ఆంధ్రప్రదేశ్‌లో సున్తీ వివాదం: ముస్లిమేతరులకు సున్తీ చేస్తున్నట్లు ఆరోపణలు, అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్ర రాష్ట్రంలో సున్తీ ఆపరేషన్ల చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. మగవారి అంగం చివరన చేసే చిన్న ఆపరేషనే ఈ సున్తీ.
వైద్యపరమైన అవసరాలతోపాటు, ముస్లిం, యూదు వంటి కమ్యూనిటీలకు చెందినవారు మతపరమైన కారణాలతో సున్తీ చేయించుకుంటారు.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒక పథకం ప్రకారం సున్తీ ఆపరేషన్లు పెంచేశారంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు లేఖ రాయడం, దానికి మంత్రి స్పందించడంతో ఈ చర్చ కొత్త మలుపు తిరిగింది.
''ముస్లింలు కానివారికీ సున్తీ చేస్తూ వైద్య కారణాల వంకతో మత అజెండాను అమలు చేస్తున్నారు'' అని నాగేశ్వర రావు ఆరోపించారు.
అయితే, ఈ అంశాన్ని పరిశీలించి నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి వెల్లడించగా, ఈ ఆరోపణలు నిజం కాకపోవచ్చనీ, అవసరం లేకుండా ఏ వైద్యుడూ ఆపరేషన్ చేసే పరిస్థితులు ఉండవని కొందరు నిపుణులు బీబీసీతో అన్నారు.

ఆరోపణలు ఏంటి?
సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. అందులో
''ఆంధ్రాలో కొందరు వైద్యులు సున్తీ ఆరోగ్యకరమైనదని నమ్ముతున్నారు. చాలామంది ముస్లిమేతర మగవారికి సున్తీ చేయించుకోమని చెప్పి, చేయిస్తున్నారు కూడా. కొంతకాలంగా ఇది జరుగుతోంది. వైద్య విద్య, శిక్షణలకు సంబంధించి సమాచార లోపం, బహుశా మెడికల్ ప్రాక్టీస్ పేరుతో ఒక మతపరమైన అజెండా అమలు చేయడానికి వ్యవస్థీకృతంగా జరుగుతున్న ప్రయత్నం ఇది. కాబట్టి, దీనిపై తక్షణం ఒక కమిటీని వేసి ఆంధ్రాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ముస్లిమేతరులకు జరిగిన సున్తీలపై విచారణ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘గత పదేళ్లలో జరిగిన అన్ని సున్తీల కేసులను విచారించి, నిజంగా వైద్యపరమైన అవసరం ఉన్నవేవో లెక్క తీయాలి'' అని నాగేశ్వరరావు కోరుతూ, ఈ పోస్టుకు ఆంధ్రప్రదేశ్ వైద్య మంత్రి సత్య కుమార్‌ను ట్యాగ్ చేశారు.
దీనిపై మంత్రి సత్య కుమార్ స్పందించారు.
''ఈ అంశాన్ని నా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎవిడెన్స్ బేస్డ్ మెడికల్ ప్రాక్టీస్, నైతిక విలువలు, మత సామరస్యానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరు లేవనెత్తిన అంశాలను వైద్య శాఖ పరిశీలించి, అమల్లో ఉన్న వైద్య నియమావళి, చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుంది'' అని సత్య కుమార్ సమాధానం ఇచ్చారు.
నాగేశ్వరరావు ఎక్స్‌లో ఈ అంశంపై పోస్ట్ పెట్టడం, దానిపై వెంటనే మంత్రి స్వయంగా స్పందించడంతో దీనిపై ఆసక్తికర చర్చ మొదలైంది.
ఇటీవల కాలంలో సున్తీ ఆపరేషన్ చేయించుకోవడం కోసం సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు కనిపించడం ఈ చర్చలో మరో కోణం.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
విశ్వసనీయమైన సమాచారం ఉంది కాబట్టే తాను లేఖ రాశానని నాగేశ్వరరావు చెబుతున్నారు. ‘‘ఇది తప్పకుండా తీవ్ర స్థాయిలో చర్చించాల్సిన అంశం. వైద్యులు ఎవరూ దీనిని అంగీకరించరు’’ అని ఆయన అన్నారు. ‘‘ఎవరైనా వెనుక ఉండి మతపరమైన అజెండా ప్రోత్సహిస్తున్నారా లేక నిజంగా అవసరం ఉంటేనే ఈ ఆపరేషన్లు చేశారా అన్నది తేల్చాలి. అవసరం లేకున్నా చేసినట్లు విచారణ కమిటీలు గుర్తిస్తే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది కూడా తేల్చాలి’’ అని బీబీసీతో నాగేశ్వర రావు అన్నారు.
