స్నానాలగదిలో టూత్‌బ్రష్ పెట్టకూడదా, టూత్‌బ్రష్‌ను ఎన్నినెలలకోసారి మార్చాలి?

టూత్‌బ్రష్, బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్యం, పళ్లు, చిగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టూత్ బ్రష్‌ను టాయిలెట్‌లో పెడితే, టాయిలెట్‌లో నీటిని ఫ్లష్ చేసినప్పుడు సూక్ష్మ జీవులు బ్రష్ మీదకు చేరే అవకాశం ఉంది.
    • రచయిత, రిచర్డ్ గ్రే
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

మనం వాడే టూత్ బ్రష్‌ సూక్ష్మ జీవులకు నివాసం అని మీకు తెలుసా? ప్రతిరోజు నీటితో కడిగి శుభ్రం చేసే బ్రష్‌లో లక్షలకొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయని చెబితే మీరేమంటారు?

ప్రస్తుతం మన టూత్‌బ్రష్ 10 లక్షల నుంచి కోటికిపైగా బ్యాక్టీరియా, వివిధ రకాల శిలీంధ్రాలు, అలాగే లెక్కలేనన్ని వైరస్‌లకు ఆశ్రయమిస్తున్న చోటు కావచ్చు. ఇవి విభిన్న జాతుల నుంచి వందలాదిగా వచ్చి మీ టూత్‌బ్రష్‌పై ఓ జీవసంబంధమైన పొరను ఏర్పరుస్తాయి. వీటిలో కొన్ని బ్రష్‌లో విరిగిపోయిన బ్రసిల్స్ (కుంచె)లోకి కూడా ప్రవేశిస్తాయి.

ప్రతిరోజు మనం బ్రష్ చేసినప్పుడు, నీళ్లు, లాలాజలం, చర్మ కణాలు, నోటిలో నుంచి వచ్చే ఆహార పదార్థాల అవశేషాలన్నీ కలిసి ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి.

కొన్నిసార్లు, సమీపంలోని టాయిలెట్‌ను ఫ్లష్ చేసినప్పుడు లేదా కిటికీ తెరిచినప్పుడు, గాలిలో ఉండే సూక్ష్మజీవులు కూడా కలిసిపోతాయి. ఇక ఆ టూత్‌బ్రష్‌నే రోజుకు రెండుసార్లు మనం నోటిని శుభ్రం చేసుకునేందుకు వాడుతుంటాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టూత్‌బ్రష్, బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్యం, పళ్లు, చిగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా ఇళ్లలో బాత్‌రూమ్‌లోనే టాయిలెట్ ఉండటం సమస్యలకు దారి తీస్తోంది.

టూత్‌బ్రష్ శుభ్రత విషయంలో జాగ్రత్తపడాలా?

ఇదే ప్రశ్న.. వైద్యులు, దంతవైద్యులను ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తోంది. మన టూత్‌బ్రష్‌పై ఏమేం నివసిస్తాయి? వాటి వల్ల మనకు ఎలాంటి మప్పు ఉంటుంది? టూత్‌బ్రష్‌ను మనం ఎలా శుభ్రం చేసుకోవాలి? వంటి అనేక విషయాలను వాళ్లు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు.

"ఈ సూక్ష్మజీవులు ప్రధానంగా మూడు మార్గాల్లో పుట్టుకొస్తాయి" అని జర్మనీలోని రైన్-వాల్ యూనిర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో మైక్రోబయాలజిస్టు మార్క్-కెవిన్ జిన్ చెప్పారు. ఆయన టూత్‌బ్రష్‌లపై సూక్ష్మజీవుల వ్యాప్తి గురించి అధ్యయనం చేశారు. టూత్‌బ్రష్ వాడే వారి నోరు, వారి చర్మం, ఆ టూత్‌బ్రష్‌ను పెట్టే చోటు వంటి మార్గాల ద్వారా ఆ సూక్ష్మజీవులు పుట్టుకొస్తాయని ఆయన చెప్పారు.

