కరువు పని: కొత్త చట్టంతో ఉపాధి హామీ పథకం భవిష్యత్తు ఏంటి, పనులు తగ్గిపోతాయన్న అనుమానాలు ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
పనులు దొరకని పల్లెల్లో బతుకుతెరువు కరువు పని. చాలా గ్రామాల్లో కూలీలపై భూ యజమానుల ఆధిపత్యానికి గండికొట్టింది ఈ కరువు పని. వేల గ్రామాల్లో కూలీ రేట్లు పెరగడానికి, గత్యంతరం లేక కూలిపనికి వెళ్లి తీరాలన్న స్థితి మారడానికి కారణం.. ఈ కరువు పని.
ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయలేని వారికి తక్కువ కూలీతో, తక్కువ గంటల పని కల్పించి, వారు కూడా గౌరవప్రదంగా బతకడానికి కారణమైంది.. ఈ కరువు పని.
ఉపాధి పని, కరువు పని అని పిలుచుకునే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో, ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం వచ్చింది.
పేరు మాత్రమే కాకుండా, చట్టంలోని కీలకమైన అంశాలు మారిపోవడంతో, ఈ పనులు చేసుకునే కూలీల్లో అయోమయం, అనుమానం మొదలైంది.
ఇంతకీ ఈ కరువు పనిలో వస్తున్న మార్పులు ఏంటి? నిజంగా పనులు తగ్గిపోతాయా?

2005లో యూపీఏ హయాంలోని భారత ప్రభుత్వం ఉపాధి పొందడాన్ని ఒక హక్కుగా చేస్తూ ఈ చట్టాన్ని తెచ్చింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది మొదట ప్రారంభమైంది.
ఈ పథకం మీద ఎన్నో అధ్యయనాలు జరిగాయి.
ఆధునిక భారతదేశంలో అతి కీలకమైన పథకాల్లో ఒకటిగా దీన్ని ఆర్థిక సంస్థలు వర్ణించాయి.
అనేక సందర్భాల్లో ప్రపంచ బ్యాంకు ఈ పథకాన్ని ప్రశంసించింది. అనేక విమర్శలు, లోటుపాట్ల గుర్తింపూ వంటివి జరిగాయి.
మొత్తంగా గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం ప్రభావం చాలా ప్రత్యేకమైనది.
అయితే, తాజాగా కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో ఎన్నో అనుమానాలు పెరిగాయి.
చట్టం పేరు మార్పుపై కూలీలకు ఆసక్తి లేదు, కానీ తమకు వచ్చే కూలీ తగ్గిపోతుందేమోననే భయం మాత్రం వారిలో కనిపించింది.

ఫొటో సోర్స్, Pedakka Family
2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైన అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో దేశంలోనే మొదటి జాబ్ కార్డు అందుకున్న చీమల పెద్దక్కను బీబీసీ కలిసింది.
ఊరి చివర గేదెలు మేపుతూ కనిపించిన పెద్దక్క, ఉపాధి హామీ పథకం తనకు చాలా మేలు చేసిందని చెప్పారు.
''మొదటి నుంచీ కరువు పనికి పోతున్నా. మనవళ్లని, మనవరాళ్లని చదివించుకున్నా. కరువు పని లేకుంటే బతకలేం. రైతుల దగ్గర కూలి తగ్గిపోతాది. 200 రూపాయలు ఇద్దాం, 150 ఇద్దాం అంటారు'' అన్నారు పెద్దక్క.
''పేరు మారితే ఏమవుతుందో మాకు తెలియదు. మాకు తెలిసింది మాత్రం పని కావాలి. అంతే'' అన్నారు ఆమె కొడుకు రామకృష్ణ.
ఇతరుల పొలాల్లో కూలీకి వెళ్లలేని మధ్య తరగతి వారు కూడా కరువు పని ద్వారా లబ్ధి పొందినట్టు ఈ పథకంలో పని చేసిన మాజీ సిబ్బంది ఒకరు చెప్పారు.
''మధ్యతరగతి వారు వేరే వాళ్ళ దగ్గరికి పనికి పోరు. వాళ్ళ దగ్గరికి నేనేం పోతానులే అనేసి. కడుపు కాలినా గమ్మునే ఉంటారు. కానీ, వాళ్లు కూడా కరువు పనికి పోయారు'' అన్నారు బండ్లపల్లి మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ శివారెడ్డి.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో మరో కరువు పీడిత ప్రాంతం మహబూబ్ నగర్ కూలీలతో కూడా బీబీసీ మాట్లాడింది.