ఈ విషయంపై స్పందించడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రైవేటు యూరాలజిస్టులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. సున్నితమైన అంశంపై మాట్లాడటానికి ఎక్కువమంది వైద్యులు సిద్ధపడలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ ఒకరు బీబీసీతో ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. తన పేరు ప్రచురించడానికి ఆయన ఇష్టపడలేదు. నాగేశ్వరరావు చెబుతున్నట్లుగా, సున్తీలు పెరిగిన ట్రెండ్ తనకేమీ కనపడలేదని ఆయన అన్నారు.
'' కొందరు పిల్లల్లో పురుషాంగం ముందుండే చర్మం మూసుకుపోయి మూత్రం వెళ్లే దారి సన్నగా అయిపోతుంది. దీనిని ఫైమోసిస్ అంటారు. దీనివల్ల మూత్ర విసర్జన బాధాకరంగా ఉంటుంది. మూత్రం అక్కడే నిలిచిపోతుంది. తరచూ ఇలా జరిగితే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సర్కంసెషన్ (Circumcision) లేదా సున్తీ చేస్తాం'' అని వివరించారు సదరు ప్రొఫెసర్.
పెద్దవారిలో సర్కంసెషన్‌కి కారణాల్లో చక్కెర వ్యాధి కీలకం అన్నారాయన.
‘‘డయాబెటిస్ ఉన్న వారిలో బెలనోపోస్టైటిస్ (Balanoposthitis) అనే సమస్య వస్తుంది. పురుషాంగం ముందుండే ఎర్రని భాగం వాయడం, మంట వస్తే అది బెలనైటిస్ అవుతుంది. దానికి ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని మీద ఉండే చర్మానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తే అది పోస్టైటీస్ అంటారు. రెండూ కలపి కూడా వస్తాయి. ఇలాంటివి తరచూ జరగడం వల్ల పెయిన్ రావడం, బిగుసుకుపోవడం, కలయికలో నొప్పి, పెయిన్ ఫుల్ ఎరక్షన్ (Painful erection), పెయిన్ ఫుల్ కాయిటాక్స్ (Painful coitus) వంటివన్నీ వస్తాయి. వారికి సర్కంసెషన్ చేస్తే జీవితాంతం ఇబ్బంది ఉండదని వైద్యులు సూచిస్తారు'' అని ఆయన వివరించారు.
ఇక ముసలి వారిలో కూడా సున్తీకి సిఫార్సు చేసే కేసులుంటాయని ఆయన వివరించారు. ''ముసలి వారు ఎవరైనా కాస్త శుభ్రంగా ఉండకుండా క్లీన్ చేసుకోకుంటే లోపల పాచి లేదా స్మగ్మా (Smegma) చేరుతూ ఉంటుంది. దానివల్ల అక్కడ వాపులు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సాధారణంగా 70 పైబడిన వృద్ధుల్లో ఈ సమస్య వచ్చినప్పుడు సున్తీ చేయించమంటాం. ఇవి అరుదుగా ఉంటాయి'' అన్నారాయన.
అజెండా ప్రకారం సున్తీ జరుగుతున్నాయన్న వాదనను సదరు ఆ ప్రొఫెసర్ తిరస్కరించారు.
‘‘ఎవరూ ఒంటి మీద అంత తేలికగా కత్తి పెట్టనివ్వరు. కాబట్టి అవసరంలేకున్నా సున్తీలు చేస్తున్నారన్న వాదన సరికాదు. అలాగే, సున్తీ చేసినంత మాత్రాన ఎవరూ ముస్లింలు అయిపోరు. అలా చేసినా దానివల్ల కొత్తగా ముస్లింలకు ఒరిగేదేం లేదు’’ అని అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ సున్తీ?
సున్తీ అనేది పురుషాంగానికి జరిగే శస్త్రచికిత్స. ఈ చికిత్సలో భాగంగా పురుషాంగం ముందుండే చర్మాన్ని తొలగిస్తారు. భారతదేశంలో ఎక్కువగా ముస్లింలలో బాల్యంలో సున్తీ చేస్తారు.
ఆరోగ్యపరమైన కారణాలతో అన్ని మతాల్లో అవసరమైన పెద్ద వారికి ఈ చికిత్స చేస్తారు.
