ఏడాదంతా ఆగకుండా రోజూ 42 కిలోమీటర్లు పరిగెత్తాడు, తరువాత ఏం తెలిసిందంటే...

ఏడాదంతా పరిగెత్తిన హ్యూగో

ఫొటో సోర్స్, Dókimos Productions

ఫొటో క్యాప్షన్, గుండెకు ఎటువంటి ముప్పు కలగకుండా హ్యూగో తన సవాలును పూర్తి చేశారని నిపుణులు చెప్పారు
    • రచయిత, జూలియా గ్రాన్జీ
    • హోదా, బీబీసీ న్యూస్

హ్యూగో ఫారియాస్ 2023లో వరుసగా 366 మారథాన్‌లు పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంటే ఆయన ఓ ఏడాదిపాటు ఎండావాన, అనారోగ్యాలు, గాయాలు వీటిని ఏవీ లెక్క చేయకుండా ప్రతిరోజూ 42 కిలోమీటర్లు పరిగెత్తారు.

హ్యూగో వయసు 45 ఏళ్లు. ఆయనో బ్రెజిలియన్ వ్యాపారవేత్త. ఆయన ఓ వైద్యపరమైన అధ్యయనంలో పాల్గొన్నారు. 12 నెలల్లో 15వేల కిలోమీటర్లు పరిగెడితే తన గుండె ఎలా ప్రతిస్పందిస్తుందన్నదే ఆ అధ్యయనం.

‘‘నేనేమీ పెద్ద అథ్లెట్‌ను కాదు. ఇంతకుముందు నేను కేవలం ఒకే మారథాన్‌లో పాల్గొన్నా'' అని చెప్పారాయన.

‘‘ఆటల ద్వారా ప్రభావం చూపాలని, ఓ కొత్త అధ్యాయం సృష్టించాలనే కోరిక నాలో బలంగా కలిగింది’’ అని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హ్యూగో ఫారియాస్

ఫొటో సోర్స్, Dókimos Productions

‘ఇందుకేనా నేను పుట్టింది?’

రోజూవారీ జీవితంపై విసిగిపోయి, ఉద్యోగాన్ని వదిలేసి ఆటలకు సంబంధించిన సవాళ్లపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు హ్యూగో.

‘‘నేను చేస్తున్న పనులన్నీ ఆపి నేను పుట్టింది ఇందుకేనా అని ఆలోచించే క్షణం వచ్చింది. దాదాపు 35, 40 ఏళ్లుగా చేసిన పనే చేయడానికేనా నేను పుట్టింది అని ప్రశ్నించుకున్నాను'' అని హ్యూగో బీబీసీకి చెప్పారు.

''చక్కని కెరీర్‌ను ఎంచుకోవాలని, జీవితంలో స్థిరత్వం సాధించాలని, పెళ్లి చేసుకోవాలని, తరువాత రిటైర్ కావాలనే విషయాలను సాంతం 18 ఏళ్లు కూడా నిండకముందే పెద్దవాళ్లు చెబుతుంటారు'' అని హ్యూగో అన్నారు.

''ఓ విభిన్నమైన దారిలో ప్రజలకు స్ఫూర్తి కలిగించాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఏదైనా చేయాలని ఆలోచించడం మొదలుపెట్టా''

''దక్షిణ అట్లాంటిక్ సముద్రాన్ని పడవపై 1984లో ప్రయాణించిన బ్రెజిలియన్ రోవర్ ఎమిర్ క్లింక్ నాకు స్ఫూర్తి. కాకపోతే ఆయనలా రోయింగ్‌ను కాకుండా, పరిగెత్తాలని నిర్ణయించుకున్నా'' అని హ్యూగో తెలిపారు.

తనదైన ముద్ర వేయాలనుకున్నారు కాబట్టి, మునుపెన్నడూ చేయని చాలెంజ్‌ను హ్యూగో ఎంచుకున్నారు. అప్పటికే బెల్జియన్ అథ్లెట్ స్టీఫెన్ ఎంగెల్స్ ఏడాదిలో 365 మారథాన్‌లు పూర్తి చేసినట్టు తెలిసి, దానికంటే ఒకరోజు ఎక్కువ మారథాన్ రన్నింగ్ చేయాలనుకున్నారు.

ఇందుకోసం హ్యూగో 8 నెలల ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో ప్రయాణం, వృత్తి నిపుణుల నుంచి శిక్షణలాంటివి కూడా ఉన్నాయి.

''నేను ఒక్కడినే ఇది చేయలేనని తెలుసు. డాక్టర్లు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు, మానసిక ఆరోగ్య నిపుణుల్లాంటి విభిన్నరంగాల వారితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశా'' అని ఆయన చెప్పారు.

