టీటీడీ: పట్టు శాలువాలా? పాలిస్టర్‌వా? వెంకన్న సేవల్లో, వీవీఐపీలకు వేదాశీర్వచనాల్లో వాడే వస్త్రాల నాణ్యతపై ఏమిటీ వివాదం?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వివాదాలు ఇంకా కొలిక్కి రాకముందే టీటీడీలో మరో కేసు బయటపడింది.
తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి సేవలకు వినియోగించే పట్టు శాలువాల కొనుగోళ్లలో కొన్నేళ్లుగా అవినీతి జరిగిందని విజిలెన్స్ ప్రాథమిక విచారణలో బయటపడింది.
దీంతో, నాణ్యత లేని వస్త్రాలు సరఫరా చేసిన కంపెనీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, దీనిపై ఏసీబీ డీజీ విచారణ చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి ఆదేశించింది.


ఫొటో సోర్స్, TTD
అసలేం జరిగింది?
టీటీడీ శాలువాల కొనుగోళ్లలో గత పాలకమండలి అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు డిసెంబర్ 10న తన 'ఎక్స్' అకౌంట్‌లో పోస్టు పెట్టారు.
రూ. 350 విలువైన పట్టు శాలువాను రూ. 1,350కు కొనుగోలు చేశారని.. దీనిపై విచారణ ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. 2019 నుంచి ఇప్పటివరకు ఏటా దాదాపు రూ. 80–90 కోట్ల అవినీతి జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు.
''శుద్ధమైన తుస్సా పట్టుతో, బంగారం లేదా వెండి జరీతో, సిల్క్ మార్క్ ధ్రువీకరణతో తయారు చేయాల్సిన పట్టు శాలువాలను నాసిరకం పట్టుతో సరఫరా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బోర్డు చర్చించి ఏసీబీ విచారణకు ఆదేశించింది. నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ కాలంలో జరిగిన కల్తీ నెయ్యి, నాసిరకం సరకులు, పరకామణి చోరీ, టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ దశలవారీగా బయటపెట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నాం. టీటీడీలో పారదర్శకత మా ప్రాధాన్యం. అవినీతి ఎవరు చేసినా వదలం'' అని బీఆర్ నాయుడు తెలిపారు.
అయితే, గత పదేళ్లుగా అవకతవకలు జరిగాయని విజిలెన్స్ నివేదిక చెప్పినా, ఉద్దేశపూర్వకంగా జగన్ మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి గత ఐదేళ్ల వైసీపీ హయాంలోనే ఇవన్నీ జరిగాయని చెబుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.

ఫొటో సోర్స్, FB/Pawan Kalyan
చాలా ఏళ్లుగా జరుగుతోంది: డిప్యూటీ సీఎం పవన్
నాసిరకం శాలువాలను టీటీడీలో పంపిణీ చేస్తున్నారనే వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. పీటీఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన పవన్, ఎక్కడెక్కడ డబ్బుల ప్రవాహం ఉంటుందో అక్కడ ఇలాంటివి జరుగుతాయన్నారు.
''నేను కల్తీ గురించి టీటీడీలో ప్రశ్నిస్తే, ఇది చాలా ఏళ్ల నుంచి జరుగుతోందని నాకు చెప్పారు. అది నిరూపితమైది. లడ్డూ విషయానికే వస్తే, అది ఒక తినే పదార్థం కాదు, ఒక విశ్వాసం. జనం అంత దూరం మక్కాకు వెళ్తారంటే, అది వారి విశ్వాసం. అక్కడ నుంచి మనం ఒకటి తీసుకొస్తున్నప్పుడు దేవుడి దీవెనలు మనం తీసుకొస్తున్నాం. అది ఏ మతమైనా కావచ్చు. తిరుపతి లడ్డూ కూడా దీవెన లాంటిదే. దాన్ని మనం పంచాలనుకుంటాం. ఏ ఆహారంలో అయినా కల్తీ చేయడం అనేది ఉల్లంఘన కిందికే వస్తుంది'' అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Bhumana Karunakar Reddy
వైసీపీ ఏమంటోంది?
ఒక ప్రణాళిక బద్ధంగా హిందూ ధర్మాన్ని తిరుమలను వాడుకొని, ఉద్దేశపూర్వకంగా జగన్ మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి, రాజకీయ పబ్బం గడపడానికి వైసీపీ హయాంలో ఇవన్నీ జరిగాయని చెబుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన.. "వాళ్లు చేసే తప్పుల నుంచి తప్పించుకోవడానికి మాపై బురద జల్లడం తప్ప ఇంకేమీ లేదు" అన్నారు.
"పట్టు వస్త్రాలకు సంబంధించిన వర్ని కూడా సింథటిక్ వ్యవహారమే అంటున్నారు. కానీ, 2015 నుంచి 2025 వరకు జరిగిందని విజిలెన్స్ నివేదిక చాలా స్పష్టంగా చెబుతోంది. దాన్ని మరుగున పెట్టి మా హయాంలో ఈ కుంభకోణం జరిగిందని రాజకీయంగా రుద్దే ప్రయత్నం జరుగుతోంది"
"ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్ద నేరంగా చిత్రీకరించి, వెంకటేశ్వర స్వామి ఆలయ పరువుకు నష్టం కలిగిస్తున్నామనే స్పృహ కూడా లేకుండా, దీని ద్వారా ఓట్లు దండుకోవచ్చని జగన్ మోహన్ రెడ్డిపై బురద జల్లి ఆయన క్రిస్టియన్ అని ఏదో ఒక రకంగా మాట్లాడి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం" అని భూమన అన్నారు.
"అహోబిలంలో కూడా నాలుగు నెలల కిందట దొంగతనం జరిగింది. దానిపై ఏం చర్యలు తీసుకున్నారు. తిరుమల వేదికగా ఒక విషయాన్ని ఎత్తితే అది దేశమంతా పాకిపోతుంది. ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందిలే అనుకుంటున్నారు. 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వైభవాన్ని కాపాడుతూ, ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసమని రాష్ట్రంలో దాదాపు 3,000 దేవాలయాలు కట్టించిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది" అని ఆయన అన్నారు.

