అఖండ‌-2 తాండ‌వం: బాల‌కృష్ణ , బోయ‌పాటి కాంబినేష‌న్ ప్రేక్ష‌కుల‌కి గూస్‌బంప్స్ తెప్పించిందా?

అఖండ 2 తాండవం, రివ్యూ, సినిమా, బాలకృష్ణ, అఘోరా

ఫొటో సోర్స్, 14Reels

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం

క‌థ ఏమంటే ఇది అఖండ‌కి సీక్వెల్‌. పార్ట్ -1 సీన్స్‌ని రీక్యాప్ చేస్తూ నీకు క‌ష్ట‌మొస్తే వ‌స్తాను అని చిన్న‌పాప‌కి అఖండ మాట ఇవ్వ‌డాన్ని గుర్తు చేస్తారు. పార్ట్ 2లోని మెయిన్‌లైన్ అదే.

భార‌త స‌రిహ‌ద్దుల్లో సినిమా ప్రారంభం అవుతుంది. చైనా జ‌న‌ర‌ల్ ఒక‌డికి ఇండియా అంటే కోపం. ఎందుకంటే ఆయన కొడుకు భార‌త సైన్యం చేతిలో మ‌ర‌ణిస్తాడు. దీంతో ఆయన ఇంకో మాజీ జ‌న‌ర‌ల్‌తో చేతులు క‌లుపుతాడు.

వీళ్లిద్ద‌రూ క‌లిసి ఒక రాజ‌కీయ నాయ‌కుడి ద్వారా కుట్ర చేస్తారు. ప‌విత్ర కుంభ‌మేళా గంగాన‌దిలో వైర‌స్ క‌లుపుతారు. వేలమంది ఆస్ప‌త్రిపాలైతే, అత్య‌వ‌స‌రంగా వ్యాక్సిన్ త‌యారు చేయించ‌మ‌ని ప్ర‌ధాని ఆదేశిస్తారు.

ఒక యంగ్ సైంటిస్ట్ లద్ధాఖ్‌లోని ఓ ల్యాబ్‌లో ఈ ప‌ని మొదలుపెడుతుంది. ఆమె ఎవ‌రో కాదు, అఖండ సోద‌రుడి కూతురు.

ఆమె విల‌న్ గ్యాంగ్ చేతికి చిక్కితే అఖండ వ‌చ్చి ఎలా కాపాడాడు? దేశాన్ని , దేవుడి మీద న‌మ్మ‌కాన్ని, హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మాన్ని ఏ ర‌కంగా ర‌క్షించాడ‌నేది మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అఖండ 2 తాండవం, రివ్యూ, సినిమా, బాలకృష్ణ, అఘోరా

ఫొటో సోర్స్, 14Reels

ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఎదురుచూపు

అఖండ-1 హిట్ కావ‌డానికి కారణం ఏమంటే చిన్న‌ప్పుడు విడిపోయిన అన్న‌ద‌మ్ముల్లో ఒక‌రు అఘోరాగా పెరుగుతాడు. సోద‌రుడి కుటుంబం క‌ష్టాల్లో ప‌డిన‌ప్పుడు దుష్ట శిక్ష‌ణ చేస్తాడు. ప‌సిపాప ఎమోష‌న్‌, నేటివిటీ బ‌లంగా వుంటాయి.

హీరో అఘోరాగా వుండ‌డం , క‌మ‌ర్షియ‌ల్‌గా కొత్త పాయింట్ (త‌మిళంలో నేనే దేవుణ్ని అని ద‌ర్శ‌కుడు బాల తీసాడు. అయితే అది క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు).

బాల‌కృష్ణ‌ని కొత్త‌గా చూడ‌డం జ‌నానికి న‌చ్చింది. సినిమాలో క‌థ‌, క‌థ‌నం బ‌లంగా వుంటాయి. అయితే అఖండ‌-2లో ఇవే లోపించాయి. పాన్ ఇండియా రేంజ్‌ని దృష్టిలో పెట్టుకోవ‌డం వ‌ల్ల క‌థ ఏకంగా దేశ స‌రిహ‌ద్దుల్లోకి వెళ్లింది. కాన్‌ప్లిక్ట్‌కి కుంభ‌మేళా అవ‌స‌ర‌మైంది. సినిమాలోకి నేష‌న‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, సైన్యం వ‌చ్చేశాయి.