మతపరమైన కారణాలతో ఇజ్రాయెల్, అనేక ముస్లిం దేశాలలో సున్తీ చేయించుకున్న మగవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది.
మతపరమైన కారణం లేకపోయినా యుఎస్ఎలో కూడా సున్తీ ఎక్కువగా కనిపిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది.
ముస్లింలు, యూదుల్లో ఇది తప్పనిసరి ఆచారం కాగా, క్రైస్తవంలో ఈ సంప్రదాయం ఉన్నప్పటికీ తప్పనిసరి కాదు.
భారతదేశంలో యూదు జనాభా తక్కువ, క్రైస్తవుల్లో తప్పనిసరి కాదు కాబట్టి, ముస్లింల ఆచారంగానే సున్తీ గురించి ఎక్కువమందికి తెలుసు.

ఫొటో సోర్స్, Getty Images
సున్తీ వల్ల ఏం జరుగుతుంది
పురుషాంగ ముందు భాగమైన గ్లాన్స్ (జననాంగ శీర్షం)ను ఈ చర్మం కప్పి ఉంచుతుంది.
మొత్తం గ్లాన్స్ బయటకు కనిపించే వరకు ఈ చర్మాన్ని తొలగిస్తుంటారు. ఈ చర్మం లోపల లూబ్రికేటెడ్ మ్యూకస్ ఉంటుంది.
నోటిలో, లేదా మహిళల యోనిలో ఇలాంటి శ్లేష్మం కనిపిస్తుంది. పురుషాంగం గ్లాన్స్ అనేది చాలా సున్నితమైన భాగం.
దానిపై చర్మాన్ని తొలగించినప్పుడు అప్పటివరకు చర్మం కింద రక్షణలో ఉండే భాగం ధరించే దుస్తులకు తగలడం మొదలవుతుంది.
అందుకే సున్తీ తర్వాత కొన్ని వారాలపాటు చాలా అసౌకర్యంగా ఉంటుంది. పురుషాంగం ఉద్రేకానికి గురైనప్పుడు కాస్త నొప్పి కూడా వస్తుంది.
అయితే, ఆ తర్వాత గ్లాన్స్ పైనుంచే చర్మం గట్టిపడుతుంది. సున్నితత్వం కూడా తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సున్తీ ఎప్పుడు చేయాలి?
మతపరమైన కారణాలను పక్కన పెడితే, ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి.
వీటిలో మొదటిది అమెరికాలో అనుసరించే విధానం. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) సమాచారం ప్రకారం, పుట్టిన కొద్ది రోజుల్లోనే ఈ చికిత్స చేస్తే, వచ్చే ముప్పుల కంటే ఆరోగ్య ప్రయోజనాలే ఎక్కువ ఉంటాయి.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, పెనైల్ క్యాన్సర్, హెచ్ఐవీ లాంటి కొన్ని సుఖ వ్యాధులను దీని ద్వారా మెరుగ్గా అడ్డుకోవచ్చని ఏఏపీ చెబుతోంది.
అయితే, రాయల్ డచ్ మెడికల్ అసోసియేషన్ (ఆర్‌డీఎంఏ) దీనికి భిన్నంగా స్పందిస్తోంది. పిల్లలకు సున్తీ చేయకూడదని ఆర్‌డీఎంఏ వివరిస్తోంది.
''వ్యాధుల నియంత్రణ లేదా పరిశుభ్రత విషయంలో సున్తీ మెరుగ్గా పనిచేస్తుందని చెప్పే ఆధారాలేమీ లేవు. అందుకే పిల్లలందరికీ దీన్ని చేయకూడదు. ఏదైనా మెడికల్/థెరప్యూటిక్ కారణాలతో అవసరమైతేనే ఈ చికిత్స చేయాలి'' అని సంస్థ చెబుతోంది.
''ప్రజలు అనుకునే దానికి విరుద్ధంగా ఈ సున్తీ వల్ల కొన్ని ఆరోగ్య, మానసిక సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుంది. ఎక్కువగా రక్తస్రావం కావడం, ఇన్ఫెక్షన్, పానిక్ అటాక్‌లు లాంటివి వచ్చే ముప్పు ఉంటుంది'' అని సంస్థ వివరించింది.
అయితే, ఫిమోసిస్, పారాఫిమోసిస్, బలనైటిస్ లాంటి సమస్యలు వస్తే సున్తీ చేయొచ్చని చెబుతోంది.
