మూవీ రివ్యూ: శ్మశానంలో పాతేసిన శవాల్ని ఎత్తుకెళ్లే ‘గుర్రం పాపిరెడ్డి’ ప్రయాణం ఎలా ఉందంటే..

ఫొటో సోర్స్, mjmmotionpictures/Screengrab
- రచయిత, సాహితీ
- హోదా, బీబీసీ కోసం
క్రైమ్ కామెడీ జానర్‌కి గిరాకీ ఎప్పటికీ ఉంటుంది. సరిగ్గా చెప్పడం రావాలంతే. పైగా కథల గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చుట్టూ బోలెడన్ని కథలు.
చాలా కాలం కిందట శవాల్ని మాయం చేసే ముఠా ఒకటి వార్తల్లోకి ఎక్కింది. శ్మశానంలో పాతేసిన శవాలను ఎత్తుకెళ్తున్న ఓ ముఠా గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు.
వాటి చుట్టూ ఓ కథ అల్లి, సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో గుర్రం పాపిరెడ్డి సినిమా పుట్టింది. మరి ఆ ఆలోచన రక్తి కట్టిందా? లేదా? శవాల మార్కెట్ వెనుక ఎలాంటి క్రైమ్ దాగుంది?


ఫొటో సోర్స్, Screenshot
కథేంటి?
హైదరాబాద్‌లోని శ్మశానంలో ఉన్న ఓ శవాన్ని తీసుకెళ్లి.. శ్రీశైలంలో ఉన్న మరో సమాధి తవ్వి... ఈ శవాన్ని అక్కడ పూడ్చి పెట్టాలి. ఇదే ఈ సినిమాలోని కథానాయకుడి మిషన్.
గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య), సౌదామిని (ఫరియా అబ్దుల్లా), మిలటరీ (కసి రెడ్డి), చిలిపి (వంశీధర్ గౌడ్), గొయ్యి (జీవన్)... ఈ క్రైమ్ లో భాగస్వాములు.
వీళ్లంతా కలిసి శవాన్ని ఎందుకు మార్చాలనుకున్నారు? అసలు శ్రీనగర్ కాలనీలో ఉన్నశవం ఎవరిది? శ్రీశైలంలోని శవం ఎవరిది? ఈ శవ మార్పిడికి, స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ఉన్నలింకేంటి? అన్నదే కథ.

ఫొటో సోర్స్, FB/Faria Abdullah
క్రైమ్ కామెడీ జానర్‌లో చాలారకాలైన కథలు, సినిమాలు వచ్చాయి. కొంతమంది విగ్రహాలను దొంగతనం చేశారు, ఇంకొందరు బంగారం, వజ్రాలను దోచుకెళ్లారు. ఆఖరికి కుక్కల్ని కిడ్నాప్ చేసిన కథలు చూశాం. వాటితో పోలిస్తే శవాలను మాయం చేయడం అనేది వెరైటీ కాన్సెప్ట్.
ఆ అంశానికి సంస్థానాలతో ముడి పెట్టడం, వేల కోట్ల స్కామ్‌తో జోడించడం అనే ఆలోచన బాగుంది. బహుశా ఈ పాయింట్ నచ్చే ఈ కథని సెట్స్ పైకి తీసుకెళ్లి ఉంటారు.
అయితే కథగా చెప్పినప్పుడు ఆసక్తి కలిగించిన అంశాలు వెండి తెరపై తర్జుమా అయ్యేటప్పుడు అంతగా రుచించకపోవొచ్చు. కొన్ని మంచి పాయింట్లు సినిమాలుగా తేలిపోవడానికి కారణం అదే. గుర్రం పాపిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది.
దర్శకుడు కొత్తపాయింట్ ఎంచుకున్నా ప్రేక్షకుల్ని అంతే కొత్తగా ఎంటర్‌టైన్ చేయడంలో విఫలం అయ్యాడు.
కోర్టు రూమ్‌లో బ్రహ్మానందం పాత్రల్ని పరిచయం చేయడం, ఆ తర్వాత ప్రధాన పాత్రలన్నీ ఒకరి తర్వాత మరోటిగా స్క్రీన్‌పైకి రావడం, శవాల్నిమాయం చేయడానికి వేసిన స్కెచ్ ఇవన్నీ ఆసక్తి కలిగిస్తాయి. కథని చెప్పడంలో దర్శకుడు కొత్త పంథా ఎంచుకున్నాడన్న భరోసా కలుగుతుంది.

