసుకుంటాం" అని జుల్ఫికార్ అలీ భుట్టో అన్నారు.
అయినప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిస్థాయిలో దారినపడలేదు.
కానీ, ఇప్పుడు సుమారు 52 ఏళ్ల తరువాత రెండు దేశాల మధ్య పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి.
షేక్ హసీనా అధికారం కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య చారిత్రక దూరం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.


ఫొటో సోర్స్, @ChiefAdviserGoB
భారత్‌తో ఉద్రిక్తత, పాక్‌పై సానుభూతి
బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు ఉస్మాన్ హాదీ డిసెంబర్ 18న మరణించారు.
డిసెంబర్ 12న ఢాకాలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.
గతవారం.. బంగ్లాదేశ్‌లో ఫ్యాక్టరీ కార్మికుడైన హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపింది.
ఈ సంఘటన తర్వాత భారత్- బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది. ఆ తర్వాతి పరిణామాలతో రెండు దేశాల మధ్య వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
డిసెంబర్ 20న, పాకిస్తాన్ జమాత్ ఏ ఇస్లామీ మాజీ అధ్యక్షుడు అమీర్ సిరాజ్-ఉల్ హక్ బంగ్లాదేశ్ యువతను ప్రశంసిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు.
"బంగ్లాదేశ్‌లోని విద్యావంతులు, ధైర్యవంతులైన యువత అఖండ భారత్ అనే ఆలోచనను ధ్వంసం చేసింది. భారత్ ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టిస్తోంది. కెనడా, పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్‌లో భారత్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, హత్యలు చేస్తోందనే ఆరోపణలు వచ్చాయి" అని ఆయన అందులో రాశారు.
ఉస్మాన్ హాదీ హంతకులు భారత్‌లో తలదాచుకున్నారని బంగ్లాదేశ్‌లోని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి.
అయితే దీనిపై బంగ్లాదేశ్ పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అయితే రెండు దేశాల్లోనూ సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న వదంతులు భారత్- బంగ్లా మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి.
బంగ్లాదేశ్‌లోని భారత్ దౌత్య కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
హిందూ యువకుడి హత్యను నిరసిస్తూ దిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన జరిగింది.

ఫొటో సోర్స్, @ChiefAdviserGoB
పాక్- బంగ్లా స్నేహ గీతం
భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ డిసెంబర్ 17న స్పందించింది
"బంగ్లాదేశ్‌లో ఇటీవలి కొన్ని సంఘటనలకు సంబంధించి ఛాందసవాద శక్తులు చేసిన తప్పుడు వాదనలను మేం తిరస్కరిస్తున్నాం. అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టకపోవడం లేదా భారతదేశంతో ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను పంచుకోకపోవడం దురదృష్టకరం" అని తన ప్రకటనలో పేర్కొంది.
గతేడాది ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ వచ్చినప్పటి నుంచి పాక్- బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగవడం మొదలైంది.
పాక్- బంగ్లాదేశ్ మధ్య దూరం నిరంతరం తగ్గుతున్నట్లు కనిపించే అనేక సంఘటనలు జరిగాయి.
1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత నిరుడు నవంబర్‌లో పాక్- బంగ్లా మధ్య తొలిసారి నేరుగా సముద్ర వాణిజ్యం జరిగింది.
గతంలో రెండు దేశాల మధ్య సముద్ర వాణిజ్యం సింగపుర్ లేదా కొలంబో ద్వారా జరిగేది.
"పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు నేరుగా కార్గో నౌక చేరుకోవడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది కీలకమైన ముందడుగు" అని బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హై కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ నిరుడు నవంబర్ 6న "పాకిస్తాన్‌లోని బంగ్లాదేశ్ పౌరులకు ఉచితంగా వీసాలు ఇస్తాం. వారి వీసా దరఖాస్తులపై 48 గంటల్లోపు నిర్ణయం తీసుకుంటాం. వారు చేయాల్సిందల్లా వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందించడమే. వీసాలలో వ్యాపార, పర్యటక వీసాలున్నాయి. టూరిస్టు వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు రిటర్న్ టికెట్, వసతి గురించి సమాచారం అందిస్తే చాలు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, @ChiefAdviserGoB
ప్రధాన స్రవంతిలోకి జమాత్ ఏ ఇస్లామీ
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాదేశ్ జమాత్ ఏ ఇస్లామీ కీలకమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది.
