కదిరి: ‘‘టపాసులు పేల్చొద్దంటే ఈ రోడ్డు .... అంటూ దాడి చేశాడు ’’

గర్భిణిపై దాడి, సత్యసాయి జిల్లా, పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఆరు నెలల గర్భిణిపై దాడి చేశారనే ఆరోపణలపై కదిరి డివిజన్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి నడిపించుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇది మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు, దాడిలో గాయపడిన బాధితురాలు సంధ్యా రాణి ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల’ నేపథ్యంలో ఈ దాడి జరగడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న పుష్పాల అజయ్ దేవాను పోలీసులు అరెస్టు చేయగా.. ఆయన తండ్రి అంజనప్ప పరారీలో ఉన్నారని తనకల్లు ఎస్ఐ కె.గోపి బీబీసీతో చెప్పారు.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

డిసెంబరు 21న జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారి పల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వేడుకలు నిర్వహించారు.

గ్రామానికి చెందిన పుష్పాల అజయ్ దేవా, ఆయన తండ్రి అంజనప్ప ఈ వేడుకలు నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు.

దీనిలో భాగంగా పుష్పాల సంధ్యా రాణి ఇంటి వద్ద రోడ్డుపై కేక్ కోసి బాణాసంచా కాల్చుతుండగా.. సంధ్యా రాణి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆరు నెలల గర్భవతినని, పటాసుల శబ్దాలకు భయంగా ఉందని, కొంచెం దూరంగా వెళ్లి కాల్చుకోవాలని సంధ్యా రాణి చెప్పడంతో ఆమెపై దాడి జరిగినట్లు తమ విచారణలో తేలిందని తనకల్లు ఎస్ఐ కె.గోపి బీబీసీతో చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు, అభిమానులు, వేడుకలు, నిందితుడు

ఫొటో సోర్స్, UGC

‘గోడకేసి బలంగా కొట్టారు’

తన మాటలకు ఆగ్రహించిన అజయ్ దేవా, అంజనప్ప తనపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు సంధ్యా రాణి ఫిర్యాదు చేశారు.

"ఈ రోడ్డు ఏమైనా మీదా.. అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ నాపై దాడి చేశారు" అని సంధ్యా రాణి మీడియాకు చెప్పారు.

"అజయ్ దేవా నా పీక నొక్కుతూ, గోళ్లతో రక్కి, బలంగా గోడకు నెట్టి, ఇబ్బంది పెట్టారు. గర్భవతినని కూడా చూడకుండా కడుపుపై బలంగా కాలితో తన్నారు" అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ దాడిలో అంజనప్ప కూడా పాల్గొన్నారని ఆమె పోలీసులకు చెప్పారు.

గాయాల పాలైన ఆమెను కుటుంబ సభ్యులు తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. తర్వాత మెరుగైన చికిత్స కోసం కదిరి ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

"సంధ్యా రాణి ఫిర్యాదు ఆధారంగా నిందితులు అజయ్ దేవా, అంజనప్పపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం" అని చెప్పారు ఎస్ఐ గోపి.

ఈ ఘటనపై అంజనప్ప కుటుంబ సభ్యులను వివరణ కోరేందుకు వారిని బీబీసీ సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు.

పోలీసులు, కట్టె, అజయ్ దేవా, అంజనప్ప

ఫొటో సోర్స్, UGC

కర్రతో కొట్టి చంపే ప్రయత్నం: డీఎస్పీ

ఈ కేసులో అజయ్ దేవాను అరెస్టు చేశామని, మరో నిందితుడు అంజనప్ప పరారీలో ఉన్నారని డీఎస్పీ శివనారాయణ స్వామి బీబీసీతో చెప్పారు.

