రాళ్ల సైజు పెరుగుతుందా, రాళ్లు, శిలలు ఒకటి కావా?

సముద్రతీరంలో నిత్యం అలల తాకిడికి గురయ్యే రాళ్లు
ఫొటో క్యాప్షన్, సముద్రతీరంలోని రాళ్లు నిత్యం అలల తాకిడికి గురవుతుంటాయి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

రాళ్లు కూడా సైజు పెరుగుతాయా? మనుషులు, జంతువుల్లానే రాళ్లు కూడా ఎత్తు పెరుగుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు అసలు రాళ్లు, శిలల మధ్యన తేడా తెలుసుకోవాలి.

"రాయి" "శిల" అనే పదాలు ఒకేలా అనిపించవచ్చు. కానీ భూగర్భశాస్త్రం ఇవి రెండూ వేరువేరని చెబుతోంది.

శిలలు (Rock) అంటే, భూమి లోపల సహజంగా ఏర్పడిన ఖనిజాల సమూహం. ఇవి చాలా పెద్దవి. భూమికి స్థిరంగా అతుక్కుని ఉంటాయి. గ్రానైట్ శిల, లైమ్ స్టోన్ శిల, బసాల్ట్ శిల లాంటివన్నమాట.

రాళ్లు (Stone) అంటే, ఈ శిలలు కాలక్రమంలో పగిలి విడిపోయిన చిన్న ముక్కలు. మన చేతులతో, యంత్రాలతో ఎత్తగలిగేంత సైజులో ఉంటాయి. ఇళ్ల నిర్మాణాల్లో వాడే రాళ్లు, నదీ తీరాల్లో కనిపించే రాళ్లు ఈ కోవకే చెందుతాయి.

అంటే, శిల మూల పదార్థం. రాయి దాని నుంచి విడిపోయిన భాగం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎ.యుగంధరరావు
ఫొటో క్యాప్షన్, ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఏ.యుగంధరరావు

రాళ్లు ఎన్ని రకాలు?

భూమి మీద మనకు రాళ్లన్నీ ఒకేలా కనిపించినా, భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రం రాళ్లను మూడు రకాలుగా విభజించారు. వీటిని పుట్టుక నుంచి భూమి చరిత్రను చెప్పే మూడు రకాల రాళ్లుగా చెప్పవచ్చు. రాళ్లు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోడానికి ఈ విభజన ఉపయోగపడుతుంది.

భూగర్భ శాస్త్రవేత్తలు రాళ్లను ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటామార్ఫిక్ రాళ్లుగా గుర్తిస్తారని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) జియాలజీ ప్రొఫెసర్ ఏ.యుగంధరరావు బీబీసీతో చెప్పారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం...

ఇగ్నియస్ రాక్స్: భూమి లోపల ఉన్న మాగ్మా లేదా అగ్నిపర్వతాల నుంచి వచ్చిన లావా చల్లబడినప్పుడు ఇవి ఏర్పడతాయి. గ్రానైట్, బసాల్ట్ వంటి రాళ్లు ఈ వర్గానికి చెందుతాయి.

సెడిమెంటరీ రాక్స్: ఇసుక, మట్టి, చిన్న రాళ్లు పొరలుగా చేరి, లక్షల సంవత్సరాల పాటు ఒత్తిడి, తేమకు లోనై గట్టిపడితే ఇవి ఏర్పడతాయి. లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ ఇందుకు ఉదాహరణ.

మెటామార్ఫిక్ రాక్స్: ఇప్పటికే ఉన్న రాళ్లు అధిక ఉష్ణోగ్రత, అధిక ఒత్తిడి వల్ల తమ రూపాన్ని మార్చుకుంటే ఈ రాళ్లు తయారవుతాయి. మార్బుల్ లాంటి రాళ్లు అలా ఏర్పడ్డవే.

"ఈ మూడు రకాల రాళ్లు భూమి లోపల కోట్ల సంవత్సరాలుగా జరిగిన ప్రక్రియలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. భూమి ఎలా మారింది? ఎలా రూపుదిద్దుకుంది అన్న ప్రశ్నలకు ఈ రాళ్లు భూగర్భ శాస్త్రవేత్తలకు సమాధానాలు ఇస్తాయి" అని ప్రొఫెసర్ యుగంధరరావు చెప్పారు.