పురుషాంగం ముందుండే చర్మం చివర రంధ్రం మరీ చిన్నగా ఉండటంతో గ్లాన్స్ బయటకు రాలేకపోవడాన్ని ఫిమోసిస్‌గా చెబుతారు. దీన్ని చిన్న వయసులోనే గుర్తిస్తే, కొన్ని క్రీమ్‌లతో కొంతవరకు ప్రభావం ఉంటుంది. అన్నిసార్లూ సున్తీనే చేయాల్సిన అవసరం లేదు.
పారాఫిమోసిస్ అంటే.. ముందు చర్మం పూర్తిగా వెనక్కి వచ్చేయడం. మళ్లీ ఇది ముందుకు పోవడం చాలా కష్టం అవుతుంది.
బలనైటిస్‌లో పురుషాంగ ముందుండే గ్లాన్స్ వాచిపోతుంది. దీనికి చాలావరకు అపరిశుభ్రతే కారణం.
ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆ ముందు చర్మాన్ని కాస్త వెనక్కి లాగి సబ్బు నీళ్లతో కడగాలని పిల్లలకు సూచించాలి.
ఇది కాకుండా పెద్దలకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా సున్తీ చేయాలని వైద్యులు సూచిస్తారు. ఇప్పుడు ఈ సూచన దగ్గరే వివాదం వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్ జీవితంపైనా ప్రభావం పడుతుందా?
''సున్తీ తర్వాత కొత్త పరిసరాలకు పురుషాంగం ముందు భాగం నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఫలితంగా మొదట్లో కాస్త సున్నితత్వం ఎక్కువగా ఉండొచ్చు. అసౌకర్యంగా కూడా కలగొచ్చు'' అని షపీరో తెలిపారు.
''సున్తీ తర్వాత త్వరగా పురుషాంగం ముందు భాగం పొడిబారుతుంది. సున్నితత్వంలోనూ మార్పులు చూడొచ్చు. ఇక్కడ పురుషాంగం ముందు భాగంపై నుండే చర్మంలోనూ నరాలు ఉంటాయి. చర్మం తొలగించేటప్పుడు వీటిని కూడా తొలగిస్తారు'' అని ఆయన తెలిపారు.
ఇక్కడ కొన్ని అపోహల గురించి మనం తెలుసుకోవాలి. సున్తీ తర్వాత పురుషాంగం పొడవుగా లేదా పెద్దగా అవ్వదు. సున్తీ తర్వాత ఎక్కువ సమయం సెక్స్ చేయొచ్చు అనేది కూడా అపోహే. అంగం ఉద్రేకం కావడం అనేది సున్తీ ముందు, తర్వాత ఒకేలా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సుఖ వ్యాధులను అడ్డుకోవచ్చా?
గనేరియా, సిఫిలిస్, క్లైమీడియా, హెర్పిస్, హ్యూమన్ పపిలోమావైరస్, జెనెటల్ అల్సర్లను అడ్డుకోవడంలో సున్తీ కొంతవరకు పనిచేస్తుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. అయితే, దీన్ని పక్కాగా నిరూపించే అధ్యయనాలేమీ లేవు.
''నిజానికి హెచ్ఐవీ వ్యాప్తి, సున్తీ మధ్య సంబంధంపై ఇప్పటికీ చాలా అస్పష్టత ఉంది. అమెరికాలో సున్తీ రేటు ఎక్కువగా ఉంటుంది, అక్కడ హెచ్ఐవీ రేటు కూడా ఎక్కువే. కానీ, నెదర్లాండ్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నమైనది. అక్కడ సున్తీలు తక్కువ, అలానే హెచ్ఐవీ కేసులు కూడా తక్కువే'' అని యూరోపియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.
తరచూ సెక్స్ చేసే స్వలింగ సంపర్కులైన పురుషుల్లో హెచ్ఐవీ వ్యాప్తిపై సున్తీ ప్రభావం చాలా తక్కువని మరొక అధ్యయనంలో తేలింది.
ఈ ప్రశ్నలకు మరింత విపులమైన సమాధానాల కోసం కింద ఇచ్చిన బీబీసీ కథనాన్ని చదవండి.
నిజంగా ఆంధ్రాలో వైద్యులు పెద్ద సంఖ్యలో అవసరం లేని వారికి సున్తీ చేయిస్తున్నారా అన్నది తేల్చే గణాంకాలు ఏవీ అందుబాటులో లేవు.
ఆరోపణలు మొత్తం వైద్యుల మీద ఉన్నందున, దీనిపై ఆంధ్ర మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డా. ఎస్ బాలరాజును బీబీసీ సంప్రదించింది. ఆయన స్పందించాల్సి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














