ఛాంపియన్ మూవీ రివ్యూ: బైరాన్‌పల్లిలో రజాకార్ల వ్యతిరేక పోరాటానికి, ‘మైఖేల్’ సాహసం తోడయ్యాక ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Vyjayanthi network/yt
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
ఛాంపియన్ ఒక హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామా.
స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో వచ్చిన ఈ సినిమాపై అధిక అంచనాలున్నాయి. మరి అందుకుందా? లేదా?

కథేంటి?
కథేంటంటే..1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే తెలంగాణ నిజాం పాలనలోనే వుంది. విలీనం విషయంలో పటేల్ నిర్ణయం తీసుకున్నా , కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.
ఈ నేపథ్యంలో నిజాం ప్రైవేట్ సైన్యం , రజాకార్లు చేసిన హింస, బైరాన్‌పల్లి గ్రామస్తుల తిరుగుబాటు కథాంశానికి ఒక యువకుడి సాహసాన్ని జోడిస్తే అదే ఛాంపియన్.
మైఖేల్ (రోషన్) ఒక హోటల్‌లో పని చేస్తూ వుంటాడు. అతనికి ఎవరూ లేరు. ఫుట్‌బాల్ అంటే పిచ్చి, అతని ఆటని మెచ్చి, ఒక ఆంగ్లేయుడు ఇంగ్లండ్‌లో ఆడే అవకాశం కల్పిస్తాడు. అయితే మైఖేల్ తండ్రి సైన్యంలో పని చేస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పని చేసి వుంటాడు. ఈ కారణంతో అధికారికంగా ఇంగ్లండ్ వెళ్లలేడు. అయితే ఒక బ్రిటిషర్ దొంగచాటుగా తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. కానీ అతను ఇచ్చిన ఆయుధాల్ని సికింద్రాబాద్ నుంచి బీదర్ చేర్చాలి. ఇది షరతు.
ఆయుధాలతో ట్రక్‌లో బయల్దేరిన హీరో , అతని ఫ్రెండ్ షబ్బీర్ అనుకోకుండా బైరాన్‌పల్లిలో చిక్కుకుపోతారు. తనకి సంబంధం లేని ఆ ఊరి తిరుగుబాటులో మైఖేల్ ఎందుకు పాల్గొన్నాడు? నాటకాల్ని ఇష్టపడే చంద్రకళతో అతని అనుబంధం ఏంటి? చివరికి ఏమైంది?

ఫొటో సోర్స్, Vyjayanthi network/yt
ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందా?
బైరాన్‌పల్లి ఒక చరిత్ర. రజాకార్ల హింసలో దాదాపు 200 మంది చనిపోయారు. వాస్తవ కథకి , హీరో స్పోర్ట్స్ డ్రామాని లగాన్ తరహాలో మిక్స్ చేయడం దర్శకుడు ప్రదీప్ ప్రత్యేకత. అతని శ్రద్ధ, ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. హేమాహేమీలైన నిపుణులు పని చేయడం అన్నిటికంటే ప్లస్ పాయింట్.
మాది కెమెరా, మిక్కీ మ్యూజిక్, కోటగిరి ఎడిటింగ్, పీటర్ హెయిన్ యాక్షన్, తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్ ఇవన్నీ కలిసి సినిమాకి గ్రాండ్ లుక్ ఇచ్చాయి. కథని నమ్మి దాదాపు రూ. 50 కోట్లు బడ్జెట్ పెట్టడం నిర్మాతల కాన్ఫిడెన్స్ లెవెల్స్ సూచిస్తాయి.
హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ గతంలో రెండు సినిమాల్లో నటించినా అతనికి గుర్తింపు రాలేదు. ఒక రకంగా ఛాంపియన్ అతని కెరీర్‌ని మార్చేసింది. నటన, డైలాగ్ డెలవరీ , స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నాయి.
అనశ్వర రాజన్ మంచి నటి. పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత కల్యాణ్ చక్రవర్తి, అర్చన కనిపించారు. పటేల్‌గా ప్రకాశ్‌రాజ్, కాశిం రజ్వీగా కెకె మీనన్ కాసేపు కనిపించినా గుర్తుంటారు.
ముఖ్యంగా బైరాన్‌పల్లి గ్రామస్తుల పాత్రల్ని రిజిస్టర్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చిన్న క్యారెక్టర్లైన చారి, భిక్షపతి కూడా ప్రేక్షకుల్ని ఫీల్‌కి గురి చేస్తాయి.

ఫొటో సోర్స్, Vyjayanthi network/yt
కెమెరా, ప్రొడక్షన్ డిజైన్ రిచ్‌గా ఉండి మనల్ని 1948లోకి తీసుకెళ్తాయి. గిరగిర పాట ఆల్రెడీ సూపర్‌హిట్. మిగతావి కూడా ఓకే. డైలాగ్‌లు చాలా చోట్ల హత్తుకుంటాయి.
అయితే 2.45 గంటల నిడివి అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా సెకెండాఫ్‌లో. ఇంటర్వెల్ వరకూ కథని అద్భుతంగా నడిపిన దర్శకుడు ప్రదీప్, ఆ తర్వాత తడబడి ఇరుక్కుపోయాడు.
దీనికి కారణం సెకెండాఫ్‌లో కొత్త సంఘటనలేవీ జరగవు. ఫైనల్‌గా ఆ ఊరిని హీరోనే కాపాడుతాడు అనేది ప్రిడిక్టబుల్.
భారీ యాక్షన్ సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ప్రేక్షకుడు థ్రిల్‌కు గురి అవుతాడు. అదే అంచనాతో లోపలికి వస్తాడు. అయితే సెకెండాఫ్‌లో కూడా చాలా సేపు హీరో ఆ ఊళ్లోనే ఉంటూ, కథని స్లో చేసాడు. పైగా ఇంటర్వెల్‌లోనూ , క్లైమాక్స్‌లోనూ హీరో ఫోర్స్‌డ్‌గా గ్రామస్తుల తిరుగుబాటులో పాల్గొంటాడు తప్ప, బలమైన మోటివేషన్ ఏమీ లేదు. ఆయుధాల కోసం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయాలనుకున్న గ్రామస్తులు, చేతికి దొరికిన తుపాకుల్ని మళ్లీ హీరోకి ఇచ్చి పంపాలని అనుకోవడం లాజిక్ లెస్.
కొన్ని లోపాల్ని వదిలేస్తే ఈ మధ్య వచ్చిన వాటిలో ఇది మంచి సినిమా. కనులవిందుగా వుంటుంది. రోషన్‌కి , ప్రదీప్‌కి ఇద్దరికీ మంచి కమ్ బ్యాక్.
ప్లస్ పాయింట్స్:
1.రోషన్ నటన
2.అనశ్వర స్క్రీన్ ప్రజెన్స్
3.కెమెరా, ఆర్ట్ , రిచ్ ప్రొడక్షన్
4.ప్రదీప్ దర్శకత్వ ప్రతిభ, ఇంటర్వెల్ యాక్షన్ సీన్
మైనస్ పాయింట్స్:
1.అక్కడక్కడ స్లో నెరేషన్, నిడివి
ఫైనల్‌గా టాలీవుడ్‌కి ఇంకో కమర్షియల్ హీరో దొరికాడు.
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