వివిధ రకాలైన రాళ్లు

రాళ్లు పెరుగుతాయా?

ఇక రాళ్లు పెరుగుతాయా అనే ప్రశ్న మనలో చాలామందికి తలెత్తుతుంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల రాళ్లు పెద్దవవుతున్నట్లుగా చెప్పుకోవడం వింటుంటాం.

కానీ "శాస్త్రీయంగా చెప్పాలంటే రాళ్లు మొక్కల్లా, మనుషుల్లా పెరగవు. కానీ వాటి పరిమాణంలో మార్పులు వస్తాయి" అని చెప్పారు ఏయూలోని జియాలజీ విభాగంలో పదవీ విరమణ పొంది ప్రస్తుతం ఆనరరీ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎం.జగన్నాథరావు.

రాళ్లకు జీవక్రియ లేదు. వాటికి కణ విభజన లేదు. రోజురోజుకీ పొడవు వెడల్పు పెరగడం ఉండదని ప్రొఫెసర్ జగన్నాథరావు చెప్పారు.

ఆయన అందించిన సమాచారం ప్రకారం...

రాళ్లు "బయోలాజికల్'' (జీవం)గా సైజ్ పెరగవు. కానీ ఫిజికల్/జియాలజికల్ (భౌతిక/భూగర్భ) ప్రక్రియల ద్వారా కాలక్రమంలో వాటి పరిమాణంపెరిగేందుకు అవకాశం ఉంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

కాల్షియం కార్బోనేట్ ఉన్న నీరు గుహలపై నుంచి నేలపైకి పూర్తిగా జారిపోకుండా గుహ ఉపరితలానికి అతుక్కుని అక్కడి నుంచి పొరలు పొరలుగా ఏర్పడి చివరకు దిబ్బల్లా పెరుగుతాయి. వీటినే స్టాలాక్లైట్స్ అంటారు. ఈ రకమైన పెరుగుదల చాలా నెమ్మదిగా వేలాది సంవత్సరాల పాటు జరుగుతుంది. అరకు సమీపంలోని బొర్రా గుహల్లో ఇది కనిపిస్తుంది.

నీటి ద్వారా ఖనిజాలు ఒక రాయి చుట్టూ చేరుతూ, వేల సంవత్సరాల పాటు డిపాజిట్ అవుతూ పొరలు ఏర్పరచుకుంటాయి. కొంచెం కొంచెంగా ఈ రాళ్లు పెరుగుతూ పెద్దగా మారతాయి. కానీ ఇది కూడా జీవపరమైన పెరుగుదల కాదు. దీనిని అక్రిషన్ (Accretion) అంటారు. సముద్రంలో పెరిగే మాంగనీస్ నాడ్యూల్ వీటికి ఉదాహరణ.

నీరు, గాలి, వోల్కానిక్ వంటి ప్రకృతి ప్రభావాల వల్ల రాళ్లలో ఖనిజాలు చేరి వాటి పరిమాణం పెరిగి ఉండవచ్చు. కానీ దీనిని కూడా రాళ్లు పెరిగాయని చెప్పలేం. దీనిని క్రిస్టల్ డిపాజిషన్ అంటారని చెప్పారు ప్రొఫెసర్ జగన్నాథరావు.

వీటన్నంటి అర్థం రాళ్లు జీవపరంగా పెరగవు. అంటే, కణ విభజన, జన్యు పెరుగుదల లాంటివి రాళ్లలో ఉండవు. కానీ వాటి పరిమాణం కాలక్రమంలో మారవచ్చు, దీనిని "గ్రోత్" అంటాం. ఇది రసాయన/ఖనిజాల డిపాజిషన్ మాత్రమే అని గుర్తించాలి. కానీ ఈ పరిస్థితుల్లో రాళ్లు "పెరిగినట్లుగా" కనిపించవచ్చు.