పాకిస్తాన్ జమాత్ ఏ ఇస్లామీ, బంగ్లాదేశ్ జమాత్ ఏ ఇస్లామీ మధ్య సైద్ధాంతిక సారూప్యత ఉంది.
బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్ పాత్రను జమాత్ ఏ ఇస్లామీ ప్రశ్నిస్తోంది.
షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత ఢాకాలోని బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి చెందిన చారిత్రక వారసత్వంపై దాడులు, విధ్వంసం జరిగాయి.
బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై దాడి జరిగింది.
ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి బంగ్లాదేశ్ జమాత్ ఏ ఇస్లామీ మద్దతు ఇస్తోంది.
"1971లో మా వైఖరి సూత్రప్రాయంగా ఉంది. భారత్ ప్రయోజనాల కోసం మేం స్వాతంత్ర్యం కోరుకోలేదు. పాకిస్తాన్ మాకు ఓటుహక్కు కల్పించాలని కోరుకున్నాం. అలా జరిగి ఉండకపోతే చాలా దేశాల మాదిరే గెరిల్లా యుద్ధంతో స్వాతంత్ర్యం సిద్ధించేది" అని 2025 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ వార్తా వెబ్‌సైట్ ప్రథమ్ అలోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ జమాత్ ఏ ఇస్లామీ చీఫ్ షఫీకుర్ రెహమాన్ చెప్పారు.
"మనం ఎవరి ద్వారా అయినా స్వాతంత్ర్యం పొందితే, లేదంటే ఎవరి తరఫునైనా స్వాతంత్ర్యం పొందితే అది ఒక భారాన్ని వదిలించుకుంటూ మరో భారాన్ని మోయడం ప్రారంభించినట్లవుతుంది. 53 ఏళ్లుగా బంగ్లాదేశ్ విషయంలో ఇది నిజం కాదా? ఒక పార్టీని ఇష్టపడని దేశం మాట మేమెందుకు వినాలి? ఆ దేశం కోరుకోక పోతే మేం అధికారంలోకి రాకూడదా? ఒక స్వతంత్ర దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండాలా? ఇదంతా వినడానికి ఇకపై బంగ్లాదేశ్ యువత ఏ మాత్రం సిద్ధంగా లేదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @sajeebwazed
భారత్‌కు ఇబ్బందేనా ?
"ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రయత్నిస్తోంది" అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజీద్ జాయ్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఈ మెయిల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల వల్ల భారత్‌కు ముప్పు పెరగవచ్చని ఆయన అన్నారు. 54 ఏళ్ల వాజీద్ అమెరికాలో నివసిస్తున్నారు.
"ఇది భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. అవామీ లీగ్ ప్రభుత్వం భారతదేశ తూర్పు సరిహద్దులను అన్ని ఉగ్రవాద కార్యకలాపాల నుంచి సురక్షితంగా ఉంచింది. అంతకుముందు భారత్‌లో తిరుగుబాటుకు బంగ్లాదేశ్ స్థావరంగా ఉండేది" అని వాజీద్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
"ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ వస్తుంది. యూనస్ ప్రభుత్వం జమాత్ ఏ ఇస్లామీ, ఇతర ఇస్లామిస్ట్ పార్టీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇస్లామిస్ట్ పార్టీలకు ఏ ఎన్నికల్లోనూ 5 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ప్రగతిశీల, ఉదారవాద పార్టీలను నిషేధించి, ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి ఇస్లామిక్ ఛాందసవాదులను అధికారంలో తేవాలని యూనస్ ప్రయత్నిస్తున్నారు" అని వాజీద్ ఆరోపించారు.
"ప్రజాస్వామ్య వైఫల్యం, అన్యాయమైన పాలనకు వ్యతిరేకంగా జూలై ఉద్యమం పుట్టింది. అయితే విముక్తి పోరాట వ్యతిరేకులు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశారా?" అని
‘సెంటర్ ఫర్ పాలసీ డైలాగ్’ వ్యవస్థాపకుడు రెహమాన్ సోభాన్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన ‘ప్రథమ్ ఆలో’ వార్తా వెబ్ సైట్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా ఆయన.. ‘ప్రజాస్వామ్య వైఫల్యం, అన్యాయమైన పాలన కారణంగా ప్రేరేపితమై జులై ఉద్యమం జరిగింది. కానీ, విముక్తి పోరాట వ్యతిరేకులు దాన్ని వాడుకున్నారు’ అని చెప్పారు.