కానీ, మనం టూత్‌బ్రష్‌ను మొదటిసారి వాడే ముందు కూడా.. దానిపై పెద్ద సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండొచ్చు.

బ్రెజిల్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వివిధ కంపెనీల నుంచికొనుగోలు చేసిన 40 కొత్త టూత్ బ్రష్‌లను పరిశీలించారు. వాటిలో సగం బ్రష్‌లపై అప్పటికే వివిధ రకాల బ్యాక్టీరియాలు తిష్టవేశాయని కనుగొన్నారు. అయితే అదృష్టం ఏమిటంటే చాలా సూక్ష్మజీవులు ప్రమాదకరం కాదు.

మనం బ్రష్ చేసిన ప్రతిసారీ.. రోథియా డెనోకారియోసా , స్ట్రెప్టోకోకసీ మిటిస్, ఆక్టినోమైసెస్ కుటుంబానికి చెందిన బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను బ్రసిల్స్ తొలగిస్తాయి. ఇవి సాధారణంగా మన నోటిలో కనిపిస్తాయి. అలాగే హానికారకమైనవి కూడా కావు. వీటిలో కొన్ని దంత క్షయానికి కారణమయ్యే సూక్ష్మజీవుల నుంచి రక్షించడంలో సాయపడతాయి. అయితే వాటిలోనే కొన్ని మనకు హాని చేసే సూక్ష్మజీవులు కూడా దాగి ఉంటాయి.

టూత్‌బ్రష్, బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్యం, పళ్లు, చిగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పళ్లు తోముకున్న తర్వాత బ్రష్‌ను కడిగినా అందులో ఇంకా కొన్ని క్రిములు ఉంటాయి.

హానికర బ్యాక్టీరియా

"ఇందులో ప్రధానమైనవి స్ట్రెప్టోకోక్సి, స్టాఫైలోకోకి. ఇవి దంతక్షయానికి కారణమవుతాయి" అని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావోపాలోలోని డెంటిస్ట్రీ ప్రొఫెసర్ వినిషియస్ పెడ్రాజ్జి చెప్పారు.మరికొన్ని మన చిగుళ్ల వాపుకు కారణమవుతాయి. దీనినే పీరియోడెంటల్ డిసీజ్ అంటారు.

టూత్ బ్రష్‌లపై ఉండకూడని ఎస్చెరియా కోలి , సూడోమోనాస్ ఎరుగినోసా, ఎంటరోబాక్టీరియాసియే వంటి బ్యాక్టీరియా, శిలీంధ్రాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఇవి పొట్టలో ఇన్ఫెక్షన్లు కలిగించడంతో పాటు ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి.

టూత్ బ్రష్‌లపై క్లెబ్సియెల్లా న్యుమోనియా (ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్లకు సాధారణ కారణం), కాండిడా ఈస్ట్ (ఇది థ్రష్ అనే పరిస్థితిని కలిగిస్తుంది) వంటి పాథోజెన్స్ కూడా ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి.

టూత్‌బ్రష్, బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్యం, పళ్లు, చిగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టూత్‌బ్రష్‌లు ఒకే చోట పెడుతుంటే ఒకదానికి ఒకటి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని దంత వైద్యులు చెబుతున్నారు.

బాత్‌రూమ్‌లోనే టాయ్‌లెట్ ఉంటే..

ఈ సూక్ష్మజీవులు మనం బ్రష్‌ను నీటితో కడిగినప్పుడు, చేతులు ఉపయోగించినప్పుడు, వచ్చి చేరుతాయి. అయితే మన బాత్రూమ్ కూడా ఇందుకు కారణం కావచ్చు.

బాత్‌రూమ్‌లు సాధారణంగా వెచ్చగా, తేమ వాతావరణంతో ఉంటాయి. ఇక్కడ ఏరోసోల్స్ అని పిలిచే చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ బిందువులు గాలి ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లను వ్యాప్తి చేస్తాయి. దీనివల్ల ప్రధానంగా బాత్రూమ్‌లో ఉంచిన టూత్ బ్రష్‌లు పాడ వడానికి అవకాశం ఉంటుందని జిన్ చెప్పారు.