ఉదాహరణకు అగ్నిపర్వతాలు బద్ధలైనప్పుడు లావా ఒక పొరలా ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్లీ బద్ధలైనప్పుడు దానిపైనే మరో పొర ఏర్పడుతుంది. ఇలా ఒక పొరపై మరో పొర ఏర్పడే ప్రక్రియ మళ్లీ మళ్లీ జరిగితే రాయి లేదా శిల పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది. కానీ, దీనికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇది మనుషుల జీవిత కాలంతో పోల్చలేని సమయమని ప్రొఫెసర్ ఏ. యుగంధరరావు బీబీసీతో అన్నారు.

సముద్రతీరంలో రాళ్లు
ఫొటో క్యాప్షన్, సముద్రతీరంలో రాళ్లు

రాళ్లు తరుగుతాయా?

ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా చెప్పొచ్చన్నారు ప్రొఫెసర్ జగన్నాథరావు.

"రాళ్లు తప్పకుండా తరుగుతాయి. అంటే వాటి సైజు తగ్గుతుంది" అని చెప్పారు.

గాలి, వాన, ఎండ, ఉష్ణోగ్రత మార్పులు, పీడనం, అలల ప్రభావం ఇవన్నీ కలిసి రాళ్లను క్రమంగా క్షీణింపజేస్తాయి. ఈ ప్రక్రియను 'క్రమక్షయం ' లేదా 'ఎరోసన్' (Erosion) అంటారు.

సముద్ర తీరాల్లో అలలు రాళ్లను గుండ్రంగా మార్చేస్తాయి. కొండ ప్రాంతాల్లో వర్షం, ఎండ వల్ల రాళ్లపై చీలికలు వస్తాయి. కాలక్రమంలో పెద్ద శిలలు కూడా మైదానాలుగా మారిపోతాయి. వీటన్నింటినీ గమనించినట్లయితే రాళ్లు సైజు తగ్గిందనే విషయం అర్థమవుతుంది.

''అయితే సైజు తగ్గిన రాయిలోని పదార్థం మరోచోట డిపాజిట్ అవుతుందే తప్ప, అది ఈ విశ్వం నుంచి మాయమైపోదు. కానీ ఈ మార్పులు జరగడానికి లక్షల సంవత్సరాలు పడుతుందని ప్రొఫెసర్ జగన్నాథరావు చెప్పారు.

తీరంలో రాళ్లు

రాళ్ల సైజులో హెచ్చుతగ్గులు నిజమేనా?

కొన్ని సందర్భాల్లో రాళ్లు పెరిగినట్లుగా కనిపిస్తాయి. ఇది నిజమైన పెరుగుదల కాదు, మన దృష్టి భ్రమ అని చెప్పారు ప్రొఫెసర్ యుగంధరరావు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం, సెడిమెంటరీ రాళ్లు పొరలుగా పేరుకుపోయిన అవక్షేపాల నుంచి ఏర్పడతాయి. ఒక పొర మీద మరో పొర చేరినప్పుడు కాలక్రమంలో అవి పెద్దవవుతున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే కొన్ని నీటిని పీల్చుకునే ఖనిజాలు ఉంటాయి. వర్షాకాలంలో అవి ఉబ్బుతాయి. అప్పుడు రాయి పరిమాణం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ ఇది కేవలం భౌతిక, రసాయన మార్పు మాత్రమే.

సముద్రంలో రాళ్లు

సముద్రంలో పెరిగే మాంగనీస్ నాడ్యూల్స్...

సముద్ర అడుగున భూమి పుట్టుక నుంచి మన కంటికి కనిపించని ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సముద్రపు అంతర్భాగంలో మాంగనీస్ నాడ్యూల్స్ ఉంటాయి.

నాడ్యూల్ అంటే ఒక కోర్ (మధ్య భాగం) చుట్టూ పదార్థం పొరలుగా చేరుతూ సహజంగా ఏర్పడిన చిన్న గడ్డ. బంగాళాదుంప ఆకారంలో కనిపించే ఇవి ఒక చిన్న రాయి లేదా షెల్ చుట్టూ పొరలుగా ఏర్పడతాయి.