ప‌రిధి మించిపోవ‌డంతో పాత్రల ప‌రిచ‌యానికి, టేకాఫ్‌కి ఎక్కువ టైమ్ ప‌ట్టింది. అఖండ చేసే అద్భుతాల కోసం ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఎదురు చూడాల్సి వ‌చ్చింది.

యాక్ష‌న్, హిందూ ధర్మం, దేవుడు, మంత్రం

ఫొటో సోర్స్, 14Reels

అఖండ చూసిన త‌ర్వాత అంత‌కు మించిన యాక్ష‌న్ , గూస్‌బంప్స్ సీన్స్ ప్రేక్ష‌కుడు కోరుకుంటాడు. ఫ‌స్టాఫ్ నీర‌సంగా న‌డిచే స‌రికి ఇంట‌ర్వెల్ పాయింట్‌లో ఉలిక్కిప‌డి , సెకండాఫ్ కూడా ఇలాగే వుంటుంద‌ని ఆశిస్తాడు.

అయితే హీరో ఫైటింగ్‌కి, ఫైటింగ్‌కి మ‌ధ్య ధ‌ర్మం, దేవుడి గురించి ఉప‌న్యాసాలు ఎత్తుకుంటాడు. అదే స‌మ‌స్య‌.

బాల‌య్య , బోయ‌పాటి కాంబినేష‌న్ అంటే నెక్ట్స్ లెవెల్‌. లాజిక్‌లు అడ‌గ‌కూడ‌దు. మ్యాజిక్ చేస్తే ఎవ‌రూ అడ‌గ‌రు. కానీ అదే మిస్ అయ్యింది.

క‌థ అఖండ‌ది అయిన‌పుడు బిగినింగ్ నుంచి అదే పాయింట్ మీద వుంటే బాగుండేది. పార్ట్ -1లో ఇంకో బాల‌కృష్ణ‌కి ప్రాధాన్యం వుంటుంది. ఆయ‌న క‌థ‌లోకి అఖండ వ‌స్తాడు.

పార్ట్‌-2లో ఎమ్మెల్యేగా మారిన బాల‌ముర‌ళీకృష్ణ‌కి క‌థ‌లో స్పేస్‌లేదు. ఆయ‌న కూతురు జ‌న‌ని (హ‌ర్షాలి)కి, అఖండ‌కి మ‌ధ్య సినిమా.

అయితే బాల‌ముర‌ళీకృష్ణ‌కి అన‌వ‌స‌ర‌మైన ఫైట్‌, పాట ఉన్నాయి. ఎస్పీతో స‌హా అంద‌రూ అధికారుల్ని గంజాయి ముఠా కిడ్నాప్ చేస్తే ఎమ్మెల్యే వెళ్లి విడిపించి క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో డైలాగ్‌లు కూడా చెబుతాడు. ఆయ‌న ఇంట్లో బోలెడు మంది వుంటారు. వాళ్ల‌ని ప‌రిచ‌యం చేసి వుంటే నిడివి ఇంకా పెరిగేది.

అభిమానుల‌కి గూస్‌బంప్స్ తెప్పించే సీన్స్ వున్నా , టోట‌ల్‌గా ఏదో మిస్ అయ్యింది. దిల్లీ, టిబెట్‌, చైనా , కుంభ‌మేళా ఇలా అన్నీ క‌ల‌గాపులగంగా రావ‌డంతో ప్రేక్ష‌కులు డిస్‌క‌నెక్ట్ అయ్యే అవ‌కాశ‌మే ఎక్కువ‌.

బాల‌య్య ఎక్స్‌ప్రెష‌న్స్‌, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ కొన్ని స‌న్నివేశాల్లో చాలా బాగున్నాయి. ఇలాంటి పాత్ర‌లు ఆయ‌న‌కి కొట్టిన పిండి. అయితే పంచ్‌లైన్ డైలాగ్స్ ఆయ‌న స్టైల్. కానీ సినిమాలో డైలాగ్‌ల పొడ‌వు ఎక్కువైంది.