మనలో చాలా మంది ఇళ్లలో స్నానాలగదుల్లోనే టాయ్‌లెట్లు ఉంటాయి. అక్కడే మనం బ్రష్‌లను పెడుతుంటాం. ఇదే కొంచెం గందరగోళంగా మారుతోంది. ప్రతిసారి టాయ్‌లెట్ ఫ్లష్ చేసినప్పుడు… మలం, నీళ్లు కలిసిన చిన్న నీటిబిందువులు గాలిలో దాదాపు 1.5 మీటర్లు(5 అడుగుల) వరకు వ్యాపిస్తాయి.ఈ ఏరోసోల్ స్ప్రే లాంటి బిందువులు బ్యాక్టీరియా, ఫ్లూ, కొవిడ్-19, నోరోవైరస్, వాంతులు వంటి అంటువ్యాధులను కలిగించే వైరస్‌లను కూడా కలిగి ఉంటాయి.

ఒకవేళ మీరు గనుక టూత్‌బ్రష్‌ను టాయ్‌లెట్‌కు దగ్గరగా పెడితే… అందులోని పదార్థాలు టూత్‌బ్రష్ బ్రిసిల్స్‌పైన పేరుకుపోతాయి. తర్వాత ఆ బ్రష్‌నే మీరు నోటిని శుభ్రం చేసుకోడానికి వాడాల్సి ఉంటుంది. అయితే.. ఫ్లష్ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవులను నేరుగా పీల్చుకునే ముప్పు అధికంగా ఉంటుంది. అందుకే ఇకపై మీరు టాయ్‌లెట్ ఫ్లష్ చేసే సమయంలో టాయ్‌లెట్ సీటును తెరిచిపెట్టడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు.

ఉమ్మడి స్నానాలగదులలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు ఓ యూనివర్సిటీలోని పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనంలో దాదాపు 60శాతం మంది విద్యార్థుల టూత్‌బ్రష్‌ల్లో మలంలో ఉండే బ్యాక్టీరియా కనిపించింది. అలాగే, ఒకరి బ్రష్ నుంచి మరొకరి బ్రష్‌లోకి కూడా సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉంటుందని తేలింది.

కానీ, టాయిలెట్ ఫ్లష్ చేసే సమయంలో వెలువడే నీటి బిందువులు అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని నిజమైన వాతావరణంలో సూక్ష్మజీవుల మనుగడపై అధ్యయనం చేసిన అమెరికా ఇల్లినాయిస్‌లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎరికా హార్ట్‌మన్ చెప్పారు.

ఇల్లినాయిస్‌లోని ప్రజల నుంచి సేకరించిన 34 టూత్ బ్రష్‌లపై ఆమె బృందం చేసిన అధ్యయనంలో.. అంత ఎక్కువగా మలం సంబంధిత బ్యాక్టీరియా కనిపించలేదు.

గాలిలోకి విడుదలైన తర్వాత అనేక గట్-సంబంధిత సూక్ష్మజీవులు ఎక్కువ కాలం జీవించలేవని ఈ పరిశోధనలో తేలిందని ఆమె చెప్పారు.

"చాలా మంది వాళ్లు వాడుతున్న టూత్‌బ్రష్ కారణంగానే అనారోగ్యానికి గురవుతున్నారని అనుకోను" అని ఆమె అన్నారు.

అయితే.. ఇన్‌ఫ్లూయెంజా, కరోనా వైరస్‌ల వంటివి టూత్‌బ్రష్‌లపై కొన్ని గంటలపాటు సజీవంగా ఉండగలవని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అలాగే కోల్డ్ సోర్స్‌కు కారణమయ్యే హెర్పెస్ సింప్లెక్స్ వైరస్-1 వంటి కేసుల్లో ఇది 48 గంటల వరకు ఉంటుందని వెల్లడైంది.

