శీతాకాలంలోనే గుండెపోటు ముప్పు ఎక్కువా, దీనిని ముందుగా గుర్తించడం ఎలా, నివారణ ఏంటి?

గుండె పోటు ప్రమాదాన్ని గుర్తించవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శుభ్ రాణా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలోని మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బులు కూడా ఒకటని మీకు తెలుసా? ప్రతి నాలుగు మరణాలలో ఒకటి గుండె సంబంధిత వ్యాధులవల్లే సంభవిస్తోందని 'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్' అధ్యయనం చెబుతోంది.

గుండె జబ్బు మరణాలలో 80 శాతం కంటే ఎక్కువ గుండెపోటు, స్ట్రోక్‌ వల్లే సంభవిస్తున్నాయి.

గుండె ఆరోగ్యం విషయంలో సాధారణ నమ్మకం ఏమిటంటే, కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఉంటే, అంతా బాగానే ఉందనుకోవడం.

కానీ మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉన్నంత మాత్రాన మన గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టేనా?

కొలెస్ట్రాల్ కాకుండా గుండెపోటుకు కారణాలు, దాని గురించి ముందస్తు హెచ్చరికగా వచ్చే సంకేతాలు, అలాగే ఈ శీతాకాలంలో మన గుండెను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

శీతాకాలంలో అత్యధిక గుండెపోటు కేసులు...

శీతాకాలం ప్రారంభమైంది. ముందుగా ఈ కాలంలో ఉండే ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం.

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ఈఎస్‌సీ) కాంగ్రెస్ 2024లో సమర్పించిన ఒక అధ్యయనం అదే ఏడాది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రధాన జర్నల్ 'జేఏసీసీ'లో ప్రచురితమైంది. తీవ్రమైన చలి వాతావరణం, ఆకస్మిక శీత గాలులు గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతాయి అని ఈ అధ్యయనం తెలిపింది.

అయితే తీవ్రమైన శీతల పరిస్థితులు ప్రారంభమైన వెంటనే ఈ ప్రమాదం ఉండదు. కానీ రెండు నుంచి ఆరు రోజుల తర్వాత ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం పేర్కొంది.

ప్రతి ఏటా క్రిస్మస్, కొత్త సంవత్సరం సమయంలో అత్యధిక సంఖ్యలో గుండెపోటు కేసులు, గుండె సంబంధిత మరణాలు నమోదవుతున్నాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డేటా తెలిపింది.

చలిగాలులు, జీవనశైలి మార్పులు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

శీతాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? అనే ప్రశ్నకు మేదాంత మూల్‌చంద్ హార్ట్ సెంటర్ అసోసియేట్ డైరెక్టర్, హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ తరుణ్ కుమార్‌ స్పందిస్తూ, ''శీతాకాలంలో గుండెపోటు ప్రమాదం పెరగడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్త నాళాలు, సిరలను సంకోచింపచేస్తుంది. దీనివల్ల గుండె తాలూకా ప్రధాన ధమనులు (కరోనరీ ఆర్టరీలు) కూడా సంకోచిస్తాయి. ఫలితంగా గుండెకు తక్కువ రక్తం, ఆక్సిజన్ చేరతాయి’’

శీతాకాలంలో ప్రజలు తక్కువగా కదులుతారు. చెమట తక్కువగా పడుతుంది. ఇది శరీరంలో ప్లాస్మా లేదా మొత్తం రక్త పరిమాణాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటు, గుండె స్పందన రేటును పెంచి, గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.

శరీర జీవక్రియ (మెటబాలిజం) కూడా శీతాకాలంలో కొద్దిగా నెమ్మదిస్తుంది. ప్రజలు తెలియకుండానే క్యారెట్ హల్వా, బెల్లం, వేరుశెనగలు, వేయించిన పకోడీలు వంటి అధిక కేలరీలు ఉండే ఆహార పదార్థాలను తినేస్తుంటారు. బయటకు వెళ్లే పనులను, వ్యాయామాన్ని పరిమితం చేస్తుంటారు. ఇది అధిక బరువు, కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది.