''నేను 20 ఏళ్ల నుంచి కరువు పనికి వెళ్తున్నాను. ప్రతి ఏటా వెళ్తాను. నాకు చాలా తక్కువ భూమి ఉంది. దానిపై బతకలేం. ఇప్పుడు శరీరం పట్టు తగ్గుతోంది. అందుకని ఉపాధి పని ద్వారా నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాను. ఇప్పుడు మెషీన్లు పెరిగిపోయాక బయట వ్యవసాయ పని కూడా పెద్దగా దొరకడం లేదు. కేవలం తాపీ పని మాత్రమే ఉంటోంది. అది రాని వారి సంగతి అంతే'' అన్నారు హన్వాడకు చెందిన సాయిలు.
తాజా చట్టం మార్పుపై సాయిలుకు అవగాహన ఉంది.
''స్టేట్ గవర్నమెంటును కూడా పైసలు ఇమ్మంటున్నారట. వీళ్లు పనులు తగ్గించేస్తారేమో అని అనుమానం. అలా అయితే నష్టమే అయితది. పిల్లలు సరిగా చూడని వారు కూడా దీనిపై ఆధారపడి ఉన్నారు చాలామంది. భూమిలేని వాళ్లు చాలామందికి ఈ పనే ఆధారం'' అని వివరించారు సాయిలు.
''పిల్లలు కూడా తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వరు. మన కాళ్ళు చేతులు ఆడినంతకాలం చేసుకోవాలి. అది లేకుంటే మేము ఎట్లా బతకాలి? మేం కరువు పనిలో కూడా కష్టపడతాం. చెట్లు పెడతాం, గుంతలు తీస్తాం.. ఇలా చాలా కష్టపడి పనిచేస్తేనే ఆ డబ్బు మాకు ఇస్తున్నారు. ఈ చుట్టుపక్కల వేరే పనిచేసేందుకు ఏ కంపెనీలూ లేవు, మరే ఉపాధీ లేదు. అందుకే ఈ పనిపై ఆధారపడ్డాం. వ్యవసాయ పనులు కూడా బాగా తగ్గిపోయాయి. కూలీ ధర, పని రోజులు పెంచితే బావుంటుంది'' అన్నారు హన్వాడకు చెందిన హసీనా బేగం.
కరువు పని ద్వారా కుటుంబానికి అండగా ఉన్నట్టు ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో వృద్ధులు, గృహిణులు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
వ్యవసాయంలో యంత్రాలు పెరగడంతో కూలీల అవసరం తగ్గడం, ఈ పథకం ఉండడం వల్ల రైతులు కూలీకి పిలిచినప్పుడు కాస్త ఎక్కువ కూలీ డిమాండ్ చేయగలగడంవంటి లాభాలున్నాయని కూలీలు చెప్పారు.
పాత చట్టం ప్రకారం పని పొందడం కార్మికుల హక్కు. పని కల్పించలేకపోతే వారికి డబ్బు ఇవ్వాలి. కానీ, ఇప్పుడు ఆ హక్కు అనే పదం కొత్త చట్టంలో తీసేశారంటున్నారు ఆందోళనకారులు.
అలాగే ఎక్కడ, ఎప్పుడు పనిచేయాలనేది కేంద్రం నిర్ణయించడం, అన్నింటికీ మించి రాష్ట్రాలు 40 శాతం వాటా భరించాలనడాన్ని వీరు తప్పు పడుతున్నారు.
గ్రామీణ భారతదేశంలో భూమి లేని వారికి, తక్కువ భూమి ఉన్న వారికి పెద్ద ఆసరాగా ఉన్న ఈ పథకం.. పేరే కాదు, రూపు రేఖలూ మారిపోతున్నాయిప్పుడు.
కొత్త చట్టం వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు రైతు స్వరాజ్య వేదిక నాయకుడు విస్సా కిరణ్.
దీనిపై కూలీలే కాక సన్నకారు రైతులు కూడా ఆధారపడ్డారని అంటున్నారు కిరణ్.
