సేలం: ఏమిటీ 220 అడుగుల'అంటరాని గోడ’ వివాదం, అసలేం జరిగింది?

- రచయిత, పి. శివ సుబ్రమణ్యం
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఒమలూరు తాలుకాలోని తోలసంపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓలైపట్టి గ్రామం ఉంది. ఈ ఊళ్లో ఓ వ్యక్తి తన సొంత భూమిలో 10 అడుగుల ఎత్తుతో 220 అడుగుల పొడవున్న భారీ కాంక్రీట్ గోడ నిర్మించారు.
ఇది అంటరాని గోడ అని షెడ్యూల్డ్ కులాల వారు ఆరోపిస్తుంటే, పశువుల పెంపకం కోసం నిర్మించిన రక్షణ గోడ అని స్థల యజమాని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు బీబీసీ స్వయంగా ఓలైపట్టి వెళ్లింది.
వెయ్యి ఇళ్లు ఉన్న ఓలైపట్టిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుటుంబాలు వంద కంటే తక్కువ. 40 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వారికి ఇళ్ల నిర్మాణం కోసం గ్రామానికి తూర్పున 1.98 ఎకరాల భూమిని కేటాయించింది. మూడు వీధులు ఉన్న ఈ ప్రాంతంలో నలభై కుటుంబాలు నివసిస్తున్నాయి.
షెడ్యూల్ కులాలకు చెందిన వారి ఇళ్ల వెనుక చంద్రశేఖర్‌కు చెందిన ఎకరం భూమి, దానికి కుడి వైపున పళణిస్వామికి చెందిన ఎకరం భూమి ఉంది.
రెండేళ్ల క్రితం కుడి వైపున భూమిని కొనుగోలు చేసిన పళనిస్వామి, అక్కడ పశువుల కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆ భూమిలో షెడ్యూల్డ్ కమ్యూనిటీ నివాసానికి, తన భూమికి మధ్య భారీ గోడను నిర్మించారు.


గాలి రాకుండా చేస్తే ఎలా?
"అంత పెద్ద గోడ కట్టకండి. మా ఇళ్లకు కూడా గాలి రాదు. సాధారణ చుట్టుకొలత గోడల మాదిరిగా 5 లేదా 6 అడుగుల ఎత్తు గోడ నిర్మించి, దానిపై వైర్ మెష్ వేయమని మేం వారికి చెప్పాం" అని రిటైర్డ్ హెల్త్ వర్కర్ థానమ్ చెప్పారు.
"వాళ్లు వాస్తు ప్రకారం పది అడుగుల ఎత్తులో గోడ నిర్మించారు. భూమికి రెండు వైపులా వైరుతో కంచె వేసిన పళణిస్వామి, షెడ్యూల్డ్ కులాల ప్రజలు నివసించే ప్రాంతం వైపు మాత్రమే గోడ నిర్మించారు. ఇది మమ్మల్ని అవమానించే చర్యగా భావిస్తున్నాం" అని ఆమె చెప్పారు.

'వ్యవసాయ భూమిలో చెత్త వేస్తున్నారు'
భారీ గోడ నిర్మించిన భూ యజమాని పళనిస్వామితో మేం మాట్లాడాం. అంత పెద్ద ఎత్తున గోడ ఎందుకు కట్టారని అడిగాం.
"నా ఇద్దరు కుమారుల కోసం ఒక వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టాను.ఆ పక్కన నివసించే ప్రజలు నాప్‌కిన్లు, ఖాళీ సీసాలు,ఇళ్లలోని చెత్త ఇలా అన్ని రకాల చెత్తను మా పంటభూమిలో వేస్తున్నారు. పంట కోత సమయంలో ఆ చెత్తను శుభ్రం చేయడం పెద్ద సమస్యగా మారుతోంది."
"పశువుల ఫారం ఏర్పాటు చేయడానికి, పశువుల మేతను దంచే యంత్రాన్ని పెట్టేందుకు బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేశాం. మేత దంచే సమయంలో వచ్చే పొట్టు, దుమ్ము నివాస ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. అలాగే అటు వైపు నుంచి ఇటువైపు చెత్త రాకూడదు. ఈ కారణంగానే ఎత్తైన గోడను నిర్మించాం. దీని వెనుక ఎలాంటి కులపరమైన ఉద్దేశం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
"పని మొదలైన వెంటనే సెల్వన్ అనే యువకుడు నలుగురైదుగురుతో వచ్చి ఈ విషయాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ పలువురికి ఫిర్యాదులు పంపారు. పోలీసులు, తహసీల్దార్ సహా అనేక మంది అధికారులు వచ్చి భూమిని కొలిచి పరిశీలించారు.
"ఆ తర్వాత మా భూమిలో గోడ కట్టుకోవచ్చని వారే చెప్పారు. ఇలాంటి అడ్డంకుల వల్ల ఒక నెలలో పూర్తవాల్సిన పని ఏడాదిపాటు ఆలస్యమైంది. ఇప్పుడు తనిఖీకి వచ్చిన బ్యాంకు అధికారులు సమస్యాత్మక ప్రాంతంలో పశువుల ఫారం ఏర్పాటు చేయడానికి రుణం ఇవ్వలేమంటున్నారు" అని పళనిస్వామి చెప్పారు.