శీతాకాలం మన శరీరంలోని కొన్ని హార్మోన్ల మార్పులను తెస్తుంది. ఇది రక్తం గడ్డకట్టే ధోరణిని పెంచుతుంది. ఈ గడ్డ గుండె సిరల్లో చిక్కుకుంటే, అది రక్తప్రసరణను అడ్డుకుని గుండెపోటుకు దారితీస్తుంది.

దిల్లీ నోయిడాలోని మెట్రో హాస్పిటల్‌ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ సమీర్ గుప్తా మాట్లాడుతూ, "ఇప్పటికే అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో ఎక్కువగా సూప్ లేదా ఉప్పగా ఉండే ఆహారం తినడం ప్రమాదకరం. అధిక ఉప్పు రక్తపోటును, గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది" అని చెప్పారు.

ఈ సీజన్‌లో వేయించిన ఆహారాలు ఎక్కువగా తినడం గుండెకు ముప్పు తెస్తాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

శీతాకాలంలో మీ గుండెను ఎలా కాపాడుకోవాలంటే...

శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం, వేపుళ్లు ఎక్కువగా తినడం, అధిక ఒత్తిడి కూడా గుండెకు చేటు తెస్తాయని డాక్టర్ సమీర్ గుప్తా చెప్పారు. "మీ బరువును అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే, అధిక బరువు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలి. 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి" అని ఆయన సూచించారు.

''ఆహారం విషయానికొస్తే పకోడీలు, సమోసాలు వంటి వేపుళ్లను తగ్గించండి. వాటికి బదులుగా, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు ఎంచుకోండి. అధిక ఉప్పు, చక్కెరను నివారించండి. యువతలో పెరుగుతున్న హృదయ స్పందన రేటు సమస్య పరిష్కారానికి పొగ తాగడం, మద్యం మానేయాలని డాక్టర్ సమీర్ గుప్తా సూచిస్తున్నారు.

  • మీ రక్తపోటు (బీపీ), షుగర్, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి.
  • ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తలతిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించండి.

ఈ చిన్న మార్పులతో, శీతాకాలంలో గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

గుండెపోటు లక్షణాలు...

యువతలో ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని ఐసీఎంఆర్, ఎయిమ్స్ 2025లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

ధమనులలో కొవ్వు నిల్వల (కరోనరీ ఆర్టరీ వ్యాధి) కారణంగా వచ్చే గుండెపోటు, 85 శాతం గుండె సంబంధిత మరణాలకు కారణమవుతోంది.

"భారతదేశంలోని యువతలో కూడా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 50 ఏళ్లలోపు వారిలో గుండెపోటు సర్వసాధారణమైపోయింది. మొత్తం కేసుల్లో 25-30 శాతం మంది 40 ఏళ్లలోపువారే'' అని డాక్టర్ తరుణ్ కుమార్ చెప్పారు.

ఈ నేపథ్యంలో అసలు గుండెపోటు లక్షణాలు ఏంటో తెలుసుకుంటే, తద్వారా వెంటనే వైద్య సహాయం పొందడానికి వీలవుతుంది.

  • ఛాతీ ఎడమ వైపు లేదా మధ్యలో నొప్పి, భారంగా అనిపించడం, ఒత్తిడి లేదా మండుతున్నట్లుగా అనిపించడం.
  • ఉదరం పై భాగం నుంచి దిగువ ఉదరానికి నొప్పి వ్యాపించడం.
  • ఎడమ చేయి పైభాగానికి నొప్పి వ్యాపించడం
  • చెమటలు పట్టడం, తల తిరగడం, ఊపిరి ఆడకపోవడం సాధారణ లక్షణాలు.

మీకు అలాంటి లక్షణాలు ఏవైనా అనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్ తరుణ్ కుమార్ చెబుతున్నారు.

"అందరికీ ఛాతీ నొప్పి కలగకపోవచ్చు. శ్వాస ఆడకపోవడం అనేది చాలామందిలో కనిపిస్తుంది. సొంత వైద్య చిట్కాలకు బదులు వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ లక్షణాలను విస్మరించడం ప్రమాదకరం" అని ఆయన అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

నిశ్శబ్ద కారకాలు

ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే చెప్పే అంశాలను డాక్టర్ సమీర్ గుప్తా వివరించారు.