బోయ‌పాటి మార్క్ సెకండాఫ్ అంతా క‌నిపిస్తుంది. త్రిశూలంతో హెలికాప్ట‌ర్ రెక్క‌ల్ని ఆప‌డం, యుద్ధ ట్యాంక్‌ల‌ని పేల్చ‌డం , తూటాల్ని కూడా త్రిశూలంతో ఆప‌డంవంటివి.

అఖండ తాండ‌వం, ఆది పినిశెట్టి, సంయుక్త‌మీన‌న్

ఫొటో సోర్స్, 14Reels

అఖండ తాండ‌వం ప్ర‌త్యేక‌త ఏమంటే దైవ‌శ‌క్తి, మాంత్రిక శ‌క్తి రెండూ వుండ‌డం. మాంత్రికుడిగా ఆది పినిశెట్టి భ‌య‌పెట్టాడు. రెండు భారీ ఫైట్స్ వున్నాయి.

అఖండ త‌ల్లి చ‌నిపోయిన‌పుడు ఏకంగా శివుడే అఖండ రూపంలో వ‌స్తాడు (శివుడి పాత్ర వేసింది బాల‌య్య కాదు). ఏకంగా దైవ‌మే అఖండ‌ని ప్ర‌శంసించి వెళ్తాడు.

పేరుకి హీరోయిన్‌గా సంయుక్త‌మీన‌న్ ఉన్నా , కేవ‌లం ఒక పాట‌కే ప‌రిమితం. కూతురిగా వేసిన హ‌ర్షాలికి డ‌బ్బింగ్ స‌రిగా కుద‌ర్లేదు. ప్ర‌ధానిగా స‌ర్వ‌ద‌మ‌న్ బెన‌ర్జీ , ఎన్ఐఏ చీఫ్‌గా ఝాన్సీ వేశారు. ఇంకా చాలా మంది న‌టులున్నా, వాళ్లెవ‌రికీ ప్రాధాన్య‌త లేదు.

రామ్‌ప్ర‌సాద్‌, సంతోష్‌ల కెమెరా ప‌నిత‌నం బాగుంది. ఎడిటింగ్ పర్‌ఫెక్ట్. థ‌మ‌న్ సంగీతం సీన్‌ని ఎలివేట్ చేసింది. వీఎఫ్ఎక్స్ కొన్నిచోట్ల తేలిపోయింది. ఖ‌ర్చు భారీగానే పెట్టారు.

ఫైన‌ల్‌గా ఇది బాల‌య్య వ‌న్‌మ్యాన్ షో. త్రిశూలంతో అఖండ చేసే బీభ‌త్సం. అభిమానులు ఆనందంగా చూస్తారు. కానీ సాధార‌ణ ప్రేక్ష‌కుడు కొంచెం ఓపిక చేసుకుని చూడాలి.

హైంద‌వ, స‌నాత‌న ధ‌ర్మాన్ని గ‌ట్టిగా చొప్పిస్తే పాన్ ఇండియా సినిమాగా మార‌దు. ధ‌ర్మాన్ని చూపించాలి, పెద్ద‌పెద్ద డైలాగ్‌ల‌తో వాదించ‌కూడ‌దు. బోయ‌పాటి ఈ లాజిక్ మిస్ అయ్యాడు.

ప్ల‌స్ పాయింట్స్:

1.అఖండ‌గా బాల‌య్య న‌ట‌న‌

2.కెమెరా, బీజీఎం

3.సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌

మైన‌స్ పాయింట్స్:

1. ఫ‌స్టాఫ్‌

2. క‌థ‌నంలో వేగం త‌గ్గ‌డం

3. బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డం

ఫైన‌ల్‌గా అఖండ ఒక్క‌డుంటే చాలు, మ‌న‌కి భార‌త సైన్యంతో కూడా ప‌నిలేదు. బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బీభ‌త్స భ‌క్తిర‌స చిత్రం.

(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)