ఇది వ్యాధుల బారిన పడేందుకు కారణమవుతుంది. అందుకే.. ఒకరి టూత్‌బ్రష్‌లను మరొకరు వాడకూడదని చెబుతుంటారు.

టూత్‌బ్రష్, బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్యం, పళ్లు, చిగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ముప్పు ఏంటి?

చాలా సందర్భాల్లో ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా తక్కువగానే ఉంటుందని జిన్ చెప్పారు. అయితే, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే అన్నారు.

జిన్ చేసిన పరిశోధనతో పాటు, టూత్‌బ్రష్‌ల్లో ఉండే బ్యాక్టీరియల్ డీఎన్ఏను విశ్లేషించిన ఇతర అధ్యయనాలు… వాటిల్లోని కొన్ని బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌ను నిరోధించే జన్యువులను కలిగి ఉన్నాయని గుర్తించాయి.

ఇటలీలో విద్యార్థుల నుంచి సేకరించిన 50 టూత్‌బ్రష్‌లపై చేసిన అధ్యయనంలో… ఆ బ్రష్‌ల్లోని బ్యాక్టీరియా వివిధ డ్రగ్‌లను నిరోధించేదిగా ఉన్నట్లు తేలింది.

కొన్ని బ్రష్‌లు యాంటీమైక్రోబియల్ ట్రీట్‌మెంట్స్‌ పూతతో మార్కెట్లో లభిస్తున్నాయి. దీని ద్వారా బ్రష్‌లపై ఉండే బ్యాక్టీరియాను నియంత్రణలో ఉంచవచ్చు.

నిజానికి, టూత్‌బ్రష్‌ను వినియోగించిన తర్వాత దాన్ని గది ఉష్ణోగ్రత వద్ద గాలికి ఆరేలా పెడితే… దానిపై ఉండే సూక్ష్మజీవులను తగ్గించవచ్చు. ఇన్‌ఫ్లుయెంజా, కరోనా వైరస్‌ వంటి అనేక వైరస్‌లు పొడి వాతావరణంలో విచ్ఛిన్నమవుతాయి.

దంతక్షయానికి కారణమయ్యే స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ వంటి బ్యాక్టీరియా మాత్రం… టూత్‌బ్రష్ బ్రిసిల్స్‌పై 8 గంటల వరకు ఉంటుంది. కానీ, 12 గంటల తర్వాత అది చనిపోవడం మొదలవుతుంది.

అమెరికన్ డెంటల్ అసోసియేషన్‌తో పాటు, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వంటి సంస్థలు కూడా.. టూత్‌బ్రష్ హెడ్‌లను కవర్ చేయడం లేదా వాటిని మూసి ఉంచిన కంటెయినర్లలో ఉంచవద్దని సూచిస్తున్నాయి. ఎందుకంటే అలా చేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలకు ఆస్కారమిచ్చినట్టవుతుంది.

టూత్‌బ్రష్, బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్యం, పళ్లు, చిగుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీ 3నెలలకొకసారి టూత్‌బ్రష్‌లు మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

టూత్‌బ్రష్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి‌?

టూత్ బ్రష్‌ను క్రిమిరహితం చేయడానికి అతినీలలోహిత కాంతి నుంచి డిష్‌వాషర్ లేదా మైక్రోవేవ్‌లో ఉంచడం వరకు అనేక పద్ధతులు ఉన్నాయి.

హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టడం లేదా బ్రష్‌ను విస్కీ గ్లాసులో ముంచడం వంటి కొన్ని పద్ధతులు అంత ప్రయోజనకరం కావని తేలాయి.

వీటిల్లో మైక్రోవేవ్‌ వినియోగించడం ప్రభావవంతమైనదని తేలింది. అయితే..వీటితో టూత్‌బ్రష్ బ్రసిల్స్ నాశనమవడం లేదా, కరిగిపోయే ప్రమాదం కూడా ఉంది.

