హోం వర్క్ చేయలేదని విద్యార్థులను అర్ధనగ్నంగా నిల్చోబెట్టిన టీచర్లు, పేరెంట్స్ ఏమన్నారంటే...

స్కూలు పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, విష్ణుకాంత్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న 8 మంది పిల్లలను హోంవర్క్ చేయనందుకు అర్ధనగ్నంగా నిల్చోబెట్టారు.

మధ్యప్రదేశ్‌ సెహోర్ జిల్లాలోని జాట్‌ఖేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

డిసెంబరు 25-26 తేదీల్లో పిల్లలు లోదుస్తులలో నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

"మాకు తెలియదు. సిగ్గుపడి మా అబ్బాయి ఈ విషయం మాకు చెప్పలేదు. కానీ ఈ రకంగా చదువుకోవడం కంటే మా పిల్లాడు నిరక్షరాస్యుడిగానే ఉండడమే మంచిది. అందరి ముందు వాణ్ని లోదుస్తులతో నిలబెట్టారు. అది వాడి మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? వాడేమన్నా నేరస్థుడా?" అని బాధిత పిల్లల కుటుంబానికి చెందిన ఒకరు బీబీసీతో చెప్పారు.

"ఈ విషయం నాకు డిసెంబర్ 26న తెలిసింది. ఆ తర్వాత నేను పాఠశాలకు వెళ్లాను. అక్కడి పిల్లలతో మాట్లాడాను. హోంవర్క్ చేయకపోవడంతో దుస్తులు విప్పి తమను గదిలో నిలబెట్టారని వారు చెప్పారు. ఇది చాలా తప్పు" అని సెహోర్ జిల్లా విద్యాశాఖాధికారి సంజయ్ తోమర్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హోమ్‌వర్క్, స్కూల్, మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, Vishnukant Tiwari/BBC

ఫొటో క్యాప్షన్, ప్రిన్సిపాల్ సమ్రీన్ ఖాన్

‘ఆరోపణలు నిజమే’

స్కూల్ ప్రిన్సిపాల్ సమ్రీన్ ఖాన్‌ను ఫోన్‌లో సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. సమ్రీన్ అందుబాటులోకి రాలేదు.

''ఇది ఒక రాజకీయ స్టంట్. మేమేం చెప్పగలం" అని ప్రిన్సిపాల్ సమ్రీన్ ఖాన్ డిసెంబర్ 26న జర్నలిస్టులతో అన్నారు.

"పాఠశాలపై లక్ష రూపాయల జరిమానా విధించాం. ప్రిన్సిపాల్ సమ్రీన్ ఖాన్, సెక్యూరిటీ గార్డు అమర్ సింగ్ వర్మ, డ్రైవర్ శిబూ జాఫ్రీలను తక్షణమే తొలగించాలని ఆదేశించాం" అని సెహోర్ జిల్లా విద్యాశాఖాధికారి సంజయ్ తోమర్ చెప్పారు.

హోమ్‌వర్క్, స్కూల్, మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, Vishnukant Tiwari/BBC

ఫొటో క్యాప్షన్, ఈ సంఘటనను సెహోర్ జిల్లా విద్యాశాఖాధికారి సంజయ్ తోమర్ ధృవీకరించారు.

తీవ్రంగా ఖండించిన తల్లిదండ్రులు

బాగా చదువుకోవాలని తమ బిడ్డను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించామని బాధిత చిన్నారుల్లో ఒకరి కుటుంబం తెలిపింది.

"నేను ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాను. నాకిద్దరు కొడుకులున్నారు. నా చిన్న కొడుకును మంచి ఇంగ్లిష్, చదువుల కోసం ప్రైవేట్ పాఠశాలకు పంపాను. అక్కడ వాడు వేధింపులకు గురవుతున్నాడని నాకు తెలియదు. విషయం తెలిసిన తర్వాత నేను వాడితో మాట్లాడాను. వాడు సిగ్గుపడుతున్నాడు. ఏదో పెద్ద నేరం చేశానన్న భావనలో ఉన్నాడు" అని బాలుడి తండ్రి చెప్పారు.

" ఒక్కరోజు కూడా హోంవర్క్ చేయకపోయినా ఇలాగే శిక్షిస్తారు. దుస్తులు విప్పి నిలబడేలా చేస్తారు. కొన్నిసార్లు గార్డులు, డ్రైవర్ కూడా మమ్మల్ని కొడతారు" అని ఓ బాలుడు చెప్పాడు.

"ప్రైవేట్ పాఠశాలలకు వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తాం. తర్వాత పిల్లల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. వారి బాగోగులు చూడడానికి ఎవరూ ఉండరు. మా పిల్లలను నమ్మి వాళ్లను స్కూళ్లకు పంపుతాం. ఫీజులు చెల్లించడానికి మేం పగలు, రాత్రి పని చేస్తాం. మా అబ్బాయి ఇదంతా నాకు చెప్పాడు. తర్వాత నుంచి వాడు మౌనంగా ఉంటున్నాడు" అని మరో బాధిత విద్యార్థి కుటుంబ సభ్యుడు చెప్పారు.

"పిల్లలను పాఠశాల ఆవరణను శుభ్రం చేయమని, మొక్కలకు నీళ్లు పోయమని బలవంతం చేశారు. వారు తప్పు చేస్తే, వారిని బెదిరించారు, కొట్టారు, అవమానించారు" అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

హోమ్‌వర్క్, స్కూల్, మధ్యప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి చెప్పారు.

పాఠశాల గుర్తింపు రద్దయ్యే అవకాశం

తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నిజమేనని సంజయ్ తోమర్ బీబీసీతో చెప్పారు. "నవంబరుకు ముందు చాలా రోజులు హోంవర్క్ చేయనందుకు పిల్లలను ప్రతిరోజూ చలిలో దుస్తులు లేకుండా నిలబెట్టారని మా దర్యాప్తులో తేలింది. సెక్యూరిటీ గార్డు అమర్ సింగ్ వర్మ, డ్రైవర్ శిబూ పిల్లలను బెదిరించి కొట్టేవారని కూడా తెలిసింది. విద్యార్థులతో రాళ్ళు ఎత్తించడం వంటి ఇతర పనులు కూడా చేయించారు" అని సంజయ్ తోమర్ తెలిపారు.

"పాఠశాలలో క్రమశిక్షణను మెరుగుపరచడానికి ఇది చేసినట్టు కనిపిస్తున్నప్పటికీ ఇలా చేయడం సరైనది కాదు..ఇవి హేయమైన చర్యలు" అని తోమర్ అన్నారు.

పాఠశాలపై విధించిన లక్ష రూపాయల జరిమానాను ఏడు రోజుల్లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతమైతే, పాఠశాల గుర్తింపు రద్దవుతుందనికూడా ఆయన అన్నారు.

స్కూల్‌ దగ్గర తల్లిదండ్రులు, సామాజిక సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాఠశాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"పిల్లలను అర్ధనగ్నంగా శిక్షించడం, కొట్టడం, పాఠశాలలో ఇతర పనులు చేయించడం వంటి ఆరోపణలపై తల్లిదండ్రుల నుంచి మాకు ఫిర్యాదు అందింది. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటారు" అని సెహోర్ నగర ఎస్పీ అభినందన శర్మ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)