‘దేశం కోసం, మీ అందరి కోసం నా దగ్గర ఓ ప్లాన్ ఉంది’.. 17 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ వచ్చిన తారిక్ రెహమాన్ తొలి ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images
ఢాకాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తారిఖ్ రెహమాన్, "అల్లా అనుకుంటే, మన ఆకాంక్షలకు అనుగుణమైన బంగ్లాదేశ్‌ను సృష్టించడానికి కలిసి పని చేస్తాం, కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో, దేశాన్ని నడిపించడానికి ఎవరు ముందుకు వచ్చినా, మనమందరం ఆయన నాయకత్వంలో, ఆ కొత్త నాయకుడు చూపిన మార్గంలో అభివృద్ధి కోసం కలిసి పని చేస్తాం" అని అన్నారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత డిసెంబర్ 25న లండన్ నుంచి ఢాకాకు తిరిగి వచ్చారు.
తారిక్ గురువారం ఉదయం 11:41 గంటలకు ‘విమాన్ బంగ్లాదేశ్’ విమానంలో ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
తారిక్ రెహమాన్‌కు స్వాగతం పలికేందుకు వేలాది మంది బీఎన్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు.
వారిని ఉద్దేశించి మాట్లాడిన తారిక్... ‘నా దగ్గర దేశ ప్రజల కోసం, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం, ప్రజల స్థితిగతులు మార్చేందుకు ఒక ప్రణాళిక ఉంది’ అని చెప్పారు. అయితే, ఆ ప్రణాళిక ఏమిటో ఆయన చెప్పలేదు.
తన ప్రసంగం చివర్లో హింస ఆపాలని ప్రజలను కోరిన ఆయన ‘దేశంలో శాంతిని నెలకొల్పడం మన అందరి బాధ్యత’ అన్నారు.
బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగొచ్చారు. అవామీ లీగ్‌ను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.
ఈ పరిస్థితుల్లో.. బీఎన్‌పీ ఎన్నికల్లో గెలిస్తే, తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆయన తల్లి ఖలీదా జియా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. బీఎన్‌పీ బాధ్యతను తారిక్ రెహమానే చూసుకుంటున్నారు.
ఖలీదా జియా నాలుగు దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆమె భర్త హత్యకు గురవడంతో ఆమె బీఎన్‌పీ నాయకత్వ పగ్గాలు చేపట్టారు.
1981లో హత్యజరిగినప్పుడు ఖలీదా భర్త జియావుర్ రెహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బంగ్లాదేశ్‌లో బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చేవారు.
1991లో బేగం జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. 1991 ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం సాధించింది. 2001లో ఆమె తిరిగి అధికారంలోకి వచ్చి 2006 వరకు కొనసాగారు. బీఎన్‌పీ గత మూడు ఎన్నికలను బహిష్కరించింది. 2024లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఖలీదా జియా మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ అతిపెద్ద పార్టీ.
షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖలీదా జియా జైలులో ఉన్నారు. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ కూడా అనేక కేసుల్లో దోషిగా తేలారు. కానీ ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఖలీదాను, ఆమె కుమారుడిని నిర్దోషులుగా ప్రకటించింది.
జనవరి 2007లో బంగ్లాదేశ్‌లో సైనిక మద్దతుతో అధికారం చేపట్టిన ప్రభుత్వ పదవీకాలంలో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన తర్వాత తారిక్ దాదాపు 18 నెలలు జైల్లోనే గడిపారు. సెప్టెంబర్ 3, 2008న విడుదలయ్యారు.
ఎనిమిది రోజుల తర్వాత, సెప్టెంబర్ 11, 2008న తన కుటుంబంతో కలిసి ఢాకా నుంచి లండన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి తారిక్ రెహమాన్ లండన్‌లో నివసిస్తున్నారు.

ఫొటో సోర్స్, MUNIR UZ ZAMAN/AFP via Getty
ఈ నెల మొదట్లో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖలీదా జియా ఆరోగ్యంపై మాట్లాడారు. ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని చెప్పారు.
"బేగం ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. బేగం జియా తన ప్రజా జీవితంలో ఏళ్లపాటు బంగ్లాదేశ్‌కు ఎంతో సేవ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ విషయంలో భారతదేశం చేయగలిగినదంతా చేయడానికి సిద్ధంగా ఉంది" అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
"బీఎన్‌పీ చీఫ్ బేగం ఖలీదా జియా ఆరోగ్యం కోసం భారత ప్రధాని చేసిన ప్రార్థనలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మద్దతును బీఎన్‌పీ అభినందిస్తుంది" అని ప్రధాని మోదీ పోస్ట్‌కు ప్రతిస్పందనగా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాసింది.
గతంలో, భారత ప్రభుత్వం, బీఎన్‌పీ మధ్య ఇటువంటి సానుకూల సంబంధాలు చాలా అరుదుగా కనిపించాయి. షేక్ హసీనాకు ఆశ్రయమివ్వడం వల్ల బీఎన్‌పీ భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.
2015 జూన్‌లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి ఖలీదా జియాను కలిశారు. ఆ సమయంలోనే బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. అప్పుడు షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నారు.
బంగ్లాదేశ్ ప్రతిపక్షాలతో ప్రధాని మోదీకి ఇది అసాధారణమైన సమావేశం. ఖలీదా జియాతో పాటు జాతీయ పార్టీకి చెందిన రోషన్ ఎర్షాద్‌ను కూడా భారత ప్రధాని మోదీ కలిశారు.

ఫొటో సోర్స్, Getty Images
భద్రతా సన్నాహాలు
తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన భద్రత కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు బీఎన్‌పీ నాయకులు తెలిపారు.
ప్రభుత్వం పోలీసు, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్, సైన్యం సహా వివిధ భద్రతా సంస్థలతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేసిందని తెలిపారు. అంతేకాకుండా పార్టీ కూడా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిందని సలావుద్దీన్ అహ్మద్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
విమానాశ్రయంలో తారిక్‌ను స్వాగతించేందుకు రెడ్ జోన్‌లోని స్టాండింగ్ కమిటీ సభ్యులను మాత్రమే అనుమతించారు.
ఢాకాలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు క్రమశిక్షణ పాటించాలని బీఎన్‌పీ విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమాల మీడియా కవరేజ్ కోసం కూడా బీఎన్‌పీ మార్గదర్శకాలను రూపొందించింది. విమానాశ్రయ కవరేజ్‌కు, స్వాగత కార్యక్రమం కవరేజ్‌కు వేర్వేరు పాస్‌లు జారీ చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