అపో బి లెవెల్: ఇది ప్రతి చెడు కొలెస్ట్రాల్ కణంపై ఉంటుంది. రక్తంలోని చెడు కణాల కచ్చితమైన సంఖ్యను 'అపో బి' సూచిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా అంచనా వేస్తుంది.

లిపోప్రొటీన్ (ఎ) లెవెల్స్: ఇది పుట్టుకతోనే నిశ్చయమయ్యే జన్యుపరమైన అంశం, దీనిని మార్చలేం. దక్షిణాసియా ప్రజలు (భారతీయులు, తదితరులు) తరచుగా ఎక్కువ స్థాయిలను కలిగి ఉంటారు. ఇది గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

హిమోగ్లోబిన్ A1C: ఈ రక్త పరీక్ష గత రెండు మూడు నెలల్లో మీ రక్తంలో సగటు చక్కెర స్థాయిని సూచిస్తుంది. అధిక స్థాయిలో ఉంటే మధుమేహంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

గుండెపోటు ప్రమాదాన్ని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన కొలమానాలు, పరీక్షలు ఉన్నాయి. వీటిని చేయించుకోవడం ద్వారా ముందుగానే అప్రమత్తంగా ఉండవచ్చంటారు డాక్టర్ తరుణ్ కుమార్.

ఎల్లప్పుడూ 'నార్మల్'గా ఉంచడానికి కీలక కొలమానాలు

  • బీఎంఐ: బీఎంఐ 18.5 నుంచి 24.9 మధ్య ఉండాలి.
  • కొలెస్ట్రాల్ లెవెల్స్: ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) - 100 mg/dL కంటే తక్కువగా ఉంచాలి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
  • హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్): 50 mg/dL వరకు సాధారణంగా 'నార్మల్'గా పరిగణిస్తారు.
  • సి-రియాక్టివ్ ప్రోటీన్: ఇది శరీరంలోని వాస్కులర్ వాపును కొలుస్తుంది. కొలెస్ట్రాల్ సాధారణమైనప్పటికీ, ధమనులలో అధిక కొలెస్ట్రాల్ ఫలకాలు చీలిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ముఖ్యంగా ఒత్తిడి లేదా ఆకస్మిక, కఠినమైన వ్యాయామం సమయంలో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ముప్పును అంచనావేసే పద్ధతులు

ఫ్రేమింగ్‌హామ్ రిస్క్ కాలిక్యులేటర్: ఇది రాబోయే పదేళ్లలో గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. వయస్సు, లింగం, కొలెస్ట్రాల్, రక్తపోటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రమాదం 5 శాతం మించి ఉంటే, మీ వైద్యుడు మందులను సూచిస్తారు.

కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్: దీన్ని సీటీ స్కాన్ ఉపయోగించి చేస్తారు. స్కోరు సున్నా కంటే ఎక్కువగా ఉంటే, గుండెపోటు ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది.

డాక్టర్ తరుణ్ కుమార్ మరికొన్ని ముఖ్యమైన పరీక్షలను సిఫార్సు చేస్తున్నారు.

"మీకు డయాబెటిస్ లేదా మరేదైనా వ్యాధి ఉందనే అనుమానం ఉంటే, ఈసీజీ, ఎకో, టీఎంటీ (ట్రెడ్‌మిల్ టెస్ట్) చేయించుకోండి. టీఎంటీలో నడుస్తున్నప్పుడు ఈసీజీ ఉంటుంది, ఇది సమస్యలను ముందుగానే గుర్తించగలదు" అని ఆయన చెప్పారు.

ఏదేమైనా ఇప్పటి పరిస్థితుల్లో, చిన్నప్పటి నుంచే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని డాక్టర్ తరుణ్ కుమార్ చెబుతున్నారు.

''18 నుంచి 20 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు కొలెస్ట్రాల్, రక్తపోటు ఎంత ఉందో టెస్ట్ చేయించుకోండి. 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు అప్రమత్తంగా ఉండటానికి ఫ్రేమింగ్‌హామ్ రిస్క్ కాలిక్యులేటర్, కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్, టీఎంటీ చేయించుకోవాలి'' అని ఆయన సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)