మధ్యప్రదేశ్: దళిత యువకుడితో మూత్రం తాగించారంటూ ఆరోపణలు, ఇలాంటి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, Saurabh Jatav
- రచయిత, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
(గమనిక: ఈ కథనంలో కొన్ని వివరణలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
''వాళ్లు నన్ను తుపాకీతో బెదిరించి కారు ఎక్కించారు . బాగా కొట్టారు. బలవంతంగా బాటిల్‌లోని మూత్రం తాగించారు. నేను దళితుడిని కాకపోతే నాతో ఇలా మూత్రం తాగించేవారా?''
ఈ మాటలు చెబుతూ దళిత వర్గానికి చెందిన 33 ఏళ్ల జ్ఞాన్‌సింగ్ జాటవ్ రోదించారు.
ఫిర్యాదు ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో అక్టోబర్ 20న జ్ఞాన్‌సింగ్ జాటవ్‌ను తీవ్రంగా కొట్టి, ఆయనతో బలవంతంగా మూత్రం తాగించారు.
15 రోజుల వ్యవధిలో మధ్యప్రదేశ్‌లో దళితుల అణచివేతకు సంబంధించిన మూడు తీవ్రమైన కేసులు వెలుగులోకి వచ్చాయి. భిండ్‌లో జరిగిన ఈ తాజా ఘటన మరోసారి రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర సవాళ్లను రేకెత్తించింది.

మధ్యప్రదేశ్ డీజీపీ కైలాశ్ మక్వానాతో మాట్లాడేందుకు బీబీసీ ఫోన్, వాట్సాప్ ద్వారా ప్రయత్నించింది. కానీ, ఆయన నుంచి స్పందన రాలేదు.
జ్ఞాన్‌సింగ్‌ను వేధించిన కేసులో సోనూ బారువా, అలోక్ శర్మ, చోటూ అనే ముగ్గురు వ్యక్తులపై భిండ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
''ఈ వ్యవహారంలో దాడి, కిడ్నాప్, ఎస్సీ-ఎస్టీ యాక్ట్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ముగ్గురిని అరెస్ట్ చేశాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసు బృందం, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉంది'' అని బీబీసీతో భిండ్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ పాఠక్ చెప్పారు.
దళితుడైనందువల్లే తనతో ఇలా వ్యవహరించారని, ఇది తన కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తోందని భిండ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్ఞాన్‌సింగ్ అన్నారు.

ఏం జరిగింది?
భిండ్ జిల్లాలో నివసించే జ్ఞాన్‌సింగ్ వృత్తిరీత్యా ఒక డ్రైవర్. అక్టోబర్ 18న సమీప గ్రామానికి చెందిన సోనూ బారువా తన వాహనానికి డ్రైవర్‌గా పనిచేయమని తనను అడిగారని జ్ఞాన్‌సింగ్ చెబుతున్నారు.
''ఆయన నన్ను డ్రైవింగ్ కోసం పిలిచారు. కానీ, నాకు వాళ్ల దగ్గర పనిచేయడం ఇష్టం లేదు. మా ఊరు నుంచి వారి గ్రామానికి అర కిలోమీటరు దూరం ఉంటుంది. వాళ్లు నేరప్రవృత్తి గల మనుషులని నాకు తెలుసు. అందుకే వారి దగ్గర పని చేయాలనుకోలేదు'' అని జ్ఞాన్‌సింగ్ వివరించారు.
వారి వాహనానికి డ్రైవర్‌గా పనిచేయలేనని చెప్పాక, తుపాకీతో బెదిరించి ఇంట్లో నుంచి తీసుకొచ్చి కొట్టారని జ్ఞాన్‌సింగ్ ఆరోపించారు.
'నేను చేసిన నేరం ఏంటి సర్? వాళ్లు నన్ను బండి నడపమన్నారు, నేను నిరాకరించాను. వారంటే భయంతో నేను బండి నడపడానికి ఒప్పుకోలేదు. తర్వాత వాళ్లు నన్ను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి బాగా కొట్టి మూత్రం తాగించారు' అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్ఞాన్‌సింగ్ బాధగా చెప్పారు.
జ్ఞాన్‌సింగ్‌కు ఇద్దరు పిల్లలు. ఆయన భార్య పింకీ జాటవ్ ఈ ఘటన గురించి బీబీసీతో మాట్లాడారు.