శాలువాల సరఫరా ఎవరిది?
ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు. పట్టు శాలువలు ఎందుకు ఉపయోగిస్తారో వివరించారు.
శంఖచక్రాలు, మధ్యలో మూడు నామాలతో ఉండే ఈ పట్టు శాలువాలను తిరుమల వెంకటేశ్వరుడికి చేసే వివిధ సేవల్లో, శ్రీవారిని దర్శించుకునే వీవీఐపీలకు వేదాశీర్వచనం అందించడానికి, దాతలను సత్కరించడానికి వాడుతారని భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు.
''టీటీడీలో 2019 నుంచి 2024 వరకు భారీ స్థాయిలో అవినీతికి జరిగింది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రంగనాయక మండపంలో భక్తులకు కప్పుతున్న శాలువాలో నాణ్యత లేని శాలువాలు అందించారు. వాటిని మేం నిపుణుల కమిటీకి పంపిస్తే, నాణ్యతలేని వస్త్రాలు సరఫరా చేశారని కమిటీ నివేదిక ఇచ్చింది. సప్లయర్స్, ఎవరి ద్వారా ఇదంతా మాట్లాడుకొని కమిషన్ తీసుకున్నారు? తదితర విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయించి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం'' అన్నారాయన.
''ఈ కుంభకోణంలో రూ. 50 కోట్లు అవినీతి జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మేం దీన్ని రాజకీయ అంశంగా చూడటం లేదు. స్వామివారి భద్రత కాపాడే దిశగా ప్రయత్నిస్తున్నాం''
''స్వామివారికి వాడే మేల్‌ఛాట్ వస్త్రం అంటే, స్వామివారికి అభిషేకం తర్వాత కట్టే వస్త్రం. దాంట్లో కూడా లోపాలున్నాయి. స్వామివారికి ఉండాల్సిన నాణ్యత లేదని నివేదిక అందింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత, ఎవరెవరు ఎక్కడ తప్పు చేశారో వారిపైన చర్యలు తీసుకుంటాం'' అన్నారు భానుప్రకాశ్.

ఫొటో సోర్స్, FACEBOOK
‘టీటీడీ ప్రతిష్ట దిగజార్చొద్దు’
"పదేళ్లలో జరిగింది అంటున్నారు, ఏ సంవత్సరంలో జరిగింది, ఇప్పుడు ఎంత జరిగిందనేది చెప్పకుండా విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. ఒకే కంపెనీ సరఫరా చేస్తే నాణ్యత ఎందుకు మారింది, ఎలా మారింది. ఇక్కడ పనిచేసే వాళ్ళ హస్తం కూడా ఉంటుంది. క్వాలిటీ చెక్ చేసే వాళ్లల్లో మార్పులు జరిగాయా? దీని వెనక ఎవరున్నారనేది తేలాలి. 2019-2024 మధ్యకాలంలో జరిగిందని కూటమి నాయకులు అంటారు. అంతకుముందు నుంచే కంపెనీ సప్లై చేస్తోంది కదా అప్పటి నుంచే జరిగిందని వైసీపీ అంటోంది'' అని తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ అన్నారు.
ఏడాదిన్నరగా ప్రభుత్వం దీన్ని ఎందుకు గుర్తించలేకపోయిందని రవికుమార్ ప్రశ్నించారు.
ఘటనపై సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు బయటపడతాయి అన్నారు రవి కుమార్.

ఫొటో సోర్స్, RAJESH
2023 ఏప్రిల్ 29న తిరుమలలో పరకామణి (నోట్లు, నాణేల లెక్కింపు) సమయంలో విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తున్నారంటూ ఉద్యోగి రవికుమార్‌ను అప్పట్లో టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్ఓ) సతీశ్ కుమార్ పట్టుకున్నారు.
విదేశీ కరెన్సీని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో రవికుమార్ దాచుకున్నారని సతీశ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో 2023 మే 30న రవికుమార్‌పై చార్జ్‌షీట్ ఫైల్ అయింది.
అయితే, 2023 సెప్టెంబర్ 9న ఈ కేసు లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. ఈ రాజీ వ్యవహారంలో సతీశ్ కుమార్ కీలకంగా వ్యహరించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరకామణి కేసుపై మళ్లీ విచారణ జరుగుతోంది.
ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసులో, తిరుమల లడ్డూ ప్రసాదంలో ఐదేళ్లపాటు (2019-2024) సింథటిక్, కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని, దాదాపు 60 లక్షల కిలోల వరకు సరఫరా జరిగిందని ఆరోపణలు రావడంతో సీబీఐ సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో పలువురు టీటీడీ ఉద్యోగులు, సరఫరాదారులు నిందితులుగా ఉన్నారు, ఈ కేసులో అనేక అరెస్టులు జరిగాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














