శంబాల మూవీ రివ్యూ: ఆ ఊళ్లో ఆకాశం నుంచి పడిన ఉల్క ఎలాంటి ‘మార్పులకు కారణమైంది’? సైంటిస్ట్ విక్రమ్ ఎలా పరిష్కరించారు?

ఫొటో సోర్స్, X/Aadi Saikumar
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆయనకి హిట్ పడిందా లేదా?
కథ ఏమంటే శంబాల మారుమూల గ్రామం. కథా కాలం 1980.
ఆ ఊరికి పురాణ చరిత్ర కూడా ఉంటుంది. ఆ ఊరిలో ఒక ఉల్క శకలం పడుతుంది.
దాన్ని పరిశోధించడానికి సైంటిస్ట్ విక్రమ్ (ఆది) వస్తాడు.
అతను సైన్స్‌ని మాత్రమే నమ్ముతాడు. మూఢ నమ్మకాల వ్యతిరేకి.
ఉల్కని శంబాల గ్రామస్తులు బండభూతం అని పిలుస్తారు.
అది పడినప్పటి నుంచి ఆ ఊళ్లో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
ఒక ఆవుకి పాలకి బదులు రక్తం వస్తుంది. దాన్ని చంపేయాలని ఒక స్వామిజీ చెబుతాడు.
దీన్ని హీరో వ్యతిరేకిస్తాడు. అతనికి ఒక కానిస్టేబుల్ సాయంగా ఉంటాడు.
తర్వాత ఆ ఊళ్లోని కొందరు వింతవింతగా ప్రవర్తిస్తూ , హత్యలు చేస్తూ చివరికి ఆత్మహత్య చేసుకుంటారు.
ఈ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు? పూజారి కూతురుగా పరిచయమైన దేవి ఎవరు? సైన్స్‌కి, దైవశక్తికి మధ్య ఊగిసలాడుతున్న హీరో శంబాలని ఎలా రక్షించాడు...ఇది మిగతా కథ.

‘అసుర శక్తులు, దైవత్వం’ మధ్య జరిగే సంఘర్షణ ఈ మధ్య పాపులర్ జానర్.
విరుపాక్ష, కిష్కింధపురి రీసెంట్‌గా వచ్చాయి. హిందీలో కూడా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.
ఈ ధోరణిలో తీసిన శంబాల ప్రారంభంలోనే సాయికుమార్ వాయిస్ ఓవర్‌తో శివుడికి, ఒక రాక్షసుడి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరిస్తాడు.
‘దుష్ట శక్తి’ శంబాలని చుట్టుముట్టిందని మనకి ఫస్ట్ సీన్‌లోనే అర్థమవుతుంది.
తర్వాత రెండు గంటల 20 నిమిషాల సినిమాని నడపడంలో దర్శకుడు తడబడ్డాడు. దీనికి కారణం వీక్ రైటింగ్.
ఇలాంటి సినిమాల్లో కథలో జరుగుతున్న సంఘటనలు కొత్తగా ఉండాలి.
ఫస్టాఫ్ వరకు గ్రిప్పింగ్‌గా ఉండి, సెకెండాఫ్‌లో తేలిపోయింది.
దీనికి కారణం అవే సంఘటనలు జాంబి తరహాలో పదేపదే జరుగుతూ ఉంటాయి. మనుషులు మారుతూ ఉంటారు.

ఫొటో సోర్స్, X/Aadi Saikumar
ఇవన్నీ అరికట్టడానికి హీరో ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆయన కూడా అందరిలా ఆశ్చర్యపోతూ ఉంటాడు.
ఒక దశలో దైవశక్తి అండగా నిలబడుతుంది. అయితే దైవం కూడా నిస్సహాయంగా ఉండిపోవడం ఒక విచిత్రం.
పాత్రకి తగినట్టు ఆది బాగా నటించాడు. అర్చనా అయ్యర్‌కి నటించే అవకాశం లేదు. స్కోప్ తక్కువ.
అయితే, హీరోకి లవ్ ట్రాక్, సాంగ్స్ పెట్టకుండా, సీరియస్‌గా కథ నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ప్రేక్షకుల్ని భయపెట్టడం, థ్రిల్‌కి గురి చేయడం ప్రధానం కావడంతో ఎమోషన్ మిస్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్‌తో ప్రయత్నించినా ఫలితం లేదు.
దుష్టశక్తికి , దైవశక్తికి మధ్య జరిగే సంఘర్షణ మూల కథ అయినప్పుడు, మిగతా ట్రాక్‌లన్నీ వచ్చి కలవాలి.
కథలో వచ్చే గోవు, ఉల్క, పురాతన ఆలయం ఇవన్నీ కథతో సంబంధం ఉండీలేనట్టుగా ఉంటాయి.
ఉద్యోగం పనిమీద గ్రామానికి వచ్చిన హీరో తన జ్ఞానంతో కాకుండా, భుజబలంతో సమస్యల్ని ఎదుర్కోవడం , అనవసరమైన ఎలివేషన్. ఇది ఫైటింగ్‌ల సినిమా కాదు.
లోపాల్ని పక్కన పెడితే ఫొటోగ్రఫీ, సౌండ్ డిజైన్, బీజీఎం బాగున్నాయి.
వీఎఫ్ఎక్స్ జస్ట్ ఓకే. అనవసరమైన పాటలు లేవు. నిడివి ఇంకో 20 నిమిషాలు కుదించినా వచ్చిన నష్టమేమీ లేదు.
ఈ టైప్ సినిమాల్లో ముఖ్యంగా ఉండాల్సింది ఉత్కంఠ, థ్రిల్. అవే తగ్గిపోయాయి. ఈ జానర్ నచ్చేవాళ్లు ప్రయత్నించొచ్చు.

ఫొటో సోర్స్, X/Aadi Saikumar
ప్లస్ పాయింట్స్
1. ఆది నటన
2. కెమెరా, సౌండ్
మైనస్ పాయింట్స్
1. సన్నివేశాలు రిపీటెడ్‌గా వుండడం
2. వీక్ క్లైమాక్స్
3. పాత్రల స్వభావాలు రిజిస్టర్ కాకపోవడం
ఫైనల్‌గా శంబాల ఆదికి ప్లస్ కాదు , మైనస్ కాదు.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