''మా ఆయనను ఎంతలా కొట్టారంటే, రెండు రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి. కానీ, ఆయనతో మూత్రం తాగించారు. ఊరంతా ఈ విషయం తెలిసింది. మా జీవితం అతలాకుతలమైంది. అందరూ మమ్మల్ని అదే దృష్టితో చూస్తారు. మా పిల్లలు కూడా ఈ బాధను అనుభవించాలి' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Rajkumar's Family
‘నా తల్లిని జుట్టు పట్టి లాగేశారు’
భిండ్‌లో జ్ఞాన్‌సింగ్, ఆయన కుటుంబం తాజా ఘటనతో బాధపడుతుండగా, అక్కడికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్నీ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ చౌధరీ కుటుంబం కూడా విషాదంలో ఉంది.
కట్నీలో 10 రోజుల క్రితం దళిత వ్యక్తిని బాగా కొట్టి మూత్రం తాగించారనే ఘటన వెలుగులోకి వచ్చింది.
కట్నీ జిల్లాకు చెందిన 36 ఏళ్ల దళిత రైతు రాజ్‌కుమార్ చౌధరీ కూడా తనను కొట్టి బలవంతంగా మూత్రం తాగించారని ఆరోపించారు.
అక్టోబర్13వ తేదీ సాయంత్రం తమ పొలానికి సమీపంలోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు తనను తీవ్రంగా కొట్టారని రాజ్‌కుమార్ బీబీసీతో చెప్పారు.
మైనింగ్ జరుపుతున్న రామ్ బిహారీ, గ్రామ సర్పంచ్ రామానుజ్ పాండే, ఆయన కుమారుడు పవన్ పాండే, మరికొంతమంది కలిసి తనను దారుణంగా కొట్టారని ఆయన తెలిపారు.
''నన్ను కాళ్లతో తన్నారు. కొట్టే సమయంలో గ్రామ సర్పంచ్ రామానుజ్ పాండే, పవన్ పాండే నా ముఖంపై మూత్రం పోశారు. వాళ్లు కొడుతుండగా నన్ను కాపాడటానికి వచ్చిన మా అమ్మను కూడా జుట్టు పట్టి లాగేశారు. కులాన్ని ప్రస్తావిస్తూ బూతులు తిట్టారు'' అని రాజ్‌కుమార్ చెప్పారు.
పోలీసులు ఈ వ్యవహారంలో ఇరు పక్షాల ఫిర్యాదుల మేరకు క్రాస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జనరల్ కేటగిరీ కుటుంబం తరఫు నుంచి అక్టోబర్ 13న ఒక ఫిర్యాదు, రాజ్‌కుమార్ తరఫు నుంచి రెండు రోజుల తర్వాత ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కింద మరో ఫిర్యాదు నమోదైంది.
కట్నీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ అభినవ్ విశ్వకర్మ, బీబీతో మాట్లాడుతూ, ''బాధితుని ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేశాం. అయితే ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరినీ అరెస్ట్ చేయలేకపోయాం. వారిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాం'' అని చెప్పారు.
ఎస్సీ-ఎస్టీ చట్టం అమలులో అనేక స్థాయుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని మధ్యప్రదేశ్‌లో అడ్వొకేట్‌గా పనిచేస్తోన్న నికితా సోన్వానే అన్నారు.
''ఈ నేరాలకు మూలం కేవలం సామాజిక పక్షపాతమే కాదు, పాలకుల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం కూడా. చాలాసార్లు నిందితులపై నమోదైన కేసులను పరస్పర వివాదాలుగా పేర్కొంటూ, లేదా క్రాస్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తూ కేసులను నీరుగారుస్తున్నారు'' అని నికిత అన్నారు.
దీనివల్ల బాధితులపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Azam Khan
దమోహ్ జిల్లాలో మరో దారుణం
కట్నీ, భిండ్ ఘటనలకు కొన్ని రోజుల ముందు మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లా సతారియా గ్రామంలో కూడా వేధింపులకు సంబంధించిన మరో ఘటన నమోదైంది.
ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన పురుషోత్తమ్ కుష్వాహాను అనుజ్ పాండే అనే ఒక అగ్రవర్ణ యువకుని కాళ్లు కడిగి, ఆ నీటిని తాగేలా బలవంతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
గ్రామంలో మద్యపాన నిషేధానికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని పురుషోత్తమ్ కుటుంబీకులు చెబుతున్నారు.
