ఎవరీ తారిక్ రెహమాన్? ‘ఆరేళ్ల వయసులోనే జైలుకు వెళ్లిన’ ఈయన 17 ఏళ్ల తరువాత సొంత దేశం బంగ్లాదేశ్‌కు ఎందుకు వస్తున్నారు? అక్కడి రాజకీయాలను మలుపు తిప్పుతారా?

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17ఏళ్లుగా దేశానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌కు తిరిగిరానున్నారు.
డిసెంబర్ 16న, లండన్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ.. 2026లో జరగనున్న జాతీయ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాను స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.
రెహమాన్ బీఎన్‌పీ తాత్కాలిక ఛైర్మన్ కూడా.
ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగనున్న సమయంలో, ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అస్థిరత, కొనసాగుతున్న హింస, తాత్కాలిక ప్రభుత్వ పాత్రపై వివాదాలతో సతమతమవుతున్న సమయంలో ఆయన తిరిగి వస్తున్నారు.
మరోవైపు తారిక్ రెహమాన్ తల్లి, 80 ఏళ్ల ఖలీదా జియా, చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఢాకాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
తారిక్ రెహమాన్ ఎవరు?
బంగ్లాదేశ్ రాజకీయాలలో 'క్రౌన్ ప్రిన్స్' గా పిలిచే తారిక్ రెహమాన్.. మాజీ అధ్యక్షుడు జియా-ఉర్-రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దవాడు.
1965 నవంబర్ 20న జన్మించిన తారిక్ రెహమాన్ బీఎన్‌పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావడానికి ముందు పార్టీలో సీనియర్ వైస్-చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు.
1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో, తారిక్ రెహమాన్‌ను ఆయన తల్లి ఖలీదా జియా, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధ ఖైదీలలో అతి పిన్న వయస్కుడిగా తారిక్ రెహమాన్‌ను బీఎన్‌పీ అభివర్ణించింది.
ఆయన తన ప్రాథమిక విద్యను ఢాకాలోని బీఏఎఫ్ షాహీన్ కాలేజ్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1980లలో ఢాకా యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివారు.
కాలం గడిచేకొద్దీ, తారిక్ రెహమాన్ తన తల్లితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చి 1988లో బీఎన్‌పీ జనరల్ సభ్యుడయ్యారు.
ఆ సమయంలో ఆయన కింది స్థాయి కార్మికులను, మద్దతుదారులను సమీకరించి, హెచ్.ఎం. ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించారు.
1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్‌కు మొదటి మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు, తారిక్ రెహమాన్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేవీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహబూబ్ అలీ ఖాన్ కుమార్తె డాక్టర్ జుబైదా రెహమాన్‌ను 1993లో వివాహం చేసుకున్నారు.
17ఏళ్లుగా రెహమాన్ లండన్‌లోనే ఉంటున్నారు.
2004 ఆగస్ట్‌లో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు.
అయితే, దీనిని ప్రతీకార రాజకీయాలతో రెచ్చగొట్టిన కేసుగా బీఎన్‌పీ పేర్కొంది.
2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ రెహమాన్ అరెస్టు అయ్యారు.
అరెస్ట్ అయనప్పుడు తారిక్ రెహమాన్‌ను హింసించడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారని బీఎన్‌పీ ఆరోపిస్తోంది.
2008లో ఆయనకి బెయిల్ వచ్చింది, చికిత్స కోసం లండన్ వెళ్లడానికి అనుమతి లభించింది.
అప్పటి నుంచి రెహమాన్ లండన్‌లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే బీఎన్‌పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఫొటో సోర్స్, @Michael kugelman/BBC
క్రిమినల్ కేసులు...
2004 గ్రనేడ్ దాడికి సంబంధించిన కేసులో అక్టోబర్ 2018లో తారిక్ రెహమాన్, మరో 18 మందికి జీవిత ఖైదు విధించారు.
2001 నుంచి 2006 వరకు బీఎన్‌పీ ప్రభుత్వ పదవీకాలంలో లంచం, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై మూడు భాగాల సిరీస్‌ను ఢాకా ట్రిబ్యూన్ 2023 మే 24న ప్రచురించింది. డాక్యుమెంటరీ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్, రెహమాన్‌ను "డార్క్ ప్రిన్స్"గా అభివర్ణించింది.
ఆ నివేదిక తారిక్ రెహమాన్‌పై అవినీతి, మీడియాను బెదిరించడం వంటి ఆరోపణలు మోపింది.
రెహమాన్ అక్రమ మార్గాలలో వందల మిలియన్ల డాలర్లు సంపాదించాడని.. అమెరికా రాయబార కార్యాలయ కేబుల్స్‌ను ఉటంకిస్తూ ఆరోపించింది.
అక్రమ సంపదను కూడబెట్టినందుకు 2023లో రెహమాన్‌కు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు.
"2024 ఆగస్ట్‌లో విద్యార్థి ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పుడు తారిక్ రెహమాన్ అదృష్టం కూడా మారిపోయింది. తదనంతరం 2004 గ్రనేడ్ దాడి, మనీలాండరింగ్ , రాజద్రోహానికి సంబంధించిన కేసులతో సహా పెండింగ్‌లో ఉన్న మొత్తం 84 కేసుల నుంచి ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు" అని ఫస్ట్‌పోస్ట్ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రెహమాన్ రాక కీలకమా?
బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు 2026 ఫిబ్రవరి 12న జరగనున్నాయి.
దేశంలో కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందడానికి బీఎన్‌పీ బలమైన ప్రయత్నం చేస్తున్న సమయంలో రెహమాన్ తిరిగి వస్తున్నారు అని బంగ్లాదేశ్ మీడియా అంటోంది.
ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దోపిడీ సహా అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ పరిస్థితిలో, తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం బీఎన్‌పీ కేడర్‌లోకి కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, ఓటర్లకు మంచి సందేశాన్ని కూడా పంపుతుందని భావిస్తున్నారు.
"గతేడాది షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించాలనే ఉద్యమం తారిక్ రెహమాన్ తిరిగి రావడానికి మార్గం సుగమం చేసింది" అని అట్లాంటిక్ కౌన్సిల్‌లో సౌత్ ఆసియా ఫెలో అయిన మైఖేల్ కుగెల్‌మాన్, ఫారిన్ పాలసీ కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
"బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన తర్వాత రెహమాన్‌కు ఇక్కడి పరిస్థితులు చక్కదిద్దడం అంత సులభం కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నా కూడా, బీఎన్‌పీ నాయకత్వం, పార్టీ మద్దతుదారులు ఆయనను ఉత్సాహంగా స్వాగతించారు. కానీ తాను ఇప్పుడు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని పార్టీ కార్యకర్తలను, నాయకులను ఒప్పించాల్సి ఉంటుంది" అని ఆయన రాశారు. ఎందుకంటే రెహమాన్ లండన్‌లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు, షేక్ హసీనా అణచివేత వల్ల ఆ పార్టీ నాయకులు ఎక్కువగా బాధపడ్డారు.
ఎన్నికల్లో బీఎన్‌పీని బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నప్పటికీ, ఆ పార్టీ ఎన్నికలను తేలికగా తీసుకోకూడదు. బీఎన్‌పీ మాజీ మిత్రపక్షమైన ఇస్లామిస్ట్ పార్టీ జమాత్ ఏ ఇస్లామీ ప్రభావం కూడా పెరిగింది. ముఖ్యంగా సెప్టెంబర్‌లో ఢాకా యూనివర్శిటీ క్యాంపస్ ఎన్నికల్లోఆ పార్టీ విద్యార్థి విభాగం విజయం సాధించిన తర్వాత. ఈ ఎన్నికను బంగ్లాదేశ్‌లో రాజకీయ దిశను సూచించే ముఖ్యమైన సంకేతంగా పరిగణిస్తున్నారు" అని ఆయన రాశారు.
జమాత్ ఏ ఇస్లామీ కూడా అవినీతికి వ్యతిరేకం అని, సామాజిక సంక్షేమంపై దృష్టి సారించాం అని చెప్పుకుంటోంది. ప్రజల్లో మార్పు పట్ల ఉన్న ఆకాంక్ష, బంగ్లాదేశ్‌పై ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో జమాత్ ఏ ఇస్లామీ ఇచ్చే ఈ సందేశం ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
జమాత్ ఇ ఇస్లామీ ఆవిర్భావం, అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడం వల్ల, ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేని ఓటర్లు బీఎన్‌పీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
"అసలు సమస్య ఫ్లోటింగ్ ఓటర్లే(ఎప్పుడూ ఒకే పార్టీకి ఓటువేయనివారు). ఇస్లామిస్టులను ఇష్టపడని వారు, ఇస్లామిక్ పార్టీకి ఓటు వేయకూడదనుకునే వారు బీఎన్‌పీపై అనుమానాలు ఉన్నప్పటికీ దాన్ని ఒక ఉదార ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయంగా చూడడానికి ఇష్టపడతారు. బీఎన్‌పీ అధికారంలోకి రావాలనుకుంటే, ఈ ఫ్లోటింగ్ ఓటర్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. తారిక్ తిరిగి రాకపోతే, బీఎన్‌పీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ శూన్యతను జమాత్ భర్తీ చేసే అవకాశం ఉంది" అని జార్జియా స్టేట్ యూనివర్శిటీలో భౌగోళిక రాజకీయ విశ్లేషకులు ఆసిఫ్ బిన్ అలీ ది ప్రింట్‌తో అన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఎన్‌పీకి బాధ్యత వహించడానికి క్షేత్రస్థాయిలో నాయకుడు అవసరమని ఆసిఫ్ అలీ అంటున్నారు.
"లండన్ నుంచి ప్రకటనలు చేయడం లేదా ప్రత్యక్ష ప్రసంగాలు ఇవ్వడం ఒకెత్తు. కానీ స్వదేశానికి తిరిగి రావడం, ప్రజలతో కరచాలనం చేయడం, వీధుల్లో సాధారణ ప్రజలతో మాట్లాడటం, మసీదులలో ప్రార్థనలు చేయడం, హిందూ దేవాలయాలను సందర్శించడం, బహిరంగ ప్రసంగాలు చేయడం – ఇవన్నీ మరోఎత్తు. ఇవి ఒక ఆశను సృష్టిస్తాయి. ఇప్పుడు, చాలా మందికి, తారిక్ ఆ ఆశకు చిహ్నంగా మారాడు, కానీ నమ్మకం క్షీణిస్తోంది" అని ఆసిఫ్ బిన్ అలీ అంటున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














