బట్టతల, జుట్టు రాలడంతో బాధపడుతున్నవారి ఖర్చులు తగ్గిస్తానంటున్న దేశాధ్యక్షుడు

బట్టతల

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కో ఈవ్, హొసూ లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ దేశంలో బట్టతల ఉన్న ప్రజలకు సాయంగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.

జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్ (జుట్టు రాలే సమస్యలకు తీసుకునే వైద్య చికిత్స) ఖర్చులను కవర్ చేయాలని ప్రెసిడెంట్ లీ ప్రతిపాదించారు.

''జుట్టు రాలే సమస్యలకు తీసుకునే వైద్య చికిత్సలను అంతకుముందు ''కాస్మోటిక్''గా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు 'మనుగడకు సంబంధించిన సమస్యగా' చూస్తున్నారు'' అని అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రెసిడెంట్ లీ జే-మ్యూంగ్ అన్నారు.

ప్రస్తుతం దక్షిణ కొరియాలో జాతీయ ఆరోగ్య బీమా కింద కేవలం కొన్ని వైద్య పరిస్థితులకు చెందిన హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్లకే కవరేజ్ ఉంది.

జన్యుపరంగా వచ్చే జుట్టు రాలే సమస్యను (బట్టతలను) బీమా పరిధిలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే, ఇది ఆ వ్యక్తి జీవితానికి లేదా ఆరోగ్యానికి అంత పెద్ద ముప్పు కాదని మంత్రి జాంగ్ యూన్-క్యుయోంగ్ వివరించారు.

దీనిపై స్పందించిన లీ.. '' జన్యుపరంగా వచ్చే వ్యాధిని ఒక వ్యాధిగా నిర్వచిస్తున్నారా? లేదా? అనేది మాత్రమే ఇక్కడ విషయమా'' అని అన్నారు.

లీ ప్రతిపాదనకు సోషల్ మీడియా యూజర్ల నుంచి మద్దతు వస్తోంది. లీ జే-మ్యూంగ్‌ను ''చరిత్రలోనే అత్యంత ఉత్తమ అధ్యక్షుడు'' అని ఒకరు కొనియాడారు.

అయితే, దీనిపై అందరూ అనుకూలత వ్యక్తం చేయడం లేదు. వ్యతిరేకత వ్యక్తం చేసేవాళ్లు ఉన్నారు.

జుట్టు రాలే సమస్యలపై చికిత్స తీసుకునేందుకు రాయితీ అర్హత ఉన్నవారూ దీన్ని సపోర్టు చేయడం లేదు.

''ఇది ఓట్లు పొందే పాలసీలాగా కనిపిస్తుంది'' అని హెయిర్ లాస్ మెడికేషన్ తీసుకున్న సోల్ నివాసి 32 ఏళ్ల సాంగ్ జీ-హూన్ అన్నారు.

''డబ్బులు ఆదా అవుతుందంటే బాగుంటుంది. కానీ, నిజాయితీగా చెప్పాలంటే, ఇది 3,00,000 వన్ (సుమారు రూ.18,143) కంటే తక్కువ ఖర్చే. బీమాలో చేర్చడం అంత అవసరమా?'' అని ఆయన ప్రశ్నించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణ కొరియాలో జుట్టు రాలుతుందని గత ఏడాది ఆస్పత్రులకు వచ్చిన వారు 2,40,000 వేల మంది ఉన్నారని, వారిలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారు 40 శాతం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

''నా నుదుటిపై జుట్టు రాలిపోతూనే వచ్చింది. అందుకే నేను వ్యాక్స్ కూడా సరిగ్గా చేయించుకోలేను'' అని నార్త చుంగ్‌చియోంగ్ ప్రావిన్స్‌లోని 33 ఏళ్ల లీ వాన్-వూ తెలిపారు.

''నాకు కావాల్సినట్లు నా జుట్టును స్టయిల్ చేసుకోలేను. అంత ఆకర్షణీయంగా ఉండదు. నా ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీస్తుంది'' అని లీ వాన్-వూ చెప్పారు.

''జుట్టు రాలే చికిత్సకు సంబంధించిన మందులు తక్కువకు దొరుకుతాయంటే నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తాను. కానీ, జాతీయ ఆరోగ్య బీమా పథకం ఇప్పటికే నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది'' అన్నారు లీ వాన్.

''వయసు పెరుగుతున్న కొద్ది సహజంగా వచ్చే సమస్యనే. ఇదొక అనారోగ్య సమస్య లేదా వ్యాధి కాదు. దీనివల్ల కలిగే భావోద్వేగ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ, వాస్తవాన్ని ఇది మార్చలేదు'' అని లీ తెలిపారు.

దక్షిణ కొరియా జాతీయ ఆరోగ్య బీమా పథకం గత ఏడాది 11.4 ట్రిలియన్ వన్‌ల (సుమారు రూ.68,980 కోట్లు) లోటుతో ఇబ్బంది పడింది.

దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఈ పథకం మరింత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

అయితే జుట్టు రాలే చికిత్సలు కలిగించే ఆర్థిక భారాలను తగ్గించేందుకు, అధికారులు వీటి కవరేజీపై పరిమితులు విధించవచ్చని అధ్యక్షుడు లీ అన్నారు.

సమాజంలో అత్యంత దుర్భర స్థితిలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని విమర్శకులు అంటున్నారు.

దక్షిణ కొరియా ప్రెసిడెంట్‌ లీ జే-మ్యుంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా ప్రెసిడెంట్‌ లీ జే-మ్యూంగ్

మొదట దీనికంటే మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం నిధులను కేటాయించాలని కొరియన్ మెడికల్ అసోసియేషన్ తన ప్రకటనలో తెలిపింది.

దక్షిణ కొరియాలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉండటం, మహిళలపై వివక్ష వంటి అతిపెద్ద సామాజిక సమస్యలపై దృష్టిపెట్టాలని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.

''శానిటరీ ప్యాడ్స్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్స్‌కు బీమా కవరేజీ కోరితేనే తీవ్రంగా స్పందించే దేశంలో.. జుట్టు రాలకుండా వాడే మందులను ఇన్సూరెన్స్‌లో కవర్ చేస్తామని ప్రకటించడం పెద్ద జోక్‌'' అని ఒక యూజర్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

''జుట్టు ఊడిపోవడం అనేది సమాజంలో మనుగడకు ఒక నిర్ణయాత్మక అంశంగా మారితే, అప్పుడు సమాజంలోని ఆ ఆలోచన ధోరణిని మార్చడమే రాజకీయాల ప్రధానాంశంగా ఉండాలి'' అని మరో యూజర్ రాశారు.

కొరియా యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2025 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన లీ జే-మ్యుంగ్

అధ్యక్షుడు లీ ప్రతిపాదనలకు కారణం

అధ్యక్షుడు జుట్టు రాలే సమస్యపై మాట్లాడటం ఒక వింత చర్యగా అనిపించవచ్చు. కానీ, 2022లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో లీ ప్రధాన ప్రచార స్లోగన్ కూడా ఇదే. జుట్టు రాలే సమస్యలకు చికిత్సలను ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పారు.

ఈ సమయంలో లీ జే-మ్యూంగ్, ఆయన టీమ్ జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడుతున్న ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు.

జుట్టు రాలిపోయే సమస్యకు సంబంధించిన ఒక వాణిజ్య ప్రకటనలో కూడా లీ జే-మ్యూంగ్ నటించారు. దీనికి కొందరు ఓటర్లలో మంచి ఆదరణ లభించింది.

సంప్రదాయ భావాజాలానికి మద్దతిచ్చే యువ పురుష ఓటర్లను ఆకట్టుకునేందుకు లీ ఈ వ్యూహాలను అనుసరిస్తున్నారని కొందరు విమర్శకులు ఆరోపించారు.

అయితే, 2022 ఎన్నికల్లో లీ జే-మ్యూంగ్ ఓడిపోయారు.

ఈ ఏడాది మళ్లీ తాను ఎన్నికల్లో గెలుపొందారు. జుట్టు రాలే సమస్యల చికిత్సల వార్తలను ఈసారి ప్రచారం నుంచి తొలగించారు.

''ఈసారి ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు'' అని కొరియా యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ చెప్పే అసోసియేట్ ప్రొఫెసర్ డాన్ ఎస్. లీ చెప్పారు.

2026 మధ్యలో ఉన్న స్థానిక ఎన్నికల కోసం తన మద్దతుదారుల సంఖ్యను పెంచుకునేందుకు అధ్యక్షుడు ప్రయత్నిస్తుండొచ్చని అన్నారు.

అధ్యక్షుడిగా లీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. దేశ యువతరాన్ని ఆకట్టుకునే అంశాలపై దృష్టిసారించారు.

ఊబకాయానికి చెందిన మందులను కూడా జాతీయ ఆరోగ్య బీమా పథకంలో కలపాలని లీ సూచించారు.

కాగా.. జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద జుట్టు రాలిపోయే చికిత్సలను తీసురావడంపై అధ్యక్షుడు ఎంత సీరియస్‌గా ఉన్నారనే దానిపై ప్రొఫెసర్ డాన్ ఎస్. లీ అనుమానం వ్యక్తం చేశారు.

''వ్యక్తిగతంగా, అధ్యక్షుడు ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, తదుపరి చర్యలు తీసుకుంటారా అనే దానిపై నాకు అనుమానం ఉంది'' అని తెలిపారు.

''ఈ వ్యూహాత్మక నిర్ణయం యంగ్ మేల్ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉంది. మీపై కూడా నేను శ్రద్ధ తీసుకుంటున్నాననే దానికి ఇదొక సంకేతం'' అని ప్రొఫెసర్ లీ తెలిపారు.

కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు భారత్‌లో కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే, భారత్‌లో ఆరోగ్య బీమా పథకాల కింద ఈ చికిత్సలు కవర్ కావడం లేదని మనీకంట్రోల్ రిపోర్టు చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)