మనం వాడే టూత్‌ పేస్టులు చాలా మేరకు యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్‌తో ఉంటాయి. ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించవగలవు. నీళ్లతో కడగడం వల్ల కూడా కూడా కొంత బ్యాక్టీరియా తొలగిపోతుంది. కానీ చాలా వరకు అలాగే ఉండిపోయి పెరుగుతూనే ఉంటాయి.

ఒకశాతం వెనిగర్ ద్రావణంలో టూత్‌బ్రష్‌ను ముంచడం ద్వారా కూడా బ్యాక్టీరియా సంఖ్య గణనీయంగా తగ్గినట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. కానీ, దీనితో వచ్చే సమస్య ఏంటంటే.. వెనిగర్‌తో కడిగిన తర్వాత మళ్లీ బ్రష్ చేసుకునే వారిలో కొందరికి దాని రుచి నచ్చకపోవచ్చు.

యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లో బ్రష్‌ హెడ్‌ను పది నిమిషాల పాటు ఉంచడం కూడా ప్రభావవంతమైనదే. ఈ మౌత్‌వాష్‌ ద్రావణంలో 0.12% క్లోరెక్సిడైనా లేదా 0.05% సెటిల్పైరిడినియం ఉండాలని పెడ్రాజ్జి సూచిస్తున్నారు.

మూడు నెలలకోసారి టూత్‌బ్రష్ మార్చాలా ?

పాత బ్రష్‌ల విరిగిన, అరిగిపోయిన బ్రసిల్స్.. తేమ, పోషకాలను ఎక్కువసేపు పట్టుకుని బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తాయి.

అందుకే అమెరికన్ డెంటల్ అసోసియేషన్ వంటి వైద్య సంస్థలు… మూడు నెలలకొకసారి టూత్‌బ్రష్‌లను మార్చాలని సిఫార్సు చేస్తున్నాయి.

బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఇంకా తొందరగా టూత్ బ్రష్‌లను మార్చాలని సూచిస్తున్నాయి. టూత్ బ్రష్ వాడడం మొదలుపెట్టిన 12 వారాల తర్వాత దానిపై బ్యాక్టీరియా సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని జిన్ పరిశోధనలో తేలింది.

అయితే కొందరు పరిశోధకులు వినూత్న రీతిలో మంచి బ్యాక్టీరియా వృద్ధిని పెంచే టూత్‌పేస్ట్‌లపై పని చేస్తున్నారు. నోటిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను పెంచడమే లక్ష్యంగా ఈ ప్రోబయోటిక్ టూత్‌పేస్టులు పనిచేస్తాయి.

ఉదాహరణకు, స్ట్రెప్టోకోకస్ సాలివేరియస్ అనే బాక్టీరియా హానికరమైన బ్యాక్టీరియాను అణిచివేసి, దంతాలపై పాచి ఏర్పడకుండా నిరోధించడంలో సాయపడుతుంది. దీనిని న్యూజిలాండ్ కంపెనీ పరీక్షిస్తోంది.

లిమోసిలాక్టోబాసిల్లస్ రియుటెరి అనే మరో బ్యాక్టీరియా.. స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్‌తో బలంగా పోరాడి, దంత క్షయాన్ని నివారించడంలో తోడ్పడుతుంది.

"ప్రోబయోటిక్ పూతలు లేదా బయోయాక్టివ్ బ్రసిల్స్ వంటివి టూత్‌బ్రష్‌లపై ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల సమతుల్యత కోసం కొత్త మార్గాలుగా మారవచ్చు." అని జిన్ చెప్పారు. కానీ, దీనిపై చాలా పరిశోధన జరగాల్సి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడిక మీ వంతు… మీ స్నానాలగదిలో ఉన్న టూత్‌బ్రష్ గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు దాన్ని వేరే చోట పెట్టాలా?

టాయిలెట్‌ నుంచి కొంచెం దూరంగా పెడితే సరిపోతుందేమో !

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)