''చట్టం చాలా మార్చారు. ఇంతకు ముందు పని డిమాండ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఇష్టమైతే ఇస్తుంది. లేకుంటే లేదు. హక్కు అనే దాన్ని తీసేశారు. ఫలానా జిల్లా, మండలం, గ్రామంలో పని ఉంటుంది, ఫలానా ప్రాంతంలో ఉండదు అని కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకూ లేబర్ కాంపొనెంట్ 100 శాతం కేంద్రమే ఇచ్చేది. మెటీరియల్ కాంపొనెంట్ మాత్రం 60 – 40 నిష్పత్తిలో రాష్ట్రాలు భరించేవి. కానీ ఇప్పుడు లేబర్ కాంపొనెంట్‌లో కూడా రాష్ట్రాలను 40 శాతం పెట్టుకోమనడమే సమస్య. ఇక 125 రోజులకి పెంచాము అని అంటున్నారు కానీ, 100 రోజుల కూలీ అనేది హక్కుగా ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్రం 125లో 60 శాతం అంటే 75 రోజులే ఇస్తుంది. అంటే కేంద్రం తన వాటా తగ్గించుకుంది" అన్నారు కిరణ్.

ఫొటో సోర్స్, Kalpit Bhachech/Dipam Bhachech/Getty Images
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం అనే అంశంపై ఎక్కువ మందికి అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించడం, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వంటి సమస్యలు కొన్ని రాష్ట్రాల్లో సర్వసాధారణం. అదే పరిస్థితి ఈ పథకానికి ఎదురైతే ఎలా అనేది కొత్త చట్టాన్ని వ్యతిరేకించే వారి వాదన.
''ఉపాధి పథకం కోసం ఇంతకు ముందు వెచ్చించని నిధులు ఇప్పుడు వెచ్చించాలంటే రాష్ట్రాలకు చాలా కష్టంగా ఉంటుంది. నా అంచనా ప్రకారం, పనిదినాలు తగ్గుతాయి'' అన్నారు కిరణ్.
ఈ పథకం దుర్వినియోగం అవుతుందన్న వాదనను ఖండించారు కిరణ్.
''వ్యవసాయ పనులు విరివిగా దొరికే సమయంలో ఉపాధి పథకం నడవట్లేదు. అలాగే, వ్యవసాయ కూలీ ఉపాధి కూలీ కంటే ఎక్కువ. కాబట్టి వ్యవసాయానికి నష్టం లేదు. కూలీ తనకు కావల్సిన ధరను డిమాండ్ చేయగలుగుతున్నాడు ఈ పథకం వల్ల'' అన్నారాయన.

ఫొటో సోర్స్, nrega.dord.gov.in
దాదాపుగా 20 ఏళ్లుగా కీలకంగా ఉన్న ఈ చట్టం కేవలం రెండు రోజుల్లో పెద్దగా చర్చ జరగకుండానే పార్లమెంటులో పాస్ అయిపోయిందనీ, దీని వెనుక బీజేపీ అజెండా వేరే ఉందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
''క్రమంగా ఈ పథకం తీసేయాలనేది బీజేపీ ఉద్దేశం. రాష్ట్రాలు మద్దతివ్వక పథకం నీరుగారిపోతుంది. పనులు సరిగా జరగడం లేదని నివేదికలు తెప్పించి, మరో బిల్లుతో దీన్ని రద్దు చేసే ప్రణాళిక వేస్తున్నారు'' అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శంకర్ యాదవ్ ఆరోపించారు.
ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది.
''కాంగ్రెస్ పార్టీ ప్రజలలో, రైతులలో, రైతు కూలీలలో అలజడి సృష్టిస్తూ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తారని ప్రచారం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకం రద్దు కాదు. 20 ఏళ్లలో గ్రామాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక పరిస్థితులు మారాయి. వ్యవసాయం మారింది. గ్రామీణ అవసరాలు మారాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టం తెచ్చింది ప్రభుత్వం'' అని చెప్పారు తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు బస్వాపురం లక్ష్మీనరసయ్య.
''ఇంతకుముందు 100 రోజుల పని గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు 125 చేశాం. వ్యవసాయ సీజన్లో పనులు ఆపే అధికారం రాష్ట్రాలకే ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఈ పథకానికి ఇచ్చాం'' అని అన్నారాయన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