మద్యపాన నిషేధం ఉన్నప్పటికీ మద్యాన్ని విక్రయించారంటూ అనుజ్ పాండేపై గ్రామస్థులు ఆరోపణలు చేశారు. దీనిపై కుష్వాహా వర్గానికి, పాండే కుటుంబానికి మధ్య వివాదం పెరిగింది.
తర్వాత పురుషోత్తమ్ సోషల్ మీడియాలో అనుజ్ పాండే ఫోటోకు చెప్పుల దండ వేసినట్లుగా ఉన్న ఒక పోస్టు చేశారు. కొంతసేపటి తర్వాత ఆ పోస్టును తొలగించారు.
ఈ పోస్టు తర్వాత గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన కొంతమంది పంచాయతీ పెట్టి పురుషోత్తమ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట్లు ఆయన కుటుంబీకులు చెప్పారు.
అనుజ్ పాండే పాదాలు కడిగి, ఆ నీళ్లు తాగాలని వాళ్లు డిమాండ్ చేశారని తెలిపారు.
ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. తర్వాత దీని గురించి అందరికి తెలిసింది.
'మేం ఇక్కడే బతకాలి. ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మేం ఎక్కడికి వెళ్లగలం?' పురుషోత్తం బీబీసీతో అన్నారు.
వీడియో వైరల్ అయిన తర్వాత, దమోహ్ పోలీసులు ఈ వ్యవహారంలో అనుజ్ పాండే, ఇతర నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని 196 (1)(బి) సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
' ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. సాక్ష్యాధారాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని అక్టోబర్ 12న పోలీస్ సూపరింటెండెంట్ శ్రుత కీర్తి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దళితులు, బీసీలపై సుదీర్ఘ అణచివేత
మధ్యప్రదేశ్‌లో దళితులు, వెనుకబడిన వర్గాలు అణచివేతకు గురికావడం కొత్త విషయమేమీ కాదు.
ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం, దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్ 2021, 2022, 2023లో స్థిరంగా మూడో స్థానంలో ఉంది. దీనికంటే ముందు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.
అలాగే, షెడ్యూల్ తెగలపై జరిగిన నేరాల్లో 2021, 2022లలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో, 2023లో రెండో స్థానంలో నిలిచింది.
కుల హింస, వివక్ష అనేవి ఇప్పటికీ మన సమాజంలో పాతుకుపోయి ఉన్నాయని భోపాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త మాధురి అన్నారు.
''చట్టాలు ఉన్నాయి. కానీ, న్యాయాన్ని పొందడం ఈరోజుకూ చాలా కష్టం. కొన్ని ఘటనలే వార్తలుగా మారుతున్నాయి. ఎవరికీ తెలియకుండా మరుగైపోయిన కేసులు ఎన్నున్నాయో?’’
‘‘ఒకవేళ మీరు ఈ కేసుల లోతుల్లోకి వెళ్తే నిందితులను ఏదో రకంగా ప్రభుత్వం రక్షిస్తున్నట్లు, అందుకే ఇలాంటి హింస మళ్లీ మళ్లీ పునరావృతమవుతున్నట్లు అర్థం అవుతుంది'' అని మాధురి వ్యాఖ్యానించారు.
'క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రక్రియ అసంపూర్తిగా, మొక్కబడిగా ఉంటుంది. కొన్నిసార్లు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయరు. చాలా కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటకు వస్తారు. కొన్ని కేసులు అసలు ముందుకే సాగవు'' అని నికితా సోన్వానే అన్నారు.
ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకొని, వీటిని తుదముట్టించేందుకు చర్యలు తీసుకోనంత కాలం ఇలాంటి కేసులన్నీ కేవలం కాగితాలపైనే ప్రభావవంతంగా కనిపిస్తాయని నికిత అభిప్రాయపడ్డారు.
ఇలాంటి ఘటనలు దళిత వర్గానికి చెందిన పిల్లలపై చూపే ప్రభావాల గురించి నికిత మాట్లాడారు.
'ఇలాంటి ఘటనలతో ఏర్పడే భయం, కోసం, నిస్సహాయత, ద్వేషం పిల్లల్లో స్థిరపడతాయి. అవమానం, అసమానతలు మామూలే అని భావించే వాతావరణంలో ఈ పిల్లలు పెరుగుతుంటారు. ఇది కేవలం సామాజిక, చట్టపరమైన హింస మాత్రమే కాదు భావోద్వేగ హింస. వీటి తాలూకూ గాయాలు తరతరాలకు వ్యాపిస్తాయి'' అని నికిత అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