''పూర్తిగా అనిశ్చితమైన ఓ పని కోసం బాగా స్థిరపడిన నా కెరీర్‌ను వదులుకున్నాను. అది ఉద్వేగాన్ని, అభద్రతను కలిగించింది. అందుకే లక్ష్యంపై దృష్టిసారించాలంటే వృత్తి నిపుణుల సాయం తప్పనిసరి'' అన్నారాయన.

హ్యూగో గుండె పనితీరును కార్డియాలజిస్టులు పరిశీలించారు

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, కార్డియాలజిస్టులు హ్యూగో గుండె పనితీరును పరిశీలించారు

సైన్స్‌కు దోహదపడాలని...

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సావో పాలో హార్ట్ ఇన్‌‌స్టిట్యూట్‌ను కూడా హ్యూగో ఆహ్వానించారు.

"ఈ సవాలుకు నా గుండె ఎలా స్పందిస్తుందో అధ్యయనం చేయడానికి నాతో కలిసి పనిచేయగలరా అని ఇన్‌స్టిట్యూట్‌లోని కార్డియాలజిస్టులను అడిగాను. గుండె పెద్దదవుతుందా, లేదా చిన్నదవుతుందా, అరిథ్మియాసిస్ (హృదయస్పందనలు క్రమబద్ధంగా లేకపోవడం) లేదా ఇంకేమైనా మార్పులు కలుగుతాయా'' అని వారిని అడిగాను.

ఈ అధ్యయనంలో కార్డియాలజిస్ట్, పరిశోధకురాలు మరియా జానియర్ అల్వెస్ పాల్గొన్నారు.

‘‘ఇది ఇంతకు ముందు ఎవరూ చేయని పని. ఇది గుండెపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది" అని మరియా వివరించారు.

అంతగా తీవ్రం కాని లక్ష్యాలపై దృష్టిసారించడం ద్వారా ఆయన గుండె జబ్బు ప్రమాదం లేకుండా సవాలును పూర్తి చేసేలా నిపుణులు హ్యూగోకు పరిమితులు నిర్దేశించారు.

హ్యూగో ప్రతినెలా ఎర్గోస్పిరోమెట్రీ (వ్యాయామం సమయంలో ఒక వ్యక్తి శ్వాసకోశ, జీవక్రియ పనితీరులను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతి)తోపాటు, ప్రతి మూడు నెలలకోసారి ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) పరీక్షలు చేయించుకున్నారు.

''శారీరక వ్యాయామం కారణంగా స్థూల, సూక్ష్మ స్థాయిలో గుండెలో ఏదైనా అసాధారణ మార్పులు కలుగుతాయోమోనని పరిశీలించడం దీని లక్ష్యం'' అని డాక్టర్ అల్వెస్ చెప్పారు.

గుండె పని తీరు

ఫొటో సోర్స్, Getty Images

వందల గంటలు...వేల కిలోమీటర్లు

హ్యూగో 2023 ఆగస్టు 28న ఈ చాలెంజ్‌ను పూర్తి చేశారు. మొత్తంగా 15,569 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడానికి ఆయనకు 1,590 గంటలు పట్టింది. ఈ ఫీట్ ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తెచ్చిపెట్టింది.

ఇద్దరు పిల్లల తండ్రి అయిన హ్యూగో ఉదయం వేళ నిద్రపోవడం ద్వారా మిగిలిన రోజంతా కుటుంబంతో గడపడానికి, పరిగెత్తడం వల్ల కలిగిన ఒత్తిడి నుంచి కోలుకోవడానికి, కండర పుష్ఠిపై దృష్టిసారించే అవకాశం కలిగేది.

అదేవిధంగా, అతను సావోపాలో రాష్ట్రంలోని అమెరికానా నగరంలో ఎప్పుడూ ఒకే రూట్‌లో పరిగెత్తారు.

వ్యాయామ సమయం, తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల గుండె కండరాలు దెబ్బతిన్నట్టుగా ఆధారాలు ఏవీ కనిపించలేదని ఈ అధ్యయనం తెలిపింది. ఈ రీసర్చ్ పేపర్ బ్రెజిలియన్ ఆర్కైవ్స్ ఆఫ్ కార్డియాలజీ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఏదైనా గుండె కండరాల మార్పు ఎక్కువగా సహజమైనవి, ఆరోగ్యకరమైన శారీరకమైనవని, ఏ వ్యాధినీ సూచించలేదని తెలిపింది.

‘‘అన్నింటికీ మించి అధికస్థాయి వ్యాయామాలను గుండె తట్టుకోగలదని, అయితే ఆ వ్యాయామ తీవ్రత మితంగా ఉండాలి’’ అని ఈ అధ్యయనం సూచిస్తోందని డాక్టర్ అల్వెస్ చెప్పారు.