ఫొటో సోర్స్, Screenshot
చివర్లో ట్విస్టు ఏమిటి?
ఓ పాత్రకు లోపం పెట్టడం, అందులోంచి వినోదం రాబట్టడం అనేది మంచి టెక్నిక్. ఇది వరకు ఈ టెక్నిక్‌ని చాలామంది వాడేశారు. అలాగని ప్రతీ పాత్రకూ ఓ లోపం ఉండడం, వాటి చుట్టూనే వినోదం రాబట్టాలని చూడడం మాత్రం వెగటు పుట్టిస్తుంది.
ఈసినిమాలోని మిలటరీ, చిలిపి, గొయ్యి ఇలా ప్రతీ పాత్రకూ ఓ లోపం ఉంటుంది. ఆఖరికి, హీరోకి కూడా.
డీఎన్ఏ టెస్ట్‌కు సంబంధించి నడిపిన కోర్ట్ రూమ్ డ్రామా చాలా చప్పగా సాగింది. ఇంత పెద్ద ఆస్తిని కాపాడుకోవడానికి విలన్ గ్యాంగ్ ఏమీ చేయదా? వాళ్ల దగ్గర సమర్థులైన న్యాయ వాదులు ఉండరా? అనే అనుమానం కలుగుతుంది.
లాజిక్కుల సంగతి అస్సలు అడగాల్సిన అవసరం లేదు. కోర్టు వాదనల్లో దర్శకుడు తెలివితేటల్నిచూపించలేకపోయాడు. చివర్లో ఓ ట్విస్ట్ ఉంది. అది కూడా బలవంతంగా ఇరికించిందే అనిపిస్తుంది. పార్ట్ 2కి లీడ్ ఇవ్వడానికి మినహాయిస్తే ఇలాంటి మలుపులు ఎందుకూ అక్కరకు రావు.
అయితే చివర్లో వచ్చిన ట్విస్టు వల్ల గుర్రం పాపిరెడ్డి పాత్రని హీరో అనుకోవాలి. ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటకు రాలేదేమో అనిపిస్తోంది. తను కూడా మంచి నటే. కానీ ఎందుకో తన ప్రతిభను పూర్తి స్థాయిలో సౌదామిని పాత్ర ఆవిష్కరించలేకపోయింది. జీవన్ లౌడ్ యాక్టింగ్ నుంచి కాస్త బయటపడినట్టు అనిపించింది. అయితే అక్కడక్కడ పాత పాత్రల్లోకి వెళ్లిపోయాడు. కసిరెడ్డి నటన సహజంగా ఉంది. మిగిలిన పాత్రలు పరిధి మేర కనిపించాయి.
పాయింట్ పరంగా కొత్తగా ఆలోచించిన దర్శకుడు.. దాన్ని తెరపైకి తీసుకొచ్చేటప్పుడు తడబడ్డాడు. ఈ కథని పూర్తి స్థాయి డార్క్ కామెడీగా మలచవచ్చు. లేదంటే ఆద్యంతం వినోదభరితంగా తీర్చిదిద్దవచ్చు. ఆ స్కోప్ ఈ కథకు, పాత్రలకు ఉంది. కానీ ఆ దారిలో ఈ కథని నడపలేకపోయాడు.
ప్లస్ పాయింట్స్
- దర్శకుడు ఎంచుకున్న అంశం
- కొన్ని హాస్య సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- స్క్రీన్ ప్లే
- అనవసరమైన ట్విస్టు
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