సముద్రపు నీటిలో కరిగిన లోహాలు ఈ నాడ్యూల్స్/గడ్డలు మీదకు మెల్లగా చేరతాయి. అందుకే ఇవి "పెరుగుతున్న రాళ్లు"లా అనిపిస్తాయి.

అలా ఒక మిల్లీమీటర్ పెరగడానికి కూడా లక్షల సంవత్సరాలు పడతుంది.

ఈ గడ్డలలో ఐరన్, కోబాల్ట్, నికెల్ లాంటి లోహాలతో పాటు మాంగనీస్ ఎక్కువ శాతంలో ఉంటుంది. అందుకే వీటిని మాంగనీస్ నాడ్యూల్స్ అంటారు.

రాళ్లు

రాళ్ల రంగు, రూపం మారతాయా...

అసలు రాళ్లు పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో నేటికీ రంగు, రూపులో అలాగే ఉన్నాయా అనే ప్రశ్నకు, రంగు, రూపు ఆ రాళ్లలో ఉన్న ఖనిజాలపై ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ జగన్నాథరావు చెప్పారు.

ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ ఎక్కువైతే తెల్లగా, కార్బన్ పదార్థాలు ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి. వాతావరణ ప్రభావాల వల్ల రాళ్లపై పొరలు ఊడిపోతాయి. చీలికలు వస్తాయి. ఆకారం కూడా మారుతుంది.

ఇదంతా వెదరింగ్ (Weathering) వల్ల జరుగుతుంది. రాయి ఒకేచోట ప్రకృతి చర్యల వలన నెమ్మదిగా మార్పుకు లోనుకావడమే వెదరింగ్.

రాళ్లు

అన్ని రాళ్లు ఒకేలా ఎందుకు ఉండవు?

మన నిత్య జీవితంలో చూసే రాళ్లు అనేక ఆకృతులలో ఉంటాయి. రంగు, రూపు, సైజు ఇలా అన్నింటిలోనూ దేనికదే ప్రత్యేకమైనదిగా ఉంటాయి. మరి రాళ్లన్నీ ఒకేలా ఎందుకు ఉండవనే ప్రశ్నకు ప్రొఫెసర్ యుగంధరరావు ఏం చెప్పారంటే....

"ఒక్కో రాయి ఒక్కో రకమైన పరిస్థితిలో ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడున్న వాతావరణ పరిస్థితులు వేర్వేరుగా ఉండొచ్చు. ఒక రాయి ఏర్పడినప్పుడు అక్కడున్న ఉష్ణోగ్రత వేరుగా ఉండి, దాని పీడనం వేరుగా ఉండొచ్చు. అలాగే ఆ రాయిలో ఉండే ఖనిజాల మిశ్రమం కూడా వేర్వేరుగా ఉండొచ్చు. మరో రాయి ఏర్పడిన పరిస్థితులతో పోల్చినప్పుడు ఇవి పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు. అందుకే కొన్ని రాళ్లు చాలా గట్టిగా ఉంటాయి. కొన్ని సులభంగా పగిలిపోయేలా ఉంటాయి. కొన్ని మెరుస్తాయి. కొన్ని మసకగా ఉంటాయి" అని అన్నారు.

మానవ చర్యల వలన కూడా రాళ్లలో భౌతికపరమైన మార్పులు రావొచ్చు. కానీ రాళ్లన్నీ ఒకేలా ఉండకపోవడానికి వాతావరణ పరిస్థితుల నుంచి వాటిలో ఉన్న మూల ఖనిజం వంటి అంశాల వరకూ ప్రభావం చూపుతాయని ప్రొఫెసర్ యుగంధరరావు బీబీసీకి చెప్పారు.

"రాళ్లు జీవం లేనివి. అందుకే అవి పెరగవు. కానీ, అవి నిలకడగా భూమి కథను మోస్తూ ఉంటాయి. రాళ్లు పెరగవు, కానీ తరుగుతాయి, రూపాంతరం చెందుతాయి. రాళ్లు జీవించవు... కానీ, కాలానికి సాక్షిగా నిలుస్తాయి" అని ప్రొఫెసర్ జగన్నాథరావు అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)