‘‘ కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, శిక్షణ సెషన్ల మధ్య కోలుకోవడానికి తగినంత సమయం ఉండటం వల్ల శిక్షణ పొందిన అథ్లెట్ గుండె చాలా తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోగలదనే ఆలోచనను ఇది బలపరుస్తుంది" అని స్పోర్ట్స్ కార్డియాలజిస్ట్ ఫిలిప్పో సావియోలి బీబీసీతో చెప్పారు. అయితే ఆయన ఈ అధ్యయనంలో పాల్గొనలేదు.

హ్యూగో సగటు హృదయ స్పందన రేటు 140 బిపిఎం (నిమిషానికి కలిగే స్పందనలు ) తో మధ్యస్థమైన తీవ్రతతో పరిగెత్తారు. ఇది ఆయన వయస్సులో ఆశించిన గరిష్ఠ హృదయ స్పందన రేటులో 70నుంచి 80 శాతం అని ఫిలిప్పో సావియోలి చెప్పారు.

ఇది ఆక్సిజన్ వినియోగాన్ని, శక్తి ఉత్పత్తిని సమతుల్యం చేసే హ్యూగోను సురక్షిత స్థితిలో ఉంచిందని వివరించారు.

‘‘ఈ స్థాయిలో పరిగెత్తడం, రోజూవారీ వ్యాయామాలు ఎక్కువసేపు చేయడం కూడా వాపు, అరిథ్మియా వంటి గుండె దెబ్బతినే ప్రమాదాలను తగ్గిస్తుంది’’ అని డాక్టర్ సావియోలి చెప్పారు.

హ్యూగో ఈ సవాలును ఎక్కువ తీవ్రతతో మొదలుపెట్టి ఉంటే పరిణామాలు హానికరమని, తగిన శిక్షణ లేదా వైద్య పర్యవేక్షణ లేకుండా ఇటువంటి సవాలును ఎదుర్కోవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

ఇందులో ఉండే ముప్పు గణనీయమైనదని, మంచిది కాదని ఆయన అన్నారు.

సరైన సన్నద్ధత లేకుండా ఇలా చేస్తే అరిథ్మియా, వాపు లేదా ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 366వ మారథాన్ చివరి అడుగును హ్యూగో తన కుటుంబంతో కలిసి పూర్తి చేశారు

ఫొటో సోర్స్, Dókimos Productions

ఫొటో క్యాప్షన్, 366వ మారథాన్ చివరి అడుగును హ్యూగో తన కుటుంబంతో కలిసి పూర్తి చేశారు

'మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి'

హ్యూగోకు, అధ్యయన ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. 'నా జీవితంలో నేను ఊహించని స్థాయి ఫిట్‌నెస్ సాధించాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు' అని పేర్కొన్నారు.

అయితే ఈ సవాలు రిస్క్ లేనిదేం కాదని, చలి, ఎండ, వర్షం, ట్రాఫిక్, గాయం వంటి అన్ని రకాల ప్రమాదాలను తాను ఎదుర్కొన్నానని ఆయన చెప్పారు.

మూడుసార్లు ఆయన విరేచనాల బారినపడ్డారు. ఓసారి ఐదురోజులపాటు ఈ బాధను అనుభవించాల్సి వచ్చింది.

‘‘నాలుగు కిలోల బరువు తగ్గాను. ఆహారం, నీరు తీసుకోవాల్సిన మోతాదులు మార్చుకోవాల్సి వచ్చింది. కానీ నా పరుగు ఆపలేదు’’ అని హ్యూగో తెలిపారు.

తన 120వ మారథాన్ సమయంలో ఆయన ప్లాంటార్ ఫాసిటిస్ బారినపడ్డారు. ఇది సుదూరం పరిగెత్తే రన్నర్లలో సాధారణంగా పాదం అడుగుభాగాన కనిపించే వాపు.

తరువాత, 140వ మారథాన్ సమయంలో, స్పోర్ట్స్ హెర్నియా అని పిలిచే లోయర్ బ్యాక్ గాయంతో బాధపడ్డారు. ఇది పొత్తి కడుపులోని కండరాలను, తోడలోపలి భాగాలను ప్రభావితం చేస్తుంది.

తరువాత తన అనుభవాలపై హ్యూగో ఓ పుస్తకం రాశారు. ఆ తర్వాత కూడా ఆయన రన్నింగ్‌ను కొనసాగించారు.

అలాస్కాలోని ప్రుధో బే నుంచి అర్జెంటీనాలోని ఉషువాయా వరకు మొత్తం అమెరికా ఖండాలంతటినీ పరిగెత్తిన వ్యక్తి కావాలనేది ఆయన నెక్ట్స్ చాలెంజ్.

వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు, మనుషులు ఎంత అద్భుతమైన పనులు చేయగలరో చాటి చెప్పడమే తన లక్ష్యమని చెప్పారు.

‘‘ప్రతిరోజూ ఎవరూ మారథాన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ తమలోని శక్తి సామర్థ్యాలను సామర్థ్యాలను నిజంగా నమ్మాలి" అంటారు హ్యూగో.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)