ఈ అంశంపై సెల్వం మాట్లాడుతూ, "మా గ్రామంలో ప్రజలకు సరైన అవగాహన లేదు. చదువుకున్న యువత అంతా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిపోయారు. పది అడుగుల ఎత్తులో గోడ కడతామని చెప్పినప్పుడు, ఈ గోడ మా ప్రజలను వేరు చేసినట్లుగా ఉంటుందని చెప్పాను" అన్నారు.
భవిష్యత్తులో ఆ గోడ కూలితే దాని ప్రభావం మా ప్రాంత ప్రజలపైనే పడుతుందన్న భయాన్ని వ్యక్తం చేసిన ఆయన, గోడను నాలుగు అడుగుల ఎత్తులో కట్టి, పైభాగంలో వైర్ మెష్ వేయాలని అధికారులకు సూచించానని తెలిపారు.
"మండనాళ్ల సరస్సును సందర్శించడానికి వచ్చిన పర్యాటక మంత్రి రాజేంద్రన్ కారును ఆపి, ఈ అంటరాని గోడను ఆయనకు చూపించాను. అప్పటికి గోడ ఆరు అడుగుల ఎత్తులో ఉంది. దీనికంటే ఎక్కువ ఎత్తులో కట్టవద్దని మంత్రి చెప్పి వెళ్లారు. అయినప్పటికీ అధికారులు గోడను మరింత ఎత్తుగా నిర్మించేందుకు అనుమతించారు" అని సెల్వం తెలిపారు.

'ఇది అంటరాని గోడే'
"గోడ అనేది విభజనకు ప్రతీక. నివాస ప్రాంతాల పక్కన కర్మాగారాలు లేదా వాణిజ్య సంస్థలు ఉంటే భద్రత కోసం ఎత్తైన గోడలు నిర్మించవచ్చు. కానీ ఇది వ్యవసాయ భూమి" అన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట నిర్వాహక కార్యదర్శి వతియార్ అలియాస్ అంబేడ్కర్.
"అంతేకాదు, మిగతా రెండు వైపులా ఇనుప కంచె వేశారు. ఒక వైపు మాత్రం ఎలాంటి అడ్డంకి లేదు. షెడ్యూల్డ్ కులాల ప్రజలు నివసించే ప్రాంతం వైపే గోడ నిర్మించారు. అందుకే ఇది అంటరానితనపు గోడ," అని ఆయన చెప్పారు .
"జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని సరైన కోణంలో చూడటం లేదు. ఈ అంటరాని గోడపై సంబంధిత అధికారులందరికీ ఫిర్యాదు పంపాం. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు రేఖా ప్రియదర్శిని, మంత్రి మాథివేంద్రన్ తదితరులు స్వయంగా వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి" అని డిమాండ్ చేశారు.
"సేలం జిల్లాలో గత ఐదేళ్లుగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీనే ఏర్పాటు కాలేదు. దీనివల్ల అనేక చోట్ల జరుగుతున్న వివక్షాపూరిత ఘటనలు ప్రభుత్వ దృష్టికి రావడం లేదు. ఈ గోడపై నా ఫిర్యాదుకు 30 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే, తదుపరి కార్యాచరణకు దిగుతాను," అని వతియార్ హెచ్చరించారు.
ఈ అంశంపై ఓమలూరు తాలూకా అధికారి రవికుమార్ మాట్లాడుతూ, "ఒలైపట్టిలో అంటరానితనపు గోడ నిర్మిస్తున్నారన్న ఫిర్యాదు మాకు అందింది. పోలీసులను తీసుకుని స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి దర్యాప్తు చేశాం. ఈ గోడ వల్ల షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఉపయోగించే మార్గం లేదా వారి వినియోగ ప్రదేశాలకు ఎలాంటి ఆటంకం లేదు" అని తెలిపారు.
అలాగే, "ఈ గోడ ప్రైవేటు వ్యక్తికి చెందిన భూమిలో నిర్మించారు. ప్రజలు ఉపయోగించే రహదారి వెంబడి ఒక మీటరు ఖాళీ వదిలి గోడ కట్టారు " అని వివరించారు.
"ప్రైవేటు భూమిలో గోడ నిర్మాణాన్ని ఆపే అధికారం నాకు లేదు. దీనిని అంటరాని గోడగా పరిగణించలేం. అవసరమైతే కోర్టును ఆశ్రయించి పరిష్కారం పొందాలని వారికి సూచించాం" అని రవికుమార్ చెప్పారు.
‘వేరు చేసినట్టే భావిస్తారు’
"గోడ నిర్మిస్తున్న ప్రదేశం ప్రైవేటు వ్యక్తికి చెందినదే. అక్కడ గోడ కట్టొద్దని షెడ్యూల్డ్ కులాల ప్రజలు అనలేదు. కేవలం ఐదు అడుగుల ఎత్తులో గోడ కట్టాలని మాత్రమే కోరారు. పది అడుగుల ఎత్తులో గోడ నిర్మించడమే అంటరాని సమస్యగా మారుతోంది" అన్నారు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ–ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు దినకరన్.
జిల్లా అధికారులు ఇరు పక్షాలను పిలిచి, ప్రైవేటు భూమిలో చెత్త వేయకూడదని, అవసరం లేనంత ఎత్తులో గోడలు నిర్మించకూడదని స్నేహపూర్వకంగా ఒప్పందం కుదుర్చి ఉండాల్సిందని దినకరన్ అభిప్రాయపడ్డారు.
"అలా జరిగి ఉంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు ఉండేది కాదు. ప్రస్తుత పరిస్థితిలో ఆ గోడ పక్కన నివసిస్తున్న ప్రజలు తమను సమాజం నుంచి వేరుచేసినవారుగా భావిస్తూ జీవించాల్సి వస్తోంది. బయట ప్రపంచం కూడా వారిని అలా చూసే ప్రమాదం ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