‘బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని వ్యతిరేకించేవారు చాలాకాలంగా దేశ రాజకీయాల్లో ఉన్నారు. వాళ్లు ఉద్యమంలోకి చొరబడి దాని దిశను రూపొందించడంలో కీలకపాత్ర పోషించి ఉండవచ్చు. నిరంకుశ పాలనలకు వ్యతిరేకంగా జరిగే సామూహిక తిరుగుబాట్లలో ఇలాంటివి కనిపిస్తాయి" అని ఆయన అన్నారు.
"బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో వారి ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో వారి అవకాశాలు బలంగా ఉన్నాయి. 1971లో పాకిస్తాన్ సైన్యానికి మిత్రులుగా వారు పోషించిన పాత్రను మార్చి చూపడానికి వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు" అని రెహమాన్ సోభాన్ అన్నారు.

ఫొటో సోర్స్, @narendramodi
"ఈ పరిస్థితి పాకిస్తాన్, చైనాలకు అనుకూలం"
భారత్ - బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు భారత్ భద్రతపై ప్రభావం చూపుతాయని శివ్‌నాడార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ హేపీమోన్ జాకబ్ డిసెంబర్ 22న ఆంగ్ల వార్తాపత్రిక ‘హిందూస్తాన్ టైమ్స్’లో రాశారు.
"బంగ్లాదేశ్‌తో వేగంగా క్షీణిస్తున్న సంబంధాలు భారతదేశానికి మూడు వైపులా సవాలును విసురుతున్నాయి. 4వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో చొరబాటు ముప్పు పెరుగుతుంది. భారత వ్యతిరేక శక్తులు సరిహద్దు వెంబడి స్థావరాలను ఏర్పాటు చేసుకునే ప్రమాదం ఉంది" అని జాకబ్ రాశారు.
"భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలను పాకిస్తాన్, చైనా ఆసరాగా చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ జోక్యం పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో చైనాలోని కున్మింగ్‌లో చైనా ఉప విదేశాంగ మంత్రి సున్ వీడాంగ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశం భారతదేశానికి ఆందోళనకర సూచన. దీని తర్వాత 2024 చివరిలో పాకిస్తాన్ నేవీకి చెందిన నౌక చిట్టగాంగ్ పోర్టుకు వచ్చింది. ముహమ్మద్ యూనస్ ప్రభత్వం చైనాతో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది" అని ఆయన తన కథనంలో రాశారు.
"ఏ కోణం నుంచి చూసినా, ప్రస్తుత పరిస్థితి భారతదేశానికి ఉపయోగకరంగా లేదు. ఈ ఉద్రిక్తత బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను మరింత దెబ్బతీస్తుంది. భారతదేశంతో పేలవమైన సంబంధాలు బంగ్లాదేశ్‌కు మరింత హాని కలిగిస్తాయని భావించడం తప్పుడు అంచనా కావచ్చు" హేపీమోన్ జాకబ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, భారతదేశం విధానాలు కూడా దిగజారుతున్న సంబంధాలకు కారణమని బంగ్లాదేశ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢాకాలోని ప్రముఖ ఆంగ్ల భాషా వార్తాపత్రిక ది డైలీ స్టార్ డిసెంబర్ 22న రెండు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై సంపాదకీయం ప్రచురించింది.
"షేక్‌హాసీనాకు భారత్ మద్దతివ్వడంతో రెండు దేశాల సంబంధాలు బలంగా ఉన్నాయి. అయితే ఇప్పుడామె అధికారం కోల్పోయారు. ఆమె పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల సంబంధాలు మరింత దిగజారుతున్నాయి" అని డైలీ స్టార్ రాసింది.
షేక్ హసీనా 2024 ఆగస్టు నుంచి భారతదేశంలో నివసిస్తున్నారు. హసీనాకు బంగ్లాదేశ్‌లో మరణశిక్ష విధించారు.
షేక్ హసీనాను అప్పగించాలని భారతదేశాన్ని బంగ్లాదేశ్‌లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కోరుతోంది.
కానీ భారత ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరించలేదు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పదేపదే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