"సంధ్యా రాణిపై దాడి చేయడమే కాకుండా గర్భిణి అని కూడా చూడకుండా కాలితో ఆమె కడుపుపై అజయ్ దేవా తన్నినట్లు మా విచారణలో తెలిసింది. కట్టెతో కొట్టి ఆమెను చంపేందుకు ప్రయత్నించినట్లు తేలింది. ఈ దాడి నుంచి ఆమె తప్పించుకున్నారు" అని డీఎస్పీ వివరించారు.

దాడికి వినియోగించారని చెబుతున్న కట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కదిరి రూరల్ పోలీసు స్టేషన్, సంధ్యా రాణి

ఫొటో సోర్స్, UGC

"మా ట్రీట్‌మెంట్ ఏమీ లేదు.. అంతా చట్ట ప్రకారమే"

కేసులో అరెస్టైన అజయ్ దేవాను కదిరి ఆర్టీసీ బస్టాండు నుంచి కదిరి రూరల్ పోలీసు స్టేషన్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. ఈ సమయంలో ఆయన కుంటుతూ నడిచి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అజయ్ దేవాకు 'పోలీసులు ట్రీట్‌మెంట్' ఇచ్చారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

నిందితుడికి పోలీసులు ఎలాంటి 'ట్రీట్‌మెంట్' ఇవ్వలేదని బీబీసీతో చెప్పారు డీఎస్పీ శివనారాయ స్వామి. తాము చట్ట ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేశారు.

అజయ్ దేవా అరెస్టు సమయంలో వాహనం లేకపోవడంతోనే పోలీసు స్టేషన్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లామని వివరించారు.

సంధ్యా రాణికి అబార్షన్ కాలేదు: డీఎస్పీ

సంధ్యా రాణి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని డీఎస్పీ శివనారాయణ స్వామి బీబీసీకి చెప్పారు.

ఆమెకు అబార్షన్ అయిందంటూ కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు.

''ఆమెకు అబార్షన్ అవ్వలేదు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆమెకు చికిత్స కొనసాగుతోంది'' అని వివరించారు.

కుటుంబాల మధ్య గతంలో వివాదాలు

కేసులో బాధితులు సంధ్యా రాణి కుటుంబం, నిందితులు అజయ్ దేవా, అంజనప్ప.. ఇద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారని పోలీసులు చెబుతున్నారు.

వీరి కుటుంబాల మధ్య గతంలో విభేదాలు ఉన్నాయని ఎస్ఐ కె.గోపి బీబీసీతో చెప్పారు.

ఈ ఏడాది జూన్‌లో కూడా అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతున్న సమయంలో తన భార్యను నిందితులు ఇబ్బంది పెట్టారని సంధ్యా రాణి భర్త గిరీశ్ బాబు మీడియాకు చెప్పారు.

ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పోలీసులు చెబుతున్నారు.

రాజకీయంగానూ సంచలనం

మరోవైపు, ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగానూ సంచలనం రేపుతోంది.

''జగన్ గారి జన్మదినం జనాలకు ప్రాణసంకటంగా మారింది. రప్పా రప్పా వైసీపీ ఉన్మాదం ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితిని విషమం చేసింది'' అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

బాధితురాలిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరామర్శించారు.

ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ.. సత్యసాయి జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు.

''నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం'' అని శైలజ వివరించారు.

వైఎస్సార్సీపీ ఏమంటోంది?

కదిరిలో జరిగిన ఘటనకు అజయ్ దేవాకు పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చెప్పారు.

''కుటుంబ త‌గాదాకు రాజ‌కీయ రంగు పులిమి అందులో నిందితుడిగా వ్యక్తిని వైఎస్సాఆర్సీపీ కార్య‌కర్త‌గా న‌మ్మించాల‌ని చూస్తున్నారు. పోలీసులతో 'ట్రీట్మెంట్' ఇప్పించి రోడ్డుపై నడిపించి షో చేశారు.

అజయ్ దేవాకు పార్టీకి సంబంధం లేదు. ఏనాడూ మా పార్టీ జెండా పట్టుకోలేదు'' అని చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)